ISRO Chandrayaan-4 Mission: అంతరిక్ష ప్రయాణంలో భారత్ మరో మైలురాయిని దాటనుంది. భవిష్యత్ అంతరిక్ష మిషన్‌లలో గేమ్ ఛేంజర్‌గా మారనున్న చంద్రయాన్-4, లూనార్‌మిషన్, గగన్‌యాన్‌తో పాటు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో రికార్డ్‌కు సిద్ధమైంది. డిసెంబర్ 30న షార్ రేంజ్ నుండి తొలి స్పేస్ డాకింగ్ మిషన్.. స్పేస్‌ఎక్స్ ఉపగ్రహాన్ని ఇస్రో పంపుతోంది. వర్క్‌హోర్స్ లాంచ్ వెహికల్‌గా పేరున్న PSLV-C 60ని ఈ మిషన్ కోసం సిద్ధం చేశారు. శ్రీహరికోట స్పేస్‌పోర్ట్‌లోని లాంచ్ ప్యాడ్ నుండి ఈ అద్భుతాన్ని ఆవిష్కరించనున్నారు. అయితే, ఇస్రో ప్రయోగిస్తున్న ఈ డాకింగ్ టెక్నాలజీ ఏంటి..? ఇది సక్సెస్ అయితే అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో ఏ స్థాయిలో నిలుస్తుంది..?ఇస్రో అధిగమించనున్న ఈ మైలురాయి భవిష్యత్ మిషన్లకు ఎలా ఉపయోగపడుతుంది..?
గగనమే గమ్యంగా భారత్ స్పేస్ వ్యూహాల్లో స్పీడు
మనిషి సాంకేతిక విప్లవాన్ని దాటి అంతరిక్ష విప్లవంలోకి అడుగుపెట్టి దాదాపు రెండు దశాబ్ధాలు దాటింది. విశ్వాన్ని జయించడానికి ఆకాశ వీధిలో అంతులేని ప్రయాణం చేస్తున్న మనిషి.. గతంలో ఎన్నో దశలు దాటుకొని ఇక్కడకు చేరుకున్నాడు . భూమిని దాటి జాబిల్లిపై కాలుమోపడానికి శతాబ్ధాల కాలం పడితే.. ఇప్పుడు దశాబ్ధాల్లోనే అంతరిక్షంలోని సుదూర తీరాలను చూడగలుగుతున్నారు. ఇక రాబోయే కాలమంతా అంతరిక్ష మయం కాబోతుంది. ఇందులో తన స్థానాన్ని పదిలం చేసుకునే దిశగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ-ఇస్రో అడుగులు వేస్తోంది. గగనమే గమ్యంగా భారత్ స్పేస్ వ్యూహాలను స్పీడుగా రూపొందిస్తోంది.
త్వరలో చంద్రయాన్-4 కూడా ప్లాన్ చేస్తున్న ఇస్రో
చంద్రయాన్-3 సక్సెస్‌తో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఇస్రో త్వరలో చంద్రయాన్-4 కూడా ప్లాన్ చేస్తుంది. ఆ తర్వాత, 2040 నాటికి భారత అంతరిక్ష కేంద్రం స్పేస్‌లో మెరవనుంది. అమెరికా, చైనా, రష్యా వంటి అగ్రదేశాలకు పోటీగా భారత్ అంతరిక్ష పరిశోధనల్లో ముందుకు వెళుతోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఇస్రో స్పేడెక్స్ శాటిలైట్‌కు సిద్ధం అయ్యింది. దీనితో, అధునాతన టెక్నాలజీ కలిగిన ఎలైట్ త్రీ-నేషన్ క్లబ్‌లో భారతదేశం చేరనుంది. ఈ లక్ష్యం సాధించడానికి డిసెంబర్ 30న ఇస్రో మొదటి స్పేస్ డాకింగ్ ప్రయోగాన్ని ప్రారంభిస్తోంది.
