ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. పెద్దగా పరిచయం అవసరం లేని విచిత్రమైన క్యారెక్టర్.. క్రైస్తవ మత ప్రభోదకుడిగా బోయింగ్ విమానాల్లో విదేశాలన్నీ చుట్టి వచ్చానంటున్న ఆయన తెలుగు రాష్ట్రాల్లో పొలిటీషియన్ అనిపించుకోవాలని తెగ తాపత్రయపడుతుంటారు. అందుకే సొంత పార్టీ పెట్టుకుని ప్రతి ఎన్నికల్లో పోటీ అంటూ హడావుడి చేస్తుంటారు. ఆయన కబుర్లు ఏ రేంజ్లో ఉంటాయంటే ట్రంప్ తన ఫ్రెండ్ అంటారు. ప్రధాని నరేంద్రమోడీ, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిలను ఢీ కొట్టే సత్తా తనకు తప్ప ఎవరికీ లేదని ఇటీవల వరంగల్ వెళ్లి ఘనమైన స్టేట్ మెంట్ ఇచ్చారు.
రాబోయే ఎన్నికలలో తాను తెలంగాణ సీఎం అవుతానని ఎస్సీ, ఎస్టీ బీసీలంతా తన వెంట నడవాలని అక్కడ చెప్పుకున్న రెండు రోజులకే ఆయన ఏపీ రాజకీయాలపై పడ్డారు. ఏపీలో సీఎం, డిప్యూటీ సీఎం పదవులపై జోరుగా చర్చ సాగుతోంది.. లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలని తెలుగు తుమ్ముళ్లు డిమాండ్ చేస్తుంటే.. పవన్‌ను సీఎంగా చూడాలన్న కోరికను ఉన్నట్లు ప్రకటిస్తున్నానే జనసేనికులు, టీడీపీ, జనసేన నేతల మధ్య చర్చ నడుస్తున్న తరుణంలో కేఏ పాల్ తన స్టైల్లో పెద్దగా సౌండ్ రాని మరో బాంబ్ పేల్చారు. ఏపీలో సీఎం, డిప్యూటీ సీఎంలే కాదు యాక్టింగ్ సీఎం, యాక్టింగ్ డిప్యూటీ సీఎంలు ఉన్నారంట.
ఏపీలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అని అందరికి తెలిసిన విషయమే.. అయితే యాక్టింగ్ సీఎంగా మెఘా కృష్ణారెడ్డి, యాక్టింగ్ డిప్యూటీ సీఎంగా లింగమనేని రమేశ్ వ్యవహరిస్తున్నారని పాల్ విచిత్రమైన అభియోగం మోపారు. మెఘా కృష్ణారెడ్డి, లింగమనేని రమేశ్ ఇద్దరు పారిశ్రామిక వేత్తలే.. వారిద్దరు రాష్ట్రంలో షాడో సీఎంలుగా ఉన్నారని కేఏ పాల్ ఆరోపిస్తున్నారు. మెఘా కృష్ణారెడ్డి, లింగమనేని రమేశ్‌లో ఇద్దరూ ఏపీలో జాయింట్ వెంచర్‌గా ప్రాజెక్టులు చేస్తున్నారనే టాక్ ఉంది.
Also Read: లోకేష్ చెప్పిన వినలే.. మదనపల్లి ఎమ్మెల్యే ఇష్టారాజ్యం
గత వైసీపీ ప్రభుత్వ హయంలోను మెఘా కృష్ణారెడ్డి ఏపీలో అనేక ప్రాజెక్టులు చేశారు. ఆయన తన రాజకీయ పలుకుబడితో ఎన్‌ఆర్ఐ కాలేజీని ఆక్రమించుకున్నారని కేఏ పాల్ ఆరోపణలు చేస్తున్నారు. మెఘా కృష్ణారెడ్డి వ్యాపార వేత్తగా దేశ వ్యాప్తంగా అనేక ప్రాజెక్టులు చేస్తున్నారు. అటు బీజేపీ పెద్దలతోను మెఘా కృష్ణారెడ్డికి సత్సంబంధాలున్నాయి. అలాంటి మెఘా కృష్ణారెడ్డి ఏపీలోను యాక్టింగ్ సీఎంగా ఉంటూ హవా కొనసాగిస్తున్నారని కేఏ పాల్ ఆరోపించడం చర్చనీయాంశంగా మారింది.
ఇక లింగమనేని రమేశ్, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ల మధ్య సంబంధాలు ఎన్నికల తర్వాత మరింత బలపడ్డాయంట. జనసేన కార్యాలయంలోను లింగమనేని రమేశ్ హవా సాగుతుందనేది జనసేన నాయకులు నుంచి వస్తున్న మాట. ప్రస్తుతం పవన్ ఎటు వెళ్లినా అక్కడ లింగమనేని కనిపిస్తున్నారు. విజయవాడ ప్రాంతంలో పవన్ సొంతింటి కోసం భూమి కోనే వ్యవహారంలోను లింగమనేని పేరు గట్టిగా వినిపించింది. అయితే.. ఎప్పుడూ ప్రచారం కోసం హడావుడి చేసే కేఏ పాల్.. అందులో భాగంగానే ఆ ఇద్దరి పేర్లను తెరపైకి తెచ్చారన్న చర్చ ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతోంది. వారిద్దరితో లింకు పెట్టి ఏపీలో 80 వేల కోట్ల కుంభకోణం జరిగిపోతుందని, దానిపై దర్యాప్తు జరిపించకపోతే పవన్ ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తారంట.. అట్లా ఉంటాయి పాల్ సార్ రాజకీయాలు.