Dams in Danger: జీవనానికి అవే ఆధారం. నీళ్లతోనే మనిషికి మనుగడ. తాగు, సాగు నీరు అందించే ప్రాజెక్టులు చాలా కీలకం. మరి అలాంటి ప్రాజెక్టుల్ని నిర్లక్ష్యం చేస్తే.. ఏళ్లకేళ్లు పట్టించుకోకపోతే పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ చూసినా అదే కథ అన్నట్లుగా ఉంది. ఇటు జూరాల, అటు మంజీర, ఇంకోవైపు శ్రీశైలం, తుంగభద్ర అన్నిట్లోనూ సేమ్ సీన్లు. లోపం ఎక్కడుంది? ఇరిగేషన్ శాఖలు చేస్తున్నదేంటి? జూరాల డ్యాం ప్రెజంట్ కండీషన్ ఏంటి?
జూరాల నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలే
కృష్ణా నదిపై తెలంగాణలో మొదటి ప్రాజెక్టు జూరాల. ఈ ప్రాజెక్ట్ నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలే అయినా.. ఏటా దాదాపు వెయ్యి టీఎంసీల వరద ఈ ప్రాజెక్టు గేట్లు దాటి దిగువకు వెళ్తుంది. కృష్ణా నదికి ఏ చిన్న వరద వచ్చినా ఈ డ్యాం త్వరగా నిండుతుంది. గేట్లు ఎత్తాల్సిందే. మిగితా ప్రాజెక్టులతో పోలిస్తే గేట్లు ఎత్తడం, మూసేయడం జూరాలలో చాలా కామన్. అదే శ్రీశైలం, నాగార్జునసాగర్ ఎప్పుడోగానీ గేట్లు ఎత్తరు. మరి జూరాలలో అలా కాదు. మరి ఇంతటి కీలకమైన ఈ ప్రాజెక్ట్ నిర్వహణ ఎలా ఉండాలి? గేట్ల విషయంలో ఎంత పకడ్బందీగా, ఎంత ముందు జాగ్రత్తతో ఉండాలి?
ఆఫీసర్లకు నీళ్లు నిండినప్పుడే ప్రాజెక్టులు గుర్తొస్తే ఎలా?
జూరాలపై గేట్లు తెరవడానికి, మూయడానికి గ్యాంటీ క్రేన్ ఏర్పాటు చేశారు. ఈ క్రేన్‌ను నడిపించే కరెంట్ మోటార్ కు అంత కెపాసిటీ లేదు. క్రేన్ ట్రాక్ కూడా సరిగా లేక మోటార్ పైనే లోడ్ పడుతోంది. నాలుగురోజులకోసారి కాలిపోతోంది కూడా. ఇదీ సిచ్యువేషన్. ఎవరికైనా నీళ్లు నిండినప్పుడే ప్రాజెక్టులు గుర్తుకొస్తాయి. చూసేందుకు జనాలు వెళ్తారు. కానీ ఇరిగేషన్ శాఖకు నీళ్లు ఉన్నా లేకపోయినా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు చేయాల్సిన మెయింటెనెన్స్ పై ఫోకస్ పెట్టాలి. కానీ అదే జరగడం లేదు. జూరాల ప్రాజెక్టులోని మొత్తం క్రస్ట్‌గేట్లకు రబ్బర్ సీల్స్, రోప్స్, పెయింటింగ్, సాండ్ బ్లాస్టింగ్, గేట్ల బలోపేతం వంటి రిపేర్ల కోసం 2022లో అప్పటి ప్రభుత్వం 11 కోట్లు విడుదల చేసింది. అయితే నాటి నుంచి కేవలం 23శాతం పనులను మాత్రమే పూర్తయ్యాయి.
