Fishermen Dispute: ఇప్పుడు జువ్వలదిన్నె తీరంలో మత్స్యకారులు రగిలిపోవడానికి చాలా కారణాలున్నాయ్. అసలే చేపల వేట అంతంత మాత్రంగానే ఉండడం.. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ మత్స్యకారుల నుంచి పోటీ పెరగడం, వారు ఏపీ పరిధిలోకి వచ్చి వేటాడుకుని వెళ్లడంతో మనవాళ్లు రోడ్డున పడుతున్న పరిస్థితి.
ఒక్క రోజు చేపల వేటకు వెళ్లి ఖాళీ చేతులతో తిరిగి వస్తే.. ఇంట్లో ఆకలి బాధలు, అప్పులు, భవిష్యత్ పై భయాలు ఇలాంటివెన్నో మన మత్స్యకారులకు ఉన్నాయి. అదే తమిళనాడు, పుదుచ్చేరి బోట్లు ఒక్కసారి వచ్చి వెళ్తే.. చాలా వారం రోజుల పాటు మత్స్య సంపదను తరలించుకు వెళ్తున్నారు. అందుకే ఇది సరిహద్దు జగడం కాదు.. జీవనోపాధి యుద్ధంగా మారిపోయింది. దీంతో ఈ సమస్యకు ఎలాగైనా చెక్ పెట్టాలనుకున్న నెల్లూరు జువ్వలదిన్న తీరం మత్స్యకారులు గతేడాది పాండిచ్చేరి, కరైకల్ వాళ్లకు చెందిన 4 బోట్లను పట్టుకుని తీరం దగ్గరికి తీసుకొచ్చారు. అయితే ఇవి తాజాగా మిస్సింగ్ అవడం అగ్నికి మరింత ఆజ్యం పోసినట్లైంది. అసలే ఉపాధి పోతోందన్న మంటతో ఉన్న మత్స్యకారులు.. ప్రాణాలకు తెగించి పట్టుకొచ్చిన పుదుచ్చేరి బోట్లను మాయం చేయడంపై మరింతగా రగిలిపోతున్నారు.
దశాబ్దాల కాలంగా రగులుతున్న ఆంధ్రా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ మత్స్యకారుల వివాదం ఇప్పుడు క్లైమాక్స్ కు చేరింది. తమ జలాల్లోకి అక్రమంగా ప్రవేశించి తమ వలలను ధ్వంసం చేస్తున్నారని, తమ మత్స్య సంపదను కొల్లగొడుతున్నారని ఆరోపిస్తూ ఏపీ మత్స్యకారులు పట్టుకుని తీసుకొచ్చిన నాలుగు పుదుచ్చేరి, కరైకల్ బోట్లు రాత్రికి రాత్రే అదృశ్యం కావడం స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. అటు వైసిపి, ఇటు కూటమి నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో బోట్ల అదృశ్యం వ్యవహారం ఏపీ రాజకీయాల్లో పెను దుమారంగా మారింది.
సాధారణంగా సముద్ర తీరం నుంచి 12 నాటికల్ మైళ్ల వరకు ఉన్న ప్రాంతాన్ని ‘టెరిటోరియల్ సీ’ గా చెబుతారు. ఈ పరిధి పూర్తిగా ఆయా రాష్ట్రాలకే చెందుతుంది. 12 నుంచి 24 నాటికల్ మైళ్ల వరకు ఉన్న ప్రాంతాన్ని ‘కాంటిగ్యువస్ జోన్’ అంటారు. అయితే గత 3 దశాబ్దాలుగా తమిళనాడు, పుదుచ్చేరికి చెందిన హైస్పీడ్ మెకనైజ్డ్ బోట్లు రూల్స్ ఉల్లంఘించి ఆంధ్రా జలాల్లోకి చొరబడుతున్నాయనేది మత్స్యకారుల ఆరోపణ. ఏపీకి 1053 కిలోమీటర్లు, తమిళనాడుకు 1076 కిలోమీటర్ల దాదాపు సమాన తీరరేఖ ఉన్నప్పటికీ.. ఆంధ్రాలో 28,935 పడవలు ఉంటే, తమిళనాడులో ఏకంగా 44,876 పడవలు ఉన్నాయి. తమిళనాడులో ఉన్న భారీ సంఖ్యలోని హైస్పీడ్ ఇంజిన్ బోట్లతో వారు ఆంధ్రా ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించి, విలువైన మత్స్య సంపదను పట్టుకెళ్లడమే కాకుండా.. స్థానిక మత్స్యకారుల చిన్న పడవలను ఢీకొట్టి, వలలను ధ్వంసం చేస్తున్నారని ఏపీకి చెందిన మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఘర్షణలు, దాడులు కామన్ అయ్యాయి. ఇన్నాళ్లూ భరించిన మత్స్యకారులు ఇకపై కుదరదంటున్నారు. తాడో పేడో అంటున్నారు.
