E-Paper
Advertisement

ఏపీ నుంచి తెలంగాణకు భారీగా అక్రమ ఇసుక రవాణా.. పట్టించుకోని మైనింగ్ అధికారులు!

ఏపీ నుంచి తెలంగాణకు భారీగా అక్రమ ఇసుక రవాణా.. పట్టించుకోని మైనింగ్ అధికారులు!
Advertisement

Illegal Sand: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయం అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తోంది. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చాల్సిన మైనింగ్‌ శాఖలో పర్యవేక్షణ కొరవడిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణకు ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజమండ్రి, విజయవాడ, కర్నూలు, ఒంగోలు తదితర ప్రాంతాల నుంచి నిత్యం వందలాది లారీల్లో ఇసుక తెలంగాణలోకి చేరుతున్నట్లు సమాచారం. రోజుకు సుమారు 200 లారీల వరకు రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నాయన్న అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ వ్యవహారం వల్ల ప్రభుత్వానికి నెలకు రూ.9.33 కోట్ల మేర ఆదాయం కోల్పోతున్నట్లు సమాచారం. ఇంత పెద్ద మొత్తంలో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతున్నా సంబంధిత శాఖ అధికారులు ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

రోజుకు 200 లారీల రాక!

ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల నుంచి ఇసుకను సేకరించి తెలంగాణకు తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏపీలో ఉచిత ఇసుక అమలులో ఉండటంతో దీనిని అదునుగా చేసుకొని కొంతమంది అక్రమార్కులు అనుమతి లేకుండా తెలంగాణకు ఇసుకను తీసుకొస్తున్నారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల నుంచి బయలుదేరే లారీలు ఖమ్మం, సూర్యాపేట మీదుగా హైదరాబాద్‌ వైపు వస్తున్నట్లు సమాచారం. విజయవాడ, కృష్ణా జిల్లా ప్రాంతాల నుంచి నందిగామ, జగ్గయ్యపేట, కోదాడ మార్గాల్లో రవాణా సాగుతున్నట్లు తెలుస్తోంది. కర్నూలు ప్రాంతం నుంచి కూడా వివిధ మార్గాల ద్వారా తెలంగాణలోకి ఇసుక చేరుతున్నట్లు ఆరోపణలున్నాయి.

అనుమతులు ఉన్నాయా..?

Advertisement

ఒంగోలు పరిసర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు సైతం ఈ రవాణాలో భాగమవుతున్నట్లు సమాచారం. ఈ లారీల్లో ఎన్ని వాహనాలకు చట్టబద్ధమైన అనుమతులు ఉన్నాయి? ఎన్ని వాహనాలు ట్రాన్సిట్‌ పర్మిట్లు లేకుండా వస్తున్నాయి? ఏపీ నుంచి ఇసుకను తరలించేందుకు అక్కడి నిబంధనల ప్రకారం అనుమతులు తీసుకున్నా, తెలంగాణలో విక్రయించేందుకు అవసరమైన అనుమతులు ఉన్నాయా? అన్న అంశాలు చర్చనీయాంశమయ్యారు. అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే అడ్డుకోవాల్సిన బాధ్యత మైనింగ్‌, రవాణా, పోలీసు, రెవెన్యూ శాఖలపై ఉంది. అయినా నిరంతరంగా లారీలు వస్తున్నాయన్న ఆరోపణలు అధికార యంత్రాంగం పనితీరుపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

నెలకు రూ.9.33 కోట్ల నష్టం?

రోజుకు 200 లారీలు తెలంగాణలోకి వస్తున్నాయనిఇప్పటికే లారీ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఒక్కో లారీకి సుమారు రూ.15,550 చొప్పున ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని ప్రాథమిక అంచనాకు తీసుకుంటే రోజుకు రూ.31.10 లక్షలు అవుతుంది. ఈ లెక్కన నెలకు రూ.9.33 కోట్లు, ఏడాదికి దాదాపు రూ.112 కోట్ల మేర ఆదాయానికి గండి పడుతున్నట్లు అంచనా. ఒక్కో లారీలో 35 నుంచి 40 టన్నులు ఇసుకను తరలిస్తున్నారని సమాచారం.

Advertisement

Also read: రైలు సీట్లు నీలం రంగులోనే ఎందుకు ఉంటాయి? దీని వెనుక ఆసక్తికర కారణాలివే!

తనిఖీలు ఎక్కడ? అడ్డుకునేదెవరు?

రాష్ట్ర సరిహద్దుల్లో మైనింగ్‌ శాఖకు చెందిన తనిఖీ వ్యవస్థ ఉన్నప్పటికీ అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో నియంత్రించలేకపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ప్రధాన రహదారుల మీదుగా భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తున్నప్పుడు వాటిని గుర్తించడం కష్టమేమీ కాదు. ప్రతి వాహనానికి సంబంధించిన అనుమతులు, రవాణా పత్రాలు, లోడ్‌ వివరాలు పరిశీలిస్తే అక్రమ రవాణాను సులభంగా గుర్తించే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు జరుగుతున్నాయా? వాహనాల నంబర్లు, రవాణా పత్రాలు నమోదు చేస్తున్నారా?

ఎన్ని సీజ్‌ చేశారు..?

