చైనా హద్దులు మీరుతోంది. డ్రాగన్ తోక వంకరని మళ్లీ మళ్లీ నిరూపిస్తోంది. భారత్‌ను ఉడికించడానికి రంగం సిద్ధం చేసింది. బోర్డర్‌లో సైన్యాన్ని వెనక్కి తీసుకుంటున్నామని చెబుతూనే… మరోవైపు నుండి విషం చిమ్ముతోంది. ఈశాన్య భారతదేశానికి వెళ్లే ఎంట్రీ పాయింట్‌కు దగ్గరగా చైనా రెచ్చగొట్టే చర్యలకు దిగుతోంది. కీలకమైన సరిహద్దుకు సమీపంలో దాని గ్రామాలను నిర్మించుకుంటుంది. ఇప్పటికే, 22 గ్రామాలను నిర్మించినట్లు తాజా శాటిలైట్ చిత్రాలు చెబుతున్నాయి. ఇంతకీ, చైనా ప్లాన్ ఏంటీ..? చైనా ఇలాంటి చీప్ ట్రిక్స్ ఎందుకు ప్లే చేస్తోంది…?
వ్యూహాత్మక ప్రదేశాల్లో చైనా గ్రామాలు
ఇటీవల, భారత్ చైనాల మధ్య పరిస్థితులు మెరుగవుతున్నాయని అనుకుంటున్న తరుణంలో చైనా తన వంకర బుద్ధిని మరోసారి బయట పెట్టుకుంటుంది. భారత్‌తో ఉన్న సరిహద్దుల వెంబడి చైనా ప్రాభల్యం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. భూటాన్‌లోని డోక్లామ్ సమీపంలో భారత్-చైనా ప్రతిష్టంభన ఏర్పడిన దాదాపు 8 సంవత్సరాల తర్వాత, వ్యూహాత్మక ప్రదేశానికి సమీపంలో చైనా గ్రామాలను నిర్మిస్తోంది. ఇప్పటికే, సుమారు 22 గ్రామాలను నిర్మించినట్లు ఉపగ్రహ డేటాలో గుర్తించారు.
చికెన్ నెక్‌కు సమీపంలో..
ఈ 22 గ్రామాల్లో 8 గ్రామాలు భూటాన్‌లోని డోక్లామ్ పీఠభూమికి దగ్గరగా ఉన్నాయి. ఈ గ్రామాలు భారత సరిహద్దుకు సమీపంలో… చైనా క్లెయిమ్ చేస్తున్న వ్యూహాత్మక లోయల్లో, కొండల్లో ఉన్నట్లు తెలుస్తోంది. “చికెన్ నెక్” అనే పేరుతో పిలిచే సిలిగురి కారిడార్‌కు ఇది దగ్గరగా ఉంది. ఈ ప్రాంతం… భారతదేశంలోని ఇతర ప్రాంతాల నుండి ఈశాన్య భారతదేశానికి వెళ్లే ఎంట్రీ ద్వారంగా పిలుస్తారు. అందుబాటులో ఉన్న ఉపగ్రహ చిత్రాల ప్రకారం, 2020 నుండి ఈ వ్యూహాత్మక ప్రాంతంలో చైనా గ్రామాలు కనిపిస్తున్నాయి. అలాగే, ఈ గ్రామాలకు సమీపంలో చైనా సైనిక స్థావరాలు, అవుట్‌పోస్టులు కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
‘డొక్లామ్’ ప్రతిష్టంభన
భూటాన్ భూభాగంలో చైనా నిర్మించిన అతిపెద్ద గ్రామాల్లో జివు అనే గ్రామం ఒకటి. నివేదికల ప్రకారం, ఈ గ్రామం సాంప్రదాయ భూటాన్ పశ్చిమ సెక్టార్‌లోని పచ్చిక బయళ్లలో త్షేతాంగ్ఖా అని పిలిచే ప్రాంతంలో అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై ఇప్పటివరకు ఎటువంటి కచ్ఛితమైన సమాచారం అందుబాటులోకి రాలేదు. అయితే, 2017లో భారత్-చైనా సరిహద్దు సమస్యలో భాగంగా ఈ భూభాగంలో ప్రతిష్టంభన ఏర్పడింది. భారత్-చైనా-భూటాన్ దేశాల మధ్య ఉన్న డోంగ్లాంగ్ ట్రైజంక్షన్ ఇది. డోక్లామ్‌పై భూటాన్-చైనాల మధ్య కూడా వివాదం ఉంది. కానీ, ఇది భారత్‌కు అత్యంత కీలకమైన సరిహద్దు ప్రాంతం. ఈ సరిహద్దుకు సమీపంలోని డోంగ్లియాంగ్ కాయోచాంగ్ అనే ప్రదేశం పక్కన ఉన్న డోక్లామ్‌లో చైనా నిర్మాణాలున్నాయనే కారణంతో భారత సాయుధ దళాలు, పీపుల్స్ లిబరేషన్ మిలిటరీ ఆఫ్ చైనా మధ్య ప్రతిష్టంభన నెలకొంది.
