Sukhoi 57: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దగ్గర ఇప్పటికే శక్తిమంతమైన రఫేల్, నమ్మకదిగిన సుఖోయ్-30, ఇండియా మేడ్ తేజస్ లాంటి అత్యాధునిక యుద్ధ విమానాలున్నాయ్. అయినాసరే, రష్యాకు చెందిన అత్యంత అడ్వాన్స్‌డ్ ఫైటర్ జెట్ సుఖోయ్-57 వైపు భారత్ మొగ్గు చూపుతుందనే వార్తలు.. రక్షణ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయ్.
భారత్ దగ్గర రఫేల్ లాంటి అద్భుతమైన 4.5 జనరేషన్ ఫైటర్ జెట్ ఉంది. కానీ.. ఇది పూర్తి స్థాయి స్టెల్త్ జెట్ కాదు. చైనా ఇప్పటికే జే-20 లాంటి ఐదో తరం స్టెల్త్ ఫైటర్ జెట్స్‌ని సరిహద్దుల్లో మోహరించింది. అందువల్ల.. ఇండియా దగ్గర కూడా ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్స్ ఉండాల్సిన అవసరం ఉంది. అందుకోసమే.. రష్యా సుఖోయ్-57పై ఫోకస్ చేసింది ఇండియా. ఇది.. ఐదో తరం స్టెల్త్ యుద్ధ విమానం. దీని డిజైన్.. శత్రు రాడార్లకు చిక్కకుండా లోపలికి చొచ్చుకుపోయేలా ఉంటుంది. ఆధునిక యుద్ధాల్లో శత్రువు కంటికి కనిపించకుండా దాడి చేయడం అత్యంత కీలకం.
రఫేల్ దగ్గర లేని పూర్తి స్థాయి స్టెల్త్ టెక్నాలజీ, కెపాసిటీ.. సుఖోయ్-57లో ఉంటుంది. అందుకే.. భారత్ దానివైపు మొగ్గుతున్నట్లు తెలుస్తోంది. రష్యా నుంచి వీటని కొనుగోలు చేసేందుకు భారత్ సీక్రెట్ డీల్ కుదుర్చుకుందనే వార్తలు.. ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సుఖోయ్-57 స్టెల్త్ ఫైటర్ జెట్స్ అమ్మకం కోసం కొన్ని దేశాలతో ఒప్పందాలు జరిగాయని.. రష్యా ప్రభుత్వానికి చెందిన రక్షణ రంగ ఉత్పత్తుల ఎగుమతి సంస్థ రోస్‌బోరోన్ ఎక్స్‌పోర్ట్ సీఈవో అలెగ్జాండర్ మిఖయేవ్ ఇటీవలే తెలిపారు. భారత్-రష్యా మధ్య ఆ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి రహస్య ఒప్పందం కుదిరినట్లు.. ఇటీవలే మిలటరీ వాచ్ అనే మ్యాగజీన్ ఓ కథనాన్ని ప్రచురించింది.
యుద్ధవిమానాల కొరతతో భారత వాయుసేన సతమతమవుతున్న క్రమంలో.. ఫ్రాన్స్ నుంచి 114 రఫేల్ ఫైటర్ జెట్స్ కొనుగోలుకు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. అయితే, ఈ విమానాల సోర్స్ కోడ్‌ను భారత్‌తో పంచుకునేందుకు ఫ్రాన్స్ ఆసక్తి చూపట్లేదు. బ్రహ్మోస్, అస్త్ర, రుద్రం మిసైళ్లని.. రఫేల్‌తో లింక్ చేసేందుకు అవసరమైన మేరకైనా కోడ్‌ను తమకు అందించాలని భారత్ కోరుతోంది. దీనికి కూడా ఫ్రాన్స్ ఒప్పుకోవడం లేదు. ఒకవేళ ఈ ఒప్పందం కుదిరినా.. భారత్‌కు ఈ విమానాల సప్లై మొదలవడానికి మరో నాలుగేళ్లు పడుతుంది. అయితే, ఇప్పటికే ఐఏఎఫ్ అమ్ములపొదిలో ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్ లేకపోవడం పెద్ద లోటుగా మారింది.