9, 12వ నెం. గేట్ల రోప్‌లు తెగిపోయాయన్న ప్రచారం
పాలమూరు జిల్లా వరప్రదాయినిగా నిలుస్తూ ప్రత్యక్షంగా పరోక్షంగా 7 లక్షలకు పైగా ఎకరాలకు నీళ్లందిస్తున్న జూరాల రిపేర్లు ఏళ్లతరబడి అలాగే ఉండిపోయాయి. ఇప్పుడది పీక్ కు వెళ్లింది. 9వ, 12వ నంబర్ గేట్ల రోప్‌లు తెగిపోయాయన్న ప్రచారం జరిగింది. అయితే అది రిపేర్లలో భాగమే అని అక్కడి ఇరిగేషన్ ఇంజినీర్లు చెబుతున్న మాట. జూరాల ప్రాజెక్టులో మొత్తం 62 గేట్లు ఉన్నాయి. రబ్బర్ సీల్స్ ఊడి లీకేజీలు జరగడం, గ్రీసింగ్ లేకపోవడంతో రోప్‌లు తుప్పు పట్టడం, ఏటా పూర్తి స్థాయిలో మెయింటెనెన్స్ లేకపోవడం ఇలా చాలా కారణాలతో క్రస్ట్ గేట్లకు రెగ్యులర్ గా రిపేర్లు వస్తున్నాయి.
ఈ ఏడాది 8, 12, 19, 27, 28, 41, 45, 51 గేట్ల రోప్‌లు మార్చే పనులు
ఈ ఏడాది 8, 12, 19, 27, 28, 41, 45, 51 గేట్ల రోప్‌లను మార్చాలని నిర్ణయించి వర్క్స్ మొదలు పెట్టారు. అయితే గేట్ల రిపేర్లకు వాడే గ్యాంటీ క్రేన్ కూడా రిపేర్లలో ఉండడంతో రెండు నెలలుగా 28, 41, 45, 51వ నంబర్ గేట్లకు మాత్రమే కొత్త రోప్‌లను అమర్చారు. మిగిలిన వాటికి బిగిద్దామనుకునేలోపే కృష్ణా పరివాహక ప్రాంతాల్లో కురిసిన వానలతో ముందుగానే ప్రాజెక్టులోకి వరద వచ్చింది. దీంతో పనులకు బ్రేక్ పడింది.
2019లోనే వెలుగులోకి గేట్లకు తుప్పు పట్టిన విషయం
ప్రాజెక్టు గేట్లు తుప్పు పట్టిన విషయం 2019లోనే వెలుగులోకి వచ్చింది. కొన్ని గేట్ల నుంచి లీకేజీలు కూడా అయ్యాయి. 2021లోనూ లీకేజీలు పెద్ద ఎత్తున కనిపించాయి. రిపేర్ల కోసం 19 కోట్లతో 2018లో ప్రతిపాదనలు పెట్టారు. 2019, 2020లోనూ ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరినా నిధులు రాలేదు. సో గత ప్రభుత్వం జూరాల మెయింటెనెన్స్ అస్సలు చేయలేదన్న విషయం చుట్టూ వాద ప్రతివాదాలు నడుస్తున్నాయి. సో ప్రస్తుతం ఎనిమిది గేట్ల ఇనుప రోప్‌లు, 18 గేట్ల రబ్బర్ సీళ్లు దెబ్బతినడంతో లీకేజీలు ఏర్పడ్డాయి. జూరాల ప్రాజెక్టు చరిత్రలో అన్ని గేట్లకు సంబంధించి పూర్తిస్థాయిలో రిపేర్లు చేసేందుకు 2022లో 11 కోట్లు రిలీజ్ చేసినా పనులు పూర్తి చేయించే విషయంలో మాత్రం గత ప్రభుత్వం వెనుకబడిదంటున్నారు.
జూరాల గేట్లు ఎత్తడంతో రోప్ ల వ్యవహారం వైరల్
మొన్నటికి మొన్న 98 వేల క్యూసెక్కుల నీరు జూరాల రాగా 12 గేట్లను ఎత్తి కిందికి వదిలారు. అదే సమయంలో ఈ రోప్ ల వ్యవహారం వైరల్ గా మారింది. 2009 మాదిరి జూరాలకు భారీ వరద వస్తే దెబ్బతిన్న గేట్లు కొట్టుకుపోయే ప్రమాదం ఉందన్న ఆందోళన పెరుగుతోంది. జూరాల ప్రాజెక్టును 1995లో 550 కోట్ల రూపాయలతో నిర్మించారు. దీని పొడవు కిలోమీటర్. మొత్తం రాతికట్టడమే. మొత్తం 62 రేడియల్ క్రస్ట్ గేట్లు, 84 బ్లాకులతో నిర్మాణం చేశారు. జూరాలకున్న మరో సమస్య ఏంటంటే.. ఈ వంతెన మీదుగా భారీ వెహికిల్స్ తిరుగుతుంటాయి. ఆనకట్ట సేఫ్టీ కోసం వాహనాలు తిరిగేందుకు మరో బ్రిడ్జి నిర్మించాలని ఎన్డీఎస్‌ఏ నిపుణులు గతేడాది సూచించారు. అది కూడా ఫైల్ దాటడం లేదు.
