AI – IT Employees: టెక్ ప్రపంచంలో.. కొత్త తుపాను మొదలైంది. అది.. వేలాది ఉద్యోగాలను ఊడ్చేస్తోంది. ఆ తుపాను పేరే.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్! ఏఐ దెబ్బకు.. ప్రపంచవ్యాప్తంగా వేలాది సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు కోతకు గురవుతున్నాయ్. ఎంతోమంది సాఫ్ట్ వేర్ ఇంజనీర్లను.. టెక్ కంపెనీలు లే-ఆఫ్స్ పేరుతో లేపేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ లాంటి టెక్ దిగ్గజాలు కూడా.. ఉద్యోగాల కోతలో ముందున్నాయి. అసలు.. ఏఐ టూల్స్ ఎఫెక్ట్.. టెక్ ఇండస్ట్రీపై ఎలా ఉంది? ఐటీ కంపెనీలు ఎందుకోసం వర్క్ ఫోర్స్‌ని తగ్గించుకోవాలనుకుంటున్నాయి? మీ జాబ్ సేఫేనా?
టెక్ కంపెనీలకు వరంగా మారిన ఏఐ
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు శాపంగా ఏఐ టూల్స్
ఒక్క ఏఐ.. మొత్తం టెక్ వరల్డ్‌లోనే రెవల్యూషన్ తీసుకొచ్చింది. ఇప్పుడు అదే ఏఐ.. టెక్ సెక్టార్‌లో పనిచేస్తున్న ఉద్యోగులను టెన్షన్ పెడుతోంది. సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, డెవలపర్లు, కోడర్ల మెడపై.. కత్తిలా వేలాడుతోంది. మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీయే.. 6 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించిందంటే.. రానురాను ఏఐ ఎఫెక్ట్ ఎలా ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా.. ఏఐతో కోడర్ల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయా? అనే క్వశ్చన్ ఆందోళన పెంచుతోంది.
వాషింగ్టన్‌లో .. 2 వేల మంది ఉద్యోగాలను తొలగించింది
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్.. టెక్ ప్రపంచాన్ని ఏలుతున్న టైమ్‌లో.. దిగ్గజ ఐటీ కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగించేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ఇటీవల ప్రకటించిన జాబ్ కట్స్‌ని చూస్తే.. ఏఐ యుగంలో సాఫ్ట్ వేర్ డెవలపర్స్ కూడా ప్రమాదంలో పడ్డారని తెలుస్తోంది. వాషింగ్టన్‌లోని మైక్రోసాఫ్ట్ హెడ్ క్వార్టర్స్‌లో.. 2 వేల మంది ఉద్యోగాలకు కోత పెట్టారు. దీనికంటే ముందే.. మైక్రోసాఫ్ట్ తన గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో 6 వేల మంది ఉద్యోగులను తగ్గించనున్నట్లు ప్రకటించింది.
డేటా సెంటర్ల నిర్మాణంలో భారీగా పెట్టుబడులు
మైక్రోసాఫ్ట్‌తో పాటు మిగతా టెక్ దిగ్గజ కంపెనీలు. ఏఐలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయ్. దాంతో.. వారు కాస్ట్ కటింగ్, బడ్జెట్‌లపై లెక్కలేసుకుంటున్నారు. ఇటీవలే.. డేటా సెంటర్ల నిర్మాణంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నందువల్ల.. మైక్రోసాఫ్ట్ ఖర్చులను తగ్గించుకోవాలని చూస్తున్నారు. ఇదే సమయంలో.. కోడ్ రాయడం, వాటిని విశ్లేషించడం, సాఫ్ట్ వేర్ డెవలప్ చేయడం లాంటి పనులన్నీ.. కొన్ని ఏఐ టూల్స్ ఆటోమేట్ చేస్తున్నాయి. ఇప్పటివరకు ఈ పనులన్నింటిని.. సాఫ్ట్ వేర్ ఇంజనీర్లే చేసేవారు. ఇప్పుడు.. మైక్రోసాఫ్ట్‌లో.. కొన్ని ప్రాజెక్టుల కోడ్‌లు.. 30 శాతం ఏఐ టూల్సే రాసేస్తున్నాయి.
సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల రిక్రూట్‌మెంట్స్ తగ్గుతాయనే అంచనా
దాంతో.. 30 శాతం మంది ఉద్యోగులతో ఇక పనేముందనే ఆలోచనలో మైక్రోసాఫ్ట్ ఉన్నట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో.. మైక్రోసాఫ్ట్‌లో భారీగా ఉద్యోగాల తొలగింపులు ఉండబోతున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయ్. ఇదొక్కటే కాదు చాలా టెక్ కంపెనీలు ఏఐపై ఫోకస్ పెట్టి.. తమ వర్క్ ఫోర్స్‌ని తగ్గించుకునే ఆలోచనతో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ఏడాది మొదట్లోనే.. సేల్స్ ఫోర్స్ వెయ్యి మందికి పైగా ఉద్యోగులను తొలగించాలనే నిర్ణయం తీసుకుంది. ఏఐ వాడకంతో.. చాలా టెక్ కంపెనీలు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల రిక్రూట్‌మెంట్స్ తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. అయితే.. ఇదే సమయంలో.. ఏఐ సెక్టార్‌లో నియామకాలు పెరుగుతాయని కూడా చెబుతున్నారు.
ఏఐని అడాప్ట్ చేసుకుంటూ.. ఉద్యోగాల్లో కోతలు పెడుతున్నాయ్
గడిచిన కొన్ని రోజుల్లో.. టెక్ ఇండస్ట్రీలో ఏఐ డ్రైవెన్ లే-ఆఫ్స్ తీవ్రమయ్యాయి. మైక్రోసాఫ్ట్ దాని గ్లోబల్ వర్క్‌ఫోర్క్‌లో దాదాపు 3 శాతం మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటిస్తుంది. ఇప్పటికే.. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల.. కంపెనీలో 30 శాతం కోడ్‌లని.. ఏఐ ద్వారానే రాస్తున్నట్లు తెలిపారు. ఏఐ సామర్థ్యాలు, ఆర్థిక అనిశ్చితుల మధ్య.. ఐటీ కంపెనీలు ఖర్చులను తగ్గించేందుకు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నాయ్. ఇదే సమయంలో.. ఇతర టెక్ కంపెనీలు కూడా ఏఐని అడాప్ట్ చేసుకుంటూ.. ఉద్యోగాల్లో కోతలు పెడుతున్నాయ్. ఈ లిస్టులో లింక్డిన్ కూడా ఉంది. క్రౌడ్ స్ట్రైక్ 5 శాతం వర్క్ ఫోర్స్‌ని తగ్గిస్తోంది. క్లార్నా కూడా తన సిబ్బందిని 40 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఓ వైపు ఏఐ డెవలపర్లకు డిమాండ్ పెరుగుతున్నప్పటికీ.. ఈ లే-ఆఫ్స్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల ఉద్యోగాలను బాగా దెబ్బతీస్తున్నాయి.
ఏఐ ఆటోమేషన్ ద్వారా.. లో-లెవెల్ ప్రోగ్రామింగ్
ఏఐ ఆటోమేషన్ ద్వారా.. లో-లెవెల్ ప్రోగ్రామింగ్, సాధారణ కోడింగ్ టాస్కులు, డీబగ్గింగ్, డాక్యుమెంటేషన్ లాంటి పనులన్నీ సులభంగా మారిపోయాయి. ఇది.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల ఉద్యోగాలపై ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి. ఏఐ.. డేటా ఎంట్రీ, బేసిక్ డేటా అనాలిసిస్ లాంటి పనుల్ని వేగంగా, తక్కువ ఖర్చుతో చేయగలదు. దీని వల్ల ఈ రంగాల్లో.. సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉద్యోగుల్ని తగ్గించుకుంటున్నాయి. ముఖ్యంగా మిడ్ లెవెల్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లపై.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ప్రభావం ఎక్కువగా ఉంది.
ఏఐ వల్ల ప్రపంచవ్యాప్తంగా 300 మిలియన్ ఉద్యోగాలపై ప్రభావం
చాలా కంపెనీలు వీళ్లని.. ఏఐతో రీప్లేసే చేసే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఏఐ టూల్స్.. సిస్టమ్స్ కాంప్లెక్స్, కోడింగ్ టాస్కులను సైతం హ్యాండిల్ చేయగల సామర్థ్యం వైపు పురోగమిస్తున్నాయి. సాఫ్ట్ వేర్ డెవలపర్ల కంటే.. ఏఐ మెరుగైన కోడ్‌ని జనరేట్ చేస్తోందని కొందరు టెక్ నిపుణులు చెబుతున్నారు. ఇది.. మిడ్-లెవెల్ రోల్స్‌పై ఒత్తిడిని పెంచుతుంది. గోల్డ్‌మన్ సాచ్స్ రిపోర్ట్ ప్రకారం.. ఏఐ వల్ల ప్రపంచవ్యాప్తంగా 300 మిలియన్ ఉద్యోగాలు ప్రభావితమవుతాయని.. వాటిలో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ప్రముఖంగా ఉంటుందని అంచనా వేశారు.
