Silver Prices: భారత్‌లో వెండి ధరలు మళ్లీ రేసులోకి వచ్చాయి. జనవరిలో కిలో వెండి ధర రికార్డు స్థాయిలో 3.70 లక్షల నుంచి 4.10 లక్షల వరకు ఆల్ టైమ్ హైని తాకిన తర్వాత, మార్చి-ఏప్రిల్ నెలల్లో భారీగా కరెక్షన్ కు లోనైంది. అయితే తాజా అప్‌డేట్స్ ప్రకారం దేశీయ మార్కెట్లలో వెండి ధరలు మళ్లీ వేగంగా పెరుగుతూ కిలోకు 2 లక్షల 60 వేల రూపాయల నుంచి 2 లక్షల 90 వేల మధ్య ట్రేడ్ అవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల కంటే ఇండియన్ మార్కెట్లలోనే వెండి ధరల పెరుగుదల వేగం ఎక్కువగా ఉంటోంది.
వెండి దిగుమతులపై కేంద్రం బ్రేక్
వెండి దిగుమతిని ఫ్రీ నుంచి రెస్ట్రిక్టెడ్ కేటగిరీకి కేంద్రం మార్చింది. దీంతో సర్కార్ ఆంక్షలతో దేశంలోకి వెండి దిగుమతులు తగ్గిపోతాయంటున్నారు. దీనివల్ల డిమాండ్‌కు తగ్గ సరఫరా లేక మార్కెట్‌లో రేట్లు పెరగడం ఖాయమంటున్నారు. ఇక దేశీయంగా వాడుతున్న వెండిలో 80 శాతానికిపైగా దిగుమతి అవుతున్నదే కావడంతో సమస్యలు పెరుగుతున్నాయ్. ప్రపంచ మార్కెట్లతో పోలిస్తే ఇండియాలో వెండి రేట్లు చాలా స్పీడ్ గా పెరుగుతున్నాయి. ఒక్క మే నెలలోనే లోకల్ గా వెండి ధరలు దాదాపు 10% పెరగగా, అదే టైంలో అంతర్జాతీయ వెండి ధరలు సుమారు 4% మాత్రమే పెరిగాయి. ఈ రేట్ల తేడా ప్రస్తుతానికి అసాధారణంగా కనిపిస్తోంది. ఈ భారీ తేడాకు కారణం ప్రపంచ డిమాండ్, మార్కెట్ సెంటిమెంట్‌కు మించి అంటున్నారు. వెండి దిగుమతులను కఠినం చేయాలన్న భారత్ ఇటీవలి చర్య ఇప్పుడు దేశీయ ధరలు, సరఫరా, ఇన్వెస్టర్ల అంచనాలను రీ కన్ స్ట్రక్ట్ చేస్తోంది.
దేశీయ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం
ఇండియాలోకి సిల్వర్ దిగుమతి వ్యవహారం ఆల్ ఆఫ్ సడెన్ గా ఖరీదైందిగా, మరింత కష్టంగా మారిపోయింది. దిగుమతి సుంకాలు విపరీతంగా పెరిగినప్పుడు, వెండి ఇంపోర్ట్ ధర దానంతట అదే పెరుగుతుంది. దానికి తోడు ఇప్పుడు సిల్వర్ దిగుమతి ఆంక్షలతో కథ మరింతగా మారిపోయింది. సో ప్రపంచవ్యాప్తంగా ఈ ధరలు కొంత పెరిగినా కూడా ఇండియాలో మాత్రం చాలా జెట్ స్పీడ్ ను అందుకునేలా కనిపిస్తున్నాయ్. ఎందుకంటే దేశీయ మార్కెట్ కు ఉండాల్సిన సమస్యలు ఉన్నాయ్. అవేంటంటే.. అధిక దిగుమతి ఖర్చులు, సరఫరా అంచనాలు మరింత కఠినం అవడం, కొరతలు ఇవన్నీ సవాల్ గా మారుతున్నాయ్.