రఫేల్ యుద్ధ విమానాలు 4.5 జనరేషన్‌కి చెందినవి కావడంతో.. అవి ఎన్ని కొన్నా ఐదో తరం స్టెల్త్ యుద్ధ విమానం లేని లోటు తీరదు. ఈ క్రమంలో.. ఫిఫ్త్ జనరేషన్ యుద్ధ విమానాలను ఎలాగైనా వాయుసేనలో చేర్చుకోవాలని భారత్ చూస్తోంది. భారత్ సొంతంగా డెవలప్ చేస్తున్న ఐదో తరం స్టెల్త్ ఫైటర్ జెట్ ఆమ్కా 2035 తర్వాత గానీ అందుబాటులోకి రాదు. మరోవైపు.. అమెరికా తమ ఎఫ్-35 యుద్ధ విమానాలను ఇండియాకు విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నా.. ఇండియాకు ఇంట్రస్ట్ లేదు. ఎందుకంటే.. అమెరికా వాటి సోర్స్ కోడ్‌ను మనతో ఎంతమాత్రం పంచుకోదు. పైగా.. వాటి వినియోగంపై అనేక కండీషన్లు పెడుతుంది. ఈ పరిస్థితుల్లో.. రష్యా మాత్రమే సుఖోయ్-57 పూర్తి సోర్స్ కోడ్‌ని ఇండియాకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది.
సుఖోయ్-57 స్టెల్త్ యుద్ధ విమానాలను పెద్ద సంఖ్యలో కొంటే.. భారత్‌లోనే వాటిని తయారుచేసేందుకు సహకరిస్తామని కూడా రష్యా హామీ చెప్పింది. ఇప్పటికే.. మహరాష్ట్రలోని నాసిక్‌లో సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధవిమానాల్ని భారత్ తయారుచేస్తోంది. ఆ యూనిట్‌లోనే సుఖోయ్-57 ఫైటర్ జెట్స్‌ని కూడా తయారుచేయొచ్చని, రెండు విమానాల్లో కొన్ని స్పేర్ పార్ట్స్ సేమ్ ఉన్నట్లు తెలుస్తోంది. అందువల్లే.. సుఖోయ్-57 యుద్ధ విమానాల కొనుగోలుకు.. భారత్ రహస్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. భారత్ గనక వాటిని కొనుగోలు చేస్తే స్వదేశీ మిసైళ్లతో పాటు దేశీయంగా తయారుచేసిన విరూపాక్ష రాడార్‌ని కూడా దాంతో లింక్ చేయొచ్చు. వీటన్నింటి వల్లే.. భారత్ సీక్రెడ్ డీల్ చేసుకొని ఉండొచ్చని భావిస్తున్నారు. దీనిని, బహిరంగంగా ప్రకటిస్తే, అమెరికా నుంచి ప్రెజర్ పెరగొచ్చనే కారణంతోనే.. రహస్యంగా ఉంచారనే చర్చ జరుగుతోంది.
ఇక.. మన డీఆర్‌డీవో డెవలప్ చేస్తున్న తేజస్ మార్క్-2 యుద్ధ విమానం కూడా ఫస్ట్ ఫ్లైట్‌కు దాదాపు సిద్ధమైంది. ముందుగా.. టాక్సీ ట్రయల్స్ నిర్వహించి.. ఆ తర్వాత ఫస్ట్ ఫ్లైట్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. డీఆర్‌డీవోనే అభివృద్ధి చేసిన 4.5 జనరేషన్ యుద్ధవిమానాలైన తేజస్ ఎంకే-1ఏలు కూడా ఐదారు రెడీగా ఉన్నాయి. కానీ, వాటిని ఇంకా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో చేర్చలేదు. ఆ యుద్ధ విమానాలతో పోలిస్తే.. తేజస్ ఎంకే2 జెట్స్ మరింత శక్తిమంతమైనవి. వీటి ఇంజిన్, ఇంధన సామర్థ్యం, రేంజ్, ఫ్రంటల్ స్టెల్త్ కెపాసిటీ చాలా ఎక్కువ. చాలా ఆయుధాలను మోసుకెళ్లగలవు. ఇందులో.. అమెరికా ఎఫ్-18 యుద్ధవిమానాల్లో వాడే ఎఫ్-414 ఇంజన్లు ఉన్నాయి.