ఓవర్‌లోడ్‌ వాహనాలపై చర్యలు తీసుకుంటున్నారా? అనుమతులు లేని లారీలను ఎన్ని సీజ్‌ చేశారు? ఎంత జరిమానా వసూలు చేశారు? అనే ప్రశ్నలకు అధికారులవద్దే సరైన సమాధానం లేదని సమాచారం. సరిహద్దుల్లో కొందరు క్షేత్రస్థాయి అధికారులకు అక్రమ రవాణాదారుల నుంచి మామూళ్లు అందుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. లారీలు ఎలాంటి ఆటంకాలు లేకుండా గమ్యస్థానాలకు చేరుతుండటానికి ఇదే కారణమన్న విమర్శలు కూడా ఉన్నాయి. అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారంపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది.

సమీక్షలకే పరిమితమవుతున్న ఉన్నతాధికారులు!

మైనింగ్‌ శాఖ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితుల్లో మార్పు రావడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేయడం, సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచడం, వాహనాల రాకపోకలను డిజిటల్‌ విధానంలో పర్యవేక్షించడం వంటి చర్యలు చేపట్టాల్సి ఉంది. కానీ కాగితాలపై సమీక్షలు, సమావేశాలకే పరిమితమైతే అక్రమార్కులకు అడ్డుకట్ట పడటం కష్టమే. మైనింగ్‌, రవాణా, పోలీసు, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేస్తేనే ఈ అక్రమ రవాణాను నియంత్రించవచ్చు. సరిహద్దు మార్గాల్లో నిరంతర తనిఖీలు, అనుమానాస్పద వాహనాలపై నిఘా, ఇసుక డంపుల తనిఖీలు తప్పనిసరి. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న ఇసుక నిల్వ కేంద్రాల్లో స్టాక్‌ వివరాలను పరిశీలించాల్సిన అవసరం ఉంది.

అనుమతుల్లేకుండా ఫిల్టర్ ఇసుక

మరోవైపు తెలంగాణలోని పటాన్ చెరువు, మహబూబ్ నగర్, నగర్ కర్నూల్ నుంచి ఫిల్టర్ ఇసుక ను అనుమతుల్లేకుండా అక్రమంగా హైదరాబాద్ కు తరలిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. దీనిపై అధికారులు నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీని కోట్లతో నష్టంజరుగుతుందని సమాచారం.

ప్రత్యేక నిఘా..

ఏది ఏమైనప్పటికీ రోజుకు ఎన్ని లారీలు ఏపీ నుంచి తెలంగాణకు వస్తున్నాయి? వాటిలో ఎన్ని అనుమతులతో వస్తున్నాయనేదానిపై మైనింగ్ అధికారులుసరిహద్దు చెక్‌పోస్టుల పనితీరుపై ప్రత్యేక నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. అనుమల్లేకుండా రవాణా అవుతున్న ఇసుకతో తెలంగాణలోని లారీఓనర్స్ సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇసుక డిమాండ్ సైతం లేకపోవడంతో లారీలకు ఈఎంఐలు, మెయింటెన్స్, డ్రైవర్ కు సైతం వేతనం ఇవ్వడం కష్టమవుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మైనింగ్ అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపుతారా? లేదా? అనేది చూడాలి.

అక్రమరవాణాను అరికట్టాలి..

ఏపీ నుంచి అక్రమంగా ప్రతి రోజూ 200లారీలు తెలంగాణకు వస్తున్నాయి. దీంతో ప్రభుత్వానికి ఆదాయంతో పాటు తమకు ఇసుక డిమాండ్ తగ్గుతుంది. లారీ కుస్తీలతోపాటు మెయింటెన్స్ సైతం చేయలేక కొంతమంది అమ్ముకుంటున్నారు. మైనింగ్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదుచేసినా పట్టించుకోవడం లేదు. ఇసుక రీచ్ లలో కూడా కాంట్రాక్టర్లు అక్రమంగా లారీకి 2వేలకు పైగా వసూలు చేస్తున్నారని తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సలావుద్దీన్, అన్నారు.

Also Read: బరువు తగ్గాలన్నా, కండలు పెంచుకోవాలన్నా పూర్తి గుడ్డు తినాలా? తెల్లసొన మాత్రమే సరిపోతుందా?

Tags

Related News

సోనియా 544 పేజీల ఆత్మకథా.. లేక రాజకీయ రణరంగమా..?

మెక్రాన్ రొమాన్స్‌.. రాజకీయాల్లో రచ్చ.. ఈ పలకరింపుల వెనుక కథేంటి?

అప్పుడు బాలీవుడ్.. ఇప్పుడు సోనియా.. కాంట్రవర్సీ ‘క్వీన్’

ఫామ్‌హౌజ్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌.. తొలిసారిగా కవితపై విరుచుకుపడ్డ పార్టీ..! సిద్దిపేట అడ్డాగా చేసిన కామెంట్స్‌తో మౌనం వీడి..

గులాబీ పార్టీలో యువ గలం అసంతృప్తి.. ఎందుకో తెలుసా..?

ఏడేళ్ల కిందటి ‘దిశ’ ఎన్‌కౌంటర్‌ కథతో ‘దాయ్రా’ మూవీ! పృథ్వీరాజ్‌ హీరోగా హిందీ మూవీ..! ఎన్‌కౌంటర్‌ను సమర్థించే పాత్రలో పృథ్వీ!

పన్నుల నుంచి పర్మిషన్‌ల వరకు.. CUREతో హైదరాబాద్‌లో మారేదేంటి?

Big Stories

Advertisement
×