కొత్త రూల్స్‌తో మార్కెట్ టెన్షన్
వెండి విషయంలో కేంద్రం రెండు విధాన మార్పులను ప్రవేశపెట్టింది. మొదటిది వెండిపై ఎఫెక్టివ్ ఇంపోర్ట్ సుంకాన్ని 15 శాతానికి పెంచడంతో దిగుమతుల ఖర్చు చాలా వరకు పెరిగింది. ఆ తర్వాత వెండి కడ్డీలు, పాక్షికంగా తయారైన వెండి వస్తువులతో సహా అనేక వెండి ఉత్పత్తులను కంట్రోల్డ్ కేటగిరిలోకి మార్చారు. గతంలో దిగుమతిదారులు ఈ ఉత్పత్తులను ఇండియాలోకి ఫ్రీగా తీసుకొచ్చే వారు. ఇప్పుడు వాటిలో చాలా వాటికి లైసెన్సులు, అదనపు అనుమతులు తప్పనిసరి చేసింది కేంద్రం.
వెండి దిగుమతులపై కేంద్రం కొత్త వ్యూహం
భారత్ లో వెండికి డిమాండ్ చాలా బలంగా ఉంది. విలువైన లోహాలు ముఖ్యంగా వెండి దిగుమతులపై భారత్ ఆలోచనా విధానం మారుతోంది. కారణం మ్యాటర్ అటు తిరిగి ఇటు తిరిగి విదేశీ మారక ద్రవ్యం వద్దకే చేరుతోంది. ఇండియా ప్రస్తుతం అధిక ముడిచమురు దిగుమతి బిల్లులు, రూపాయిపై ఒత్తిడి, వాణిజ్య లోటు ఆందోళనలు, ప్రపంచ భౌగోళిక రాజకీయ అనిశ్చితి మధ్య ఉంది. ఇలాంటి టైంలో విదేశీ మారక నిల్వలపై తీవ్ర ఒత్తిడిని కలిగించే దిగుమతులను తగ్గించాలనుకుంటున్నారు.
ఇండస్ట్రీలకు కీలక ఇంధన లోహం
భారత్ ప్రతి సంవత్సరం భారీ ఎత్తున వెండిని దిగుమతి చేసుకుంటుండడంతో, ఆ ఆందోళనలో వెండి కూడా క్రమంగా ఒక భాగంగా మారుతోంది. వెండి అనగానే అందరికీ ఆర్నమెంట్స్ వ్యవహారం మాత్రమే గుర్తొస్తుంది. కానీ ఇవాళ్టి రోజుల్లో వెండికి పారిశ్రామిక డిమాండ్ బాగా పెరిగింది. సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ తయారీలో కీరోల్ గా ఉంది. ప్రపంచవ్యాప్తంగా వెండి స్వచ్ఛమైన ఇంధన ఉత్పాదక లోహంగా మారుతోంది. స్వల్పకాలంలో అస్థిరత ఉన్నప్పటికీ, దీర్ఘకాలిక డిమాండ్ అంచనాలు బలంగా ఉండటానికి ఇది ఒక కారణం. నిజానికి వెండి వ్యవహారం భారత్ కు ఒక సవాల్ ను కూడా సృష్టిస్తోంది. విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడానికి దేశం వెండి దిగుమతులను కంట్రోల్ చేయాలనుకుంటున్నా.. మరోవైపు సోలార్ పవర్, ఈవీ ఉత్పత్తి వంటి ఇండస్ట్రీలు వెండిపై రోజురోజుకూ ఎక్కువగానే ఆధారపడాల్సి వస్తోంది.