ఉద్రిక్తతలకు కారణం.. ఆ రోడ్డే
డోక్లామ్‌లో చైనా సైన్యం వివాదాస్పద ప్రదేశంలో రోడ్డు నిర్మాణం చేపట్టి… భారత్ వైపుగా దాన్ని నిలిపేసింది. దీనిని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. నిర్మాణం ఆపాలని డిమాండ్ చేసింది. ఈ పరిణామం తర్వాత, 2017 జూన్ 16 నుంచి భారత్-చైనా సైనికుల మధ్య 73 రోజుల పాటు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 2017 ఆగస్టు 28న విదేశీ వ్యవహారాల శాఖల ముఖాముఖి చర్చల తర్వాత ఈ ప్రాంతం నుండి వైదొలగుతున్నట్లు చైనా ప్రకటించింది.
ఉపగ్రహ చిత్రాలతో బయటపడ్డ బాగోతం
ఇక, భారత్-చైనా మధ్య ప్రతిష్టంభన ముగిసే సమయానికి రెండు దేశాల సైనిక బలగాలు ఈ ప్రాంతం నుండి వెనక్కి తగ్గడానికి ఒప్పుకున్నాయి. కానీ, ఇటీవలి సంవత్సరాల్లో సేకరించిన ఉపగ్రహ చిత్రాలు చైనా అసలు స్వరూపాన్ని మరోసారి బయటపెట్టాయి. డోక్లామ్ చుట్టూ చైనా నిర్మాణాలను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మాత్రం ఇప్పటి వరకూ స్పందించ లేదు. నిజానికి, చికెన్ నెక్ అని పిలుస్తున్న ఈ ప్రాంతం భారతదేశానికి చాలా ముఖ్యమైన ప్రాంతం. ప్రత్యేకించి ఈ వ్యూహాత్మక ప్రాంతంలో చైనా నిర్మాణాలు… చికెన్ నెక్ అయిన సిలిగురి కారిడార్‌ను కలిపే ప్రమాదం పెరుగుతుంది. ఇది భారతదేశంలోని ఇరుకైన కారిడార్‌లలో ఒకటి.
ఈశాన్య ప్రాంతాలను కలిపే కీలక ప్రాంతం ‘చికెన్ నెక్’
పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి చుట్టూ ఉన్న చికెన్ నెక్ భూభాగాన్ని భౌగోళిక-రాజకీయ, భౌగోళిక-ఆర్థిక కారిడార్‌గా పేర్కొంటారు. ఇది ఈశాన్య భారతదేశంలోని ఏడు రాష్ట్రాలను భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలకు కలిపే కీలక ప్రవేశ ద్వారం. ఇక్కడ చైనా ప్రాభల్యం పెరిగితే అది ఈశాన్య భారత్‌లో ఉద్రిక్తతలకు కారణం అవుతుంది. ఇప్పటికే, మణిపూర్ అల్లర్లలో చైనా హస్తం ఉందనే సందేహాల మధ్య ఇక్కడ చైనా ఉనికి మరింత ప్రమాదాన్ని సృష్టించే అవకాశం ఉంది.
భూటాన్ వ్యతిరేకించినా.. తగ్గని చైనా
ఇటీవలి సంవత్సరాలలో, భూటాన్ అధికారులు కూడా భూటాన్ భూభాగంలో చైనీస్ నివాసాల ఉనికిని ఖండించారు. 2016 నుండి, భూటాన్ కూడా చైనాలో భాగమేనని చైనా మొండిగా వాదిస్తోంది. ఈ భూభాగంలో మొదటిసారిగా ఒక గ్రామాన్ని నిర్మించినప్పుడు కూడా భూటాన్ వ్యతిరేకించింది. కానీ, చైనా కార్యకలాపాలను మాత్రం నిలువరించలేకపోయింది. తర్వాత, పరిణామంలో… చైనా అధికారులు 22 గ్రామాల్లో 2 వేల 284 రెసిడెన్షియల్ యూనిట్లను పూర్తి చేశారు. అలాగే, దాదాపు 7 వేల మందిని ఆ గ్రామాల్లోకి పంపించి, పూర్తి స్థాయి గ్రామాలుగా తీర్చిదిద్దారు. దీనిపైన, స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ పరిశోధకులు… “ఫోర్స్‌ఫుల్ డిప్లమసీ: చైనా బోర్డర్ విలేజెస్ ఇన్ భూటాన్” అనే ప్రత్యేక రిపోర్టును తయారు చేశారు.
