Economic Crisis: పశ్చిమాసియా యుద్ధం మొదలైన 2 నెలల తర్వాత.. దాని తాలూకూ ఎఫెక్ట్ ఇండియాపై ఇప్పుడు మొదలైంది. ఇన్నాళ్లూ యుద్ధ సంక్షోభం ఎలా ఉంటుందో తెలియకుండా గడిపిన వాళ్లందరికీ.. క్రైసిస్ ఎలా ఉంటుందో ఇకపై అర్థమవుతుంది. ఇప్పటికే.. కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి దిగుమతులకు కళ్లెం వేసేందుకు కీలక చర్యలు చేపట్టింది. ప్రధాని మోడీ బంగారం కొనొద్దని పిలుపునిచ్చిన కొద్ది గ్యాప్‌లోనే.. కేంద్రం గోల్డ్ దిగుమతులపై సుంకాన్ని 6 శాతం నుంచి ఏకంగా 15 శాతానికి పెంచేసింది. దాంతో పాటు 10 శాతం బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, 5 శాతం అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ సెస్ విధించారు.
ప్రస్తుతం రూపాయి విలువ భారీగా పతనమై.. డాలర్‌తో పోలిస్తే దాదాపు 96 రూపాయలకు చేరిన సమంయలో.. ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. కస్టమ్స్ సుంకాల పెంపుతో.. దేశంలో వాటి ధరలు భగ్గుమన్నాయి. బులియన్ మార్కెట్‌లో పసిడి ధరలు అమాంతం పెరిగిపోగా, గోల్డ్ ఈటీఎఫ్‌లకూ రెక్కలొచ్చాయి. పుత్తడి ధర ఒక్క రోజులోనే దాదాపు 9 వేలు పెరిగింది. హైదరాబాద్ బహిరంగ సభలో ప్రధాని మోడీ.. ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు నిలిపేయాలని విజ్ఞప్తి చేసిన తర్వాత కూడా కస్టమ్స్ డ్యూటీని పెంచేసింది కేంద్రం.
ప్రపంచంలోనే బంగారం అత్యధికంగా దిగుమతి చేసుకొనే రెండో దేశం ఇండియా. వెండి విషయంలో అయితే మనమే టాప్. ఈ పరిస్థితుల్లో.. ప్రభుత్వం సుంకాలు పెంచడంతో దేశీయంగా కొనుగోళ్లు డీలా పడే అవకాశాలున్నాయి. భారత్ తన అవసరాలకు కావాల్సిన 85 శాతం క్రూడ్ ఆయిల్‌ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇదే సమయంలో.. బంగారం కూడా భారీగా దిగుమతి అవుతోంది. ఏటా 700 నుంచి 800 టన్నుల బంగారం వినియోగిస్తుంటే.. అందులో దేశీయంగా ఉత్పత్తి అయ్యేది చాలా తక్కువ. 90 శాతానికి పైగా బంగారాన్ని భారత్ దిగుమతి చేసుకుంటుంది. గోల్డ్, క్రూడ్ ఆయిల్‌కు మనం అమెరికన్ డాలర్లలోనే చెల్లింపులు చేయాలి.
అంటే.. ఈ రెండింటిని మనం ఎంత ఎక్కువగా దిగుమతి చేసుకుంటే.. అదే స్థాయిలో మన ఖజానాలోని విదేశీ మారకపు నిల్వలు బయటకు వెళ్లిపోతాయ్. దీనివల్ల.. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్‌కు డిమాండ్ పెరిగి, ఇండియన్ రూపీ విలువ పడిపోతుంది. అందుకే, కేంద్రం చర్యలు చేపట్టింది. దిగుమతి సుంకాలు పెంచిన తర్వాత.. బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి.. లక్షా 65 వేలు దాటింది. కేజీ వెండి ధర దాదాపు 3 లక్షలకు చేరింది. మరోవైపు.. గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్ ధరలు కూడా భారీగా పెరిగాయ్. మరోవైపు, జ్యువెలరీ స్టాక్స్ పతనం కొనసాగుతోంది. జ్యువెలరీ స్టాక్స్‌లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఇది కేవలం టీజర్ మాత్రమేనని.. త్వరలోనే మరిన్ని వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకనున్నాయనే విశ్లేషణలు మొదలయ్యాయ్.