FTA రూట్లపై ఫోకస్
వెండిపై తాజా ఆంక్షల వెనుక వాణిజ్య పరమైన కోణం కూడా ఉందంటున్నారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల కింద తక్కువ సుంకాలు ఉండే దేశాలైన థాయ్ లాండ్, యూఏఈ ద్వారా కొంతమంది దిగుమతిదారులు వెండిని రవాణా చేస్తున్నారని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ రూట్ల ద్వారా అసాధారణంగా భారీ స్థాయిలో వెండి దిగుమతులు వస్తుండడంతో కేంద్రం అలర్ట్ అయింది. అధిక సుంకాలను తప్పించుకోవడానికి వెండిని ఇలా దేశంలోకి తీసుకొస్తున్నారన్న డౌట్లతో పర్యవేక్షణను కఠినం చేయడానికి, లూప్ హోల్స్ తగ్గించేలా కొత్త ఆంక్షలనైతే తీసుకొచ్చారు. ఇది కాస్తా వెండిని మరింత స్పీడ్ పెరిగేలా చేస్తోంది.
వెండి మార్కెట్‌లో కొత్త సమీకరణం
గతంలో వెండి రేట్లు ప్రధానంగా అంతర్జాతీయ పరిస్థితులు, డాలర్ ఇష్యూస్, వడ్డీ రేట్లు, మొత్తం వరల్డ్ రిస్క్ సెంటిమెంట్ ఆధారంగా ఉండేవి. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ విధానమే రేట్లను ప్రభావితం చేస్తోంది. అంటే సిల్వర్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు పెట్టేవారితో సహా వెండిని ట్రాక్ చేసే ఇన్వెస్టర్లు, ప్రపంచ వెండి ట్రెండ్‌లతో పాటు దిగుమతి సుంకాలు, డీజీఎఫ్‌టీ నిబంధనలు, వాణిజ్య ఆంక్షలు, కరెన్సీ హెచ్చుతగ్గులు ఇలాంటివన్నీ కీలకంగా మారుతున్నాయ్.
Also Read: చిల్లర రాజకీయాలు వద్దు.. అభివృద్ధి చేయండి.. ఎంపీ అరవింద్‌పై సంజయ్ ఫైర్!
వెండి ధరలపై డబుల్ షాక్
వెండికి ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక డిమాండ్ పెరిగింది. అటు భౌగోళిక రాజకీయ అనిశ్చితి కూడా తోడైంది. దిగుమతి ఆంక్షలు పెరిగాయ్, సరఫరా సమస్యలు ఎక్కువయ్యాయ్. ఇన్వెస్టర్ల ఊహాగానాలు.. ఇవన్నీ కలిసి ధరల్లో తీవ్రమైన హెచ్చుతగ్గులకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా దిగుమతి విధానాలు కఠినమైన మనలాంటి దేశీయ మార్కెట్లలో ఈ ఇష్యూ ఎక్కువగా కనిపిస్తోంది. అంతర్జాతీయంగా పోలిస్తే మన దగ్గర సిల్వర్ రేట్లు ఇలాగే పెరిగితే ఆభరణాలే కాదు.. సోలార్ ప్యానెళ్లలో వెండిని విస్తృతంగా వాడుతున్న సంస్థలపైనా ప్రభావం ఉంటుంది.
కేంద్రం కొత్త వ్యూహం
విదేశీ మారకపు నిల్వలను ఆదా చేసుకోవాలని దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపునిచ్చాక పరిస్థితులు వేగంగా మారిపోతూ వస్తున్నాయ్. మే 12న బంగారం, వెండిపై ఉన్న దిగుమతి సుంకాన్ని 6 నుంచి 15 శాతానికి పెంచింది కేంద్రం. ఆ తర్వాత డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ -DGFT మే 16న వెండి దిగుమతులపై సరికొత్తగా ఉత్తర్వులను జారీ చేసింది. బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని పెంచిన నాలుగు రోజుల తర్వాత ఈ నిర్ణయం వెలువడింది. కొత్త రూల్ ప్రకారం లైసెన్స్ తీసుకుంటేనే వెండి ఇంపోర్ట్ చేసుకునే అనుమతి లభిస్తుంది. అసలు మీకు లైసెన్స్ ఇవ్వాలా వద్దా అని డీజీఎఫ్‌టీ డిసైడ్ చేస్తుంది.
