Kumbh Mela Special Trains: ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు దేశ నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా గత నెల 13న ప్రారంభం అయిన కుంభమేళాలో కనీవినీ ఎరుగని రీతిలో భక్తులు పాల్గొంటున్నారు. మహా శివరాత్రి (ఫిబ్రవరి 26) వరకు ఈ ఆధ్యాత్మిక సంబురాలు కొనసాగనున్నాయి. 45 రోజుల పాటు కొనసాగే కుంభమేళా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు తరలి వస్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించి పునీతులవుతున్నారు. 144 ఏండ్లలో ఒకసారి వచ్చే మహా కుంభమేళాలో కచ్చితంగా పాల్గొనాలనే ఉద్దేశంతో దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలు ప్రయాగరాజ్ కు బయల్దేరుతున్నారు.
కుంభమేళా రైళ్లకు బోగీలను పెంచుతూ సౌత్ సెంట్రల్ రైల్వే నిర్ణయం
ప్రయాగరాజ్ లో జరిగే మహా కుంభమేళాకు భారతీయ రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి మొత్తం 13 వేల రైళ్లను నడుపుతున్నది. వీటిలో 10 వేల రెగ్యులర్ రైళ్లు ఉండగా, 3 వేలకు పైగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నది. ప్రత్యేక రైళ్ల ద్వారా పెద్ద సంఖ్యలో భక్తులు ప్రయాగరాజ్ వెళ్తున్నారు. పుణ్యస్నానాలు చేసేందుకు పోటీ పడుతున్నారు. ఇక పలు రాష్ట్రాల నుంచి కుంభమేళాకు వచ్చే రైళ్లలోనూ రద్దీ ఎక్కువగా కనిపిస్తున్నది. ఏపీలోని విజయవాడ, కాకినాడ నుంచి కుంభమేళా కోసం ప్రత్యేకంగా నడుపుతున్న రైళ్లలోనూ రద్దీ భారీగా కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ రెండు రైళ్లకు బోగీల సంఖ్యను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రైల్వేశాఖ కీలక ప్రకటన విడుదల చేసింది.
Read Also: మన వందేభారత్ కు మరిన్ని కోచ్ లు, ప్రయాణీకులకు రైల్వేశాఖ సూపర్ న్యూస్!
ఏ రైళ్లో ఎన్ని కోచ్ లు పెరిగాయంటే?
రైల్వేశాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం విజయవాడ నుంచి గయా వెళ్లే ప్రత్యేక రైలులో రెండు థర్డ్ ఏసీ కోచ్ లు, రెండు స్లీపర్ కోచ్ లు పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ రైలు ఈనెల 5న విజయవాడ నుంచి బయల్దేరే గయాకు వెళ్లనుంది. అదే రైలు ఈ నెల 8న గయా నుంచి బయల్దేరి విజయవాడకు రానుంది. అటు ఈనెల 8న కాకినాడ టౌన్ నుంచి బయల్దేరి గయాకు వెళ్లే ప్రత్యేక రైలులోనూ రెండు థర్డ్ ఏసీ కోచ్ లను కలుపుతున్నారు. అటు గయా నుంచి ఈ నెల 10న తిరిగి బయల్దేరే ఈ రైలు కాకినాడ టౌన్ కు చేరుకోనుంది. ఈ రైళ్లలో పెరిగిన కోచ్ లను మహా కుంభమేళాకు వెళ్లే భక్తులు వినియోగించుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. ప్రయాణీకుల రద్దీని బట్టి ఆయా రైళ్లకు కోచ్ ల సంఖ్య మరిన్ని పెంచే అవకాశాన్ని పరిశీలిస్తామని వెల్లడించారు. ఒకవేళ రద్దీ తగ్గితే బోగీల సంఖ్యను తగ్గిస్తామని ప్రకటించారు.
Read Also: తెలియని వ్యక్తులకు టికెట్లు బుక్ చేస్తున్నారా? జైల్లో ఊచలు లెక్కబెట్టడం ఖాయం!