బంగారం దిగుమతులపై సుంకం పెంచడమే కాదు కేంద్రం మరో సంచలన నిర్ణయం కూడా తీసుకుంది. త్వరలోనే కొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీ తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇది.. సామాన్యులకు కొంత ఊరటనిచ్చే విషయం అంటున్నారు. ఇంట్లో అలా పడి ఉన్న బంగారంతో.. వడ్డీ పొందే అవకాశం ఉంది. కేవలం 10 గ్రాముల బంగారం ఉన్నా.. బ్యాంకులో డిపాజిట్ చేయొచ్చని కేంద్రం ప్రతిపాదిస్తోంది. ఈ గోల్డ్ మానిటైజేషన్ పాలసీ.. దేశ ఆర్థిక వ్యవస్థనే మార్చేస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే.. 140 కోట్ల మంది భారతీయుల దగ్గర 30 వేల టన్నుల బంగారం ఉంది. దీనిని వెలికితీసేందుకు మోడీ సర్కార్ మాస్టర్ ప్లాన్ వేసింది.
బంగారం దిగుమతులు తగ్గితేనే.. రూపాయి విలువ బలపడుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అందువల్ల.. పబ్లిక్ డిపాజిట్ చేసిన బంగారంపై వడ్డీతో పాటు పన్ను మినహాయింపులు పొందే వెసులుబాటు కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జ్యువెలరీ సంస్థలకు కూడా నేరుగా డిపాజిట్ బంగారం సరఫరా చేసి.. దేశీయ తయారీ రంగానికి ఊతమివ్వనున్నారు. 30 వేల టన్నుల్లో.. కనీసం 2 వేల టన్నుల బంగారం డిపాజిట్ అయినా.. మూడేళ్ల దాకా దిగుమతుల అవసరమే ఉండదంటున్నారు. ఇందుకోసం.. గోల్డ్ మానిటైజేషన్ పాలసీలో కీలక మార్పులు చేసేందుకు ఆర్థిక శాఖ సిద్ధమవుతోంది.
బంగారంపై దిగుమతి సుంకం పెంచడం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఇంపోర్ట్ డ్యూటీ పెరగ్గానే.. దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు భగ్గుమన్నాయి. ఇది.. సామాన్య వినియోగదారులపై భారాన్ని పెంచింది. అధికారికంగా దిగుమతి చేసుకుంటే ఎక్కువ పన్ను కట్టాల్సి వస్తుందని కాబట్టి.. దేశంలో బంగారం స్మగ్లింగ్ పెరిగే అవకాశాలున్నాయంటున్నారు. ధరలు పెరగడం వల్ల.. ఆభరణాల కొనుగోళ్లు తగ్గి, జ్యువెలరీ పరిశ్రమలో అమ్మకాలు క్షీణించే అవకాశం ఉంది. దీనివల్ల.. ఈ రంగంపై ఆధారపడిన లక్షలాది కార్మికుల ఉపాధిపై ప్రభావం పడుతుంది.
ఈ నిర్ణయం స్వల్పకాలికంగా వినియోగదారులకు కష్టంగా అనిపించినప్పటికీ, దీర్ఘకాలికంగా దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తుంది. క్రూడ్ ఆయిల్ లాంటి అత్యవసర దిగుమతుల కోసం విదేశీ మారక నిల్వలను ఆదా చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. పైగా.. అనవసర ఖర్చులని తగ్గించి, పెట్టుబడులను దేశాభివృద్ధికి ఉపయోగపడే రంగాల వైపు మళ్లించేందుకు ఇదొక మార్గం. పశ్చిమాసియాలో యుద్ధ సంక్షోభంతో.. భారత్‌లో ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా మారుతున్న వేళ ఇలాంటి చర్యలు తీసుకోక తప్పదంటున్నారు. అదుకే.. ప్రధాని మోడీ కూడా పరిస్థితులకు తగ్గట్లుగా ప్రజలు కూడా మారాలని కోరారు. దేశం కోసం, భవిష్యత్తు కోసం ఇది మనందరి బాధ్యత అనే నినాదాన్ని బలంగా వినిపిస్తున్నారు.
