BigTV English

Indians in Bangladesh: బంగ్లాదేశ్‌తో భారత్‌కి ముప్పు తప్పదా..? మోదీ ప్లానేంటి..?

Indians in Bangladesh: బంగ్లాదేశ్‌తో భారత్‌కి ముప్పు తప్పదా..? మోదీ ప్లానేంటి..?

ఇటీవల, నమాజ్ సమయంలో దుర్గ పూజల నిషేధం

ప్రస్తుతం, బంగ్లాదేశ్‌లోని మైనారిటీ హిందూ సమాజం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. హిందువులపై దాడులతో మొదలైన ఈ వివక్ష తర్వాత.. ఇటీవల కాలంలో భారత్‌కు చేపల ఎగుమతిపై కూడా బంగ్లాదేశ్ పరిమితులు విధించింది. ఆ తర్వాత, ఇటీవల దసరా ఉత్సవాల సందర్భంగా.. నమాజ్ సమయంలో దుర్గ పూజల నిషేధం విధించాలంటూ డిమాండ్లు కూడా వచ్చాయి. రాడికల్ ఇస్లామిక్ గ్రూపులు పండుగలో నిర్వహించే బహిరంగ వేడుకలను వ్యతిరేకించాయి.


అలాగే ప్రతి ఏటా దుర్గాపూజ పండుగ కోసం దేశవ్యాప్తంగా ఇచ్చే సెలవులు కూడా నిషేధించాలని కోరాయి. దీనికి ముందు, ఢాకాలోని సెక్టార్ 13లో అతివాద గ్రూపులు, హిందువులకు వ్యతిరేకంగా ఒక భారీ కవాతును నిర్వహించాయి. దుర్గాపూజ కోసం హిందువులు ప్లే గ్రౌండ్‌ని ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ప్రదర్శనలు చేశారు. సంవత్సరాల తరబడి ఆ వేదికపై దుర్గాపూజను జరుపుకునే హిందువులు దీనిపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలోనే.. బంగ్లాదేశ్ వ్యాప్తంగా వివక్షకు వ్యతిరేకంగా హిందువులు పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది.

మిటలరీ కనుసన్నల్లో నడుస్తున్న తాత్కాలిక ప్రభుత్వం

అయితే, ఇటీవల యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం, దాని మధ్యంతర ప్రభుత్వ ఆర్డినెన్స్, 2024కి తాత్కాలిక ఆమోదం పొందింది. ఈ చర్య, మిటలరీ కనుసన్నల్లో నడుస్తున్న యూనస్ తాత్కాలిక ప్రభుత్వానికి మరింత అధికారాలను ఇస్తుంది. ఈ కొత్త ఆర్డినెన్స్.. బంగ్లాదేశ్‌లో కొత్త పార్లమెంటు ఏర్పాటు, ప్రధానమంత్రి నియామకం వంటి మధ్యంతర ప్రభుత్వ చర్యలను చట్టబద్ధంగా చెల్లుబాటు అయ్యేలా చేస్తుంది. అయితే, దీనికి ఎటువంటి నిర్ణీత కాలవ్యవధి లేకుండా ప్లాన్ చేయడంపై పలు అనుమానాలు వస్తున్నాయి. 13వ పార్లమెంటు కొత్త ప్రధానమంత్రిని నియమించే వరకు ఈ తాత్కాలిక ప్రభుత్వం అధికారంలో ఉంటుందని నియమం ఉన్నప్పటికీ.. అది ఎప్పటి వరకూ అనేది స్పష్టత ఇవ్వలేదు.

మరోవైపు, బంగ్లాదేశ్ రాజ్యాంగం నుండి “సెక్యులరిజం”, “సోషలిజం” అనే పదాలను తొలగించాలని బంగ్లా అత్యున్నత న్యాయాధికారి ప్రతిపాదించడం చర్చనీయాంశమయ్యింది. దీనికి సంబంధించిన రిట్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టులో అటార్నీ జనరల్ మహ్మద్ అసజ్జామాన్ కీలక ప్రకటన చేశారు. రాజ్యాంగంలోని నాలుగు సూత్రాలలో “లౌకికవాదం”, “సోషలిజం” అనే రెండు పదాలను తొలగించాలని కోరారు. అయితే, దీనిపై మధ్యంతర ప్రభుత్వం స్పందించాలని కోర్టు కోరింది. ఒకవేళ, యూనస్ దీనికి ఓకే అంటే.. బంగ్లాలో లౌకికవాదం, సోషలిజం కనుమరుగయ్యి పూర్తి స్థాయిలో ఇస్లామిక్ స్టేట్ స్థాపన జరిగే అవకాశం ఉంది.