భూటాన్ భూభాగంలో 2 శాతం కంటే ఎక్కువగా..
“ఫోర్స్‌ఫుల్ డిప్లమసీ: చైనా బోర్డర్ విలేజెస్ ఇన్ భూటాన్”లో పేర్కొన్న అంశాలను పరిశీలిస్తే.. గతంలో భూటాన్‌లో ఉన్న భూభాగంలో… చైనా దాదాపు 825 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మాణాలు చేసినట్లు తెలుస్తోంది. ఈ భూభాగం భూటాన్ మొత్తం భూభాగంలో 2% కంటే కొంచెం ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ గ్రామాల్లో… చైనాకు చెందిన అధికారులు, నిర్మాణ కార్మికులు, బోర్డర్ పోలీసులు, సైనిక సిబ్బంది నివాసాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, ఈ గ్రామాలన్నీ చైనాలోని పట్టణాలకు వెళ్లే రోడ్లతో అనుసంధానించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
గ్రామాల నుంచి పట్టణాలుగా అప్‌గ్రేడ్.. ఆ తర్వాతి టార్గెట్ ఇండియా
ఇక, 2023 ప్రారంభం నుండి ఈ ప్రాంతంలో మరో ఏడు కొత్త స్థావరాలు నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ అనుబంధ ప్రాంతాల్లో మరింత వేగంగా ప్రస్తుతం నిర్మాణాలు జరుగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. అలాగే, ఇందులో మూడు గ్రామాలను పట్టణాలుగా అప్‌గ్రేడ్ చేయబోతున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ చర్యలతో ముందుగా… భూటాన్ పశ్చిమ సెక్టార్‌లోని డోక్లామ్ పీఠభూమి, పరిసర ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడం, చైనా లక్ష్యంగా తెలుస్తోంది. వీటిని ఆక్రమించుకున్న తర్వాత భారత్‌లోని పలు ఈశాన్య ప్రాంతాలపై పట్టు సాధించే ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది.
1998 నాటి ఒప్పందం ఉల్లంఘన
ఇక, పశ్చిమ సెక్టార్‌లోని 8 గ్రామాలు… ఉత్తరం నుండి దక్షిణానికి 36 కి.మీ విస్తరించి ఉన్నాయి. ఇందులో, ప్రతి గ్రామం మధ్య సగటున 5.3 కి.మీ. గ్యాప్ కనిపిస్తోంది. చరిత్రకారుల ప్రకారం, 1913లో అప్పటి టిబెట్ పాలకుడు, భూటాన్‌కు అప్పగించిన ప్రాంతంలో వీటిని నిర్మించినట్లు తెలుస్తోంది. అయితే, భూటాన్ భూభాగంలో చైనా గ్రామాలను నిర్మించడం డిసెంబర్ 1998లో భారత్-చైనాలు సంతకం చేసిన ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని నిపుణులు చెబుతున్నారు. ఈ చర్యలు సరిహద్దు ప్రాంతాల్లో శాంతికి భగం వాటిల్లజేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ద్వేపాక్షిక సంబంధానికి తూట్లు
డోక్లామ్ సమీపంలో చైనా చర్యలు ఒక్క భారతదేశానికే కాదు.. భూటాన్ సార్వభౌత్వానికి కూడా సవాలుగా ఉంది. ఇప్పటికే భూటాన్‌లోని చాలా వరకూ భూభాగాన్ని చైనా ఆక్రమించేసింది. ఇప్పుడు, చైనా గ్రామాల నిర్మాణం పేరుతో అటు భూటాన్ భూభాగాన్ని స్వాధీనంలోకి తెచ్చుకుంటూనే… మరోవైపు, భారత్‌ను బెదిరించడానికి ప్రయత్నిస్తోంది. ఇటీవల, చైనా-భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగవుతున్నాయనే తరుణంలో ఇలాంటి రెచ్చగొట్టే చేష్టలు మరింత ఆందోళనను కలిగిస్తున్నాయి.