Also Read: ఖాకీ చొక్కా వేసిన ఏజెంట్లకు బుద్ధి చెప్తాం.. పోలీసులకు జక్కంపూడి మాస్ వార్నింగ్
దేశంలో ఇప్పుడు జరుగుతున్న చర్చ కేవలం బంగారం, గోల్డ్ ఆర్నమెంట్స్ గురించి మాత్రమే కాదు. భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కోబోతున్న ఓ పెద్ద సవాలుకు సూచనే ఇది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే.. సామాన్యుడి జేబుపై భారం పడే అంశాలు చాలానే ఉన్నాయ్. ప్రధాని మోడీ కేవలం బంగారం మాత్రమే కొనొద్దనలేదు. ఇంకా చాలా చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే క్రమంలో.. కనీసం సంవత్సరం పాటు బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉండాలని సూచించారు. దీనివల్ల.. విదేశీ మారక ద్రవ్యం ఆదా ఆవుతుంది. అంతేకాదు.. పెట్రోల్, డీజిల్‌ని కూడా పొదుపుగా వాడాలి. అత్యవసరమైతే తప్పు సొంత వాహనాలు వాడొద్దన్నారు.
ముడి చమురు దిగుమతులపై భారాన్ని తగ్గించేందుకు, పర్యావరణ రక్షణ కోసం వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించి, ఇంధనాన్ని ఆదా చేయాలి. దేశీయంగా రేట్లు పెంచకుండా ఉండాలంటే వినియోగం తగ్గించక తప్పని పరిస్థితి నెలకొంది. కార్‌పూలింగ్, మెట్రో వాడకానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఇదే క్రమంలో.. కాలుష్య రహిత భారత్ కోసం.. పెట్రోల్, డీజిల్ వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచాలని, పర్యావరణ హితమైన రవాణాకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రయాణ ఖర్చులు, సమయాన్ని ఆదా చేసేందుకు, వీలైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలోకి మారాలని సూచించారు పీఎం మోడీ. మీటింగ్‌లని కూడా ఆన్‌లైన్‌లో నిర్వహించుకోవాలన్నారు.
మరీ ముఖ్యంగా.. ఏడాది పాటు విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలన్నారు. దేశీయ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు, విదేశాలకు తరలిపోయే ధనాన్ని అరికట్టేందుకు విదేశీ పర్యటనలు తగ్గించుకోవాలన్నారు మోడీ. ఫారిన్ ట్రిప్‌లతో మన డాలర్ నిల్వలు తగ్గిపోతున్నాయ్. అందుకోసమే.. టూరిజం కోసం విదేశాలకు వెళ్లేవారు దేశీయ టూరిజం స్పాట్‌లకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు. ఇక.. వంట నూనెల వినియోగం కూడా కొంత మేర తగ్గించాలన్నారు ప్రధాని. భారత్ తన వంట నూనెల అవసరాల్లో 50 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. దీని కోసం ఏటా వేల కోట్ల డాలర్లు బయటకు పోతున్నాయి. అందుకే వినియోగంలో కనీసం 10 శాతం తగ్గించుకోవాలని పిలుపునిచ్చారు.
ఆరోగ్యపరంగానూ, దిగుమతి భారం తగ్గించే ఉద్దేశంతోనూ.. వంట నూనెల వినియోగంలో పొదుపు పాటించాలని సూచించారు. రోజువారీ వాడకంలో కొంత తగ్గించినా.. ఎంతో మేలు జరుగుతుందన్నారు. ప్రధాని మోడీ విజ్ఞప్తి చేసిన వాటిలో రసాయన ఎరువుల వాడకం కూడా ఉంది. రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా యుద్ధాల వల్ల ఎరువుల ధరలు పెరిగాయి. దీని వల్ల కేంద్రంపై సబ్సిడీ భారం పెరుగుతోంది. ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లడం ద్వారా ఈ భారం తగ్గించాలనేది కేంద్రం ప్లాన్. అందుకోసమే.. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు రసాయనిక ఎరువుల వాడకాన్ని క్రమంగా తగ్గించుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు.