డిసెంబర్ 30 రాత్రి 9:30 గం. PSLV C-60 రాకెట్ ప్రయోగం
డిసెంబర్ 30న రాత్రి 9:30 గంటలకు పీఎస్‌ఎల్‌వీ C-60 రాకెట్‌ను ప్రయోగించనుంది. ఈ ప్రయోగం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్-షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి జరగనుంది. ఈ ప్రయోగం ద్వారా 400 కిలోల బరువుతో రూపొందించిన స్పేడెక్స్ అనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్న జంట ఉపగ్రహాలను రోదసిలోకి ప్రవేశపెట్టనున్నారు. స్పేస్ డాకింగ్ అంటే, రెండు అంతరిక్ష నౌకలను ఖచ్చితంగా అనుసంధానం చేసే ప్రక్రియ. ఇది ఒక్కోసారి మనుషులతో లేదంటే మానవరహితంగా కూడా ఉంటుంది.
ఇంధనం నింపడం, టెక్నికల్ సమస్యలొస్తే రిపేర్ చేయడం..
ఈ మిషన్‌లో భాగంగా.. ఒక అంతరిక్ష నౌకకు మరో అంతరిక్ష నౌక నుండి ఇంధనం నింపడం, టెక్నికల్ సమస్యలొస్తే రిపేర్ చేయడం, అవసరమైనప్పుడు సిబ్బంది మార్పిడి వంటి క్లిష్టమైన పనుల కోసం ఒకే యూనిట్‌గా పనిచేసే వీలు కల్పిస్తుంది. ఇప్పటి వరకూ ఇలాంటి డాకింగ్ మిషన్ చేయడం అమెరికా, రష్యా, చైనాలకు మాత్రమే సాధ్యమయ్యింది. ఇప్పుడు ఈ సామర్థ్యాన్ని భారత్ కూడా సాధించబోతోంది. ఇది సక్సెస్ అయితే, ఇలాంటి మిషన్ చేసిన నాలుగో దేశంగా భారత్ నిలవనుంది.
400 కి.గ్రా. రెండు ఉపగ్రహాల పేర్లు ‘ఛేజర్’, ‘టార్గెట్’
అయితే, ఈ స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్‌లో భాగంగా.. 400 కిలోగ్రాముల రెండు ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. వీటి పేర్లు.. ‘ఛేజర్’, ‘టార్గెట్’. ఈ అంతరిక్ష డాకింగ్ ప్రయోగం కోసం హైదరాబాద్‌కు చెందిన అనంత్ టెక్నాలజీస్ ఛేజర్, టార్గెట్ ఉపగ్రహాలను ఇస్రోకు అందించింది. PSLV-C60 ద్వారా ప్రయోగించబోతున్న ఈ ఉపగ్రహాలు.. భవిష్యత్తులో నిర్వహించబోయే భారత అంతరిక్ష కేంద్రం, చంద్రయాన్ మిషన్‌లకు మార్గం సుగమం చేస్తాయని ఆశిస్తున్నారు.
దాదాపు 700 కిలోమీటర్ల ఎత్తులో డాక్ చేసే విధంగా తయారీ
ఈ కీలకమైన ఉపగ్రహాలను తయారు చేయడంలో అనంత్ టెక్నాలజీస్ నుండి 100 మందికి పైగా ఇంజనీర్లను పనిచేశారు. అలాగే, ఒకే PSLV-క్లాస్ వెహికిల్ నుండి ప్రయోగించే ఈ ఉపగ్రహాలు దాదాపు 700 కిలోమీటర్ల ఎత్తులో డాక్ చేసే విధంగా రూపొందించారు. చండీగఢ్‌లోని సెంట్రల్ సైంటిఫిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఈ మిషన్‌కు సంబంధించిన వివరాలను ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ వెల్లడించారు.
ప్రొపల్షన్ యూనిట్‌ల సాధారణ జీవితకాలం 8-10 సంవత్సరాలు
నిజానికి, ఈ జియోస్టేషనరీ ఉపగ్రహాలు చాలా ఖరీదుతో కూడుకున్నవి. ఇతర ఆన్‌బోర్డ్ సిస్టమ్‌లు పనిచేస్తున్నప్పటికీ.. ఇంధనం అయిపోయే వరకు వాటి ప్రొపల్షన్ యూనిట్‌లు 8 నుండి 10 సంవత్సరాల సాధారణ జీవితకాలంతో పనిచేశాస్తాయి. స్పేడెక్స్ మిషన్ ప్రాథమిక లక్ష్యం.. రెండెజౌస్, డాకింగ్, అన్‌డాకింగ్ కోసం అవసరమైన సాంకేతికతను అభివృద్ధి చేయడం, ప్రదర్శించడం. ఇందులో భాగంగా, లో-ఎర్త్ సర్క్యులర్ ఆర్బిట్‌లో రెండు చిన్న అంతరిక్ష నౌకలైన చేజర్, టార్గెట్‌లు పనిచేశాస్తాయి.
