Kavitha TRS: హైదరాబాద్ శివార్లలో లక్షలాది మంది జనం.. కళ్లు మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతులు.. కొత్తదనం ఉట్టిపడే జెండాలు. ఆ వేదికపై నుంచి కవిత గంభీరంగా ప్రకటించారు. మన పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన. ఆ మరుసటి రోజు పత్రికల్లో ఫుల్ పేజీ యాడ్స్.. టీవీల్లో బ్రేకింగ్ న్యూస్.. అంతటా TRS అనే పేరే మారుమోగింది. ప్రజల మైండ్‌లో కవిత పార్టీ అంటే రాష్ట్ర సేన అని ఫిక్స్ అయిపోయారు. కానీ సరిగ్గా వారం తిరగక ముందే అసలు నిజం బయటపడింది. ఎలక్షన్ కమిషన్ వెల్లడించిన జాబితాలో ఆమె పార్టీ పేరు తెలంగాణ రక్షణ సేన అని ఉంది. అంతేకాదు, కవిత దరఖాస్తు చేసిన ఐదు పేర్లలో ఎక్కడా రాష్ట్ర సేన అనే పదమే లేదని తేలిపోయింది. ఇది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైనా పార్టీ పేరు ప్రకటించే ముందు వంద సార్లు ఆలోచిస్తారు. లీగల్ చిక్కులు రాకుండా చూసుకుంటారు. కానీ, కవిత వంటి అత్యంత విద్యావంతురాలు, రాజకీయ చతురత ఉన్న నేత.. అప్లికేషన్‌లో లేని పేరును ఎలా అనౌన్స్ చేస్తారు? ఇందులో వ్యూహం లేకపోలేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకటి బ్రాండ్ హైజాకింగ్.. పాత టీఆర్‌ఎస్‌కు అత్యంత చేరువగా ఉండే పేరు తెలంగాణ రాష్ట్ర సేన. ప్రజలకు కన్ఫ్యూజన్ లేకుండా రాష్ట్ర అనే పదాన్ని వారి మెదళ్లలోకి పంపడమే ఆమె ప్రాథమిక లక్ష్యం కావచ్చు. రెండోది వార్తల్లో నిలవడం.. పేరు మార్పు అనేది ఒక వివాదంగా మారితేనే మీడియాలో ఎక్కువ చర్చ జరుగుతుంది. రాష్ట్ర అని చెప్పి రక్షణ అని మార్చడం ద్వారా మీడియా స్పేస్‌ను ఆమె పూర్తిగా ఆక్రమించగలిగారు.
కవిత తన వ్యూహాన్ని మార్చుకోవడంలో ఒక బలమైన సెంటిమెంట్ దాగి ఉంది. రాష్ట్ర అనేది ఒక భౌగోళిక ఉనికిని మాత్రమే తెలుపుతుంది. కానీ రక్షణ అనేది ఒక బాధ్యతను, ఒక పోరాటాన్ని సూచిస్తుంది. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతిన్నాయని, ఇప్పుడు రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పదలుచుకున్నట్లు అర్థమవుతుంది. తనపై జరుగుతున్న దాడుల నుంచి, ఢిల్లీ నుంచి వస్తున్న ఒత్తిళ్ల నుంచి తనను తాను రక్షించుకుంటూనే, తెలంగాణ ప్రజలకు రక్షణ కవచంగా ఉంటానని సంకేతాలివ్వడమే రక్షణ సేన వెనుక ఉన్న అసలు సీక్రెట్‌గా భావిస్తున్నారు.
అయితే నిజంగానే కవిత పొరపాటున రాష్ట్ర సేన అనే పేరును ప్రకటించారా? అంటే రాజకీయ విశ్లేషకులు కానే కాదని కుండబద్దలు కొడుతున్నారు. కోట్ల రూపాయల ప్రకటనలు ఇచ్చేటప్పుడు ప్రతి అక్షరాన్ని సరిచూసుకుంటారు. రాష్ట్ర సేన అని పత్రికల్లో అచ్చు వేయించారంటే.. అది పక్కా ప్లాన్ ప్రకారమే జరిగింది. పాత టీఆర్‌ఎస్ ఓటు బ్యాంకును ఆకర్షించడానికి రాష్ట్ర అనే పదాన్ని ఒక ట్రాప్ లాగా వాడారనే అంచనా వేస్తున్నారు. ఒకవేళ నేరుగా రక్షణ సేన అని ప్రకటించి ఉంటే, దానికి ఇంతటి పబ్లిసిటీ వచ్చేదా?
ఖచ్చితంగా రాదు. రాష్ట్రం పేరుతో మొదలుపెట్టి రక్షణ దగ్గర ఆగడం ద్వారా, ఆమె రెండు సార్లు ప్రజల దృష్టిని ఆకర్షించగలిగారు.
బీఆర్ఎస్‌ను మళ్ళీ టీఆర్‌ఎస్‌గా మార్చాలని కేటీఆర్ అండ్ కో భావిస్తున్న తరుణంలో.. కవిత రాష్ట్ర సేన అని చెప్పి వారిని టెన్షన్‌లో పెట్టారు. తీరా రక్షణ సేన అని రిజిస్టర్ చేయించుకుని, సంక్షిప్త నామం TRS ను లీగల్‌గా లాక్ చేసేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు తెలంగాణ రాష్ట్ర సమితి అని పేరు మార్చుకోవాలన్నా, కవిత పార్టీ తెలంగాణ రక్షణ సేనతో పోలిక ఉంటుంది కాబట్టి ఈసీ అనుమతి లభించడం కష్టమవుతుంది. ఇది కవిత బీఆర్‌ఎస్‌కు వేసిన అసలైన చెక్‌మేట్.
రాష్ట్రం పేరుతో సెంటిమెంట్‌ను తట్టి లేపి, రక్షణ పేరుతో సైన్యాన్ని సిద్ధం చేసుకుంటున్నారు కల్వకుంట్ల కవిత. రాష్ట్రం వచ్చి పదేళ్లు దాటిన తర్వాత కూడా ఇంకా తెలంగాణ వాదం పని చేస్తుందా? అనే ప్రశ్నకు కవిత తన చర్యల ద్వారా సమాధానం చెబుతున్నారు. బీఆర్ఎస్ తన పేరులో తెలంగాణ తీసేసి తప్పు చేసిందని..ఇప్పుడు తెలంగాణ రక్షణ అనే కొత్త నినాదంతో ప్రజల్లోకి వెళ్తేనే మనుగడ ఉంటుందని ఆమె భావిస్తున్నారు. అందుకే పేరులో ఉన్న కన్ఫ్యూజన్‌ను కూడా తన అడ్వాంటేజ్‌గా మార్చుకున్నారు.
రాజకీయాల్లో పేరులోనే అంతా ఉంటుంది. రాష్ట్రం అని చెప్పి రక్షణ అని ఆమోదింపజేసుకోవడం వెనుక కల్వకుంట్ల కవిత రాజనీతి దాగి ఉంది. ఇది పొరపాటు కాదు.. ఒక వ్యూహాత్మకమైన పొరపాట్లు చేసి ప్రత్యర్థులను బోల్తా కొట్టించే పద్ధతి. మొత్తానికి TRS అనే బ్రాండ్ ఇప్పుడు కవిత చేతిలో ఉంది. ఈ రక్షణ సేన తెలంగాణ రాజకీయాల్లో ఎవరికి రక్షణగా నిలుస్తుంది? ఎవరిని దెబ్బతీస్తుంది? అనేది కాలమే నిర్ణయించాలి. ఏది ఏమైనా, కవిత తన సెకండ్ ఇన్నింగ్స్‌ను అత్యంత చాకచక్యంగా, సంచలనాత్మకంగా ప్రారంభించారని చెప్పుకోవచ్చు.
కల్వకుంట్ల కవిత.. ఈ పేరు వినగానే ఒకప్పుడు తెలంగాణ ఉద్యమకారుల్లో ఒక రకమైన ఊపు వచ్చేది. 1978 మార్చి 13న కరీంనగర్‌లో జన్మించిన కవిత, తన తండ్రి కేసీఆర్ రాజకీయ ఎదుగుదలను దగ్గర నుండి చూశారు. ఇంజనీరింగ్ పూర్తయ్యాక అమెరికా వెళ్లి, అక్కడ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా స్థిరపడింది. అయితే 2004-2006 మధ్య కాలంలో తెలంగాణ మలిదశ ఉద్యమం పతాక స్థాయికి చేరుకుంది. అప్పుడు కవిత అమెరికాలో ఉద్యోగాన్ని వదిలి, తెలంగాణ కోసం పోరాడాలని నిర్ణయించుకున్నారు. అందుకే క్షేత్రస్థాయిలోకి వెళ్లారు.. పల్లె పల్లెను తట్టారు.
