సుగంధ ద్రవ్యాలలో ఏలకులు ముఖ్యమైనవి, ఖరీదైనవి కూడా. ప్రతిరోజూ ఒక పచ్చి యాలకులు తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. ఒక వారం రోజులు పాటు ఆకుపచ్చని యాలకులు రోజుకొకటి నమిలి చూడండి. మీకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. స్వీట్లు, బిర్యానీ, రుచిని పెంచే మసాలా గానే పచ్చి యాలకులను భావించకండి. ఆయుర్వేదంలో ఇది ఔషధం కన్నా ఎక్కువ. ప్రతిరోజు 1 లేదా 2 ఏలకుల తినడం వల్ల మీరు ఊహించని ప్రయోజనాలు ఎన్నో దక్కుతాయి.
కేవలం 7 రోజులపాటు రోజుకు ఒక పచ్చి యాలక లేదా రెండు పచ్చి యాలకులు తినేందుకు ప్రయత్నించండి. మీ జీర్ణక్రియ రక్తపోటు చర్మ సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది. చర్మం మెరవడం ప్రారంభమవుతుంది.
జీర్ణక్రియకు
ఆకుపచ్చని యాలకులలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అలాగే ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి. ఇవి మీ జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. వారం రోజులు పాటు పచ్చి యాలకులను ప్రతిరోజు తినడం వల్ల గ్యాస్, అజీర్ణం, అసిడిటీ వంటి సమస్యల నుంచి మీరు బయటపడవచ్చు.
నోటి దుర్వాసన
నోటి దుర్వాసన సమస్యతో బాధపడే వారి సంఖ్య కూడా ఎక్కువే. అలాంటివారు డెంటిస్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. పచ్చి యాలకులను ప్రతిరోజు నమిలితే చాలు… ఇది సహజమైన మౌతో ఫ్రెషనర్ లాగా ఉపయోగపడతాయి. వీటిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా ఎక్కువ. కాబట్టి నోటిలోని బ్యాక్టీరియాని తొలగించి శ్వాస తాజాగా ఉండేలా చేస్తాయి.
అధికరక్తపోటు
అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు ప్రతిరోజు యాలకులు తింటే ఎంతో మంచిది. ఎందుకంటే యాలకులలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది తిన్న తర్వాత శరీరంలో సోడియం స్థాయిలను సమతుల్యం చేసేందుకు ఎంతో సహాయపడుతుంది. పచ్చి యాలకులు రోజు తినేవారిలో అధిక రక్తపోటు అదుపులో ఉండడం ఖాయం.
చర్మం మెరుపుకు
చర్మం మెరవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దీనికోసం మీరు బ్యూటీ సెలూన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. పచ్చి యాలకులను రోజు తినేందుకు ప్రయత్నించండి. ఇది చర్మం నుండి విషాన్ని తొలగిస్తుంది. ఎందుకంటే వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వారం రోజులపాటు ప్రతిరోజు పచ్చి యాలకులను తినడం వల్ల చర్మానికి సహజమైన మెరుపు వస్తుంది. మొటిమలు, మచ్చలు వంటి సమస్యలు చాలా వరకు తగ్గుతాయి.
పచ్చి యాలకుల సువాసన పీలిస్తే చాలు ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది నాడీ వ్యవస్థను ప్రశాంతంగా ఉంచుతుంది. మానసిక స్థితిని ఉత్తమంగా ఉంచేందుకు ప్రయత్నిస్తుంది. నిద్ర బాగా పట్టేలా చేస్తుంది. మానసిక ఒత్తిడి తగ్గించేందుకు పచ్చి యాలకులు ఎంతగానో ఉపయోగపడతాయి. గుండె ఆరోగ్యానికి కూడా యాలకులు మంచివి. ఇవి కొలెస్ట్రాల్ ను తగ్గించి రక్తప్రసరణ సవ్యంగా జరిగేలా చేస్తాయి. ప్రతిరోజు ఉదయం లేచాక ఖాళీ పొట్టతోనే ఒకటి లేదా రెండు ఆకుపచ్చని యాలకులు నమలండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటిని తాగేయండి. అయితే అధికంగా తినవద్దు. రోజుకి రెండు కంటే ఎక్కువ తినకపోవడమే మంచిది.