Guntur West YSRCP President: ఎన్నికలలో ఓడిపోయినా పక్క జిల్లాలో పార్టీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్నా తన కంటూ నియోజకవర్గం లేదని తీవ్ర అసంతృప్తితో కనిపించారు… దాంతో గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి జిల్లా పార్టీ అధ్యక్షుడి హోదాలో తనని తానే ఇన్చార్జ్‌గా ప్రకటించుకున్నారు. ఆ సెగ్మెంట్లో గత్యంతరం లేకుండా పోయిన వైసీపీ అధిష్టానం కూడా ఆయన్నే ఇన్చార్జ్‌గా ప్రకటించాల్సి వచ్చిందంట.
ఎట్టకేలకు గుంటూరు వెస్ట్‌కి ఇన్చార్జ్‌ని ప్రకటించిన జగన్
చాలా రోజులుగా వైసీపీ శ్రేణులు ఆసక్తిగా వేచిచూస్తున్న గుంటూరు వెస్ట్ నియోజకవర్గం పార్టీ ఇన్చార్జ్‌ని జగన్ ఎట్టకేలకు భర్తీ చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుని గుంటూరు వెస్ట్ నియోజక వర్గ వైసీపీ ఇన్చార్జ్‌గా నియమించారు. గత కొన్ని రోజులుగా వెస్ట్ నియోజకవర్గానికి తానే ఇన్చార్జ్‌నని చెప్పుకుంటున్న అంబటికి పార్టీ అధ్యక్షుడి ప్రకటన ఆనందాన్ని ఇచ్చిందంట. 2019 ఎన్నికల్లో పల్నాడు జిల్లా సత్తెనపల్లె నుండి పోటీ చేసిన అంబటి రాంబాబు తాను పర్మినెంట్ గా నియోజకవర్గంలో ఉంటానని ప్రచారం చేసుకున్నఅంబటి రాంబాబు విజయం సాధించి , మంత్రిగానూ పనిచేశారు. అప్పట్లో ఆయనపై పలు ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఓటమి తర్వాత సత్తెనపల్లి వైపు చూడని మాజీ మంత్రి
సత్తెనపల్లి నియోజకవర్గాన్ని వైసీపీ కంచుకోటగా మారుస్తానని చెప్పిన అంబటి 2024 ఎన్నికలలో ఘోర పరాజయం తర్వాత ఎన్నికల కౌంటింగ్ రోజు బయట పెట్టిన కాలుని తిరిగి సెగ్మెంట్లో మోపలేదు. తిరిగి సత్తెనపల్లి నుంచి పోటీకి ఆయన ఇష్టపడలేదన్న ప్రచారం నడిచింది. ఆ ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి విడదల రజినీని తర్వాత జగన్ తిరిగి చిలకలూరిపేట ఇన్చార్జ్‌గా పంపారు. అంబటిని ఏకంగా జిల్లా మార్చేసి గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమించారు. దాంతో అంబటి రాంబాబు గుంటూరు జిల్లా రాజకీయాలలోకి అడుగుపెట్టారు.
అంబటి విషయంలో ఎట్టకేలకు నిర్ణయం తీసుకున్న జగన్
ఆ రోజు నుండి జిల్లాలో తనదైన శైలిలో రాజకీయాలు చేస్తున్నారు అంబటి. కూటమి ప్రబుత్వంపై తనదైన శైలిలలో విమర్శలు చేస్తూ, జిల్లా నేతలను సమన్వయం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్న అంబటిని వెస్ట్ నియోజకవర్గ ఇన్చార్జ్ గా నియమించేందుకు జగన్ అనేక తర్జనభర్జనలు పడి ఎట్టేకేలకు నియమించారు. వెస్ట్ ఇన్చార్జ్ గా అంబటి నియామకానికి నియోజకవర్గంలోని కొందరు నేతలు తీవ్ర వ్యతిరేకించారంట. అనుకూలమైన ప్రాంతంలో గెలవలేని అంబటి రాంబాబుని టీడీపీ కంచుకోట అయిన గుంటూరు వెస్ట్ ఇన్చార్జ్‌గా నియమించడం సరికాదని నేతలు తాడేపల్లికి వర్తమానాలు పంపారట. గతంలో పనిచేసిని నేతలకి ఇవ్వాలని జగన్ ముందు ప్రతిపాదనలు పెట్టారంట. ఆ క్రమంలో గుంటూరు వెస్ట్ సెగ్మెంట్ వైసీపీకి ఆరు నెలల పాటు ఇన్చార్జ్ లేకుండానే గడిచిపోయింది.
Also Read: పదవుల కోసం పైరవీలు.. టీడీపీలో పంచాయితీ
1989లో తొలిసారి రేపల్లే నుంచి గెలిచిన అంబటి
అంబటి రాంబాబు చివరికి తనకి తానే గుంటూరు వెస్ట్ ఇన్చార్జ్‌గా ప్రకటించుకుని ప్రచారం చేసుకున్నారు. ఆ నియోజకవర్గంలో నమ్మకమైన మరో నేత అధినేత జగన్‌కి లేకపోవడంతో చివరికి ఆయనకే బాధ్యతలు అప్పగించారంట. 1989లో తొలిసారి కాంగ్రెస్ నుంచి రేపల్లె ఎమ్మెల్యేగా గెలిచిన అంబటి రాంబాబు.. తర్వాత 30 ఏళ్లకు 2019లో సత్తెనపల్లి నుంచి పోటీ చేసి వైసీపీ వైసీపీ నుంచి రెండో సారి ఎమ్మెల్యే అయ్యారు. మరిప్పుడు ఏరికోరి గుంటూరు వెస్ట్ ఇన్చార్జ్ బాధ్యతలు దక్కించుకున్న ఆయన లక్ ఎలా ఉంటుందో చూడాలి.