రాజ్యాంగంలో సెక్యులరిజం, సోషలిజం పదాలను తొలగించే ప్రతిపాదన

ఒకవేళ, బంగ్లాదేశ్‌‌ ఇస్లామిక్ స్టేట్‌గా రూపాంతరం చెందితే.. అక్కడి జనాభాలో ఎనిమిది శాతంగా ఉన్న హిందువులు బతకడం కష్టంగా మారుతుంది. ఇప్పటికే, హిందూ పండుగలకు ప్రభుత్వ సెలవుదినాలను నిషేధించాలని ఇన్సాఫ్ కీమ్‌కారీ ఛత్ర-జంతా వాదిస్తోంది. లౌకికవాదాన్ని గౌరవిస్తూ.. హిందూ పండుగలకు మద్దతు ఇవ్వడానికి ముస్లింలు ఎవరూ పాల్గొనకూడదంటూ ఆ సంస్థ పిలుపునిస్తోంది.

Also Read: యోగి టార్గెట్ సంభల్.. జామా మసీద్‌ కథ తేలాల్సిందే..

ఈ సంస్థ ఇటీవల ప్రభుత్వానికి సమర్పించిన డిమాండ్లలో.. బంగ్లాదేశ్‌లోని ప్రత్యేక భూములను ఆక్రమించి నిర్మించిన హిందూ దేవాలయాలను తొలగించాలని కూడా పేర్కొన్నారు. అలాగే, “భారతదేశం బంగ్లాదేశ్‌కు జాతీయ శత్రువు కాబట్టి, బంగ్లాదేశ్‌లోని హిందూ పౌరులు కూడా భారతదేశానికి వ్యతిరేకంగా ఉండాలని డిమాండ్ చేశారు. ఈ కారణంగా, భారతదేశానికి వ్యతిరేకంగా బ్యానర్లు, భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు దేవాలయాలలో ఉంచాలని కూడా డిమాండ్ చేశారు.

బంగ్లాదేశ్‌ జనాభాలో హిందువులు 8 శాతం

ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితుల్ని చూస్తుంటే.. భారత్‌ పక్కలో మరో ముప్పు ఉందనే సంకేతాలు బలంగానే కనిపిస్తున్నాయి. భారత్‌కు సన్నిహితంగా ఉన్న ప్రధాని హసీనా పలాయనం తర్వాత అక్కడ హిందువులపై దాడులు మరింత పెరిగాయి. 2021లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన తర్వాత కూడా ఇలాగే బంగ్లాదేశ్‌లో హిందువులను టార్గెట్ చేశారు. అప్పుడు, హింసాకాండలో అనేక హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి.

అయితే, ప్రస్తుతం బంగ్లాదేశ్ జనాభాలో హిందువులు 8 శాతంగా ఉన్నారు. 1951లో బంగ్లాదేశ్ జనాభాలో హిందువుల వాటా 22 శాతంగా ఉంది. హిందూ అమెరికన్ ఫౌండేషన్, నివేదిక ప్రకారం, 1964, 2013 మధ్య మతపరమైన హింస కారణంగా 11 మిలియన్లకు పైగా హిందువులు బంగ్లాదేశ్ నుండి పారిపోయారు. అయితే, హసీనా పాలనలో దాన్ని అదుపు చేయడానికి తీవ్రంగా ప్రయత్నించారు. ఇక, ఇప్పుడు హసీనా బహిష్కరణ తర్వాత బంగ్లాదేశ్‌లో భారతీయులు నివశించడానికే వణికిపోతున్న పరిస్థితి వచ్చిందనే అభిప్రాయాలు ఉన్నాయ్.

బంగ్లాదేశ్‌లో ఇటీవలి ఉద్యమం వెనుక ప్రతిపక్ష BNP, JI పార్టీల హస్తం

బంగ్లాదేశ్‌తో దాదాపు 4 వేల 96 కిలో మీటర్ల పొడవైన భూమి, నదీ సరిహద్దును పంచుకుంటున్న భారత్‌కు ఇది అత్యంత కీలకమైన అంశం. బంగ్లాదేశ్‌లో పరిస్థితికి పాకిస్తాన్‌‌కు చెందిన శక్తులు కారణమా కాదా అనే అంశంపై ఇప్పటికైతే భారత్ అధికారికంగా ఎలాంటి కామెంట్లూ చేయలేదు. అయినప్పటికీ.. హసీనా పలాయనం నుండీ భారత్‌పై బంగ్లాదేశీయులు కోపం పెంచుకోడానికి బయటి హస్తం ఏదో ఉందనే అనుమానాలు లేకపోలేదు. అయితే బంగ్లాలో ఇటీవల విద్యార్థుల ఆందోళన తారాస్థాయిలో చేరుకోడానికి, పాలన మార్పు కోసం ఒక ఉద్యమంగా మార్చడానికి.. బంగ్లాదేశ్ ప్రతిపక్ష BNP పార్టీ, జమాతే ఇస్లామీ పనిచేశాయని భారత్ బలంగా నమ్ముతుంది.

