Sugavasi Subramanyam Resignation: టీడీపీలో మొన్నటి వరకు కీలకంగా ఉన్న ఆయన వైసీపీలో చేరేందుకు రెడీ అయ్యారు. ఈనెల 25న ముహూర్తం కూడా ఖరారైంది. ఈ నేపథ్యంలో ఆయన చేరికపై ఎన్నో ప్రశ్నలు.. మరెన్నో గుసగుసలు విన్పిస్తున్నాయి. ఇంతకీ సుగవాసి సుబ్రహ్మణ్యం చేరిక.. జగన్ పార్టీ ప్రారంభించిన ఆపరేషన్ ఆకర్ష్‌కు నిదర్శనమా.. లేదంటే కేసుల భయంతో వైసీపీ చేస్తున్న డైవర్షన్ పాలిటిక్సా..? అసలు సుగవాసి ప్లానేంటి..? వైసీపీ స్కెచ్ ఏంటి..?
వైసీపీలోకి వెళ్లేందుకు సిద్ధమైన సుగవాసి సుబ్రహ్మణ్యం
రాయలసీమ రాజకీయాలకు సంబంధించి కీలక పరిణామాల్లో ఒకటిగా సుగవాసి బాల సుబ్రహ్మణ్యం ఎపిసోడ్ ఉండబోతోందా..? ఇప్పటికే అధికార టీడీపీని వీడిన ఆయన.. వైసీపీలో చేరేందుకు రెడీ అయ్యారు. దీంతో.. ఉమ్మడి కడప జిల్లా రాయచోటిలో భవిష్యత్ పాలిటిక్స్ ఎలా మారబోతున్నాయి అన్న ఉత్కంఠ నెలకొంది. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో రాజంపేట నుంచి పోటీ చేసి ఓటమి పాలైన సుగవాసి సుబ్రహ్మణ్యం అధికార టీడీపీని ఎందుకు వదిలిపెట్టారన్నది అత్యంత ఆసక్తి కలిగించే పరిణామం. ఎందుకంటే ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అత్యంత బలంగా ఉంది. ఎంత బలంగా ఉందంటే చివరకు వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కనంతగా. కానీ, సుగవాసి మాత్రం వైసీపీకి జైకొట్టారు. టీడీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత జనసేన పార్టీ నుంచి ఆహ్వానం అందిందని ప్రచారం జరిగినా ఆయన మాత్రం తన తదుపరి గమ్యంగా వైసీపీని ఎంచుకోవడం, ఆ పార్టీలో చేరనుండడంపై జిల్లా రాజకీయాల్లోనే కాదు.. రాష్ట్ర పాలిటిక్స్‌లోనూ చర్చనీయాంశంగా మారిందన్న టాక్ విన్పిస్తోంది.
సుగవాసి కుటుంబానికి, రాయచోటి రాజకీయాలకు..
వాస్తవానికి సుగవాసి కుటుంబానికి, రాయచోటి రాజకీయాలకు విడదీయరాని అనుబంధముంది. నాలుగు దశాబ్దాలుగా సుగవాసి కుటుంబం టీడీపీలో కొనసాగుతోంది. సీనియర్ లీడర్‌గా దివంగత నేత సుగవాసి పాలకొండ్రాయుడు టీడీపీలో కీలక పాత్ర పోషించారు. ఆయన రాజకీయ వారసుడిగా 1995 నుంచి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం పాలిటిక్స్‌లో కొనసాగుతున్నారు. ఓ బలమైన సామాజిక వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న సుగవాసి.. ఇప్పుడు పార్టీ మారటం, అది కూడా తెలుగుదేశం కూటమి అధికారంలో ఉన్న వేళ.. వైసీపీలోకి వెళ్లడం జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీ జిల్లా రాజకీయాలతో విసిగి వేసారడం, తాను ఫిర్యాదు చేసినా అధిష్టానం పెద్దగా స్పందించకపోవడం.. సుగవాసి పార్టీ మారేందుకు కారణాల్లో ఒకటని చెబుతున్నారు ఆయన మద్దతుదారులు. ఇక, టీడీపీతో సుదీర్ఘ అనుబంధం ఉన్న పాలకొండ్రాయుడు మృతి చెందిన తర్వాత కనీసం ఆయనకు నివాళులు అర్పించేందుకు సీఎం చంద్రబాబు రాకపోవడం మరో రీజనని అంటున్నారు.
వైసీపీ ఆపరేషన్ ఆకర్షే సుగవాసి పార్టీ మార్పునకు కారణమా..?
సుగవాసి పార్టీ మార్పునకు మరో కారణం కూడా విన్పిస్తోంది. అదే వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ అనే మాట. టీడీపీ కూటమి ఏపీలో అఖండ మెజార్టీతో అధికారంలోకి రావడంతో చాలాచోట్ల సమీకరణాలు మారిపోయాయి. మూడు పార్టీల నేతలు అధికారం పంచుకోవడంతో కొన్నిచోట్ల ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న వారు సర్దుకుపోవాల్సిన పరిస్థితి. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలోనే వారిలో ఉన్న అసంతృప్తిని క్యాష్ చేసుకునేందుకు వైసీపీ నాయకత్వం ప్రయత్నిస్తోందన్న వాదన విన్పిస్తోంది.
వరుస కేసుల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే..
ఇదే సమయంలో రాష్ట్రంలో అధికారం మారిన తర్వాత వైసీపీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కీలకంగా ఉన్న పలువురు నేతలు ఇప్పటికే జైలుకు వెళ్లి వచ్చారు. ఇందుకు అనుగుణంగానే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని ఆరోపిస్తోంది వైసీపీ. ఇలాంటి పరిణామాల వేళ.. ప్రజల దృష్టిని మరల్చేందుకే ఉమ్మడి కడప జిల్లాలో అసంతృప్తులకు గాలం వేసిందని మరికొందరు చెబుతున్నారు.
Also Read: బీజేపీ చెప్పేదొకటి.. చేసేదొకటి..!
సుగవాసి ఎపిసోడ్‌లో చక్రం తిప్పిన ఎంపీ మిథున్ రెడ్డి
ఈ మొత్తం వ్యవహారంలో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి చక్రం తిప్పారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వచ్చే ఎన్నికల్లో సుగవాసి రాజకీయ భవిష్యత్‌కు ఢోకా లేకుండా జగన్ దగ్గర ఒప్పందం చేసుకున్నారని చెబుతున్నారు. ఇక, టీడీపీ కేడర్ మాత్రం నియోజకవర్గంలో తమకేం ఢోకా లేదని చెబుతోంది. సుగవాసి సుబ్రహ్మణ్యంతో క్షేత్రస్థాయిలోని కార్యకర్తలు ఎవరూ వెళ్లడం లేదని అంటున్నారు నేతలు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నేతృత్వంలో పార్టీ బలంగా ఉందని చెబుతున్నారు. మొత్తంగా రాయచోటి నియోజకవర్గంలో చోటు చేసుకున్న ఈ మార్పు టీడీపీ, వైసీపీపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్నది మరికొన్ని రోజుల్లో తేలనుంది.