జూరాల నిర్వహణపై అధికార, విపక్షాల వాదన ప్రతివాదనలు
రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టు మెకానికల్ పనులు చేసే ప్రైవేట్ ఏజెన్సీలు తక్కువగా ఉన్నాయంటున్నారు ప్రాజెక్టు ఎస్ఈ. ఈ కారణంతోనే నాలుగేళ్ల కిందట జూరాల రిపేర్లకు నిధులు మంజూరైనా కాంట్రాక్టు ఏజెన్సీ పనులు పూర్తి చేయడంలో ఆలస్యమైందని, అయితే ప్రాజెక్టుకు 10 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా ప్రమాదమేం లేదంటున్నారు ఎస్ఈ. మరోవైపు జూరాల నిర్వహణపై పొలిటికల్ గానూ వాద ప్రతివాదాలు వేడెక్కుతున్నాయి. జూరాల ప్రాజెక్టులోని గేట్ల రోప్‌లు తెగిపోవడం కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యానికి నిదర్శనమని కేటీఆర్ విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డికి ప్రాజెక్టు నిర్వహణ రాకపోవడం వల్లే.. జూరాల ప్రాజెక్టు ప్రమాదంలో పడిందన్నారు. మరోవైపు కాంగ్రెస్ కూడా కౌంటర్లు పెంచుతోంది. 2019 నుంచి లీకేజీలు వస్తే.. పనులు స్పీడ్ గా చేయించకుండా ఇప్పుడు విమర్శలు ఏంటని కాంగ్రెస్ ఫైర్ అవుతోంది.
అటు మంజీర, శ్రీశైలం, తుంగభద్ర అన్నిట్లోనూ ఇవే సీన్లు
అటు మంజీర, శ్రీశైలం, తుంగభద్ర అన్నిట్లోనూ ఇవే సీన్లు కనిపిస్తున్నాయి. NDSA ఇటీవల అన్ని ప్రాజెక్టులను విజిట్ చేసి డిటైల్డ్ రిపోర్ట్స్ ఇచ్చాయి. వెంటనే చేపట్టాల్సిన పనులపై అలర్ట్ చేశాయి. నిజానికి ప్రాజెక్టుల ఇంజినీర్లు, ఇరిగేషన్ ఆఫీసర్లు ఇవన్నీ చూసుకోవాలి. ప్రభుత్వాల నుంచి నిధులు తెచ్చుకోవాలి. కానీ డ్యాములు నిండినప్పుడే, గేట్లు తెరిచేటప్పుడే కళ్లు తెరుస్తామంటే కుదురుతుందా అన్న వాదన వినిపిస్తోంది. పైగా ప్రాజెక్టుల రిపేర్లు అంటే ఒకటి రెండు రోజుల్లో అయ్యేవి కూడా కాదు.
మంజీర జలాశయానికి పొంచి ఉన్న ముప్పు
ఇది మంజీర జలాశయం. హైదరాబాద్ జంటనగరాలతో సమీప గ్రామాలకు తాగునీటిని బ్యారేజీ ఇది. దీనికి వెంటనే రిపేర్లు చేయకపోతే ముప్పు తప్పదని, ప్రస్తుత పరిస్థితుల్లో బ్యారేజీలో పూర్తిస్థాయిలో నీటి నిల్వ ఏ మాత్రం సేఫ్ కాదని SDSO చెప్పింది. మార్చి 22న బ్యారేజీని పరిశీలించి రిపోర్ట్ ఇచ్చింది. బ్యారేజీ నిర్వహణ, పర్యవేక్షణ లోపాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పియర్లకు పగుళ్లు వచ్చాయని గుర్తించింది. తుమ్మ చెట్లు పెరిగిపోవడంతో మట్టికట్ట బలహీనమైందని, ఏళ్ల తరబడి రిపేర్లు చేయకపోవడంతో గేట్లు, స్పిల్ వేలోని కొంత భాగం సైతం దెబ్బతిందన్నది. రోజూ 10 కోట్ల గ్యాలన్ల నీరు అందించే ఈ బ్యారేజీ హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ నిర్వహణలో ఉంది. నీళ్లు తరలించుకు వెళ్లడమే గానీ.. దీన్ని పట్టించుకోవాల్సిన పనులు మాత్రం చేయలేకపోయారు ఆఫీసర్లు.