మీ జాబులు నిలబడాలంటే.. అడ్వాన్స్‌డ్ స్కిల్స్ అయినా నేర్చుకోవాల్సిందే
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్.. గ్లోబర్ జాబ్ మార్కెట్‌నే మార్చేస్తోంది. ఇంకొన్ని రోజుల్లో.. ఉద్యోగాలు దొరకడం అంత ఈజీ కాదు. ముఖ్యంగా.. ఐటీ సెక్టార్‌లో! రెగ్యులర్ సాఫ్ట్‌వేర్ జాబులన్నీ.. ఏఐ టెక్నాలజీనే చేసేస్తోంది. సో.. మీ జాబులు నిలబడాలంటే.. అడ్వాన్స్‌డ్ స్కిల్స్ అయినా నేర్చుకోవాలి.. ఏఐ టూల్స్‌పై గట్టి పట్టు అయినా ఉండాలి. లేకపోతే.. అంతే సంగతి అంటున్నారు టెక్ ఎక్స్‌పర్ట్స్. అసలు.. ఏఐ ఏయే ఉద్యోగాలపై ఎఫెక్ట్ చూపబోతోంది?
మీ ఉద్యోగం ఉంటుందా? ఊడుతుందా?
టెక్ ప్రపంచంలో.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వేగంగా మార్పులు తీసుకొస్తోంది. కొన్ని ఉద్యోగాలు.. ఏఐతో ప్రమాదంలో పడుతుండగా.. ఇంకొన్ని ఉద్యోగాలు సేఫ్‌గా ఉండొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. మానవ నైపుణ్యం, వ్యక్తిగత సేవ, ఇతర సామర్థ్యాలపై ఆధారపడే.. మీ ఉద్యోగం ఉంటుందా? ఊడుతుందా? అనేది డిసైడ్ అవుతుంది. సేల్స్, మానవ వనరుల లాంటి ఉద్యోగాలు ఏఐ ఆటోమేషన్‌కి ఎఫెక్ట్ అయ్యే చాన్స్ లేదంటున్నారు. డాక్టర్లు, నర్సులు, హెల్త్‌కేర్‌లోని ఇతర ఉద్యోగాలు సురక్షితంగా ఉంటాయని చెబుతున్నారు. అయితే.. ప్రధానంగా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌పై ఏఐ ప్రభావం ఉండే అవకాశం కనిపిస్తోంది. మూడేళ్లలో సాఫ్ట్ వేర్ డెవలపర్ల పని.. ఏఐ రాసిన కోడ్‌ని చెక్ చేయడం మీదే ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఇది.. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల రోల్‌నే మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఏఐ వాడకంతో.. ఉద్యోగాలు ఆటోమేట్ అయ్యే అవకాశం
ఏఐ వాడకం పెరుగుదలతో.. చాలా ఉద్యోగాలు ఆటోమేట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అందువల్ల.. ఉద్యోగులు తమ నైపుణ్యాలను అప్‌డేట్ చేసుకుంటే తప్ప జాబ్ సెక్యూరిటీ ఉండదంటున్నారు. అంతేకాదు.. ఏఐ టూల్స్ వాడకంతో పాటు ఆ టెక్నాలజీని బాగా అర్థం చేసుకోవాలని సూచిస్తున్నారు టెక్ నిపుణులు. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ వంటి రంగాల్లో పనిచేసేవారు.. ఏఐకి తగినట్లు మారాల్సిన అవసరం ఉంది. ఏఐ వల్ల మిలియన్లకొద్దీ ఉద్యోగాలు పోవడమే కాదు.. అంతేస్థాయిలో కొత్త ఉద్యోగాలు కూడా వస్తాయని చెబుతున్నారు. ఇందులో.. ఏఐ స్పెషలిస్ట్‌లు, మెషీన్ లెర్నింగ్ ఇంజనీర్లు, ఏఐ ఎథిక్స్ కన్సల్టెంట్లు, ఏఐ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్‌ల లాంటి రోల్స్ ఉన్నాయి. ఏఐ ఇంటిగ్రేషన్‌కు సంబంధించిన స్కిల్స్ ఉన్న ప్రొఫెషనల్స్‌కి ఇప్పుడు డిమాండ్ పెరుగుతోంది. అందువల్ల.. ఏఐ టెక్నాలజీ, డేటా సైన్స్‌లో నైపుణ్యం పెంచుకోవాలంటున్నారు. కేవలం టెక్నికల్ స్కిల్స్ మాత్రమే కాదు.. సాఫ్ట్ స్కిల్స్, అడాప్టబిలిటీ, ఏఐతో సహకరించే సామర్థ్యం కూడా ముఖ్యమని సూచిస్తున్నారు.