దొంగచాటుగా రోడ్ల నిర్మాణాలు, పెట్రోలింగ్
గతంలో, చైనా-భూటాన్ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం… రెండు దేశాల మధ్య సరిహద్దు సమస్యకు పరిష్కారం పెండింగ్‌లో ఉన్నప్పటికీ… సరిహద్దు ప్రాంతాల్లో శాంతిని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. అలాగే, మార్చి 1959కి ముందు ఉన్నట్లే సరిహద్దులో యథాతథ స్థితిని కొనసాగించడానికి రెండు దేశాలు అంగీకరించాయి. ఇంకా ఈ ఒప్పందంలో…. సరిహద్దులో యథాతథ స్థితిని మార్చడానికి రెండు వైపులా ఏ ఒక్క దేశమూ ఏకపక్ష చర్య తీసుకోకూడదని అనుకున్నారు. అయితే, ఈ ఒప్పందాన్ని కూడా చైనా తుంగలో తొక్కింది. భూటాన్ మ్యాప్‌లో ఉన్న సాంప్రదాయ సరిహద్దులోని… భూటాన్ వైపు ఉన్న ప్రాంతాల్లోనే ఈ గ్రామాలను చైనా నిర్మించింది. ఇక, భారత్-చైనా మధ్య కూడా 2017లో డోక్లామ్ దగ్గర స్టాండ్‌ఆఫ్ పాయింట్ నుండి బలగాలు వెనక్కి వెళ్లాయి. అయితే, చైనా మాత్రం గ్రామాలు, రోడ్ల నిర్మాణం, పెట్రోలింగ్ వ్యవహారాలను దొంగచాటుగా కొనసాగిస్తూనే ఉన్నారు.
చైనాను ప్రశ్నించలేకపోతున్న భూటాన్..
ఇక, ఈ గ్రామాలు, చైనా భూభాగంలో క్రమపద్ధతిలో మార్పులు తీసుకొస్తున్నాయి. సరిగ్గా, ఇది దక్షిణ చైనా సముద్రంలోని చైనా చేస్తున్న కార్యకలాపాలకు దగ్గరగా ఉంది. ఇక్కడ కూడా చైనా ఆర్టిఫిషియల్ నిర్మాణాలను చేపట్టి వాటిని సైనికీకరించింది. అయితే, భూటాన్‌లో అధికార అసమానతల వల్ల ఆ దేశం చైనాను సవాలు చేసే స్థితిలో లేదు. ఈ పరిస్థితి చైనా మరింత రెచ్చిపోడానికి అవకాశాన్ని ఇస్తుంది. గత ఒప్పందాలను, ఇతర దేశాల ఆందోళనలను పట్టించుకోకుండా చైనా కావాలనే ఈ రాద్ధాంతం చేస్తోంది. దాని ‘వన్ చైనా సిద్ధాంతం’లో భాగంగా… మంగోలియన్ జాతులున్న అన్ని ప్రాంతాలను కలుపుకోడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే, అన్ని రకాలుగా భారతదేశంలో భాగంగా ఉన్న ఈశాన్య రాష్ట్రాలపై చైనా కన్నుపడటం భారత్‌ను మరింత అప్రమత్తం చేస్తోంది.
త్రైపాక్షిక విధానమే ఉత్తమం..
ఇక, ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ ముందున్న మొదటి ప్రశ్న డోక్లామ్ సమస్య. అయితే, భారతదేశ భద్రతా ప్రయోజనాలను గౌరవించే ఒప్పందానికి భూటాన్ కట్టుబడి ఉంది. అందుకే, డోక్లామ్ సమస్యను భూటాన్ ద్వారా కాకుండా చైనాతో కూడా కలుపుకొని త్రైపాక్షిక విధానంలో నిర్ణయించుకోవాల్సి ఉంది. కాబట్టి, భారత్ ప్రమేయం లేకుండా డోక్లామ్‌పై చైనా పూర్తి స్థాయిలో ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదని నిపుణులు భావిస్తున్నారు.
