BYD Sealion 7 Festive Edition: ఎలక్ట్రిక్ SUV మార్కెట్‌లో ఉన్న BYD తన సీలియన్ 7 కోసం కొత్త ఫెస్టివ్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ఈ స్పెషల్ ఎడిషన్ ధరను రూ.50.60 లక్షలుగా నిర్ణయించింది. అయితే, ఈ ఎడిషన్ అందరికీ అందుబాటులో ఉండదు. కంపెనీ కేవలం 150 యూనిట్లను మాత్రమే విక్రయించనుంది. కొత్త ఇంటీరియర్ థీమ్‌తో వచ్చిన ఈ మోడల్, ప్రీమియం వేరియంట్ ఆధారంగా రూపొందింది.
BYD సీలియన్ 7 ఫెస్టివ్ ఎడిషన్ ధర, సాధారణ ప్రీమియం వేరియంట్ తో పోలిస్తే రూ.70,000 ఎక్కువ. ఇందులో ప్రధానంగా ఇంటీరియర్ డిజైన్‌లో మార్పులు చేశారు. టాన్ అండ్ బ్లాక్ కలర్ థీమ్‌తో క్యాబిన్‌కు కొత్త లుక్ ఇచ్చారు. డాష్‌బోర్డ్, డోర్ ప్యానెల్స్, సీట్లు, సెంటర్ కన్సోల్ ప్రాంతంలో ఈ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. సీలియన్ 7 మోడల్ ధరలను పరిశీలిస్తే, డైనమిక్ ధర రూ.41.90 లక్షలు, ప్రీమియం ధర రూ.49.90 లక్షలు, ప్రీమియం ఫెస్టివ్ ఎడిషన్ ధర రూ.50.60 లక్షలు, పెర్ఫార్మెన్స్ ధర రూ.55.90 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది.
ఈ ఎలక్ట్రిక్ SUVలో ప్రీమియం ఫీచర్లకు ప్రాధాన్యత ఇచ్చారు. 15.6 అంగుళాల రొటేటింగ్ టచ్‌స్క్రీన్, 10.25 అంగుళాల డ్రైవర్ డిస్‌ప్లే, పనోరమిక్ గ్లాస్ రూఫ్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. ముందు సీట్లకు ఎలక్ట్రిక్ అడ్జస్ట్ మెంట్ తో పాటు వెంటిలేషన్ సదుపాయం కూడా అందించారు. 12 స్పీకర్ల ఆడియో సిస్టమ్ ప్రయాణ సమయంలో అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తుంది. సేఫ్టీ విషయానికి వస్తే 11 ఎయిర్ బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరా, లెవెల్ 2 ADAS లాంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే, ఫెస్టివ్ ఎడిషన్ లో బయటి వైపు ప్రత్యేకమైన డిజైన్ మార్పులు చేయలేదు. కొత్త కలర్ థీమ్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.
ఈ ఎడిషన్‌లో 82.56kWh బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. వెనుక భాగంలో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ 313hp పవర్, 380Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. సీలియన్ 7 ప్రీమియం వేరియంట్ NEDC సైకిల్‌పై 567 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. ఈ SUV కేవలం 6.7 సెకన్లలోనే 0 నుంచి 100kph వేగాన్ని అందుకుంటుందని కంపెనీ వెల్లడించింది.
మొత్తంగా చూస్తే, BYD సీలియన్ 7 ఫెస్టివ్ ఎడిషన్‌లో కొత్త ఇంటీరియర్ కలర్ థీమ్, ప్రీమియం ఫీచర్లు, పవర్ ఫుల్ ఎలక్ట్రిక్ పవర్ ట్రెయిన్ ఉన్నాయి. కేవలం 150 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉండటంతో ఈ ప్రత్యేక ఎడిషన్‌పై చాలా ఆసక్తి చూపిస్తున్నారు.
Read Also: సిట్రోయెన్ నుంచి చౌకైన ఎలక్ట్రిక్ కారు.. లుక్ ఏంది భయ్యా ఇంత బాగుంది!