ఏపీ వ్యాప్తంగా 21 మెరైన్, పోలీస్ స్టేషన్లు ఉన్నప్పటికీ… సరిహద్దుల్లో నిఘా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. పుదుచ్చేరి, కరైకల్, తమిళనాడు ప్రాంతాలకు చెందిన మత్స్యకారులు ఆంధ్ర తీరానికి రావడం వెనుక కొన్ని సాంకేతిక, ఆర్థిక కారణాలు ఉన్నాయి. ఆంధ్ర తీరంలో దాదాపు 14 జాతుల చేపలు దొరుకుతాయి. సముద్రపు రొయ్యలు, పీతలు, కవళ్లు, వంజురం, తలమలు, పారలు, ఎండు చేపలకు పనికొచ్చే చిన్న రకం చేపలు ఇక్కడ సమృద్ధిగా దొరుకుతాయి. అమ్మకాల పరంగా వీటికి మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంది. అయితే తమిళనాడు, పుదుచ్చేరి తీరాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ తీరంలో ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల వద్ద కాంటినెంటల్ షెల్ఫ్ వెడల్పుగా ఉండటం వల్ల చేపల వేటకి అనువైన పరిస్థితులు ఉంటాయి.
ఇక్కడ చేపల సాంద్రత ఎక్కువగా ఉండటం వారిని ఆకర్షిస్తుంది. పుదుచ్చేరి, కరైకల్ మత్స్యకారులు ఎక్కువగా పెద్ద మెకనైజ్డ్ బోట్లను వాడుతుంటారు. ఈ బోట్లు ఎక్కువ రోజులు సముద్రంపై ఉండి, వేగంగా ప్రయాణిస్తాయి. దీంతో వాళ్లు చేపల కోసం వారు పక్క రాష్ట్రాల జలాల్లోకి చొచ్చుకు వస్తుంటారు. చట్టపరంగా 12 నాటికల్ మైళ్ల లోపు వేట సాగించే అధికారం ఆయా రాష్ట్రాల మత్స్యకారులకే ఉంటుంది. వారు ఆంధ్ర జలాల్లోకి రావడం వల్ల ఆంధ్ర మత్స్యకారుల వలలు చినిగిపోవడం, ఫైబర్ బోట్లను ఢీ కొట్టడం తరచుగా స్థానిక మత్స్యకారులతో ఘర్షణలు జరుగుతున్నాయ్.
పక్క రాష్ట్రాల మత్స్యకారుల ఆగడాలు, వీటిపై అధికారుల నిర్లక్ష్యాన్ని భరించలేకపోయిన నెల్లూరు జిల్లా మత్స్యకారులు స్వయంగా రంగంలోకి దిగారు. తమ ప్రాణాలకు తెగించి ఏకంగా నాలుగు పుదుచ్చేరి, కరైకల్ బోట్లను పట్టుకున్నారు. కానీ, ఆ బోట్లు మాయం అవ్వడం ఇప్పుడు అసలు కథకు తెరలేపింది. గతేడాది ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఇందుకూరుపేట, వాకాడు, కావలి మండలాల చెన్నాయి పాలెం తీరాల్లో స్థానిక మత్స్యకారులు వీటిని పట్టుకున్నారు. వాటిని బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌కు తరలించి, ఇంజిన్ గేర్ బాక్సులు విప్పి గోడౌన్‌లో భద్రపరిచారు. 164 గ్రామాల కాపుల సమక్షంలో వాటికి కాపలా కూడా పెట్టారు.
అయితే మార్చి 12న నెల్లూరు జిల్లాలో సాగర్ డిఫెన్స్ కంపెనీకి శంకుస్థాపన చేసిన వారం రోజులకే.. ఈ నాలుగు బోట్లు గుట్టుచప్పుడు కాకుండా అదృశ్యమయ్యాయి. వీటిని ఎవరు మాయం చేశారో తెలియదు. తమిళనాడు సరిహద్దుల వరకు వెతికిన ఆంధ్రా మత్స్యకారులు నిరాశతో వెనుదిరిగారు. దీని వెనుక పెద్దకాపు పాత్ర ఉందన్న అనుమానంతో ఇస్కపల్లి గ్రామస్తులు ఆయన్ను.. ఆయన కుటుంబ సభ్యులను నిలదీయగా.. ఎంపీ బీదా మస్తాన్ రావు పేరు చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఈ మ్యాటర్ పొలిటికల్ టర్న్ తీసుకున్నట్లైంది.
బోట్ల మిస్సింగ్ వ్యవహారం జువ్వలదిన్నెలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఏప్రిల్ మొదటి వారంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వస్తున్నారనే నేపథ్యంలో.. వైసీపీ, కూటమి నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. హెలిప్యాడ్ స్థల పరిశీలనకు వచ్చిన వైసీపీ నేతలు కాకాణి గోవర్ధన్ రెడ్డి, ప్రతాప్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ ప్రభుత్వంలో 289 కోట్లతో నిర్మించిన ఫిషింగ్ హార్బర్ భూములను కూటమి ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. లోకేష్ పర్యటన తర్వాత, కూటమి నేతల అండదండలతోనే పుదుచ్చేరి బోట్లను వదిలేశారని, దీని వెనుక ఎంపీ BMR పాత్ర ఉందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మత్స్యకారుల ఉపాధి కోసమే జగన్మోహన్ రెడ్డి పరితపించారని, హార్బర్ స్థలాన్ని ప్రైవేటుపరం కానివ్వబోమని వైసీపీ నేతలు అంటున్నారు.
అయితే వైసీపీ ఆరోపణలను టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్ గట్టిగా తిప్పికొట్టారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో మత్స్యకారులకు ఒక్క రూపాయి ఖర్చు చేయలేదని, ఒక్క వల, ఫైబర్ బోర్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు. జీవో 217 ద్వారా దోపిడీకి పాల్పడ్డారని, జువ్వలదిన్నె హార్బర్ టీడీపీ హయాంలోనే మంజూరైందని గుర్తుచేశారు. సాగర్ డిఫెన్స్ ప్రైవేట్ సంస్థ కాదని, కేంద్ర ప్రభుత్వ సంస్థలతో లింకప్ ఉందని, దీనివల్ల స్థానికులకు మేలు జరుగుతుందంటున్నారు. మిస్సయిన బోట్లు పాండిచ్చేరి అధికారుల ఆధీనంలో ఉన్నాయని, విచారణలో అసలు దోషులు తేలుతారని చెప్పుకొచ్చారు.
మరోవైపు రాజ్యసభ ఎంపీ బీదా మస్తాన్ రావు తనపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. మత్స్యకారుల ఆరాధ్యదైవం రాములవారి మీద ఒట్టేసి చెబుతున్నానని, బోట్ల మిస్సింగ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తన ప్రమేయం ఉందని నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని, ఎంపీకి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. కొందరితో బలవంతంగా తన పేరు చెప్పించారని, అయితే దీని వెనుక సూత్రధారులెవరో కమిటీ వేసి తేల్చాలని సీఎంను కోరుతామన్నారు.
అయితే బోట్ల మిస్సింగ్ తర్వాత రాజకీయ ఆరోపణలు పెరగడం, మత్స్యకారుల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకోవడంతో రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ రామా శంకర్ నాయక్ బృందం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ లో పర్యటించింది. సమస్యలేంటో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పక్క రాష్ట్ర బోట్లు మన జలాల్లోకి రాకుండా కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. సముద్రంలో నిఘా కోసం ప్రత్యేకంగా ఒక బోటును కేటాయించారు. మెరైన్, లోకల్ పోలీస్, మత్స్యశాఖ అధికారులు, మత్స్యకారులు సంయుక్తంగా ఇకపై నిరంతరం తనిఖీలు నిర్వహించేలా చర్యలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ డిపార్ట్‌మెంట్ 22 కిలోమీటర్ల తీరంలో హైసెక్యూరిటీ పెట్రోల్ బోట్లు, డ్రోన్లతో నిఘా పెంచింది. కానీ స్థానికులు ఇంకా సంతృప్తి చెందడం లేదు.
Also Read: ట్యాక్స్ నుంచి టికెట్ దాకా.. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి ఈ కొత్త రూల్స్!