Retail Inflation: సామాన్యుడు మార్కెట్‌కు వెళ్తే సంచి నిండటం లేదు కానీ… జేబులు ఖాళీ అయిపోతున్నాయి. సెప్టెంబర్ నెలకు సంబంధించి దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.54 శాతానికి చేరింది. ఎకనామిస్ట్‌లు 5.40 శాతం అనుకుంటే, దాన్ని దాటి ముందుకు పోయింది. లెక్కల్లో ఐదున్నర శాతమే కావచ్చు.. కానీ ఈ నంబర్ వెనుక సామాన్యుడి కడుపు కోత ఉందనేది పచ్చి నిజం. పొద్దున లేస్తే పాలు, కూరగాయలు, నూనె.. దేన్ని ముట్టుకున్నా మంట పుడుతుంటే కుటుంబాలు ఎలా గడుస్తాయి?
సెప్టెంబర్‌లో 5.54 శాతానికి..
ఇక మన తిండికి సంబంధించిన ఆహార ద్రవ్యోల్బణం ఆగస్టులో 5.97 శాతం ఉంటే.. సెప్టెంబర్‌కి వచ్చేసరికి ఏకంగా 7.74 శాతానికి పెరిగిపోయింది! దీనికి ప్రధాన కారణం మన వంటగదిలో తప్పనిసరి అయిన ఉల్లిపాయే! ఉల్లి ధరలు ఏకంగా 108.08 శాతం పెరిగాయి. అంటే రెట్టింపు కంటే ఎక్కువ! కోయకుండానే ఉల్లిపాయ సామాన్యుడి కళ్లలో కన్నీళ్లు తెప్పిస్తోంది. ‘ఉల్లి లేని కూర లేదు.. పెరిగిన ధరతో కొనే స్తోమత లేదు’ అని సామాన్యులు లబోదిబోమంటున్నారు.
అల్లాడిపోతున్న సామాన్యుడు..
పోనీ గత ఏడాదితో పోలిస్తే బంగాళాదుంపలు 11.50 శాతం, టమాటాలు 8.62 శాతం తగ్గాయి కదా అని సరిపెట్టుకుందామంటే.. మిగతా నిత్యావసరాల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఇక హెచ్చరించదగ్గ మరో డేంజర్ బెల్ ఏంటంటే.. పట్టణాల్లో ఇన్‌ఫ్లేషన్ 4.88 శాతంగా ఉంటే, పల్లెల్లో ఏకంగా 6.08 శాతంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయాలు తక్కువ, ధరల భారం ఎక్కువై అక్కడ పేదలు అల్లాడిపోతున్నారు.
పైసా మిగలని పరిస్థితి..
జీతాలు పెరగడం లేదు కానీ.. నెలాఖరు వచ్చేసరికి నిత్యావసరాల బిల్లులు మాత్రం కొండలా పెరిగిపోతున్నాయి. పొదుపు చేసుకుందామన్నా పైసా మిగలని పరిస్థితి. పండగల సీజన్ దాటిన తర్వాత కూడా ఈ ద్రవ్యోల్బణం తగ్గకపోతే పరిస్థితి మరింత చేయిదాటిపోయే ప్రమాదం ఉంది.
Also Read: కూటమిలో మొదైన సీట్ల పంచాయితీ.. జనసేన నెక్స్ట్ స్టెప్ ఏంటి?