పశ్చిమాసియాలో సంక్షోభంతో దేశంలో ఎరువుల కొరత కూడా తలెత్తే అవకాశం ఉంది. అందువల్ల.. 50 శాతం ఆర్గానిక్ పద్ధతుల్లోనే సాగు చేయాలని కోరారు. వ్యవసాయ రంగంలో విద్యుత్ ఆదా కోసం సోలార్ పంపు సెట్లని వినియోగించాలన్నారు. క్రమంగా పునరుత్పాదక ఇంధన వనరుల వైపు అడుగులు వేయాలని సూచించారు. స్థానిక ఉత్పత్తులని కొనుగోలు చేయడం ద్వారా దేశీయ పరిశ్రమలను, చేతివృత్తుల వారిని ఆదుకోవాలని, వోకల్ ఫర్ లోకల్ మంత్రాన్ని పాటించాలని కోరారు. ముఖ్యంగా.. మధ్య తరగతి కుటుంబాలు అనవసరపు ఖర్చులను, ఆడంబరాలు తగ్గించుకొని, పొదుపు చేసి, ఆర్థికంగా స్థిరపడాలన్నారు. ఇంపోర్టెడ్ వాచీలు, కెమెరాలు, ప్రీమియం ఆల్కహాల్ లాంటి వస్తువులపైనా సుంకాలు పెంచి, వాటి వినియోగాన్ని తగ్గించే దిశగా అడుగులు పడుతున్నాయి.
ప్రధాని మోడీ విజ్ఞప్తి చేయడం, బంగారం దిగుమతులపై సుంకం పెరిగిన తర్వాత.. అందరినీ భయపెడుతున్న అంశం ఇంధన ధరలు. ప్రస్తుతం ముడి చమురు ధరలు అంతర్జాతీయంగా మండిపోతున్నాయ్. ఆయిల్ కంపెనీలు భారీ నష్టాల్లో ఉన్నాయని రిపోర్ట్స్ చెబుతున్నాయి. 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియడంతో.. ఏ క్షణమైనా ధరల పెంపు ఉండొచ్చనే సంకేతాలు అందుతున్నాయి. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగితే అది కేవలం వాహనదారులకే కాదు, రవాణా ఖర్చులు పెరిగి.. పాలు, కూరగాయలు, నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతాయ్. అప్పుడు రేట్ల పోటు నేరుగా.. సామాన్యుడికే తగులుతుంది. అందుకోసమే.. ప్రభుత్వం ఇప్పటికే ప్రజలను వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గించి, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వైపు మళ్లాలని కోరుతోంది.
Also Read: చంద్రబాబు కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఏపీలో పొదుపు ఫార్ములా, వారానికి ఒకరోజు ‘నో వెహికిల్ డే’
ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందనే విషయం తెలుస్తోంది. ఇజ్రాయెల్, ఇరాన్ ఉద్రిక్తతలతో.. సప్లై చైన్ దెబ్బతింది. వంట నూనెలు, ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం పెరిగిపోయి, నిత్యవసర సరుకుల ధరలు పెరిగితే.. మధ్యతరగతి కుటుంబాల పొదుపు చేసే సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. అందువల్ల.. ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షలు, పెరుగుతున్న ధరల నుంచి తప్పించుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పవంటున్నారు.
బంగారం లాంటి లగ్జరీ వస్తువుల కొనుగోళ్లను ప్రస్తుతాని వాయిదా వేసుకుంటే బెటర్. సాధ్యమైనంత వరకు ప్రయాణాలను తగ్గించుకోవాలి. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వాడాలి. బంగారం దిగుమతులపై సుంకం పెంపు జస్ట్ బిగినింగ్ మాత్రమే. రాబోయే రోజుల్లో ఇంధన ధరలని కూడా పెంచితే.. సామాన్యుడికి అసలైన అగ్ని పరీక్ష అప్పుడే మొదలవుతుంది. ప్రభుత్వం తనవంతుగా సబ్సిడీలతో ఆదుకుంటున్నా.. ప్రపంచ పరిణామాల దృష్ట్యా మనం కూడా పొదుపు పాటించక తప్పని పరిస్థితులు ఉన్నాయ్.
