Robinhood Review: ఈ మధ్య కాలంలో నితిన్ కి ఒక్క హిట్టు కూడా పడలేదు. ఎలాగైనా హిట్టు కొట్టాలని ‘రాబిన్ హుడ్’ చేశాడు. తనకి ‘భీష్మ’ వంటి హిట్ ఇచ్చిన వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన సినిమా ఇది. మరి ఇదైనా నితిన్ కి హిట్ ఇచ్చేలా ఉందో? లేదో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి..
కథ
అనాధ అయినటువంటి రామ్(నితిన్) తన తోటి స్నేహితుల అక్కర్లు తీర్చడానికి రాబిన్ హుడ్ అనే దొంగగా మారతాడు. ఇతనికి సాయం చేయడానికి ఫ్రెండ్స్ గ్యాంగ్ కూడా ఉంటుంది. ఆలా పెద్ద నెట్ వర్క్ నే బిల్డ్ చేసుకుంటాడు. ఇతని దొంగతనాల వ్యవహారం ఏకంగా హోమ్ మినిస్టర్ రేంజ్ కి వెళ్తుంది. దీంతో ఇతన్ని పట్టుకోవడానికి విక్టర్ వర్గీస్(షైన్ టైం చాకో) అనే సిన్సియర్ అండ్ అగ్రెసివ్ పోలీస్ ను నియమిస్తుంది. అయితే అతను కూడా ఇతన్ని పట్టుకోలేడు. మరోపక్క విదేశాల్లో ఉండే గ్రేట్ బిజినెస్మెన్ అభినవ్ వాసుదేవ్ (సిజు) కి తన కూతురంటే ప్రాణం. అయితే తన తల్లి కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే ఆమె ఇండియాకి రావాల్సి ఉంటుంది. ఇందుకోసం z కేటగిరీ ఫోర్స్ ను నియమిస్తాడు ఆమె మేనేజర్(వెన్నెల కిషోర్). ఆ Z కేటగిరీ ఫోర్స్ లో హీరో కూడా ఉంటాడు? ఆమెతో పాటు అతను కూడా ఊరికి వెళ్తాడు. ఆ తర్వాత ఆ ఊరి జనాల కోసం, హీరోయిన్ తాతగారు(లాల్) కోసం అండగా నిలబడతాడు. అది ఎందుకు? రాబిన్ హుడ్ కి ఆ ఊరికి సంబంధం ఏంటి? ఆ ఊర్లో జనాలని సామి అలియాస్ రామ్ ధూత్ హనుమాన్ (దేవదత్త నాగే) ఎందుకు పీడిస్తూ ఉంటాడు? అతనిపై ఉన్న డేవిడ్ ఎవరు? వంటి ప్రశ్నలకి సమాధానమే మిగిలిన సినిమా.
విశ్లేషణ
కథ ఎక్కడో శ్రీలంకలోని తలైమన్నార్ లో మొదలైనట్టు చూపిస్తారు. ఆ వెంటనే హీరో గారి బాల్యం ఎపిసోడ్ వస్తుంది. అనాధ శరణాలయాలను వాటికి వచ్చే విరాళాలను ఎలా దుర్వినియోగం చేస్తున్నారు అనే పాయింట్ తో కథ మొదలవుతుంది. దీంతో సినిమాలో విషయం ఉంది అనే అటెన్షన్ వస్తుంది. తర్వాత హీరో దొంగతనాలు చేసి పేద జనాలను ఆదుకోవడం అనే పాయింట్ కూడా ఓకే. కానీ ఎప్పుడైతే హీరోయిన్ ట్రాక్ ఓపెన్ అవుతుందో అక్కడి నుండి వచ్చే సిల్లీ కామెడీ విసిగిస్తుంది. అయినప్పటికీ ఫస్ట్ హాఫ్ సో సోగా టైం పాస్ చేయిస్తుంది. అయితే సెకండాఫ్ ఆరంభంలోనే ఒక మంచి ఫైట్ వస్తుంది. దీంతో సినిమా గ్రాఫ్ పెరుగుతుందేమో అని అంతా అనుకుంటారు. కానీ ఆ వెంటనే మళ్ళీ అనవసరమైన కామెడీ ఎపిసోడ్స్ విసిగిస్తాయి. విలన్ ట్రాక్ అయితే చాలా పేలవంగా ఉంటుంది. అసలు ఆ పాత్రకి సరైన ఎష్టాబ్లిష్మెంట్ లేదు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో వచ్చే హీరో చేతిలో జోకర్లా అతను ఆడుతూ ఉంటాడు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ మాత్రం పర్వాలేదు అనిపిస్తుంది. దర్శకుడు వెంకీ కుడుముల రాసుకున్న కథ పాతదే అయినప్పటికీ.. కథనాన్ని బాగానే డిజైన్ చేసుకున్నాడు. స్క్రిప్ట్ వరకు ఇది బాగానే ఉందేమో అనిపిస్తుంది. కానీ డైరెక్షన్ వీక్ అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ‘ఛలో’ ‘భీష్మ’ లో ఉన్న మ్యాజిక్ ఇందులో మిస్ అయ్యింది. జీవీ ప్రకాష్ సంగీతం జస్ట్ ఓకే. ‘వన్ మోర్ టైం’ ‘అదిదా సర్ప్రైజు’ వంటి పాటలు ఓకే అనిపిస్తాయి. మిగిలినవి ఏమీ గుర్తుండవు. నిర్మాతలు మాత్రం మంచినీళ్లులా డబ్బులు పెట్టేశారు. వారు పెట్టిన బడ్జెట్ స్క్రీన్ పై కనిపిస్తుంది.
నటీనటుల విషయానికి వస్తే..
నితిన్ ఎప్పటిలానే హుషారుగా నటించాడు. అతని స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. శ్రీలీల పాత్రకి ఇంపార్టెన్స్ ఉన్నప్పటికీ.. దాన్ని సరిగ్గా డెవలప్ చేసినట్టు లేదు. పైగా శ్రీలీలకి వేరే వాళ్ళతో చెప్పించిన డైలాగ్ కూడా మ్యాచ్ అవ్వలేదు. రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్..ల కామెడీ ఓకే. శుభలేఖ సుధాకర్, లాల్ వంటి నటులు జస్ట్ పాడింగ్ ఆర్టిస్టుల్లా ఉన్నారు. దేవదత్త, మైమ్ గోపి..ల పాత్రలు విలన్స్ గా మొదలై కామెడీ టర్న్ తీసుకున్నాయి. డేవిడ్ వార్నర్ ఈ సినిమాలో నటించాడు అనే కంటే జస్ట్ కనిపించాడు అనడం కరెక్ట్.
ప్లస్ పాయింట్స్:
నితిన్
కామెడీ
నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్:
డైరెక్షన్
సెకండాఫ్
విలన్ రోల్
మొత్తంగా ‘రాబిన్ హుడ్’ సినిమా నితిన్ గత సినిమా ‘ఎక్స్ట్రా’ కంటే కొంచెం బెటర్. కానీ దర్శకుడు వెంకీ కుడుముల ‘ఛలో’ ‘భీష్మ’ వంటి సినిమాలతో పోలిస్తే వీక్.
Robinhood Movie Rating : 2/5