Kalvakuntla Kavitha: తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక బహిరంగ లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ నుంచి చేపట్టనున్న ఇంటింటి జనగణనను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రంలో తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆమె ఈ లేఖ ద్వారా డిమాండ్ చేశారు.
ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల డిమాండ్
రాబోయే జనాభా లెక్కల్లో బీసీ, ఓబీసీల కులగణనతో పాటు ఆదివాసీల మతాన్ని ప్రత్యేకంగా నమోదు చేసేలా తీర్మానాలు చేయడానికి వెంటనే శాసనసభ, శాసనమండలి ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయాలని కవిత స్పష్టం చేశారు. డిసెంబర్‌లో ఇంటింటి సర్వే ప్రారంభం కానున్నందున, ఈ లోపే ప్రభుత్వం స్పందించి అసెంబ్లీని సమావేశ పరచాల్సిన అవసరం ఉందన్నారు.
ఓబీసీ ఆందోళనలు.. ఆదివాసీల గుర్తింపు
దేశవ్యాప్తంగా వివిధ ఓబీసీ సంఘాలు తమ హక్కుల కోసం, సరైన ప్రాతినిధ్యం కోసం చేస్తున్న ఆందోళనలపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని లేఖలో పేర్కొన్నారు. ప్రత్యేకమైన సంస్కృతి, జీవన విధానం ఉన్న ఆదివాసీల మతాన్ని గతంలో నిర్వహించిన జనాభా లెక్కల్లో ప్రత్యేకంగా నమోదు చేశారని ఆమె గుర్తుచేశారు. అదే రీతిలో ప్రస్తుత జనగణనలోనూ ఆదివాసీల మతాన్ని ప్రత్యేక కోడ్‌తో నమోదు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తేలాలన్నారు.
కేంద్రానికి తీర్మానం పంపాలి
బీసీల కులగణన, ఆదివాసీల మత నమోదు అంశాలపై శాసనసభ, మండలిల్లో ఏకగ్రీవంగా తీర్మానాలు ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి వెంటనే పంపాలని కవిత రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రజల, వెనుకబడిన వర్గాల, ఆదివాసీల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం తక్షణమే ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలని ఆమె కోరారు.
Also Read: పులివెందులలో హైటెన్షన్.. జగన్ కాన్వాయ్ ఆపిన దస్తగిరి, మా జీవితాలను నాశనం చేశారు, రంగంలోకి పోలీసులు