Kadapa Politics: గత సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి ని చావు దెబ్బ కొట్టిన టీడీపీ.. వైఎస్ కంచుకోట లాంటి కడప జిల్లాలో సైతం ఆధిక్యత కనబర్చింది. జిల్లాలో పది సెగ్మెంట్లు ఉంటే కడప సహా ఏడు నియోజకవర్గాల్లో పసుపు జెండా ఎగిరింది. అదే ఊపులో కడప రాబోయే మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా తెలుగు తమ్ముళ్లు పావులు కదుపుతున్నారంట.. ముఖ్యంగా కడప మున్సిపల్ కార్పొరేషన్‌ను అధికారపక్షం ప్రతిష్టాత్మకంగా తీసుకుందంట. మున్సిపల్ ఎన్నికలకు ముందే వైసిపి నుంచి కడప మాజీ మేయర్ సురేష్ వర్గీయులు టీడీపీ కాంపౌండ్‌లోకి జంపింగ్‌లు మొదలుపెట్టడంతో వైసిపి లో కలవరం మొదలైందట.. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కడప కోటను బద్దలు కొట్టి పసుపు జెండా పాతాలని టీడీపీ వ్యూహాలకు పదును పెడుతుంటే.. రెండు దశాబ్దాల తమ హవా కొనసాగించేందుకు వైసిపి ప్రతి వ్యూహాల్లో నిమగ్రమైందంట.. ఇంతకీ కడప కార్పొరేషన్ రాజకీయం ఏ మలుపు తిరగబోతోంది?
కడప వైసీసీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ కంచుకోటగా ఉంటూ వచ్చింది. కాంగ్రెస్ అయినా వైసీపీ అయినా వైఎస్ కుటుంబానిదే కడపలో హవా కొనసాగింది. 2005 లో కడప మున్సిపాల్టీ నగరపాలక సంస్థగా అప్ గ్రేడ్ అయిన తర్వాత కాంగ్రెస్ మేయర్‌గా బోణి కొడితే … వైసీపీ ఆవిర్భావం నుంచి కడప కార్పొరేషన్ లో ఆ పార్టీ రెండుసార్లు మేయర్ పీఠం కైవసం చేసుకుంది. కడప ఎమ్మెల్యే అయినా, మేయర్ అయినా దాదాపు రెండు దశాబ్దాలుగా వారి హవానే నడిచింది. కడపప కార్పొరేషన్లో ఒక్కసారైన పాగా వేయాలనే టీడీపీ ప్రయత్నాలు ఒక్కసారిగా కూడా ఫలించలేదు. ఇప్పుడు కడప జిల్లాలో పొలిటికల్ సినేరియా మారిపోవడం, కడప ఎమ్మెల్యేగా టీడీపీకి చెందిన రెడ్డప్పగారి మాధవిరెడ్డి ఉండటంతో… త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలు ఉత్కంఠభరితంగా తయారయ్యాయి. అయితే 2024 ఎన్నికల్లో జగన్ సొంత జిల్లాలో అనూహ్యంగా 10 కి 7 స్థానాలు కైవసం చేసుకున్న కూటమి వైసీపీకి గుండె లాంటి కడప అసెంబ్లీ స్థానం కైవసం చేసుకోవడం ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల నేపధ్యంలో టీడీపీ శ్రేణుల్లో మరింత ఉత్తేజం నింపుతోంది.. కడప కర్పొరేషన్ పాలకవర్గం గడువు మార్చి 11 నాటికి ముగియనుండడంతో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేటర్ సీట్ల కోసం అన్ని పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నాయి.. మొన్నటి వరకు కడపలో చక్రం తిప్పిన వైసిపి లో వర్గ పోరు ఆ పార్టీలో తీవ్ర కలకలం రేపుతోందట కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వైసిపికి చెందిన 8 మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరి జగన్‌తో పాటు ఆయన పార్టీకి పెద్ద షాక్ ఇచ్చారు.
Also Read: SP Sharat Chandra Pawar: సహజసిద్ధమైన రంగులతో హోళీ సంబరాలు జరుపుకోవాలి.. ఎస్పీ శరత్ చంద్ర పవార్
తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో రెండు సార్లు మేయర్ సీటులో కూర్చున్న వైసీపీ నేత సురేష్ బాబు పదవి కోల్పోయారు. తర్వాత అదే పార్టీ నుంచి పాకా సురేష్ మేయర్ సీటు దక్కించుకోవడంతో వైసీపీలో గ్రూప్ పాలిటిక్స్ కు తెరలేపింది.. తమ పదవి కాలం పదిరోజుల్లో ముగుస్తుందనగా మరో ఇద్దరు కీలక కార్పొరేటర్లు శివకోటిరెడ్డి, రామలక్ష్మణరెడ్ఢి వైసీపీని వీడి ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో పసుపు కండువ వేసుకోవడంతో ఫ్యాన్ పార్టీలో అలజడి మొదలైందట.. రాబోయే రోజుల్లో మరికొంతమంది కీలక నేతలు పార్టీ వీడతారనే ప్రచారం ఇప్పుడు వైసీపీ వర్గాలకు తెగ టెన్షన్ పెడుతోందంట. మున్సిపల్ ఎన్నికలకు అన్ని పార్టీలు ఒక వైపు సమాయత్తం అవుతుంటే సొంత జిల్లాలో, అదీ కంచుకోటలా భావిస్తున్న కడప నగరంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, పార్టీలో వర్గపోరు వైసీపీ అధ్యక్షుడు జగన్‌ని సైతం ఆందోళనకు గురిచేస్తోందం. ఇటీవల మేయర్ సురేష్ బాబుపై అవినీతి ఆరోపణలతో అనర్హత వేటు పడగానే, కొత్త మేయర్ ఎంపికకు సంబంధించి పార్టీ కార్పొరేటర్లు రెండు వర్గాలుగా చీలిపోయారట.. జిల్లా పార్టీ అధ్యక్షుడు, కమలాపురం మాజీ ఎమ్మెల్యే, జగన్‌కు స్వయానా మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి వర్గంగా కొందరు, మాజీ మేయర్ సురేష్ బాబు వైపు కొందరు చీలిపోయారట.
రవీంద్రనాథ్ రెడ్డి కొత్త మేయర్ ఎంపికలో పాకా సురేష్‌కు మద్దతివ్వడంతో సురేష్ బాబు వర్గీయులు ఇప్పుడు పక్కచూపులు చూస్తున్నారట. పార్టీలో తమకు సరైన గుర్తింపు లేదని సైకిల్ ఎక్కేందుకు సన్నద్దం అవుతున్నారట. ఆ క్రయంలో తాజాగా ఇద్దరు కార్పోరేటర్లు చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా వేసుకొని వైసీపీకి షాక్ ఇస్తే, వారం రోజుల్లో మరికొందరు పార్టీ మారేందుకు సిద్దంగా ఉన్నారని ఇప్పుడు కడపలో జోరుగా ప్రచారం సాగుతోంది. కడప కార్పొరేషన్లో టీడీపీకి పోటీ చేసే అభ్యర్థులు ఉండరనీ ప్రగల్భాలు పలికిన వైసీపీ, ఇప్పుడు తమ పరిస్థితి ఏంటనే డైలమాలో పడిందట. టీడీపీలో సీటు గ్యారెంటీ అని హామీ లభిస్తే వైసీపీ కార్పొరేటర్లు పెద్ద ఎత్తున జంప్ అవ్వడానికి సిద్దంగా ఉన్నారంట. అయితే వైసీపీ నేతలు మాత్రం తమ పార్టీ నుంచి ఎవరు వెళ్లినా నష్టం లేదని, పోటీ చేసేందుకు బలమైన నేతలు క్యూలో ఉన్నారని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో సైకిల్ స్పీడ్‌కు ఫ్యాన్ ఎలా బ్రేకులు వేస్తుందో చూడాలి.
Story By: Apparao, Big Tv
Also Read: Kalvakuntla Kavitha: ఆ సమయానికి పార్టీ రావడం ఖాయం.. గతాన్ని తలుచుకుంటూ కవిత ఎమోషనల్