రాజకీయాల్లోకి రాకముందే కవిత ఒక సామాజిక శక్తిగా ఎదిగారు. 2006లో తెలంగాణ జాగృతి స్థాపించి ..గల్లీ నుంచి లండన్ దాకా బతుకమ్మ వైభవాన్ని చాటిచెప్పారు. తెలంగాణ మహిళలను ఏకం చేయడంలో జాగృతి చేసిన కృషి సామాన్యమైనది కాదు. కేవలం పండుగలే కాదు.. ఫ్లోరైడ్ రక్కసితో తల్లడిల్లుతున్న నల్లగొండ జిల్లాలో గ్రామాలను దత్తత తీసుకుని, వేలాది మంది పేద విద్యార్థులకు అండగా నిలబడ్డారు. జాగృతి ద్వారా నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసి, యువతకు ఉపాధి కల్పించి, తనకంటూ ఒక ప్రత్యేకమైన ఓటు బ్యాంకును, అభిమాన గణంను సృష్టించుకున్నారు.
2014.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన సమయం. కవిత ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుండి పోటీ చేసి, కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్‌ను ఓడించారు. పార్లమెంట్‌లో ఆమె ప్రసంగాలు ఢిల్లీని సైతం ఆశ్చర్యపరిచాయి. ఇంగ్లీష్, హిందీ భాషల్లో అనర్గళంగా మాట్లాడుతూ తెలంగాణ సమస్యలను ఎలుగెత్తి చాటారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం జంతర్ మంతర్ వద్ద ఆమె చేసిన ధర్నా, జాతీయ స్థాయి నాయకుల దృష్టిని ఆకర్షించింది. అప్పట్లో కవిత అంటే పార్టీలో నంబర్ 2 లేదా నంబర్ 3 పొజిషన్. అంతలా ఆమె ప్రభావం ఉండేది.
రాజకీయాల్లో వెలుగు ఎంత ఉంటుందో.. చీకటి కూడా అంతే వేగంగా వస్తుంది. 2019 ఎన్నికలు కవితకు ఒక పీడకలగా మిగిలాయి. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయలేదన్న కోపంతో వందలాది మంది రైతులు స్వతంత్రంగా పోటీ చేశారు. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఇచ్చిన హామీల ముందు కవిత చరిష్మా పనిచేయలేదు. తొలిసారిగా ఆమె ఓటమిని చవిచూశారు. ఆ ఓటమి ఆమెను కుంగదీస్తుందని అందరూ భావించారు, కానీ కవిత వెనకడుగు వేయలేదు. ఓడినా కూడా నిజామాబాద్ ప్రజల మధ్యే ఉంటూ తన పట్టును నిలుపుకునే ప్రయత్నం చేశారు.
ఓటమి తర్వాత కొంతకాలం మౌనంగా ఉన్న కవితను కేసీఆర్ ఎమ్మెల్సీగా శాసనమండలికి పంపారు. నిజామాబాద్ స్థానిక సంస్థల నుండి ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే, ఆమె రాజకీయ జీవితంలో అతిపెద్ద గండం ఢిల్లీ లిక్కర్ స్కామ్ రూపంలో వచ్చింది. ఈడీ, సీబీఐ విచారణలు.. గంటల కొద్దీ ప్రశ్నలు.. చివరకు 2024 మార్చి 15న అరెస్ట్.. తీహార్ జైలులో 5 నెలల పాటు గడిపిన కాలం ఆమెను మానసికంగా, రాజకీయంగా ఎంతో మార్చేసింది. జైలు నుండి బయటకు వచ్చాక కవితలో మునుపటి మెరుపు కనిపించినా, లోపల మాత్రం ఏదో అసంతృప్తి రగులుతూనే ఉంది.
2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడం.. ఆ తర్వాత కవిత సైలెంట్ అయిపోవడం చకచకా జరిగిపోయాయి. అయితే.. బీఆర్ఎస్ ఓటమికి కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామే కారణమన్న ఆరోపణలు అప్పట్లో బలంగా వినిపించాయి. దీనికి తోడు అమెరికా వెళ్లిన సమయంలో.. కవిత, తన తండ్రికి రాసిన లేఖ బయటకు రావడం అప్పట్లో సంచలనం రేపింది. అప్పటి నుంచి కవితకు, బీఆర్ఎస్ నాయకత్వానికి అంతర్గత పోరు నడిచింది. బాహాటంగానే బీఆర్ఎస్‌పై, ముఖ్యంగా హరీష్ రావు, సంతోష్ రావు, కేసీఆర్ వైఫల్యాలు, కాళేశ్వరం ప్రాజెక్టు, బీఆర్ఎస్ నేతల అవినీతిపై కవిత విమర్శలు చేయడం సంచలనంగా మారింది. దీంతో 2025 సెప్టెంబర్‌లోనే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో బీఆర్ఎస్ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. కన్న కూతురని కూడా చూడకుండా కేసీఆర్ తీసుకున్న ఆ నిర్ణయం కవితను తీవ్రంగా గాయపరిచింది.
బీఆర్ఎస్ నేతలు తనను లిక్కర్ రాణి అని విమర్శిస్తుంటే.. కవిత మాత్రం మౌనంగా ఉండి తన ఆయుధాన్ని సిద్ధం చేసుకున్నారు. కేసీఆర్ టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చడం వల్లే తెలంగాణ’ అనే సెంటిమెంట్ పోయిందని ఆమె బలంగా నమ్మారు. అందుకే అందరికంటే ముందుగా అడుగు వేసి.. ‘తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో పార్టీని ప్రకటించారు. అయితే కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రకటనలు ఇచ్చినప్పుడు రాష్ట్ర సేన అని చెప్పారు. కానీ ఎన్నికల కమిషన్ కు దరఖాస్తు చేసిన ఐదు పేర్లలో ఆ పేరు అసలు లేదు. అప్లికేషన్‌లో ఉన్న పేర్లలో ఒకటైన తెలంగాణ రక్షణ సేనను ఈసీ ఆమోదించింది. ఇక్కడ రాష్ట్రం కంటే ‘రక్షణ’ అనే పదం మరింత పవర్‌ఫుల్ అని కవిత భావిస్తున్నారు.
ఇప్పుడు కవిత ముందున్నది అగ్నిపరీక్ష. ఒకవైపు అధికార కాంగ్రెస్, మరోవైపు బలపడుతున్న బీజేపీ, ఇంకోవైపు తన సొంత కుటుంబం నేతృత్వంలోని బీఆర్ఎస్. 13 ఏళ్ల తర్వాత మళ్ళీ తెలంగాణ వాదంతో ప్రజల్లోకి వెళ్తే జనం ఆదరిస్తారా? కేవలం కేసీఆర్ బిడ్డగా కాకుండా, తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలిగా ఆమె ఏ మేరకు ప్రభావం చూపుతారు? ఆమె కట్టుబొట్టు, అనర్గళమైన ప్రసంగ పాఠవం, విషయ పరిజ్ఞానం ఆమెను ఇందిరా గాంధీ లేదా జయలలిత వంటి ధీరవనితల వరుసలో నిలబెడతాయా? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. అయితే కోట్లాది రూపాయలు ఖర్చుతో పార్టీ ప్రకటన చేసి..మరీ ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర సేన ఇప్పుడు..నన్నెందుకు రాజకీయాల్లోకి లాగారని ప్రస్తావిస్తోంది.
మొత్తానికి తండ్రి నీడ నుండి బయటకు వచ్చిన కవిత.., తనకంటూ ఒక సొంత సైన్యాన్ని రక్షణ సేన రూపంలో సిద్ధం చేసుకుంది. మరి టీఆర్ఎస్ బ్రాండ్‌ను తన ఖాతాలో వేసుకున్న కవిత.. రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాలను ఏ మలుపు తిప్పుతారో చూడాలి. రాష్ట్ర సేన నుంచి రక్షణ సేన దాకా.. ఆమె వేసిన ప్రతి అడుగు ఒక రాజకీయ చదరంగమే! ఈ చదరంగంలో ఆమె గెలుస్తుందా? లేక కుటుంబ పోరులో చిక్కుకుపోతుందా? వేచి చూడాల్సిందే.
Also Read: గద్వాలలో డీసీఎం బీభత్సం.. ముగ్గురు అన్నదమ్ములు దుర్మరణం
Story by: Anup, Big Tv