రాడార్, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్‌లో.. తేజస్ మార్క్ 2 రఫేల్ కంటే మెరుగైన సామర్థ్యం కలిగి ఉంటుందని చెబుతున్నారు. ఈ యుద్ధ విమానాలు హిమాలయాల్లో బాగా ఉపయోగపడతాయి. ఇందులో వాడే ఉత్తమ్ రాడార్, గాలియం నైట్రైడ్ రాడార్.. రఫేల్ రాడార్ కంటే ఎక్కువ రేంజ్ కలిగి ఉంటుంది. శత్రుదేశాలు జామింగ్ చేయకుండా తట్టుకొని నిలబడగలదు. రఫేల్‌తో పోలిస్తే.. ఎక్కువ ఎత్తులోనూ కచ్చితత్వంలో పనిచేస్తుంది. రఫేల్ 52 వేల అడుగుల ఎత్తులో పనిచేస్తే.. తేజస్ ఎంకే2 56 వేల అడుగుల ఎత్తులోనూ పనిచేస్తుంది. సుఖోయ్-57, తేజస్-మార్క్ 2 గనక భారత వాయుసేనలో చేరితే.. భారత్ మరింత శత్రుదుర్భేద్యంగా తయారవుతుంది.
భారత వాయుసేన కీలకమైన మలుపులో ఉంది. దశాబ్దాలుగా మన గగనతల రక్షణ కవచంగా ఉన్న రష్యా సుఖోయ్ విమానాల వారసత్వం, మరోవైపు స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకుంటున్న తేజస్ గర్జనకు తోడు.. ఐదో తరం యుద్ధ విమానాలు కూడా చేరితే.. ఐఏఎఫ్ కేవలం బలమైన శక్తిగా మాత్రమే కాదు, ఆసియాలోనే అజేయమైన మహా వాయుసేనగా అవతరిస్తుంది. పశ్చిమాసియా యుద్ధ పరిణామాలు, మారుతున్న భౌగోళిక రాజకీయాల వేళ.. భారత్ అనుసరిస్తున్న వ్యూహాత్మక మార్పులు ఇప్పుడు టాక్ ఆఫ్ ది వరల్డ్‌గా మారాయ్.
రష్యాతో మనకున్న దశాబ్దాల అనుబంధం.. ఇప్పుడు మరో స్థాయికి చేరుకునే సమయం ఆసన్నమైనట్లు కనిపిస్తోంది. ఇప్పటికే.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు వెన్నెముకగా సుఖోయ్-30ఎంకేఐ ఉంది. రాబోయే రోజుల్లో.. అదే రష్యాకు చెందిన ఐతో తరం స్టెల్త్ ఫైటర్ జెట్ సుఖోయ్-57పై భారత్ ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఉన్న సుఖోయ్ యుద్ధ విమానాలను.. సూపర్ సుఖోయ్‌లుగా మార్చే ప్రక్రియ.. భారత వాయుసేనకు కొత్త శక్తినిస్తుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయ్. మరోవైపు.. విదేశీ యుద్ధ విమానాలపై ఆధారపడటం తగ్గించి, ఆత్మనిర్భర్ భారత్ దిశగా మనం వేస్తున్న మరో అడుగు.. లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్.. తేజస్ మార్క్-2! తేజస్ మార్క్-1తో పోలిస్తే.. తేజస్ మార్క్-2లో అత్యాధునిక సెన్సార్లు ఉంటాయ్. ఎక్కువ ఆయుధాలను మోయగలదు, ఎక్కువ దూరం ప్రయాణించగలదు. రాబోయే పదేళ్లలో.. మిగ్-29, మిరాజ్-2000 లాంటి పాత యుద్ధ విమానాల స్థానాన్ని.. తేజస్ మార్క్-2 భర్తీ చేయనుంది. ఇది.. ఐఏఎఫ్‌ని ఒకే విధమైన మెయింటెనెన్స్ ప్లాట్‌ఫామ్‌పైకి తెచ్చి ఖర్చు తగ్గిస్తుంది.