మార్చి 22న బ్యారేజీని పరిశీలించిన SDSO
మంజీరా గేట్ల నుంచి నీళ్లు రిలీజ్ అవగానే.. రక్షణగా దిగువన ఉండే కాంక్రీట్ నిర్మాణం కొట్టుకుపోయిందని SDSO పరిశీలనలో తేలింది. కాంక్రీట్ కొట్టుకుపోవడంతో బ్యారేజీ దిగువన భారీ గుంతలు ఏర్పడ్డాయి. శ్రీశైలంలో కూడా ఇదే ఫ్లంజ్ పూల్ కంప్లైంట్ ఉంది. కాళేశ్వరం తరహాలోనే మంజీరా బ్యారేజీ ఆప్రాన్ కొట్టుకుపోవడం ఆందోళన కలిగించే విషయం. బ్యారేజీ కెపాసిటీకి మించిన వరద ఒత్తిడితోనే పియర్లకు పగుళ్లు వచ్చినట్టు గుర్తించారు. ఇది రాతి ఆనకట్ట కావడంతో ఉక్కు, కాంక్రీట్‌తో నిర్మించిన దృఢత్వం ఉండదు. పైగా తాగునీటి అవసరాల కోసం మంజీర బ్యారేజీలో ఏడాది పొడవునా నీటిని నిల్వ చేస్తుండడంతో కట్టపై ఒత్తిడి ఉంటోంది.
మంజీరా జలాశయంలో 700 వరకు మొసళ్లు
మరి ఇలాంటి డాంను ఎలా మెయింటేన్ చేయాలి. కానీ అదే జరగలేదు. గేట్ల సీలింగ్ సరిగ్గా లేదని, భారీగా లీకేజీలు కనిపిస్తున్నాయని రిపోర్ట్ తెలిపింది. ఒకవైపు రిపేర్లు.. ఇంకోవైపు మంజీరా జలాశయంలో 700 వరకు మొసళ్లు ఉన్నాయి. వాటితోనూ నీటి కాలుష్యం జరుగుతోంది. బ్యారేజీ మెయింటెనెన్స్ పనులకు మొసళ్లు కూడా ఆటకంగా మారుతున్నాయి. మొసళ్లను ప్రాజెక్టు నుంచి తరలించాలని SDSO అంటోంది.
శ్రీశైలం డ్యాంలో తీరని ప్లంజ్ పూల్ సమస్య
ఇప్పుడు శ్రీశైలం విషయం చూద్దాం. ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి వరద కంటిన్యూ అవుతోంది. క్రమంగా నీటిమట్టం పెరుగుతోంది. పెరిగితే మంచిదే కదా అనుకుంటున్నారా. అయితే శ్రీశైలం డ్యామ్ లోనూ ప్రమాదాలు పొంచే ఉన్నాయి. ప్లంజ్ పూల్ సమస్య తీరలేదు. ఈ వానాకాలం సీజన్ ను డ్యాం ఎలా ఎదుర్కొంటుందన్నది క్వశ్చన్ మార్క్ గానే మారింది. రిపేర్ల కోసం చేసిన స్టడీస్ లో ఆందోళనకర విషయాలు బయటికొచ్చాయి. డ్యాం వద్ద అంచనాలకు మించిన నష్టం జరిగినట్లు గుర్తించారు. దెబ్బతిన్న భాగాలు ఎక్కువగా నీటిలోపల ఉండటంతో వాటి ఎఫెక్ట్ అంతగా బయటకు కనిపించడం లేదు. డ్యాం ముందు ఫ్లంజ్ పూల్ 143 అడుగుల లోతు ఉన్నట్లు గుర్తించారు.