భారత్–యూఏఈ ఒప్పందం ప్రభావం
2022లో భారత్, యూఏఈ మధ్య ఒప్పందం జరిగింది. ఆ డీల్ ప్రకారం.. యూఏఈ నుంచి దిగుమతి చేసుకునే సిల్వర్ పై భారత్ ప్రతేడాది దిగుమతి సుంకాన్ని 1 శాతం తగ్గించాల్సి ఉంది. ప్రస్తుతం యూఏఈ నుంచి దిగుమతి చేసుకునే వెండిపై కేవలం 7 శాతం దిగుమతి సుంకాన్ని మాత్రమే భారత్ చెల్లిస్తోంది. అదే బ్రిటన్ నుంచి వెండిని దిగుమతి చేసుకోవాలనుకుంటే, 15 శాతం దిగుమతి సుంకాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఇది చాలా పెద్ద తేడా. ఎవరైనా వ్యాపారులు తమ విధానాన్ని దుర్వినియోగం చేసి, యూఏఈ మీదుగా భారత్‌కు వెండిని తీసుకొస్తారేమోనని ప్రభుత్వం ఆందోళన చెందుతూ ఉండొచ్చంటున్నారు. అందుకే లైసెన్స్ తెచ్చారంటున్నారు.
వెండి ధరల ర్యాలీ వెనుక అసలు కారణాలు
సో మనదేశంలో వెండి ధరలు పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయ్. అందులో మొదటిది దేశంలో విదేశీ మారక నిల్వలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం వెండి బార్ల దిగుమతులపై ఆంక్షలను కఠినతరం చేయడం. దీనివల్ల దేశీయ మార్కెట్లోకి ఫిజికల్ సిల్వర్ రాక చాలా తగ్గి సరఫరా కొరత ఏర్పడింది. సప్లై తగ్గడంతో దేశీయంగా ధరలు వేగంగా దూసుకుపోతున్నాయి. వీటికి తోడు గ్రీన్ ఎనర్జీ, క్లీన్ టెక్నాలజీల నుండి భారీ డిమాండ్ ఉంది. బంగారంతో పోలిస్తే వెండి కేవలం ఆభరణాలకే కాకుండా పారిశ్రామికంగా అత్యధికంగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా సోలార్ ప్యానెల్స్ తయారీ, ఎలక్ట్రిక్ వాహనాలు , సెమీకండక్టర్లు, AI హార్డ్‌వేర్ పరిశ్రమల్లో వెండి వినియోగం విపరీతంగా పెరిగింది.
భారత్‌పై డాలర్-రూపాయి ఎఫెక్ట్
ప్రపంచవ్యాప్తంగా ఐదో ఏడాది కూడా వెండి సరఫరా లోటు కనిపిస్తోంది. గ్లోబల్ సిల్వర్ ఇన్‌స్టిట్యూట్ రిపోర్టుల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా వెండి మైనింగ్ కంటే డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. వరుసగా ఐదో ఏడాది కూడా ప్రపంచ మార్కెట్లలో వెండి డిమాండ్ కంటే సరఫరా దాదాపు 4.2 టన్నుల లోటుతో నడుస్తోంది. లండన్ వంటి ప్రధాన అంతర్జాతీయ కేంద్రాలలో వెండి స్టాక్స్ చారిత్రక కనిష్ట స్థాయికి పడిపోయాయి. అంతర్జాతీయంగా అమెరికన్ డాలర్ బలంగా మారడం వల్ల, డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ తగ్గుతోంది. భారత్ తన వెండి అవసరాల కోసం దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతుంది కాబట్టి, రూపాయి బలహీనపడినప్పుడు వెండిని దిగుమతి చేసుకోవడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. ఈ అదనపు భారం దేశీయ రిటైల్ ధరలపై పడుతోంది.