ఇక.. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం, మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న ఉద్రిక్తతలు.. భారత రక్షణ రంగానికి కీలక పాఠాలు నేర్పాయి. కేవలం.. ఫైటర్ జెట్లు మాత్రమే సరిపోవు. స్ట్రాంగ్ ఎయిర్ డిఫెన్స్ కూడా ఉండాలని భారత్ భావిస్తోంది. యుద్ధం సుదీర్ఘంగా సాగితే.. విదేశీ విడిభాగాల కోసం ఎదురుచూడటం ప్రమాదకరం. అందుకే.. తేజస్‌తో పాటు అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రాజెక్టులను సైతం భారత్ వేగవంతం చేసింది. ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్, రాడార్ జామింగ్ కెపాసిటీ కూడా యుద్ధ గమనాన్ని మారుస్తుందని గుర్తించింది. ప్రస్తుతం భారత వాయుసేన దగ్గర.. 31 యాక్టివ్ ఫైటర్ జెట్ స్క్వాడ్రన్లు ఉన్నాయి. వీటిని.. 42 స్క్వాడ్రన్లకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాదు.. ఐఏఎఫ్‌లో ఫోర్త్, 4.5 జనరేషన్ వరకు మాత్రమే అడ్వాన్స్‌డ్ యుద్ధ విమానాలు ఉన్నాయి. ఇప్పుడు.. కచ్చితంగా ఐదో తరం స్టెల్త్ ఫైటర్ జెట్స్ ఉండి తీరాల్సిన అవసరముంది. అందుకోసమే.. రష్యాతో డీల్ కుదుర్చుకుందనే వార్తలు వస్తున్నాయ్.
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఇప్పుడు కొనుగోలుదారుగా మాత్రమే లేదు. యుద్ధ విమానాల సృష్టికర్తగానూ మారుతోంది. ఒకవైపు రష్యా నుంచి అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని అందిపుచ్చుకుంటూనే, మరోవైపు స్వదేశీ పరిజ్ఞానంతో.. ప్రపంచ స్థాయి విమానాలను తయారు చేస్తోంది. రాబోయే కొన్నేళ్లలోనే.. తేజస్ మార్క్-2 గాల్లోకి లేవడం ఖాయం. మరోవైపు.. ఐదో తరం స్టెల్త్ ఫైటర్ జెట్లు కూడా ఐఏఎఫ్ అమ్ములపొదిలో చేరతాయ్. అప్పుడు.. భారత వాయుసేన.. ఆసియాలోనే అత్యంత శక్తివంతమైన మహా వాయుసేనగా మారుతుంది. శత్రుదేశాలైన పాకిస్థాన్, చైనా.. ఇండియా వైపు చూడాలంటేనే.. వెన్నులో వణుకు పుట్టే స్థాయికి చేరుతుంది. ఓవరాల్‌గా.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్.. ఇప్పుడున్న దానికంటే మరింత శత్రుదుర్భేద్యంగా మారుతుంది.
Also Read:టీజీ ఆర్టీసీ విలీనంలో భారీ ట్విస్టులు.. ఏపీ మోడల్ ఫాలో అయితే ఎవరికి లాభం? ఎవరికి నష్టం?
Story by: Anup, Big Tv