ఇప్పటికే జరుగుతున్న రూ. 2 కోట్ల పనులు
ఏప్రాన్‌తో పాటు అక్కడికి వెళ్లే రూట్ కూడా దెబ్బతిన్నది. ఐఐటీడీఎం ఆధ్వర్యంలో డ్యాం ప్లంజ్‌పూల్‌ను అండర్ వాటర్ డ్రోన్‌తో పరిశీలించారు. డ్రోన్‌ను ఆరు మీటర్ల లోతుకు పంపించి, ప్లంజ్‌పూల్ అంతర్భాగం ఫొటోలు, వీడియోలు తీశారు. పూల్ గొయ్యి అంచులన్నీ బాగా దెబ్బతిన్నట్లు, పగుళ్లు వచ్చినట్లు గుర్తించారు. సిలిండర్లు ధ్వంసమైనట్లు తేలింది. పుణేలోని సీడబ్ల్యూపీఆర్‌ఎస్ టీమ్ ఇటీవల శ్రీశైలానికి వచ్చి మూడు రోజులు స్టడీ చేసింది. విశాఖ నుంచి వచ్చిన అండర్ వాటర్ వీడియోగ్రఫీ నిపుణులు ప్లంజ్‌పూల్‌తో పాటు ప్రాజెక్టు దగ్గర నీళ్లలో మునిగిన పలు భాగాలను వీడియో తీశారు. వారిచ్చిన రిపోర్ట్ ప్రకారం కొంత వరకు రిపేర్లు పూర్తయ్యాయి. ఇప్పటికే 2 కోట్ల పనులు జరుగుతుండగా, మరో 12 కోట్ల విలువైన పనులు చేయనుంది. వరద వస్తే మాత్రం పనులు ఆగిపోతాయి.
2020 నుంచే శ్రీశైలంలో మొదలైన సమస్యలు
శ్రీశైలం డ్యాంలో 62 సిలిండర్లకుగానూ 12 పూర్తిగా దెబ్బతినగా, మరో 8 పాక్షికంగా పాడైనట్లు 2020లోనే బయటపడింది. వీటి రిపేర్లకు గత వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదంటున్నారు. శ్రీశైలం డ్యాంకు అత్యవసర రిపేర్లు చేయాల్సి వచ్చినప్పుడు అధికారులు ఈ కేబుల్ వేను వాడుతారు. అది కూడా మొరాయించడం ఆందోళన కలిగించే విషయం. అటు నాగార్జున సాగర్ డ్యామ్ పరిస్థితి కూడా అంతేం బాగా లేదు. నాగార్జున సాగర్ డ్యామ్ స్పిల్‌వేలో భారీ గుంతలు ఏర్పడ్డాయి. ఈ గుంతలతో స్పిల్‌వే మరింతగా దెబ్బతింటోంది. ఈ రిపేర్లు ఈ సీజన్ లో పూర్తవడం కష్టమే. డ్యాం సేఫ్టీని ఇవి ఎఫెక్ట్ చూపించే అవకాశాలున్నాయి. సో ఈ ప్రాజెక్టుల వ్యవహారంపై తేలుతున్న విషయం ఏంటంటే.. సాగునీటిపారుదల ఇంజినీర్లు, ప్రాజెక్ట్ ఇంజినీర్లు శ్రద్ధ వహించాలని, ఎప్పటికప్పుడు రిపోర్టులు అందించి, నిధులు రాబట్టాల్సిన బాధ్యత వారిపైనే ఉంటుంది. గేట్లు ఎత్తేటప్పుడే సమస్యలంటే కుదరని పని అన్నది వారికి కూడా తెలుసు.
