Jagadish Reddy on 22A Lands:బిగ్ టీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘స్ట్రైట్ టాక్’ కార్యక్రమంలో పాల్గొన్న సూర్యపేట ఎమ్మెల్యే, మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాలపై తనదైన శైలిలో మండిపడ్డారు.
మార్పిడి వెనుక పెద్ద ఎత్తున అవినీతి
రాష్ట్రంలో నిషేధిత జాబితాలో ఉన్న విలువైన భూముల మార్పిడి వెనుక పెద్ద ఎత్తున అవినీతి,అక్రమాలు ,అలాగే అధికారాన్ని అడ్డం పెట్టుకుని నిధుల మళ్లింపు భారీగా జరుగుతోందని జగదీశ్వర్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు లేదా బినామీలకు అనుకూలంగా మారుస్తూ, వేల కోట్లలలో బిజినెస్ పరంగా లాభాలు పొందుతున్నారని మండిపడ్డారు.ముఖ్యంగా రేవంత్ రెడ్డి పాలనలో ల్యాండ్, సాండ్, కాంట్రాక్టుల కేటాయింపుల్లో పారదర్శకత పూర్తిగా లోపించిందని, కమిషన్ల కోసమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పని చేస్తుందని తీవ్రంగా విమర్శలు చేశారు.
అధికారంలోకి వచ్చాక అసలు ఏం చేస్తున్నారు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దామరచర్ల పవర్ ప్లాంట్, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులపై చేసిన ఆరోపణలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ప్రతి చిన్న కాంట్రాక్టులోనూ, బూడిద (యాష్) డిస్పోజల్ వ్యవహారంలోనూ అవినీతి జరుగుతోందని అప్పట్లో మాట్లాడిన నాయకులు, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అసలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజలకి మంచి చేయడమే లక్ష్యంగా కష్టపడి పనిచేసి విద్యుత్ కొరత లేకుండా చూశామని గుర్తుచేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ పర్యవేక్షణలో తెలంగాణను విద్యుత్ రహిత కోతలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దామని, రైతులు, విద్యుత్ వినియోగదారులు ఏనాడూ ఇబ్బంది పడకుండా ప్రణాళికాబద్ధంగా ప్లాంట్లను నిర్మించామని తెలిపారు.
వారి వారి స్వార్థ ప్రయోజనాల కోసమే
అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగూడెం, భూపాలపల్లి, మనుగూరు లాంటి కీలక విద్యుత్ ప్రాజెక్టులను, పవర్ ప్లాంట్ పనులను కావాలనే నిలిపివేస్తూ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి రంగాన్ని దెబ్బతీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బొగ్గు లభ్యత, సింగరేణి సహకారం సమృద్ధిగా ఉన్నప్పటికీ కావాలనే ప్రాజెక్టులను కావాలనే నిర్లక్ష్యం చేయడం వెనుక పెద్ద ఎత్తున వారి వారి స్వార్థ ప్రయోజనాలు దాగి ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు.
కడుపులను నింపుకోవడానికే ప్రాధాన్యం
అభివృద్ధి పేరుతో నాటకాలు ఆడుతూ ప్రజలను, పర్యావరణ వ్యవస్థను కాంగ్రెస్ నాయకులు మభ్యపెడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో ప్రజల కడుపు నింపేలా సంక్షేమ పథకాలు, నిరంతర విద్యుత్, తాగు-సాగు నీరు అందిస్తే నేటి ప్రభుత్వం తమ సొంత ఖాతాలను, కడుపులను నింపుకోవడానికే ప్రాధాన్యం ఇస్తోందని దుయ్యబట్టారు.
also read :ప్రజల భూముల విషయంలో ఇదేం పద్ధతి? 22Aపై జగదీశ్ రెడ్డి
22A భూముల అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని, ప్రజా ఆస్తులను లూటీ చేయడానికి చూస్తే బీఆర్ఎస్ ఊరుకోదని ఈ సందర్భంగా జగదీశ్వర్ రెడ్డి హెచ్చరించారు.