నేటి నుంచే గ్లోబల్ ఏఐ సదస్సు
– వేదిక కానున్న హైదరాబాద్ హెచ్ఐసీసీ
– రెండు వేల మంది నిపుణులు హాజరు
– ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్
– శుక్రవారం సాయంత్రం ముగింపు కార్యక్రమం
– తెలంగాణ ఏఐ రూట్‌మ్యాప్ విడుదల
– 200 ఎకరాల్లో ఏఐ సిటీ ఏర్పాటుపై క్లారిటీ
– తొలిసారిగా ఆతిథ్యమిస్తున్న భారత్
Hyderabad: హైదరాబాద్ నగరం నేటి నుంచి మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కానుంది. రాజధానిలోని హెచ్‌ఐసీసీలో నేడు, రేపు జరగనున్న ఈ అంతర్జాతీయ సదస్సుకు ప్రపంచం నలుమూలల నుంచి రెండువేల మంది ఏఐ రంగ నిపుణులు హాజరు కానున్నారు. సాంకేతిక ఆవిష్కరణల రంగంలో తెలంగాణను అగ్రగామిగా తీర్చిదిద్దాలనే ముఖ్యమంత్రి సంకల్పానికి ఈ సదస్సుతో మరో అడుగు ముందుకు పడనుంది. ‘మేకింగ్ ఏఐ వర్క్ ఎవ్రీ వన్’ అనే ఇతి వృత్తంతో జరుగుతున్న ఈ సదస్సులో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సమాజానికి ఎలా ప్రయోజనం చేకూర్చనుంది? పలు వర్గాలకు ఎలా సాధికారతను కల్పించనుంది? అనే అంశాలపై నిపుణులు చర్చించనున్నారు. ఏఐ అంశంపై ఒక రోడ్‌మ్యాప్ ఏర్పాటు, ప్రభుత్వ సేవల్లో ఏఐ వినియోగం, యువతకు శిక్షణ తదితర ఏఐ టెక్నాలజీ రంగంలో తెలంగాణలో కొత్త ప్రాజెక్టులకు ఈ సదస్సు నాంది పలుకనుందని ప్రభుత్వం భావిస్తోంది.
తొలిసారి ఇక్కడే..
మనదేశంలోనే ఏఐ గ్లోబల్ సదస్సు జరగటం ఇదే తొలిసారి కాగా, ఆ ఘనత హైదరాబాద్‌కు దక్కటం మరో విశేషం. ఇక.. ఈ సదస్సుకు ఏఐ రంగంలో అందరి దృష్టి ని ఆకర్షిస్తున్న ఖాన్ అకాడమీ అధినేత సల్ ఖాన్, IBM నుంచి డానియెలా కాంబ్, XPRIZE ఫౌండేషన్ పీటర్ డయామండిస్ తదితర ప్రముఖులు హాజరవుతున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో ఏఐ రంగంపై తమ ఆలోచనలను, ఈ రంగంలోని భవిష్యత్తు అవకాశాలు, కొత్త ఆవిష్కరణలపై వీరు చర్చలు జరపనున్నారు. అలాగే, సామాజిక బాధ్యతగా సమాజంపై AI ప్రభావం, నియంత్రణ, సవాళ్ల మీదా చర్చ జరగనుంది. కొత్త టెక్నాలజీతో చేపట్టే పరిశోధనలు, స్టార్టప్ డెమోలు, అభివృద్ది దశలోని వినూత్న ప్రాజెక్ట్‌లను ఈ సదస్సులో ప్రదర్శిస్తారు. ఈ ఈవెంట్‌లో ప్రధాన వేదికతో పాటు 4 అదనపు వేదికలు ఏర్పాటు చేశారు. అన్ని వేదికలపై AI కి సంబంధించి వేర్వేరు అంశాలపై చర్చలు, ఇష్టాగోష్టి సెషన్స్ నిర్వహించే ఏర్పాట్లు చేశారు. హై-ప్రొఫైల్ ప్యానెల్ డిస్కషన్స్, ఇంటరాక్టివ్ సెషన్‌లు ఏర్పాటు చేశారు.
రోడ్ మ్యాప్ రెడీ..
ఐటీ, ఫార్మా, పలు సేవారంగ సంస్థలతో అలరారుతున్న హైదరాబాద్ నగరాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు కేరాఫ్‌గా మార్చటం వల్ల ప్రపంచ వ్యాప్తంగా మరింత గుర్తింపు సాధించవచ్చని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అదే సమయంలో ప్రభుత్వంలోని అన్ని శాఖల్లోనూ ఏఐని సమర్థంగా వినియోగించుకోవటం ద్వారా మెరుగైన ఫలితాలను సాధించవచ్చని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారు. దీనిని ఆచరణలోకి తీసుకురావటం కోసం 25 అంశాలతో కూడిన ఒక స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక(రోడ్ మ్యాప్)ను ఇప్పటికే ఐటీ శాఖ రూపొందించింది. ఈ సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి ఏఐపై రోడ్‌మ్యాప్‌ను ప్రకటించనున్నారు.
యువతకు శిక్షణ
తెలంగాణలోని ఇంజనీరింగ్ విద్యార్థుల్లో ఏఐపై ఆసక్తి ఉన్నవారికి ప్రభుత్వం తరపున మెరుగైన శిక్షణ ఇప్పించటం ద్వారా వేలాది కొత్త ఉద్యోగాల కల్పన సాధ్యమని ప్రభుత్వం భావిస్తోంది. దీనిని అత్యంత ప్రాధాన్యత గల అంశంగా ముందుకు తీసుకుపోయే క్రమంలో లక్షమందికి ఏఐపై శిక్షణ ఇవ్వడానికి ఒక ప్రముఖ అంతర్జాతీయ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవటానికి రంగం సిద్ధం చేసింది. ఇకపై.. ఐటీ శాఖ తరపున ప్రతి రెండు నెలలకు ఒక వర్క్‌షాప్ నిర్వహించి అందులో యువతను, విద్యాసంస్థలను, ఐటీ కంపెనీలను భాగస్వామం చేసే దిశగా ఐటీ శాఖ సిద్ధమవుతోంది.
Also Read: TGSRTC: బ్రేకింగ్ న్యూస్.. బంపర్ ఆఫర్ ప్రకటించిన ఆర్టీసీ
అల్గారిథమ్స్‌లోనే అంతా..
ఏఐలో ఎంత మంచి అల్గారిథమ్స్‌ను తయారుచేస్తే.. కచ్చితత్వం అంత బాగా పెరుగుతుంది. అయితే, దీనికోసం విస్తృతమైన శిక్షణ ఇవ్వాలి. కానీ, అల్గారిథమ్స్‌పై శిక్షణ పొందేవారికి ప్రస్తుతం డేటా అంశం పెద్ద సమస్యగా ఉంది. ఉదాహరణకు ప్రభుత్వంలోని వ్యవసాయం, రెవెన్యూ వంటి శాఖల వద్ద డేటాల సాయంతో అల్గారిథమ్స్ తయారుచేయాలంటే..నాలుగైదు డెస్క్‌టాప్‌లు, ల్యాప్‌టాప్‌లు సరిపోవు. దానికి ‘గిగా’ సామర్థ్యం గల కంప్యూటర్లు కావాల్సి ఉంటుంది. అయితే, ఇది భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కనుక కేంద్ర ప్రభుత్వ సంస్థ సీ-డాక్‌తో సమన్వయం చేసుకొని యువతకు ఈ ఇబ్బందిని దూరంచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రభుత్వ సేవలకూ ఏఐ..
ప్రభుత్వంలో వేర్వేరు శాఖల్లో 30కి పైగా ఏఐ అప్లికేషన్లను ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వాడుతోంది. తెలంగాణలో సంప్రదాయక వ్యవసాయక సవాళ్లు అధిగమించేందుకు, రద్దీ సమయాల్లో హైదరాబాద్ రోడ్లపై వాహనాల రాకపోకకలను సులభతరం చేసేందుకు, వేటగాళ్లు రిజర్వ్ ఫారెస్టులో వన్యమృగాలను వేటాడటానికి ప్రయత్నించిన సందర్భాల్లో ఏఐని వాడటం ద్వారా ఆయా శాఖలు మంచి ఫలితాలను పొందుతున్నాయి. అలాగే, కొత్తగా డ్రగ్స్‌కు అలవాటు పడే క్రమంలో యువకుల్లో వచ్చే మార్పులను గుర్తించటానికి ఏఐని వాడుకుంటున్నారు. ఇప్పటికే సుమారు 50 మందిని ఈ టెక్నాలజీ సాయంతో గుర్తించి, వారికి కౌన్సెలింగ్ అందించటం జరిగింది. ఇదే విధంగా, ప్రభుత్వ సేవల్లోనూ దీనిని బాగా వాడాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో వ్యక్తుల ప్రైవేటు డేటా అక్రమార్కుల చేత చిక్కకుండా కూడా ప్రభుత్వం గట్టి కట్టుదిట్టం చేయనుంది.
200 ఎకరాల్లో ఏఐ సిటీ
కొత్తగా అభివృద్ధి చేయనున్న ఫోర్త్ సిటీలో 200 ఎకరాల్లో ‘ఏఐ సిటీ’ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)లో దీన్ని అభివృద్ధి చేయాలని, తద్వారా ప్రపంచంలో ఎక్కడ ఏఐకి సంబంధించిన కొత్త అభివృద్ధినైనా ముందుగా తెలంగాణ అందిపుచ్చుకోవాలని, దానిపై యువతకు శిక్షణనివ్వాలని సర్కారు యోచిస్తోంది. నేడు, రేపు జరగనున్న ఈ సదస్సులో తీసుకున్న నిర్ణయాలు, జరిగిన చర్చల అనంతరం ప్రభుత్వం ఏఐ సిటీకి సంబంధించిన యాక్షన్ ప్లాన్‌ను ప్రకటించనుంది. ఈ క్రమంలోనే టాస్క్, టీ-హబ్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్, తెలంగాణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ (టీ-ఎయిమ్) వంటి సంస్థ మధ్య సమన్వయాన్ని పెంచాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఇక్కడి ఇంజినీరింగ్ కళాశాలల్లో ఏఐ స్పెషలైజేషన్‌లో కోర్సులను మరింత ప్రోత్సహించాలని కూడా ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది.