E-Paper
Advertisement

జువ్వలదిన్నె జలాల్లో ‘హైడ్రామా’.. 4 బోట్ల మాయం వెనుక అసలు మాస్టర్ మైండ్ ఎవరు?

జువ్వలదిన్నె జలాల్లో ‘హైడ్రామా’.. 4 బోట్ల మాయం వెనుక అసలు మాస్టర్ మైండ్ ఎవరు?
Advertisement

Juvvaladinne: సముద్రం ఎప్పుడూ ప్రశాంతంగానే కనిపిస్తుంది.. కానీ దాని లోపల ఎన్నో సుడిగుండాలు! ఇప్పుడు నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పరిస్థితి కూడా అచ్చం అలాగే ఉంది. 30 ఏళ్లుగా రగులుతున్న మత్స్యకారుల ఆవేదన ఒకవైపు.. రాత్రికి రాత్రే మాయమైన 4 బోట్ల మిస్టరీ మరోవైపు.. వీటికి తోడైన రాజకీయ చదరంగం ఇంకోవైపు! అసలు జువ్వలదిన్నెలో ఏం జరుగుతోంది? ప్రాణాలకు తెగించి పట్టుకున్న బోట్లు ఏమయ్యాయి? ఏళ్ల తరబడి సరిహద్దుల సమస్యను పట్టించుకోని ప్రభుత్వాలు ఇప్పుడు ఎందుకు పరుగులు పెడుతున్నాయి..?

ముప్పై ఏళ్లుగా మత్స్యకారుల పోరాటం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నాటి నుంచి నేటి వరకు, రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతూ వచ్చినప్పటికీ.. మత్స్యకారుల ప్రధాన సమస్య మాత్రం పరిష్కారం కాలేదన్నది నగ్నసత్యం. గత 30 సంవత్సరాలుగా ఆంధ్ర జలాల్లోకి తమిళనాడు, పాండిచ్చేరి మత్స్యకారులు హై స్పీడ్ బోట్లతో చొరబడటం, వలలు తెంచుకుని పోవడం, మన మత్స్యకారుల సంపదను దోచుకుపోవడం నిత్యకృత్యంగా మారింది. ప్రభుత్వాలు మారినా ఈ దాడులకు వివాదాలకు అడ్డుకట్ట పడలేదు. అయితే సుమారు తొమ్మిది నెలల క్రితం నెల్లూరు జిల్లా మత్స్యకారులు ప్రాణాలకు తెగించి, మన జలాల్లో వేటాడుతున్న నాలుగు కరైకల్ మేకనైజ్డ్ బోట్లను పట్టుకొని జువ్వలదిన్నె హార్బర్ కు తీసుకొచ్చారు.

జువ్వలదిన్నె హార్బర్‌లో హైడ్రామా

Advertisement

అధికారులు కానీ, ఏ రాజకీయ పార్టీ నాయకులు కానీ దీనిని పెద్దగా పట్టించుకోలేదు. ఈ బోట్లతోనైనా ఆంధ్ర మత్స్యకారుల సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని వేచి చూస్తున్నారు. ఆ బోట్లు వారి ఆధీనంలోనే ఉన్నాయి. అంతా సవ్యంగానే ఉందనుకుంటున్న తరుణంలో అసలు కథ మొదలైంది..!మార్చి 17వ తేదీన హార్బర్ లో ఉన్న ఆ నాలుగు బోట్లు అనూహ్యంగా మాయమయ్యాయి. మంత్రి నారా లోకేష్ జువ్వలదిన్నెలో నూతనంగా ‘సాగర్ డిఫెన్స్ కంపెనీ’కి శంకుస్థాపన చేసి వెళ్లిన ఐదు రోజులకే ఈ ఘటన జరగడంతో హార్బర్ లో కలకలం రేగింది.

సాగర్ ప్రాజెక్ట్‌పై సందేహాలు

అసలు ఈ సాగర్ డిఫెన్స్ ప్రాజెక్టును జువ్వలదిన్నె హార్బర్ లోనే ఏర్పాటు చేయడం వెనుక ఆంతర్యం ఏమిటన్న దానిపై మత్స్యకారుల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు ఈ ప్రాజెక్టు ఏర్పాటుపై రేకెత్తుతున్న సందేహాలు, మరోవైపు రాత్రికి రాత్రే జరిగిన నాలుగు బోట్లు అపహరణ వ్యవహారం..వెరసి ఈ పరిణామాలన్నీ మత్స్యకారుల్లో తీవ్ర అలజడిని సృష్టిస్తున్నాయి. అప్పటివరకు నెల్లూరు జిల్లాకే పరిమితమైన ఈ సమస్య కాస్తా.. ఇప్పుడు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, తిరుపతి జిల్లాలకు చెందిన మత్స్యకారుల సమస్యగా మారిపోయింది.

బీద మస్తాన్ రావుపై ఆరోపణలు

Advertisement

బోట్లు అపహరణ వెనుక ఎవరున్నారు..? దీనిపై ఈ నెల 6వ తేదీన సింగరాయకొండ మండలం పాకాలలో 164 మత్స్యకార గ్రామాల పెద్దకాపులుసమావేశమయ్యారు. ఈ సమావేశంలో తోటయ్య అనే పెద్దకాపు.. బోట్ల మాయం వెనుక బీద మస్తాన్ రావు హస్తం ఉందంటూ బాంబు పేల్చారు. ఆ పంచాయితీలో ఐదు గ్రామాల వారికి రూ.5 కోట్లు ఫైన్ వేసినట్లు సమాచారం. దాంతో తాము అంత ఫైన్ కట్టలేమని వారు అక్కడి నుంచి వెళ్లిపోయారంట. ఆ క్రమంలో మత్స్యకారుల్లో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. “ప్రాణాలకు తెగించి మేం బోట్లు పట్టుకుంటే, ఈ రాజకీయ నాయకుల జోక్యం ఏంటి?” అని కొందరు ప్రశ్నిస్తుంటే, “ఇందులో ఆయన ప్రమేయం లేదు” అని మరికొందరు వాదిస్తున్నారు.

చంద్రబాబు సీరియస్

చివరకు, కాపులు అందరూ కలిసి 5 కోట్ల జరిమానా విధించారు. అయితే, ఏ సమస్య కోసం 164 గ్రామాలు మమేకమయ్యాయో.. ఆ సమస్య పరిష్కారం కాకపోవడం ఏంటన్నది? సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది. మరోవైపు ప్రతిపక్ష వైసీపీ ఇదే అస్త్రంగా చేసుకుని అధికార టీడీపీని, సాగర్ డిఫెన్స్ ప్రాజెక్టును టార్గెట్ చేస్తూ విమర్శల దాడి పెంచింది. ఈ పరిణామాలతో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయినట్లు సమాచారం. వెంటనే రంగంలోకి దిగిన ప్రభుత్వం డ్యామేజ్ కంట్రోల్ చర్యలు చేపట్టింది.

మత్స్యకారులతో కలెక్టర్, ఎస్పీ

ప్రభుత్వ ఆదేశాలతో మత్స్యశాఖ కమిషనర్, మెరైన్ ఐజీ గోపీనాథ్ జెట్టి తదితరులు జువ్వలదిన్నెను పరిశీలించారు. గస్తీ కోసం తక్షణమే రెండు బోట్లను కేటాయించారు. ఏప్రిల్ 9న నెల్లూరు టౌన్‌హాల్ లో 164 గ్రామాల మత్స్యకారులతో కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ అజితా వేజండ్ల ముఖాముఖి సమావేశం నిర్వహించారు. 30 ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పీఎంఎంఎస్‌వై పథకం కింద రూ.1.20 కోట్లతో నాలుగు 650 హెచ్‌పీ సామర్థ్యం గల స్టీల్ హైస్పీడ్ గస్తీ బోట్ల కొనుగోలు చేశారు. జూన్ 15 నాటికి కొత్త బోట్లతో పటిష్ట గస్తీ వ్యవస్థ ఏర్పాటు చేసి సమస్యల సత్వర పరిష్కారం కోసం తీరప్రాంత 23 మండలాల ప్రతినిధులు, కలెక్టర్, ఎస్పీలతో ప్రత్యేక వ్యవస్థను తయారు చేస్తామన్నారు. అలాగే తమిళనాడు బోట్లను పట్టుకున్న తర్వాత విధివిధానాలు ఖరారు చేసేందుకు అధికారులతో కూడిన ప్రత్యేక కమిటీని కూడా నియమించారు.

మత్స్యకారులకు కలెక్టర్ భరోసా

ఈ సమావేశంలో కలెక్టర్ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ తాను కలెక్టర్‌ కాకముందు ఆరేళ్లపాటు వివిధ దేశాల్లో సముద్రంలో పనిచేసిన అనుభవం ఉందని, మత్స్యకారుల సమస్యలు తనకు తెలుసని, తాను ఉన్నా, లేకపోయినా సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికేలా పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేస్తామని వారికి భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో తీరప్రాంతాల్లో ఏర్పడే పరిశ్రమల ద్వారా మత్స్యకార యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, ప్రభుత్వం పక్షాన అన్ని విధాలా తోడుగా ఉంటామని అని హామీ ఇవ్వడంతో మత్స్యకారుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. దశాబ్దాలుగా ఎవరూ పట్టించుకోని సమస్యను కూటమి ప్రభుత్వం పరిష్కరించే దిశగా అడుగులు వేస్తుండటంపై వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జువ్వలదిన్నెకు జగన్ రాక

కథ ఇక్కడితో సుఖాంతం కాలేదు. అసలు రాజకీయ చదరంగం ఇప్పుడే మొదలుకాబోతోంది. ఈ నెల 15వ తేదీన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి జువ్వలదిన్నె హార్బర్ కు రానున్నారు. బోట్లు అపహరణ, అందులో టీడీపీ నేతల హస్తం ఉందన్న ఆరోపణలు, సాగర్ డిఫెన్స్ వల్ల జరిగే నష్టం వంటి అంశాలను అస్త్రాలుగా చేసుకుని మత్స్యకారులతో ఆయన మమేకం కానున్నారు. ప్రభుత్వం చేపట్టిన గస్తీలో ఇటీవల తమిళనాడుకు చెందిన నాలుగు బోట్లు అక్రమ వేట చేస్తుండగా పట్టుకొని జువ్వలదిన్నె హార్బర్ లో ఉంచారు.

మత్స్యకారులపై రాజకీయ పోరు

ఏదేమైనా ప్రభుత్వానికి, మత్స్యకారులకు మధ్య దూరం పెంచేలా వైసీపీ వ్యూహాలు రచిస్తుంటే.. శాశ్వత పరిష్కారాలతో వారిని దగ్గర చేసుకునేలా అధికార పక్షం పావులు కదుపుతోంది. మరి 15వ తేదీన జువ్వలదిన్నెలో ఏం జరగబోతోంది? మున్ముందు మత్స్యకారుల స్టాండ్ ఎలా ఉండబోతోంది? అన్నది చూడాలి.

Also Read: జీవన్ రెడ్డి బాటలో ఆ 9 మంది? ఏప్రిల్ 20న జగిత్యాలలో బిగ్ వికెట్లు పడబోతున్నాయా?

Story by: Apparao, Big Tv

Related News

ఫిఫా ఫైనల్ కురుక్షేత్రం.. 16 ఏళ్ల కల నెరవేరిన వేళ.. కన్నీళ్లతో మెస్సీ వీడ్కోలు!

మీ అవినీతిని బంద్ పెడితే చాలు.. ఉచిత కార్పొరేట్ విద్యా, వైద్యం అందించొచ్చు..!

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

Big Stories

Advertisement
×