ఏఐ డెవలప్‌మెంట్, ఎథిక్స్, మానిటరింగ్ లాంటి రంగాల్లో
ఎప్పటికప్పుడు కొత్తగా వస్తున్న ఏఐ టూల్స్.. టెక్ ఇండస్ట్రీలో ఉద్యోగాలపై గణనీయమైన ప్రభావం చూపుతున్నాయి. ఆటోమేషన్ ద్వారా.. కొన్ని రిపిటేటివ్ టాస్క్‌లను తొలగిస్తూ.. ఉద్యోగాల కోతకు దారితీస్తున్నాయ్. కోడింగ్, డేటా ఎనలిసిస్, కస్టమర్ సపోర్ట్ లాంటి రంగాల్లో.. ఏఐ వాడకం పెరుగుతోంది. దాంతో.. ఇప్పుడున్న నైపుణ్యాల కంటే ఎక్కువ స్కిల్స్ పెంచుకుంటే తప్ప.. జాబ్‌లకు గ్యారంటీ లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు.. ఏఐ డెవలప్‌మెంట్, ఎథిక్స్, మానిటరింగ్ లాంటి రంగాల్లో.. ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. ఓ రిపోర్ట్ ప్రకారం.. టెక్ ఇండస్ట్రీలో.. లే-ఆఫ్స్‌లో ఏఐ కారణంగా ఉన్నప్పటికీ.. ఆర్థిక అనిశ్చితులు, ఓవర్ హైరింగ్ కూడా కీలకపాత్ర పోషిస్తున్నాయి. అందువల్ల.. ఇప్పుడున్న స్కిల్స్‌ని మెరుగుపరుచుకోవడంతో పాటు రీస్కిల్లింగ్ కూడా అవసరమే అంటున్నారు టెక్ నిపుణులు.
ఏఐ భర్తీ చేయలేని క్రియేటివిటీపై లీడర్‌షిప్ స్కిల్స్‌పై ఫోకస్ చేయాలి
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌ని తట్టుకొని.. టెక్ మార్కెట్‌లో నిలబడాలనుకుంటే.. మెషీన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ లాంటి డిమాండ్ ఉన్న స్కిల్స్ నేర్చుకోవాలి. ఏఐ భర్తీ చేయలేని క్రియేటివిటీ, క్రిటికల్ థింకింగ్, లీడర్‌షిప్ స్కిల్స్‌పై ఫోకస్ చేయాలి. ప్రధానంగా.. ఏఐ టూల్స్‌ని ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటే.. ప్రొడక్టివిటీ పెంచి.. జాబ్ సెక్యూరిటీని మెరుగుపరచవచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఏఐ రెగ్యులేషన్, ఎథికల్ ఇంప్లిమెంటేషన్‌లో స్కిల్స్.. డిమాండ్‌ని పెంచుతోంది. ఏఐ ఆధారిత స్టార్టప్‌లు, సొంత ప్రాజెక్టుల ద్వారా కొత్త అవకాశాలను సృష్టించుకోవచ్చు. ఏఐతో ఉద్యోగాల్లో కోత పడుతున్నప్పటికీ.. అది కొత్త రంగాల్లో ఉద్యోగాలకు డోర్ ఓపెన్ చేస్తోంది. టెక్ ఎక్స్‌పర్ట్స్ ప్రకారం.. ఏఐ వల్ల ఉద్యోగాలు తగ్గుతున్నప్పటికీ.. ఏఐ స్పెషలిస్ట్‌లు, డేటా సైంటిస్ట్‌లు, సెబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్‌లకు కొత్త అవకాశాలు వస్తున్నాయి. ఈ మార్పుల మధ్య సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు తమ స్కిల్స్‌ని అప్‌డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు.