కొత్త పార్టీ ద్వారా తొలిసారిగా బలమైన ఎన్నికనే ఎదుర్కొనేందుకు టీఆరెస్ చీఫ్ కవిత రెడీ అయ్యారు. ఎన్నిక ఏదైనా పోటీ చేయడమే రాజకీయ పార్టీ లక్షణమని ఆమె పలుమార్లు తేల్చి చెప్పారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికైనా, రాబోవు జీహెచ్‌ఎంసీ ఎన్నికలైనా .. అన్నింట్లోనూ పోటీ చేస్తామని ఆమె ఇది వరకే ప్రకటించి ఉన్నారు.
వీటికన్నా ముందే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు రానున్నాయి. ఇప్పటికే ఎన్‌రోల్‌మెంట్ ప్రక్రియ జరుగుతోంది. కాంగ్రెస్ తమ పార్టీ అభ్యర్థులను కూడా ప్రకటించి దూసుకుపోతున్నది. బీఆర్‌ఎస్ కూడా ఖమ్మం, నల్గొండ, వరంగల్ నియోజకవర్గానికి అభ్యర్థిని ప్రకటించింది. ఎన్‌రోల్‌మెంట్‌పై దృష్టి పెట్టింది.
ఈ క్రమంలోనే ఇవాళ కవిత కూడా దీనిపై కీలక ప్రకటన చేశారు. తను ఓటరుగా నమోదు చేసుకోవడంతో పాటు నిరుద్యోగులను, పట్టభద్రులను ఓటరుగా ఎన్‌రోల్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రశ్నించే గొంతుగా ఉన్న కొత్తపార్టీ టీఆర్‌ఎస్‌ను గెలిపించుకోవాలని ఆమె కోరారు. త్వరలో తమ పార్టీ నుంచి మంచి అభ్యర్థులను బరిలోకి దింపుతామని ప్రకటించారు. దీంతో తొలిసారిగా కొత్త పార్టీ ద్వారా కవిత ఈ ప్రధాన ఎన్నికలను ఎదుర్కొనేందుకు రెడీ అయినట్టుగా తేలిపోయింది.
జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా, ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే సరైన సమయం ఇదేనని ఈ సందర్భంగా ఆమె యువతకు సూచించారు. టీఆర్ఎస్ పార్టీ అంటేనే ప్రశ్నించే గొంతుక అని.. తమ పార్టీ నుంచి రెండు గ్రాడ్యుయేట్ స్థానాల్లో మంచి వాళ్లకు అవకాశం ఇస్తామని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికైనా యువకులు, నిరుద్యోగులు ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఆమె పార్టీ పెట్టిన తొలినాళ్లలోనే మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి. ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ సింహం గుర్తును తీసుకుని ఆమె కొన్ని చోట్ల తన పార్టీ నుంచి అభ్యర్థులను నిలిపారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీని గెలిచి సత్తా చాటారు. ఆ తరువాత ఏ ఎన్నిక వచ్చినా పోటీ చేయడానికి ఆమె సిద్దంగానే ఉన్నారు. ఇప్పుడు ఆ తరుణం రానే వచ్చింది.
వచ్చే ఏడాది మార్చిలో పట్టభద్రుల ఎమ్మెల్సీకి చెందిన రెండు నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్‌నగర్ నియోజకవర్గంపై బీజేపీ భారీ ఆశలు పెట్టుకున్నది. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్‌గా దృష్టి పెట్టారు. ఏరికోరి సామ రామ్మోహన్‌రెడ్డికి చాన్సు ఇచ్చారు. ఈ స్థానం గెలుపును సీఎం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు.
నల్లగొండ- ఖమ్మం- వరంగల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి గెలుపు బాధ్యతలను మంత్రులకు అప్పగించారు. ఇక్కడ బీఆర్‌ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ఎన్నికలను సెమీ ఫైనల్‌గా హరీశ్ ప్రకటించడం.. తమకు తాముగానే బరిగీసి నిలుచున్నట్టే బీఆర్‌ఎస్ రిస్క్ తీసుకునేందుకు రెడీ అయ్యింది.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిజామాబాద్-ఆదిలాబాద్- కరీంనగర్ నియోజకవర్గాన్ని గెలుచుకున్న బీజేపీ మంచి ఊపు మీదున్నది. యువత మోడీని చూసి తమకు ఓటేస్తారని భావిస్తోంది. అందుకే హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాలు… ఇక్కడి విద్యాసంస్థలపై ఆశలు పెట్టుకున్నది. ఇంతటి గట్టిపోటీ మధ్య కొత్తపార్టీ టీఆరెస్ ఎలా తట్టుకుని నిలబడుతుంది? కవిత స్ట్రాటజీ ఏమిటీ? తన ప్రచార అస్త్రాలు ఎలా ఉండబోతున్నాయి? రాజకీయ వ్యూహాలు ఫలిస్తాయా? పొలిటికల్ సర్కిళ్లలో ఈ పరిణామం ఆసక్తిని రేకెత్తిస్తున్నది.