అందులోనూ, ఈ రెండు పార్టీలు చారిత్రాత్మకంగా పాకిస్తాన్, చైనాలతో సన్నిహిత సంబంధాలు ఉండాలని వాదించిన పార్టీలు. గతంలో, భారతదేశం ప్రతిపాదించిన రెడ్ లైన్లను కూడా స్పష్టంగా ఉల్లంఘించిన పార్టీలు. గతంలో, హసీనాకు భారత్ మద్దతును తీవ్రంగా వ్యతిరేకించాయి. భారతదేశానికి వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లో జాతీయవాద, మతపరమైన భావాలను రెచ్చగొట్టారు. గతంలో, BNP నాయకులు “ఇండియా అవుట్” ప్రచారం కూడా నిర్వహించిన సందర్భాలు ఉన్నాయ్. అయితే, రాబోయే రోజుల్లో ఇవే పార్టీలు అక్కడ ప్రభుత్వం చేపట్టే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో, బంగ్లాదేశ్ భారత్ వ్యతిరేఖ వైఖరి వెనుక ఇస్లామిక్ సంస్థల హస్తం ఉందనే అనుమానాలు వస్తున్నాయ్.

చైనా అనుకూలమైన బంగ్లా ఆర్మీ చీఫ్ వాకర్-ఉజ్-జమాన్‌ 

ఈ సమస్య సాంఘీకంగానే కాక రాజకీయంగానూ ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే, ప్రస్తుతం, బంగ్లాదేశ్‌ను ఆధీనంలోకి తీసుకున్న బంగ్లా ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్-ఉజ్-జమాన్‌ను ఆర్మీకి చీఫ్‌గా అపాయింట్ చేసుకోవద్దనీ.. జమాన్‌తో జాగ్రత్తగా ఉండమని గతంలో భారత్ హసీనాను హెచ్చరించింది. జమాన్ చైనాకు అనుకూలంగా ఉండే వ్యక్తి అని కూడా భారత్ హెచ్చరించినట్లు సమాచారం. అందుకే, దాదాపు 280 మంది అల్లర్లలో చనిపోయిన తర్వాత కూడా బంగ్లాలో నిరసనలను నియంత్రించడానికి బదులుగా.. జనరల్ జమాన్.. హసీనాకు అల్టిమేటం జారీ చేశాడు.

తర్వాత, తాత్కాలిక ప్రభుత్వం తక్షణమే అమలులోకి వస్తుందని జమాన్ ప్రకటించాడు. సైన్యంపై విశ్వాసాన్ని ఉంచాలని బంగ్లా పౌరులను కోరాడు. కొన్ని నివేదికల ప్రకారం, భారత్‌కు మిత్రురాలిగా షేక్ హసీనా ఉండటం వల్లనే ఆమెను గద్దె దించడానికి చైనా, పాకిస్తాన్‌లు జమాన్‌ను ఆయుధంగా వినియోగించినట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే జమాన్ కనుసన్నల్లో నడుస్తున్న బంగ్లాదేశ్ మరో పాకిస్తాన్‌లా మారి భారత్‌కు పెద్ద ముప్పుగా పరిణమిస్తుదనడంలో సందేహం లేదు.

చైనా, పాక్‌లు జమాన్‌ను ఆయుధంగా వినియోగించినట్లు అనుమానం

1971లో పాకిస్తాన్ అధికారం నుండి బంగ్లాదేశ్ స్వాతంత్ర్య దేశంగా ఏర్పడినప్పటి నుండి పాక్ బంగ్లాను తూర్పు పాకిస్తాన్‌గానే పరిగణిస్తూ వచ్చింది. అందులోనూ, షేక్ హసీనా తండ్రి, బంగ్లాదేశ్ జాతి పిత అయిన షేక్ ముజిబిర్ రెహమాన్ అంటే పాకిస్తాన్‌‌కి దాదాపు శత్రువన్నట్లే లెక్క. అలాంటిది, ఆయన కుమార్తె దేశం నుండి పారిపోవడం అంటే పాకిస్తాన్‌కు పండుగేనని చెప్పాక తప్పదు. ఇక, ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్ బంగ్లాను తన సిద్ధాంతాల ప్రకారం, ఇస్లామిక్ సంస్థల ద్వారా పరోక్షంగా ప్రభావితం చేస్తుందనే అనుమానాలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో.. భారతదేశానికి పశ్చిమాన ఒరిజినల్ పాకిస్తాన్, తూర్పున ఈస్ట్-పాకిస్తాన్‌గా ఉన్న బంగ్లాదేశ్‌లు కలిస్తే.. భారత్‌కు ముందు నుయ్యి వెనక గొయ్యిలా ఉంటుంది. మరి, భవిష్యత్తులో ఈ పరిణామాలు ఇంకెన్ని తలనొప్పులకు దారితీస్తాయో చూడాలి.

 

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×