పెట్టుబడిదారులకు అలర్ట్ సిగ్నల్
వీటికి తోడు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి కారణంగా ఇన్వెస్టర్లు సురక్షితమైన ఆస్తిగా వెండి వైపు మొగ్గు చూపుతున్నారు. అంతేకాకుండా, బంగారం ధరలు సామాన్యుడికి అందుబాటులో లేనంతగా పెరగడంతో, రిటైల్ ఇన్వెస్టర్లు సిల్వర్ ఈటీఎఫ్‌లు, డిజిటల్ సిల్వర్ రూపంలో ప్రత్యామ్నాయంగా వెండిలో పెట్టుబడులు పెంచుతున్నారు. నిజానికి వెండి కథ డిఫరెంట్ గా ఉంటుంది. వెండి మార్కెట్ పరంగా చూస్తే చాలా ఒడిదుడుకులతో ఉంటుంది. ఒకే వారంలో 10 వేల నుంచి 30 వేల రూపాయల దాకా పెరగడం లేదా తగ్గడం ఇలాంటివి కనిపిస్తుంటాయ్. సో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలన్న సూచనలు వస్తున్నాయ్.
వెండి ప్రత్యేకత ఇదేనా?
జనవరిలో వెండి ధర కిలో 4 లక్షల రూపాయల రికార్డు గరిష్టాన్ని చేరినప్పుడు ఎగబడి కొనుగోలు చేసిన రిటైల్ ఇన్వెస్టర్లు తాత్కాలికంగా నష్టాల్లో ఉన్నారు. ఎందుకంటే మార్చి-ఏప్రిల్ నెలల్లో ధర దాదాపు 40% వరకు కరెక్షన్ కు గురైంది. 2024 లేదా 2025 ప్రారంభంలో పెట్టుబడి పెట్టిన వారికి ఇప్పటికీ అద్భుతమైన లాభాలు కనిపిస్తున్నాయ్. ఎందుకంటే 2025 ఏడాది పొడవునా వెండి ఏకంగా 138% నుండి 148% వరకు రిటర్న్స్ ఇచ్చింది. సో బంగారంతో పోలిస్తే వెండికి పారిశ్రామికంగా తిరుగులేని డిమాండ్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా వచ్చే మొత్తం డిమాండ్‌లో 50% నుంచి 60% కేవలం పరిశ్రమల నుంచే ఉంది. వెండికి విద్యుత్ వాహకత చాలా ఎక్కువ. దీంతో 5G స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్ చిప్స్, సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వర్ల తయారీలో దీని వినియోగం విపరీతంగా పెరిగింది. అటు మన దేశంలో వీటికి తోడు వెండి ఆభరణాలు, వెండి పాత్రలు, పూజా సాగ్రి, సిల్వర్ కాయిన్స్ రూపంలో సాంప్రదాయ డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది.
Also Read: కోడూరు హైవేపై ఘోర ప్రమాదం.. మూడు వాహనాలు దగ్ధం!
వెండి పతనంతో సిల్వర్ ETFలకు షాక్
ఈ ఏడాది ఫిబ్రవరి-మార్చి వెండి ధరలు క్రష్ అయినప్పుడు, భారతీయ మ్యూచువల్ ఫండ్స్ నడుపుతున్న దాదాపు 17 సిల్వర్ ఈటీఎఫ్‌లు ఒక్క నెలలోనే 13% నుంచి 19% వరకు నష్టాలను మూటగట్టుకున్నాయి. 2025 లో సిల్వర్ ఈటీఎఫ్‌లు దాదాపు 80%-90% పైగా రిటర్న్స్ ఇవ్వడంతో, చాలా మంది ఇన్వెస్టర్లు ధరలు పడిపోకముందే ఈ ఏడాది ఫిబ్రవరిలో తమ ఈటీఎఫ్ యూనిట్లను అమ్మి లాభాలను పొందారు. దీంతో రెండేళ్లలో మొదటిసారి సిల్వర్ ఈటీఎఫ్‌ల నుంచి భారీగా నిధులు బయటకు వెళ్లాయి.
గ్లోబల్ సిల్వర్ మ్యాప్ ఇదేనా?