కరోనా ఆరోగ్య సంక్షోభమైతే.. ప్రస్తుతం ప్రపంచం ముందున్న సవాల్ అంతకంటే క్లిష్టమైన ఆర్థిక సంక్షోభం. యుద్ధం ముగిసినా.. దాని తాలూకూ గాయాలు మానడానికి సమయం పట్టినట్లు, కోవిడ్ తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు ఇంకా కుదుటపడకముందే ద్రవ్యోల్బణం, మాంద్యం భయాలు చుట్టుముట్టాయి. ఇప్పుడు భారత్ కూడా అలాంటి భిన్నమైన స్థితిలోనే ఉంది. పశ్చిమాసియాలో యుద్ధం ముగిసినట్లే కనిపిస్తున్నా.. సంక్షోభం మాత్రం ఇంకా చుట్టుముట్టే ఉంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ దూసుకుపోతున్న సమయంలో.. ఇలాంటి ఎకనమిక్ క్రైసిస్ రౌండప్ చేస్తుందని ఎవరూ ఊహించలేదు. దీని ఇంపాక్ట్.. సామాన్యుడి మీదే ఉండబోతోంది. కరోనాని అడ్డుకునేందుకు లాక్ డౌన్ విధించారు. కొన్నాళ్లు అంతా సైలెంట్‌గా ఉన్నారు. కానీ.. ఆర్థిక సంక్షోభం అలా కాదు. ఇదొక.. సైలెంట్ కిల్లర్.
ఆర్థిక సంక్షోభం మొదలైతే.. ధరలు పెరిగిపోతాయ్. సామాన్యుల కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. పెట్రోల్ నుంచి పప్పు దినుసుల దాకా అన్నింటి ధరలు ఆకాశాన్ని తాకుతాయ్. ఆదాయం పెరగదు కానీ, ఖర్చులు డబులవుతాయ్. యుద్ధం తాలూకూ ప్రభావం, గ్లోబల్ సప్లై చైన్ సమస్యలు.. మన కిచెన్‌పై ఎఫెక్ట్ చూపిస్తాయ్. దీనిని.. సామాన్యులు ఎదుర్కోగలరా? అనేదే.. ఇప్పుడు బిగ్ క్వశ్చన్. సంక్షోభాన్ని తట్టుకోవాలంటే కేవలం ప్రజల ఓపిక సరిపోదు. ప్రభుత్వ విధానాలు కూడా పటిష్టంగా ఉండాలి. నిజానికి, దేశంలో మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ ప్రజలు ప్రస్తుతం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నారు. పెరిగిన ఈఎంఐలు, విద్య, వైద్యం ఖర్చులు.. సగటు భారతీయుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయ్. సంక్షోభం ఎప్పుడొచ్చినా.. అది మొదట తగిలేది పేదవాడికే. అందుకే.. జనంలో ఇప్పుడు పోరాడే స్ఫూర్తి ఎంత ఉందనేది ఇప్పుడు చర్చకు వస్తోంది.
ఇప్పటికే దేశ ప్రజలందరికీ పొదుపు మంత్రాన్ని పాటించాలని చెప్పిన ప్రధాని మోడీ.. కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను చెప్పిన పొదుపు సూత్రాలను పాటించడం మొదలుపెట్టారు. తన కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యను బాగా తగ్గించారు. అదేవిధంగా.. ప్రభుత్వ వాహనాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచాలని సూచించారు. ఇంధన పొదుపు, మిత వ్యయ చర్యల్లో భాగంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. భద్రతా ప్రమాణాలు తగ్గకుండా, అవసరమైన వాహనాలు మాత్రమే ఉండాలని పీఎంవో నుంచి ఆదేశాలు వెళ్లాయి.
ప్రధాని మోడీ పిలుపు మేరకు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు కూడా ఆచరణలోకి దిగారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ సీఎంలు.. తమ కాన్వాయ్‌ల్లోని వాహనాలను తగ్గించమని సిబ్బందికి సూచించారు. మరోవైపు.. కేంద్రమంత్రిత్వ శాఖలు కూడా ఇంధన పొదుపు చర్యలని పరిశీలిస్తున్నాయ్. మార్పు అనేది మన నుంచి మొదలైతేనే.. జనం కూడా నెమ్మదిగా పొదుపు వైపు మళ్లుతారనే ఉద్దేశంతోనే ప్రధాని మోడీ తన కాన్వాయ్‌లోని వాహనాలని తగ్గించుకున్నారు. దీంతో.. జనంలో ఎంతమేర మార్పు వస్తుందనేది ఆసక్తిగా మారింది.
