Big Stories

IT Raids : మంత్రులే టార్గెట్ గా ఐటీ రైడ్స్.. భయపడేది లేదంటున్న టీఆర్ఎస్..

IT Raids : మొన్న గ్రానైట్ వ్యాపారులపై ఈడీ రైడ్స్ ..అప్పుడు టార్గెట్ టీఆర్ఎస్ నేతలే. నిన్న చీకోటి ప్రవీణ్ క్యాసినో కేసు ఈడీ విచారణ…టార్గెట్ గులాబీ నాయకులే.. నేడు ఐటీ దాడులు .మళ్లీ లక్ష్యం టీఆర్ఎస్ నేతలే. ఇలా వరసగా కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులకు దిగడం తెలంగాణలో పొలిటికల్ హీట్ ను మరింత పెంచింది.

- Advertisement -

టార్గెట్ మల్లారెడ్డి

- Advertisement -

తాజాగా ఐటీ రైడ్స్ లో మంత్రి మల్లారెడ్డి టార్గెట్ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. మంత్రి ఇళ్లు, విద్యాసంస్థలు, కార్యాలయాల్లో ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. కేంద్ర భద్రతా బలగాల మధ్య రికార్డులు పరిశీలన చేస్తున్నారు. మల్లారెడ్డి కుమారులు మహేంద్రరెడ్డి, భద్రారెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆదాయ పన్ను ఎగవేశారన్న ఆరోపణలు రావడంతో లెక్కలు తేల్చేందుకు 50 బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. దాడులు జరుగుతున్న సమయంలో బోయినపల్లి నివాసంలో మంత్రి మల్లారెడ్డి ఉన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఐటీ బృందాలు ఆయన సమక్షంలో సోదాలు చేపట్టాయి. ఆ సమయంలో కుటుంబ సభ్యుల ఫోన్లన్నీ ఐటీ అధికారులు తీసుకున్నారు. మంత్రి మల్లారెడ్డి కుమారులు మహేంద్రరెడ్డి, భద్రారెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఇళ్లలోనూ తనిఖీలు చేస్తున్నారు. సికింద్రాబాద్‌లోని మంత్రి మల్లారెడ్డి సోదరుడు గోపాల్ రెడ్డి ఇంట్లోనూ ఐటీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. గోపాల్ రెడ్డి CMR విద్యాసంస్థల ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. మంత్రి సమీప బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల్లో 50 చోట్ల ఏకకాలంలో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు.

గ్రానైట్ వ్యాపారులే లక్ష్యం
కొన్ని రోజుల క్రితం గ్రానైట్ వ్యాపారులపై ఈడీ రైడ్స్ జరిగాయి. అప్పుడు ఈడీ అధికారులు మంత్రి గంగుల కమలాకర్ ను టార్గెట్ చేశారు. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రకు సంబంధించిన గ్రానైట్ కంపెనీల్లో తనిఖీలు చేశారు. కేంద్రం పథకం ప్రకారం టీఆర్ఎస్ నేతలను లక్ష్యంగా చేసుకుంటోందని ఆ దాడుల సమయంలో గులాబీ నేతలు ఆరోపించారు.

మళ్లీ తెరపైకి క్యాసినో కేసు
క్యాసినో కేసును 3 నెలల తర్వాత ఈడీ మళ్లీ తెరపైకి తెచ్చింది. ఈ కేసులోనూ ఈడీ మళ్లీ టీఆర్ఎస్ నేతలనే టార్గెట్ చేసింది. మంత్రి తలసాని సోదరులు మహేష్ , ధరేంద్ర యాదవ్ ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఆ తర్వాత రోజు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్. రమణను విచారించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పీఏ హరీష్ ను ప్రశ్నించారు.

టీఆర్ఎస్ అత్యవసర భేటీ
మంత్రి మల్లారెడ్డి టార్గెట్ గా ఐటీ రైడ్స్ జరగడంతో తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు అత్యవసరంగా భేటీ అయ్యారు. ఈ సమావేశానికి హోంమంత్రి మహమూద్ అలీ, హైదరాబాద్ కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. మరోవైపు మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ దాడులపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. తాటాకు చప్పుళ్లకు భయపడబోమన్నారు. ప్రజల మన్ననలు పొందేలా ప్రభుత్వాలు వ్యవహరించాలన్నారు. తమను కేంద్ర ప్రభుత్వ సంస్థలు టార్గెట్ చేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలకు గమనిస్తున్నారన్నారు. వారం రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న దాడులను కక్షపూరిత దాడులుగా పేర్కొన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News