ప్రపంచవ్యాప్తంగా వెండి ఉత్పత్తి, నిల్వల్లో మెక్సికో తొలి స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా లభించే మొత్తం వెండిలో దాదాపు 24% వాటా ఒక్క మెక్సికోదే. మెక్సికో ఏటా దాదాపు 6 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో అగ్రస్థానంలో ఉంది. చైనా దాదాపు 3,300 మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో రెండో స్థానం, పెరూ 3,100 మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో మూడో స్థానంలో ఉంది. ఇక్కడ భూగర్భంలో ప్రపంచంలోనే అత్యధికంగా 1.4 లక్షల మెట్రిక్ టన్నుల వెండి నిల్వలు బొలీవియాలో దాదాపు 1,300 మెట్రిక్ టన్నులు, రష్యా 1,200 మెట్రిక్ టన్నుల సిల్వర్ ఉత్పత్తి చేస్తోంది. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద వెండి వినియోగదారులలో ఒకటి. మన దేశ అవసరాల కోసం దాదాపు 80% నుంచి 90% వెండిని ఇతర దేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాము.
గ్లోబల్ సప్లయర్లపై భారత్ వ్యూహం
భారత్ సాధారణంగా ఏడాదికి సగటున 4,500 నుంచి 5,000 టన్నుల వెండిని దిగుమతి చేసుకుంటుంది. అయితే ఇండస్ట్రియల్ డిమాండ్ విపరీతంగా పెరగడం వల్ల ఇటీవలి కాలంలో దిగుమతులు భారీగా పెరిగాయి. 2025 ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలంలోనే భారత్ ఏకంగా 5,727 టన్నుల సిల్వర్ ను ఇంపోర్ట్ చేసుకుంది. 2025 క్యాలెండర్ ఇయర్‌లో వెండి దిగుమతుల విలువ రికార్డు స్థాయిలో 76 వేల కోట్ల రూపాయలకు చేరింది. భారత్ ప్రధానంగా మెక్సికో, బ్రిటన్, చైనా, అర్జెంటీనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాల నుంచి వెండిని దిగుమతి చేసుకుంటోంది. మన దేశంలో కూడా వెండి ఉత్పత్తి అవుతోంది. కానీ అది మన అవసరాలకు ఏమాత్రం సరిపోదు. భారత్ లో ప్రత్యేకంగా వెండి కోసం మాత్రమే కేటాయించిన పెద్ద గనులు లేవు. దేశీయంగా ఏటా కేవలం 800 మెట్రిక్ టన్నుల లోపే వెండి ఉత్పత్తి అవుతోంది.
భారత్ వెండి మార్కెట్‌లో భారీ గ్యాప్
ఓవరాల్ గా చూస్తే మన దేశంలో ఏటా కేవలం 800 టన్నుల వెండి మాత్రమే ఉత్పత్తి అవుతుండగా, సోలార్ ప్యానెళ్లు, ఎలక్ట్రానిక్స్ ఆభరణాల కోసం డిమాండ్ 5 వేల టన్నులకు పైగా ఉంది. ఈ భారీ వ్యత్యాసం వల్లే భారత్ పూర్తిగా విదేశీ దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. దీంతో మనం ఎక్కువగా విదేశీ మారకద్రవ్యాన్ని ఖర్చు చేయాల్సి వస్తోంది. ముఖ్యమైనవన్నీ అంటే బంగారం, వెండి, పెట్రోల్, డీజిల్ ఇలాంటివాటిపై దిగుమతిపైనే ఆధారపడుతుండడంతో విదేశీ మారక ద్రవ్యం వేగంగా ఖర్చవుతోంది. దీన్ని సెట్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. సో దిగుమతి ఆంక్షలు కొనసాగినంత కాలం వెండి పరిస్థిలి ఇలాగే ఉండొచ్చు.
Also Read: కొడుకు తప్పుకు తండ్రి పదవికి రాజీనామానా? బండి సంజయ్‌కు మల్లు రవి మద్దతు!
Story by: Anup, Big Tv