డాకింగ్, అన్‌డాకింగ్‌కి అవసరమైన టెక్నాలజీ అభివృద్ధి, ప్రదర్శన
ఇక, డాక్ చేసిన స్పేస్‌క్రాఫ్ట్ మధ్య విద్యుత్ శక్తి బదిలీ చేస్తాయి. ఇది అంతరిక్షంలో రోబోటిక్స్ వంటి భవిష్యత్ అప్లికేషన్‌లకు ఎంతో అవసరంగా కనిపిస్తోంది. అలాగే, ఈ మిషన్‌లో భాగంగా.. మిశ్రమ అంతరిక్ష నౌకలను నియంత్రించడం… అన్‌డాకింగ్ తర్వాత పేలోడ్ కార్యకలాపాలను కూడా పరిశీలిస్తారు. అయితే, ఈ మిషన్ సక్సెస్‌ను నిర్ధారించడానికి ఇస్రో క్లిష్టమైన అప్లికేషన్లకు సంబంధించి, తుది సమీక్ష చేస్తోంది.
డిసెంబర్ 5న పీఎస్‌ఎల్‌వీ C-59 రాకెట్ విజయవంతం
ఈ మిషన్‌కు సంబంధించి డిపెండెంట్ మిషన్లను కూడా ఉన్నాయి. డిసెంబర్ 5న పీఎస్‌ఎల్‌వీ C-59 రాకెట్‌ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఈ ప్రయోగంలో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 ఉపగ్రహాలను నిర్ధేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ విజయవంతమైన ప్రయోగం తర్వాత, ఇస్రో ప్రస్తుతం పీఎస్‌ఎల్‌వీ C-60 ప్రయోగానికి పూర్తి స్థాయిలో సిద్ధమయ్యింది. చంద్రుడి నుండి నమూనా సేకరణ కోసం ప్లాన్ చేసిన చంద్రయాన్-4.. అలాగే, ప్రతిపాదిత ఇండియన్ స్పేస్ స్టేషన్‌తో పాటు ఇస్రో చేయబోతున్న ప్రతిష్టాత్మక భవిష్యత్తు మిషన్‌లకు ఈ స్పేస్ డాకింగ్ మిషన్‌ను సక్సెస్ చేయడం చాలా కీలకంగా మారింది.
400 కి.మీ ఎత్తులో కక్ష్యలో ఉండే 52-టన్నుల ప్లాట్‌ఫామ్
ఇది మానవ సహిత సిబ్బందితో భూమికి 400 కి.మీ ఎత్తులో కక్ష్యలో ఉండే 52-టన్నుల ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేస్తుంది. ఇక, ఈ మిషన్‌తో.. ఇంటర్‌ప్లానెటరీ ఎక్స్‌ప్లోరేషన్, ఖగోళ వస్తువుల నుండి నమూనా సేకరణ, మనుషులతో కూడిన అంతరిక్ష విమానాలు, స్పేస్ స్టేషన్‌లను నిర్వహించడం వంటి సంక్లిష్టమైన అంశాలకు సంబంధించి, కీలక విషయాల్లో స్పష్టత వస్తుంది.
ఛేజర్, టార్గెట్‌లు సుమారు 220 కిలోల బరువు
స్పైడెక్స్ మిషన్‌లో PSLV-C60 నుండి ప్రయోగించే రెండు చిన్న వ్యోమనౌకలు ఛేజర్, టార్గెట్‌లు సుమారు 220 కిలోలు ఉంటాయి. స్వతంత్రంగా, ఏకకాలంలో ఈ రెండు వ్యోమ నౌకలు… 470 కి.మీ వృత్తాకార కక్ష్యలో 55° డిగ్రీల వంపులో తిరుగుతాయి. వీటి స్థానిక కాలచక్రం దాదాపు 66 రోజులు ఉంటుందని ఇస్రో వెల్లడించింది. అయితే, ప్రయోగ వాహనం నుండి విడిపోయే సమయంలో టార్గెట్, ఛేజర్‌ల మధ్య చిన్న సాపేక్ష వేగాన్ని అందించడానికి PSLV వాహనం ఖచ్చితత్వంతో పనిచేస్తుంది. ఒక రోజులో ఛేజర్‌కు సంబంధించి పెరుగుతున్న వేగం 10 నుండి 20 కి.మీ వేగతో ఇంటర్-శాటిలైట్ విడిపోడానికి టార్గెట్ అంతరిక్ష నౌకను అనుమతిస్తుంది.
రెండు సంవత్సరాల వరకు మిషన్ జీవితకాలం
ఈ సమయంలో, టార్గెట్ స్పేస్‌క్రాఫ్ట్ ప్రొపల్షన్ సిస్టమ్‌ని ఉపయోగించి టార్గెట్ మధ్య సాపేక్ష వేగం రీప్లేస్ అవుతుంది. అయితే, ఈ డ్రిఫ్ట్ అరెస్ట్ మెనీవర్ ముగింపులో, టార్గెట్, ఛేజర్ ఉపగ్రహాలు ఒకే విధమైన వేగంతో ఒకే కక్ష్యలో ఉంటాయి. చివరికి రెండు అంతరిక్ష నౌకలు డాకింగ్ అవుతాయి. ఇవి రెండూ విజయవంతగా అంతరిక్షంలోకి విడుదలైన తర్వాత, రెండు ఉపగ్రహాల మధ్య విద్యుత్ శక్తి బదిలీని అన్‌డాకింగ్ చేస్తారు. ఇక, ఇస్రో ఆశించిన విధంగా ఇవి రెండు సంవత్సరాల వరకు మిషన్ జీవితకాలంలో ఆపరేషన్‌ను నిర్వహిస్తాయి.
నాలుగు రెండెజౌస్, డాకింగ్ సెన్సార్ల సూట్
ఈ మిషన్‌లో వాడుతున్న కొత్త టెక్నాలజీని స్వదేశంలోనే రూపొందించి, కొత్త రికార్డ్ సృష్టించింది ఇస్రో. ఇందులో భాగంగా.. ఈ డాకింగ్ మిషన్‌ను ఎనేబుల్ చేయడం కోసం అభివృద్ధి చేసిన స్వదేశీ టెక్నాలజీల్లో డాకింగ్ మెకానిజం చాలా కీలకమైనది. అలాగే, నాలుగు రెండెజౌస్, డాకింగ్ సెన్సార్ల సూట్ ఉంటుంది. అదే విధంగా.. ఎలక్ట్రసిటీ ట్రాన్సఫర్ టెక్నాలజీతో.. స్వదేశీ అటానమస్ రెండెజౌస్, డాకింగ్ స్ట్రాటజీని అనుసరిస్తూ ఇస్రో ఈ మిషన్‌ను రూపొందించింది. మరోవైపు, ఈ రెండు అంతరిక్ష నౌకల మధ్య స్వయంప్రతిపత్త కమ్యూనికేషన్ కోసం ఇంటర్-శాటిలైట్ కమ్యూనికేషన్ లింక్‌ను కూడా ఇస్రో అభివృద్ధి చేసింది.
శాటిలైట్స్ స్థితిగతుల సమాచారానికి ఇన్‌బుల్ట్ ఇంటెలిజెన్స్
అలాగే, ఇతర అంతరిక్ష నౌకల స్థితిగతులను తెలుసుకోవడానికి ఇన్‌బుల్ట్ ఇంటెలిజెన్స్‌ను కూడా పొందుపరిచారు. ఇలాంటి అత్యాధునిక టెక్నాలజీతో.. స్పేడాక్ చిన్న సైజు, బరువు కారణంగా… రెండు పెద్ద వ్యోమనౌకలను డాకింగ్ చేయడంతో పోలిస్తే, మరింత ఖచ్చితత్వంతో పనిచేయడంపై కొన్ని సవాళ్లు ఉన్నాయి. అయితే, వాటిని అధిగమించడానికి ఇస్రో అని విధాలుగా రెడీ అయ్యింది. ఈ మిషన్‌తో… గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ మద్దతు లేకుండా భారత్ ప్రయోగాలు చేపట్టనుంది. ఇది, చంద్రయాన్-4 వంటి భవిష్యత్ లూనార్ మిషన్‌లకు అవసరమైన అటానమస్ డాకింగ్‌ను సాధ్యం చేయనుంది.
చంద్రుని దక్షిణ ధ్రువాన్ని తాకిన మొదటి దేశం
ఇక, ఇటీవల కాలంలో వేగంగా అభివృద్ధి చెందిన ఇస్రో కార్యకలాపాలు భారత అంతరిక్ష సామర్థ్యాలలో భారీ పురోగతికి అద్దం పడుతున్నాయి. చంద్రుని దక్షిణ ధ్రువాన్ని తాకిన మొదటి దేశంగా చరిత్ర సృష్టించడమే కాకుండా.. చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ సాధించిన నాల్గవ దేశంగా భారత్ నిలిచింది. చంద్రయాన్-3 మిషన్‌తో సాధించిన ఈ విజయాల నేపథ్యంలో భారత్ స్పేస్ డాకింగ్ మిషన్‌పై భారత్ దృష్టి సారించింది. దీనికి ముందు, అంగారక గ్రహంపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన ప్రాజెక్ట్ ‘అంగారకయాన్’. ఈ మార్స్ ఆర్బిటర్ మిషన్‌లో భాగంగా… తొమ్మిదేళ క్రితం MOM-1 రోదసిలోకి దూసుకెళ్లింది.
అంగారక గ్రహంపై ప్రయోగించిన మొట్టమొదటిసారే విజయం
ఇది మూడు వందల రోజుల పాటు.. దాదాపు 40 కోట్ల కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించి అంగారక గ్రహాన్ని చేరుకుంది. అంగారక గ్రహం చుట్టూ కొన్ని నెలల పాటు పరిభ్రమిస్తూ జీవాన్వేషణ, మార్స్ గ్రహ నిర్మాణం, ఖనిజాల మిశ్రమం తదితరాలను శోధించింది. దీనితో అంగారక గ్రహంపై ప్రయోగించిన మొట్టమొదటిసారే విజయం సాధించి మొట్టమొదటి దేశంగా భారత్ ఘనత సాధించింది. అలాగే, ఇస్రో మొదటి సారి చేపడుతున్న స్పేస్ డాకింగ్ మిషన్ కూడా సక్సెస్ అవుతుందని అంతా ఆశిస్తున్నారు.
ఇప్పటికే, అనేక దేశాలు, ప్రైవేట్ సంస్థలు అంతరిక్ష మిషన్‌ల కోసం తమ ప్రణాళికలను ప్రకటించాయి. అయితే, భారతదేశ విధానం వీటికి భిన్నంగా కనిపిస్తుంది. ఇస్రో సమగ్ర, దశలవారీ వ్యూహంతో సక్సెస్ రేటును పెంచుకోడానికి ప్రయత్నిస్తోంది. దీర్ఘకాలిక దృష్టితో రూపొందిస్తున్న ఇస్రో లక్ష్యాలతో ప్రస్తుత సామర్థ్యాలను సమన్వయం చేస్తూ పనులు ప్లాన్ చేస్తోంది. ఇస్రో ఇలాంటి కీలకమైన మైలురాళ్లను దాటే దిశగా పని చేస్తున్నందు వల్ల, నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్, అలాగే, అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌లతో సహా కీలక సాంకేతికతలను అభివృద్ధి చేయడంలో ఇస్రో ముందుకెళుతోంది. ఈ పరిణామాలు లూనార్ స్పేస్ స్టేషన్ కోసమే కాకుండా భారతదేశ విస్తృత అంతరిక్ష పరిశోధన లక్ష్యాలకు కూడా కీలకంగా మారనుంది.