BigTV English

Kcr Public Entry: కేసీఆర్ గజ్వేల్ లెక్కలు.. ఐదు లక్షల మందితో భారీ బహిరంగ సభ

Kcr Public Entry: కేసీఆర్ గజ్వేల్ లెక్కలు.. ఐదు లక్షల మందితో భారీ బహిరంగ సభ

Kcr Public Entry:  మాజీ ముఖ్యమంత్రి కసీఆర్ ఉన్నట్టుండి జనంలోకి వస్తానంటున్నారు. రెండు టర్మ్‌లు అధికారం చెలాయించి అది పోగానే దాదాపు ఏడాదికి పైగా ఫాంహౌస్‌కు పరిమితమైన గులాబీ బాస్ ఇప్పుడు సడన్‌గా బహిరంగ సభ పెడతానడం వెనుక వ్యూహం ఏంటి?  తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేలులో సభ పెట్టడానికి సన్నాహాలు చేయిస్తున్న ఆయన ఆక్కడ ఏం చెప్పదలచుకున్నారు? అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, లోక్‌సభ ఎన్నికల్లో చావుదెబ్బతో కుంగిపోతున్న పార్టీ శ్రేణులను యాక్టివ్ చేయడానికా? కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినా ఉనికి చాటుకోవాలనా?


ఎర్రవెల్లి ఫాంహౌస్‌కు ఇటీవల జనగామ బీఆర్ఎస్ నాయకులు , కార్యకర్తలు వచ్చినప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రదర్శించిన ఉత్సాహమిది. అధికారం కోల్పోయాక ఇలాంటి స్టేట్‌మెంట్లు వివిధ సందర్భాల్లో ఇచ్చారు కేసీఆర్. ఇదిగో వ‌స్తున్నా.. అదిగో వస్తున్నా అంటూ గత ఏడాది కాలంగా ఫామ్ హౌస్‌లో నుంచి ప్రకటనలు గుప్పించి కేడర్‌లో ఉత్సాహాన్ని నింపడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆయన బయటకు రాకపోయినా కేటీఆర్‌, హ‌రీశ్ రావులు ప్రజ‌ల్లో ఉంటూ పార్టీ నేత‌ల‌కు అండ‌గా ఉన్నామ‌ని భ‌రోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా.. వారి మాట‌ల‌ను ప‌ట్టించుకోని కొంద‌రు నేత‌లు ఆ పార్టీని వీడుతున్నారు. ఇలా.. బీఆర్ఎస్ పార్టీని వీడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

ఆ క్రమంలో అధికారం కోల్పోతే ఇక ప్రజలతో, పార్టీతో పనిలేదా అని గులాబీ శ్రేణులే కేసీఆర్‌పై చిర్రుబుర్రు లాడుతున్నాయి. క‌నీసం అసెంబ్లీకి కూడా హాజరుకాకపోతుండటంతో ఇక కేసీఆర్ పనైపోయింది. రాజ‌కీయాల్లో యాక్టివ్ కావ‌టం క‌ష్టమేన‌న్న అభిప్రాయానికి ఆ పార్టీ నేత‌లు వ‌స్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఫిబ్రవ‌రి చివ‌రి వారంలో భారీ బ‌హిరంగ స‌భ పెడ‌తామని ప్రకటించారు. దానికైనా కేసీఆర్ క‌ట్టుబ‌డి ఉంటారా లేదా అని బీఆర్ఎస్ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. అయితే వారి అనుమానాలు పటాపంచలు చేస్తూ గులాబీబాస్ నిజంగానే ఫాంహౌస్ నుంచి బయటకు వచ్చే పనిలో పడ్డారంట.


బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రభుత్వం కోల్పోయాక తొలిసారి ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టబోతున్నట్లు పార్టీ వర్గాలు నమ్మకంగా చెప్తున్నాయి. ఏడాది పాలన తర్వాత కాంగ్రెస్‌ సర్కారు పాలనా వైఫల్యాలపై నిలదీసేందుకు ఆయన బయటకు వస్తున్నారంట. బహిరంగసభను తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌లోనే నిర్వహించాలని కేసీఆర్ ఫిక్స్ అయ్యారంట. అందుకు తగిన ప్రాంగణం చూడాలని పార్టీ శ్రేణులకు ఆదిశించినట్టు తెలుస్తుంది.