భూటాన్‌కు.. భారత్‌కు వైరం పెట్టేలా చైనా కుట్ర
అయితే, ఎప్పటి నుండో చైనా, భూటాన్ మీద తీవ్ర ఒత్తిడి తీసుకొస్తోంది. ఒకరకంగా.. భూటాన్‌ను భారతదేశ ప్రభావం నుండి బయటకు తెచ్చి, చైనాతో సంబంధాలను పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగానే, బహుశా చైనా ఇలా రెచ్చగొట్టే చర్యలు చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఇందులో చైనా విజయం సాధిస్తుందా లేదా అనేది తేలాల్సి ఉంది. అయితే, భూటాన్ భూభాగంలో కొంత భాగాన్ని చైనా ఇప్పటికే స్వాధీనం చేసుకుంది. దానిని, నిరోధించడంలో భారతదేశం భూటాన్‌కు సహాయం చేయలేకపోయింది. కాబట్టి, మరింత భూభాగంపై ఆధిపత్యం చెలాయిస్తూ… భూటాన్‌కి భారతదేశానికి మధ్య వైరం పెంచాలనే ప్లాన్‌లో భాగంగానే చైనా ఇలా చేస్తుందనే అనుమానం కూడా లేకపోలేదు. ఇప్పటికే, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మాల్దీవుల్ని చంకనెక్కించుకొని భారత్‌పై ఉసిగొల్పుతున్న చైనా… ఇప్పుడు, భూటాన్‌ని కూడా ఇలాగే రెచ్చగొట్టే అవకాశం ఉంది.
ఏ దేశంతో భూటాన్‌కు ఎక్కువ ప్రయోజనం?
రాబోయే రోజుల్లో, భూటాన్‌లోని థింఫులో దౌత్యకార్యాలయాన్ని తెరవడానికి చైనాను అనుమతించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ చర్య చైనాతో భూటాన్ వాణిజ్యాన్ని పెంచడానికి ముఖ్యమైన చర్యగా భావిస్తున్నారు. కాబట్టి, భవిష్యత్తులో భూటాన్‌లో చైనా పరపతి గెలుస్తుందా… భారత్ ప్రయోజనాలు గెలుస్తాయా అన్నది తెలియాలి. మరోవైపు, ఈ సమస్యపై భూటాన్ ప్రజలు ఎలా స్పందిస్తారన్నది కూడా ఇక్కడ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఏది ఏమైనప్పటికీ… భూటాన్‌కు నిజమైన ప్రయోజనం ఏ దేశం నుండి ఉందో అనేది చూసినప్పుడు అది కచ్ఛితంగా భారత్ నుండేనని ప్రస్తుతం భూటాన్ భావిస్తుందనడంలో సందేహం లేదు. మరి, చైనా ఆధిపత్య ధోరణి దాన్ని ఎంత వరకూ అడ్డుకుంటుందన్నది భవిష్యత్తు నిర్ణయిస్తుంది.
చైనా వంకర బుద్ధి.. స్నేహం నిలుస్తుందా?
2020 ఏప్రిల్-మే నెలల మధ్య భారత్-చైనా వాస్తవ నియంత్రణ రేఖ-LACలోని లడఖ్ సెక్టార్‌లో సైనిక ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. ఈ ప్రతిష్టంభన కారణంగా గత నాలుగు సంవత్సరాల్లో, భారత్, చైనా మధ్య సంబంధాలు క్షీణించాయి. రెండు దేశాల మధ్య 1962 సరిహద్దు యుద్ధం తర్వాత అంతగా సంబంధాలు దెబ్బతినడం ఇటీవలే పెరిగింది. అయితే, ఈ ఏడాది అక్టోబర్ 21న, LACలో ఘర్షణ పాయింట్లుగా ఉన్న డెమ్‌చోక్, డెప్సాంగ్ వద్ద ఫ్రంట్‌లైన్ దళాలను విడదీయడానికి రెండు దేశాలూ ఒక అవగాహనకు వచ్చాయి. రెండు రోజుల తర్వాత, భారత ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రష్యాలో బ్రిక్స్ సమ్మిట్ సందర్భంగా కలుసుకున్నారు. దీనితో, సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడానికి… ద్వైపాక్షిక సంబంధాలను నార్మలైజ్ చేయడానికి రెండు దేశాల యంత్రాంగాలు అంగీకరించారు. తాజాగా, డిసెంబర్ 18న భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ని కలిశారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ కూడా చేశారు. సరిగ్గా, ఇలాంటి తరుణంలోనే చైనా మళ్లీ తన వంకర బుద్ధిని చూపిస్తోంది. ఈ పరిస్థితుల్లో మరోసారి చైనా, భారత్ మధ్య సంబంధాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.