గతేడాది ఆగస్ట్ లో కొట్టుకుపోయిన తుంగభద్ర 19వ గేటు
ఇప్పుడు తుంగభద్ర డ్యాం సంగతి చూద్దాం. గతేడాది ఆగస్ట్ లో డ్యాంకు చెందిన 19వ గేటు కొట్టుకుపోయింది. ఇది జరిగి మరో నెల గడిస్తే ఏడాది అవుతుంది. అయినా సరే కొత్త గేటు ఫిట్ చేసేందుకు ఇంకా ఆలస్యమవుతూనే ఉంది. పనులు కూడా లేటెస్ట్ గా వాయిదా పడింది. జలాశయంలో నీటిమట్టం 41 టీఎంసీలు చేరేలోగానే గేటు బిగించాల్సి ఉంటుంది. ప్రస్తుతం తుంగభద్ర డ్యాంలో 34 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువ నుంచి సుమారు వరద వచ్చి చేరుతోంది. దీంతో 41 టీఎంసీలు దాటిపోతాయి. ఆ టైంలో గేటు ఫిట్టింగ్ డేంజర్ అని పనులు ఆపేశారు. 19వ గేట్ స్థానంలో అప్పుడే స్టాప్‌లాగ్‌లను ఏర్పాటు చేశారు. నీరు దిగువకు వెళ్లకుండా చర్యలైతే తీసుకున్నారు. కానీ ఇది తాత్కాలికమే కదా. పర్మినెంట్ పనులు చేద్దామంటే మ్యాటర్ ముందుకు కదలడం లేదు.
19వ గేట్ స్థానంలో స్టాప్‌లాగ్‌ల ఏర్పాటు
తుంగభద్రలో 19వ గేటు ఒక్కటే సమస్య కాదు.. ఇంకా చాలానే ఉన్నాయి. రాయలసీమ వరప్రదాయినిగా పేరుగాంచిన ఈ తుంగభద్ర డ్యామ్ ఇప్పుడు డేంజర్ జోన్ లో ఉంది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో లక్షల ఎకరాలకు, వందల గ్రామాలకు సాగు, తాగునీరు అందిస్తున్న ఈ ప్రాజెక్ట్ గేట్లన్నీ తుప్పుపట్టిపోయాయి. ప్రాజెక్ట్ గేట్లన్నీ వెంటనే మార్చాల్సిందేనని అల్ట్రా సౌండ్ పరీక్షల్లో తేలింది. మొత్తం 33 గేట్లలో 19 గేట్ల కెపాసిటీ 40 నుంచి 55 శాతానికి తగ్గిపోయింది. తుంగభద్ర డ్యామ్ మొత్తం 33 గేట్లు మార్చాల్సిందేనని తాజా స్టడీ తేల్చి చెప్పింది. దీనికి 250 కోట్ల రూపాయల ఖర్చు కానుంది. ఈ ప్రాజెక్టు నిర్మించి ఇప్పటికే 70 ఏళ్లు దాటింది. 40 నుంచి 45 ఏళ్లకోసారి హైడ్రో మెకానికల్ భాగాలు మార్చాల్సి ఉన్నా, తుంగభద్ర ప్రాజెక్ట్‌లో ఆ మార్పు చేయలేదు. అందుకే ఈ సమస్యలు.
40-45 ఏళ్లకోసారి హైడ్రో మెకానికల్ భాగాలు మార్చాలి
రైట్ చూశారుగా ప్రాజెక్టుల దీనావస్థ. వీటి మెయింటెనెన్స్ కంప్లీట్ గా ఇరిగేషన్ శాఖదే. చికిత్స కంటే నివారణ మేలు అన్న సూత్రం ఈ డ్యాంలకూ వర్తిస్తుంది. అంటే ఎప్పటికప్పుడు చేయాల్సిన నిర్వహణా పనులు చేస్తేనే ప్రాజెక్టులకు మనుగడ. ఎందుకంటే ఈ ప్రాజెక్టుల ఆధారంగానే మనకు మనుగడ ఉంది. ఇవి లేకపోతే తాగు, సాగునీటి సమస్యలు పెరిగి మొదటికే మోసం వస్తుంది. పైగా ఇవి ఒకటి రెండు రోజుల్లో పూర్తయ్యే రిపేర్లు కూడా కాదు. నెలల కొద్దీ టైం పడుతుంది. అందుకే ప్రాజెక్ట్ ఇంజినీర్లు, ఇరిగేషన్ శాఖలు ఎప్పటికప్పుడు నిధులు రాబట్టుకోవాలి. పనులు చేయాలి. కారణాలు చెబుతూ వెళ్తే ప్రాజెక్టుల మనుగడకే ఇబ్బంది.