అధికారం కోల్పోయాక మాజీ ముఖ్యమంత్రి పాల్గొననున్న గజ్వేలు బహిరంగ సభకు 5 లక్షల మందిని సమీకరించాలి గులాబీపార్టీ టార్గెట్‌గా పెట్టుకుందంట. మెదక్ జిల్లాలోని గజ్వేలు నియోజకవర్గంలో అంతమంది పట్టే సభా స్థలి కోసం పార్టీ వర్గాలు అన్వేషిస్తున్నాయంట. ఇక గజ్వేలులోనే సభ పెట్టడానికి కారణముందంటున్నారు. 5 లక్షల మందిని సభకు తరలించడం అంటే వ్యయప్రయాసలతో కూడిన వ్యవహారమే. అదీ ఎలాంటి పొలిటికల్ హడావుడి లేని తరుణంలో అంత మందిని సమీకరించాలంటే తడిసిమోపెడవుతుంది.

వేరే చోట ఎక్కడైనా సభ పెడితే జనసమీకరణ కష్ట సాధ్యమవుతుంది కాబట్టి గజ్వేలునే సెలెక్ట్ చేశారంట. గజ్వేలు ఎమ్మెల్యేగా కేసీఆర్ మూడో సారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, అది కాక గజ్వేలుని ఆనుకొని ఉన్ని సిద్దిపేట ఎమ్మెల్యేగా మాజీ మంత్రి హరీష్‌రావు ఉన్నారు. దాంతో మామాఅల్లుళ్లు ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్ల నుంచే మెజార్టీ జనాన్ని సమీకరిస్తే .. మిగిలిన ప్రాంతాల నేతలు అటు ఇటుగా వ్యవహరించినా పెద్దగా ఫరక్ పడదన్న ముందుచూపుతోనే గజ్వేలును ఎంపిక చేశారంట.

అందుకు అనుగుణంగానే సభ నిర్వహణకు గులాబీ పార్టీ కసరత్తు చేస్తోందట. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏడాది పాలనా వైఫల్యమే అజెండాగా ఈ సభను నిర్వహించాలని కారు పార్టీ భావిస్తోంది. ఇటీవల ఫాంహౌస్‌లో మాట్లాడినప్పుడు కేసీఆర్ ప్రభుత్వం తీరును తాను ఇన్ని రోజులు మౌనంగా, గంభీరంగా చూస్తున్నానని.. తాను కొడితే మామూలుగా ఉండదని, గట్టిగా కొట్టడం తనకున్న అలవాటని డైలాగ్ వేశారు. తాను పదేళ్లు అధికారంలో ఉండి కూడా పూర్తి చేయలేని ప్రాజెక్టుల గురించి వదిలేసి సంగమేశ్వర, బసవేశ్వర పనులు ఆగిపోయాయన్నారు. SLBC, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, కూలిన కాళేశ్వరం గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారు. దాంతో గజ్వేలు సభలో ఆయన ఏ సబ్జెక్టులపై ఫోకస్ పెడతారన్నది ఆసక్తి రేపుతోంది.

Also Read: నమ్మకం లేదు దొర.. కేసీఆర్‌ను లెక్క చేయని కేడర్

అదలా ఉంటే ఉన్నట్టుండి కేసీఆర్ బయటకు రావడం. బహిరంగ సభ పెడతాను అనడం వెనక ఉన్న వ్యూహం ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. ఓవైపు పార్టీ ముఖ్యనేతలను కేసులు వెంటాడుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలు, విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి కేసీఆర్‌కు ఉచ్చు బిగుసుకునే పరిస్థితి కనిపిస్తుంది … ఇప్పటికే ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్‌పై అభియోగాలు నమోదయ్యాయి. ఢిల్లీ లిక్కర్ కేసు విచారణలో ఉండగానే.. మరో లిక్కర్‌ స్కామ్‌లో కవిత పేరు వినిపిస్తుంది.. కేరళలో మద్యం కుంభకోణంలో సైతం కవిత ప్రమేయం ఉందని కేరళ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

పార్టీని నడిపిస్తున్న ముఖ్యనేతలు కేసులు, ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దాంతో అసలే వరుస ఓటముల భారంతో కుంగి పోతున్న కారు పార్టీ క్యాడర్ మరింత ఢీలా పడిపోతుంది. మరోవైపు బ్రేకులు లేకుండా కొనసాగుతున్న వలసలు కార్యకర్తలను మరింత గందరగోళంలోకి నెడుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు అభ్యర్థులు కరువైనా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు. అది దృష్టిలో పెట్టుకునే కేసీఆర్ కాస్త లేట్ అయినా యాక్టివ్ అవ్వాలని చూస్తున్నారంట. పార్టీ లీడర్స్‌ను, క్యాడర్‌ను యాక్టివ్‌ చేయడానికే కేసీఆర్ బహిరంగసభ ప్లాన్ అనే చర్చ నడుస్తోంది. ఎలాగైనా సరే బహిరంగ సభను సక్సెస్ చేసి పార్టీ శ్రేణుల్లో భరోసా నింపాలని కేసీఆర్ పట్టుదలతో ఉన్నారంట. మరి చూడాలి గజ్వేలు సభతో ఆయనేం సాధిస్తారో?

 

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×