Kalvakuntla Kavitha: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. ఇంతకాలం అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య సాగుతున్న రాజకీయ పోరులోకి కల్వకుంట్ల కవిత నేతృత్వంలోని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) ప్రవేశించడంతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కొత్త రాజకీయ చర్చకు తెరలేపాయి. రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించడం ద్వారా కవిత ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాల్లో తన పార్టీ బలాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించగా, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కవిత రాజకీయంగా ఎవరికి సవాల్‌గా మారబోతున్నారు? ఆమె పోటీ వల్ల కాంగ్రెస్‌కు నష్టమా? బీఆర్ఎస్కు ఇబ్బందా? లేక కొత్త రాజకీయ శక్తిగా ఎదిగేందుకు తెలంగాణ రక్షణ సేనకు ఇది అవకాశమా? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా సాగుతోంది.
రెండు స్థానాల్లోనూ బరిలోకి కవిత పార్టీ
రాష్ట్రంలోని రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలపై కవిత ప్రత్యేకంగా దృష్టి సారించారు. వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్‌ను, తాజాగా హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి సీనియర్ జర్నలిస్టు ఆకాష్ కొల్లూరును అభ్యర్థులుగా ప్రకటించారు.రెండు స్థానాల్లోనూ బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను ఎంపిక చేయడం ద్వారా కవిత ఒక స్పష్టమైన రాజకీయ సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. సామాజిక న్యాయం, బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం, నిరుద్యోగులు, పట్టభద్రుల సమస్యలను ప్రధాన అజెండాగా తీసుకెళ్లాలన్నది ఆమె వ్యూహంగా కనిపిస్తోంది. రెండు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించడంతో పాటు నియోజకవర్గాల వారీగా ఇన్చార్జిలు, ఎన్నికల సమన్వయకర్తలను నియమించడం ద్వారా ఎన్నికల కార్యాచరణకు శ్రీకారం చుట్టారు.
కాంగ్రెస్‌కు కవిత రూపంలో కొత్త చిక్కు?
అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానానికి సామ రామ్మోహన్‌రెడ్డిని, వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానానికి రామిరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డిని బరిలోకి దించింది.అయితే రెండు స్థానాల్లోనూ ఒకే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను ప్రకటించడంపై కవిత విమర్శలు గుప్పించారు. రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను ఒకే సామాజిక వర్గానికి కేటాయించడం సామాజిక న్యాయానికి విరుద్ధమని ప్రశ్నించారు.ఇప్పుడు అదే అంశాన్ని ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉంది. బీసీ సామాజిక ప్రాతినిధ్యాన్ని రాజకీయ అస్త్రంగా మలుచుకుంటే కాంగ్రెస్‌కు ఇబ్బందికరమైన ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పట్టభద్రుల్లో సామాజిక న్యాయం, ఉద్యోగ అవకాశాలు, విద్యారంగ సమస్యలపై చర్చను ముందుకు తీసుకెళ్లాలని కవిత భావిస్తున్నట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి.అయితే కాంగ్రెస్‌కు క్షేత్రస్థాయిలో ఉన్న పార్టీ యంత్రాంగం, అధికారంలో ఉండటం, అభ్యర్థుల వ్యక్తిగత పరిచయాలు వంటి అంశాలు కూడా ఎన్నికల్లో కీలకం కానున్నాయి.
బీఆర్ఎస్ ఓటు బ్యాంకుపై ప్రభావం ఉంటుందా?
కవిత రాజకీయ అడుగులు బీఆర్ఎస్కు కూడా కీలకమైన సవాల్‌గా మారుతున్నాయి. గతంలో బీఆర్ఎస్లో కీలక నేతగా ఉన్న కవిత ఇప్పుడు సొంత రాజకీయ పార్టీని స్థాపించి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.బీఆర్ఎస్కు సంప్రదాయంగా ఉన్న కొన్ని సామాజిక, ప్రాంతీయ వర్గాల్లో కవిత తన పార్టీకి మద్దతు కూడగట్టగలరా? ముఖ్యంగా యువత, పట్టభద్రులు, బీసీ వర్గాల్లో తనకంటూ ప్రత్యేక రాజకీయ గుర్తింపు తెచ్చుకోగలరా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ కవిత పార్టీకి బీఆర్ఎస్కు మద్దతుగా ఉండే కొన్ని వర్గాల నుంచి ఆదరణ లభిస్తే, అది బీఆర్ఎస్ ఓటు సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మరోవైపు బీఆర్ఎస్ నాయకత్వం కూడా ఈ ఎన్నికలను సాధారణ ఎమ్మెల్సీ పోటీగా కాకుండా తమ రాజకీయ ప్రాబల్యాన్ని చాటుకునే అవకాశం ఉంది.అయితే కవిత పార్టీకి బీఆర్ఎస్ ఓటు బదిలీ అవుతుందా? లేక ఆమెకు స్వతంత్రంగా కొత్త మద్దతు వర్గం ఏర్పడుతుందా? అనేది ఎన్నికల ఫలితాల కంటే ముందే రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఓట్ల చీలికేనా?
ఈ ఎన్నికల్లో ప్రధానంగా చర్చ జరుగుతున్న అంశం ఓట్ల చీలిక. ఇప్పటివరకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీగా భావించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కవిత పార్టీ ప్రవేశంతో మరో రాజకీయ ప్రత్యామ్నాయం తెరపైకి వచ్చింది.కవిత పార్టీకి పట్టభద్రుల్లో గణనీయమైన మద్దతు లభిస్తే, ప్రధాన పార్టీల సంప్రదాయ ఓటు సమీకరణాల్లో మార్పులు చోటుచేసుకోవచ్చు. కాంగ్రెస్‌పై అసంతృప్తిగా ఉన్న ఓటర్లు, బీఆర్ఎస్తో విభేదిస్తున్న వర్గాలు, కొత్త రాజకీయ ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న పట్టభద్రులు కవిత పార్టీ వైపు మొగ్గు చూపుతారా అన్నది చూడాలి. మరోవైపు బీజేపీ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. ముఖ్యంగా హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పరిధిలో పట్టభద్ర ఓటర్లను ఆకర్షించేందుకు ప్రధాన పార్టీలు ప్రయత్నించనున్నాయి. దీంతో పోటీ బహుముఖంగా మారే అవకాశముంది.
కవితకు అసలైన పరీక్ష ఇదే!
రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం ఒక ఎత్తయితే, వారిని గెలిపించుకునే స్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని నిర్మించడం మరో ఎత్తు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు ఇప్పటికే నియోజకవర్గాల వారీగా కార్యకర్తలు, నాయకులు, ఎన్నికల అనుభవం ఉన్నాయి. కొత్తగా రాజకీయ కార్యాచరణ ప్రారంభించిన తెలంగాణ రక్షణ సేనకు మాత్రం పట్టభద్రుల స్థాయిలో బలమైన నెట్‌వర్క్‌ను నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది.అంతేకాదు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల నమోదు అత్యంత కీలకం. అర్హులైన పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించడం, వారి సమస్యలను గుర్తించడం, పోలింగ్ వరకు వారిని సమన్వయం చేయడం వంటి అంశాలు ఫలితాలపై ప్రభావం చూపుతాయి. ఈ విషయంలో కవిత పార్టీ ఎంత సమర్థంగా పనిచేస్తుందన్నది ప్రధాన పరీక్షగా నిలవనుంది.అభ్యర్థుల ఎంపికతో పాటు ఓటర్ల నమోదు కూడా పార్టీలకు కీలకంగా మారింది. ఎవరు ఎక్కువ మంది అర్హులైన పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించగలరు? ఎవరు ఎక్కువ మందిని పోలింగ్ కేంద్రాలకు తీసుకురాగలరు? అన్నదానిపైనే ఎన్నికల పోరులో కీలక అంశాలు ఆధారపడనున్నాయి.
చివరకు లాభం ఎవరికి?
కవిత రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండింటికీ రాజకీయంగా కొత్త పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్‌కు సామాజిక ప్రాతినిధ్యంపై ప్రశ్నలు ఎదురవుతుండగా, బీఆర్ఎస్కు తమ మాజీ నాయకురాలి కొత్త రాజకీయ ప్రస్థానం నుంచి సవాల్ ఎదురవుతోంది. మరోవైపు బీజేపీ కూడా తన ఓటు సమీకరణాలను కాపాడుకోవాల్సి ఉంటుంది.కవితకు మాత్రం ఈ ఎన్నికలు తన పార్టీకి ప్రజల్లో ఎంత ఆదరణ ఉందో తెలుసుకునే తొలి ముఖ్యమైన అవకాశంగా మారాయి. రెండు స్థానాల్లోనూ పోటీ చేయడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ ఉనికిని చాటుకోవడంతో పాటు, భవిష్యత్తు రాజకీయాలకు పునాది వేసుకోవాలని ఆమె ప్రయత్నిస్తున్నారు.అయితే కవిత పోటీ వల్ల కాంగ్రెస్‌కు ఎంత నష్టం? బీఆర్ఎస్కు ఎంత ప్రభావం? అన్నది ఇప్పుడే తేల్చలేని అంశం. పట్టభద్రుల ఓటింగ్ ప్రాధాన్యతలు, అభ్యర్థుల వ్యక్తిగత బలం, పార్టీల క్షేత్రస్థాయి యంత్రాంగం, ఓటర్ల నమోదు వంటి అంశాలే అసలు రాజకీయ చిత్రాన్ని స్పష్టం చేయనున్నాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు రెండు స్థానాల భర్తీకి పరిమితమైన పోటీ మాత్రమే కాదు. కాంగ్రెస్ పాలనపై పట్టభద్రుల అభిప్రాయానికి, బీఆర్ఎస్ రాజకీయ ప్రాబల్యానికి, కవిత కొత్త పార్టీ భవిష్యత్తుకు ఒకేసారి పరీక్షగా నిలవనున్నాయి. అందుకే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒకటే ఆసక్తికరమైన ప్రశ్న.. కవిత రంగంలోకి దిగితే రాజకీయంగా లాభపడేదెవరు? నష్టపోయేదెవరు? రాజకీయ ఆసక్తి నెలకొంది.
Also Read: సీఎం రేవంత్ రెడ్డికి కవిత సంచలన లేఖ.. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలకు డిమాండ్!