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముడిచమురు ధరల పెరుగుదల, మారుతున్న వాణిజ్య ఒప్పందాలతో.. ఆర్థిక సంక్షోభం భయాలు ఎక్కువైపోయాయ్. పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన తర్వాత.. ప్రపంచవ్యాప్తంగా వృద్ధి రేటు మందగిస్తోంది. అయినప్పటికీ.. భారత్ బ్రైట్ స్పాట్‌గానే కొనసాగుతోంది. కానీ.. ప్రధాని మోడీ చెప్పిన పొదుపు సూత్రాలు విన్నాక.. ఇండియా అంతటా డైలమాలో పడిపోయింది. ఆర్థిక సంక్షోభం గనక తలెత్తితే.. సామాన్యుడు ఎదుర్కోబోయే సవాళ్లేంటి? అనే చర్చ మొదలైంది.
చమురు ధరలు మరింత పెరిగితే.. భారత్‌లో ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలపడి, రూపాయి విలువ క్షీణిస్తే.. దిగుమతులు మరింత ఖరీదైనవిగా మారతాయ్. అయితే, 1991 ఆర్థిక సంక్షోభాన్ని, 2008 గ్లోబల్ రిసెషన్‌ని, 2020 కరోనా కష్టాలని భారత్ తట్టుకుని నిలబడింది. గత ఆర్థిక సంక్షోభాల నుండి పాఠాలు నేర్చుకున్న భారత్, ఇప్పుడు పటిష్టంగా ఉంది. విదేశీ మారక నిల్వలు తగ్గిపోకుండా భారత్ ముందే అప్రమత్తమైంది. అందుకనుగుణంగానే కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇతర దేశాల్లో కొనుగోలు శక్తి తగ్గినా, ఇండియా మాత్రం ఇంకా పటిష్టంగానే ఉంది.
భారతీయులకు సహజంగానే పొదుపు చేసే అలవాటు ఎక్కువ. సంక్షోభ సమయంలో మనల్ని కాపాడే అతిపెద్ద ఆయుధం ఇదే. కానీ, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే నిత్యవసర వస్తువుల ధరలు పెరిగే అవకాశముంది. ఈ ఏడాది.. ద్రవ్యోల్బణం 4.1 శాతం నుంచి 5.1 శాతం మధ్య ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అందువల్ల.. రాబోయే ఆర్థిక సంక్షోభాన్ని హ్యాండిల్ చేయడం అంత సులభం కాదనే మాటలు కూడా వినిపిస్తున్నాయ్. పశ్చిమాసియాలో తలెత్తిన యుద్ధం ప్రభావం మనపై కొంత ఉన్నప్పటికీ.. మన ఆర్థిక పునాదులు ఇప్పటికీ బలంగానే ఉన్నాయి.
అయితే.. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే క్రమంలో ఇలాంటి ఒడిదుడులు రావడమే కొంత ఆందోళన రేకెత్తిస్తోంది. అందువల్ల.. రాబోయే రోజుల్లో అనవసర ఖర్చులకు చెక్ పెట్టడం, తెలివిగా పెట్టుబడి పెట్టడం, ఆర్థిక క్రమశిక్షణను పాటించడం.. ప్రతి భారతీయుడికి తప్పనిసరి అవుతుంది. యుద్ధ సంక్షోభం ముగిసేదాకా.. విదేశీ వస్తువులపై మోజు తగ్గించుకోకపోతే, దేశ ఆర్థిక వ్యవస్థ చిక్కుల్లో పడుతుందనేది ప్రభుత్వ ఆందోళన. ఈ పరిస్థితుల్లో.. సంక్షోభం ఏదైనా దేశ ప్రజల ధైర్యమే కవచం, వారి పొదుపే ఆయుధం.
Also Read: కేంద్రం తీరుపై రాఘవులు నిప్పులు.. శ్రీలంక గతే భారత్‌కు పడుతుందా?
Story by: Anup, Big Tv