E-Paper
Advertisement

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై కమలం గట్టి ఫోకస్.. కారణం బీజేపీ అసలు ప్లాన్ ఇదే?

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై కమలం గట్టి ఫోకస్.. కారణం బీజేపీ అసలు ప్లాన్ ఇదే?
Advertisement

BJP Strategy: స్వేచ్చ బ్యూరో: కేంద్రంపై.. కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న రాజకీయ పోరాటానికి అదే స్థాయిలో క్షేత్రస్థాయిలో సమాధానం చెప్పాలని బీజేపీ అధిష్ఠానం వ్యూహం రచిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలనే లక్ష్యంగా చేసుకుని ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించినట్లు పార్టీ కార్యక్రమాల సరళి స్పష్టం చేస్తోంది. ఢిల్లీ వేదికగా కాంగ్రెస్, ఇండియా కూటమి చేస్తున్న నిరసనలు, ఓటు చోరీ ఆరోపణలకు కేవలం ప్రకటనలతోనే కాకుండా.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పాదయాత్రలు, బహిరంగ సభలు, ప్రజా సంపర్క కార్యక్రమాలతో దీటుగా బదులివ్వాలని కమలనాథులు భావిస్తున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఆ పార్టీ ప్రభుత్వాల పాలన, వైఫల్యాలు, ప్రజా సమస్యలను స్థానికంగా ప్రస్తావిస్తూనే.. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టడం ఈ కార్యాచరణలో కీలక అంశాలుగా కనిపిస్తున్నాయి.

దేశవ్యాప్తంగా పాదయాత్రలు..

ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణపై కాంగ్రెస్, ఇండియా కూటమి కేంద్ర ఎన్నికల సంఘాన్ని లక్ష్యంగా చేసుకుని రాజకీయ పోరాటాన్ని ఉధృతం చేస్తున్నాయి. నవంబర్‌ 1న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో కాంగ్రెస్ నిర్వహించిన నిరసనకు మరుసటి రోజే బీజేపీ తన ప్రతివ్యూహాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా పాదయాత్రలు, సభలు, మీడియా సమావేశాలు, ప్రజా అవగాహన కార్యక్రమాలతో ప్రతిపక్షాల ప్రచారాన్ని ఎదుర్కోవాలని ప్రణాళిక సిద్ధం చేసింది. ఎస్‌ఐఆర్‌ వల్ల అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోతున్నాయన్న ప్రతిపక్షాల ఆరోపణలను ఖండిస్తూ.. ఓటరు జాబితాల ప్రక్షాళన అవసరాన్ని ప్రజలకు వివరించాలని బీజేపీ భావిస్తోంది.

బీజేపీ స్కెచ్..

Advertisement

కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో స్థానిక సమస్యలను రాజకీయ అస్త్రాలుగా మలచుకోవాలని బీజేపీ యోచిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాల హామీలు, పాలనా తీరు, ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను ఆయా ప్రాంతాల్లోనే ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టాలన్నది వ్యూహంగా కనిపిస్తోంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ చేస్తున్న విమర్శలకు స్థానిక పాలన అంశాలను జోడించడం ద్వారా ప్రజల్లో ప్రత్యామ్నాయ రాజకీయ కథనాన్ని బలంగా తీసుకెళ్లాలని కమలనాథులు భావిస్తున్నారు. ఇందుకోసం జాతీయ నాయకులు, కేంద్ర మంత్రులు, పార్టీ ముఖ్య నేతలను రంగంలోకి దించుతోంది.

నవంబర్‌ 2న తెలంగాణ..

ఈ జాతీయ కార్యాచరణలో భాగంగానే కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. నవంబర్‌ 2న తెలంగాణ బీజేపీ నిర్వహించిన ‘లోక్‌తంత్ర్ బచావో.. అరాచకత హఠావో’ మహా పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. బషీర్‌బాగ్‌లోని డాక్టర్‌ బాబు జగ్జీవన్‌రామ్‌ విగ్రహం వద్ద ప్రారంభమైన కార్యక్రమం అబిడ్స్‌ మీదుగా మోజంజాహీ మార్కెట్‌ వరకు సాగింది. ఎస్‌ఐఆర్‌పై ప్రతిపక్షాల ప్రచారాన్ని ఎదుర్కోవడంతోపాటు, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలన్న సంకేతాన్ని ఈ పర్యటన ద్వారా బీజేపీ ఇచ్చింది.

Advertisement

Also read: మురసు తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీలో పలు రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు

ఎస్‌ఐఆర్‌..

అమిత్ షా పర్యటన తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో రాజకీయ ఉత్సాహాన్ని నింపింది. కేంద్ర నాయకత్వం రాష్ట్ర రాజకీయాలపై ప్రత్యేక దృష్టి సారించిందన్న భావన పార్టీ క్యాడర్‌లో బలపడింది. రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని రాజకీయంగా మలచుకోవడం, భవిష్యత్తు ఎన్నికలకు ఇప్పటి నుంచే శ్రేణులను సిద్ధం చేయడం వంటి లక్ష్యాలకు ఈ పర్యటన దోహదం చేయనుంది. జాతీయ అంశమైన ఎస్‌ఐఆర్‌ను రాష్ట్ర రాజకీయాలతో ముడిపెట్టి ప్రజల్లోకి వెళ్లడం ద్వారా రెండు స్థాయిల్లోనూ రాజకీయ ప్రయోజనం పొందాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది.

ఉమ్మడి 10 జిల్లాలతో..

తెలంగాణలో హైదరాబాద్‌తోపాటు అన్ని ఉమ్మడి జిల్లాల్లో ఈ పాదయాత్రలు నిర్వహించాలని రాష్ట్ర బీజేపీ ప్రణాళిక రూపొందించింది. దీపావళికి ముందు పలు జిల్లాల్లో ఈ యాత్రలు పూర్తిచేయాలని భావిస్తోంది. ఉమ్మడి 10 జిల్లాలతో పాటు అదనంగా నిర్మల్ జిల్లాలో సైతం యాత్ర చేపట్టాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ముందడుగు వేయడంతో ఆ సెగ్మెంట్ లోనూ యాత్ర చేపట్టనున్నారు. మంగళవారం(ఈనెల 3న) నిర్మల్ లో ఈ యాత్ర చేపట్టనున్నారు. ఈ యాత్రకు చీఫ్​ గెస్ట్ గా కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొననున్నారు. కాగా కరీంనగర్ లో కూడా ఈనెల 5న పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా పాదయాత్ర చేపట్టాల్సి ఉంది.

కమలం వ్యూహం..

కానీ ఆయన పర్యటన వాయిదా పడటంతో దీపావళి తర్వాత ఈ యాత్రను కొనసాగించనున్నారు. ఒకవైపు కాంగ్రెస్ జాతీయ స్థాయిలో ఓటు హక్కు, ఎన్నికల సంఘం వ్యవహారాలపై పోరాటం చేస్తుంటే.. మరోవైపు బీజేపీ ప్రజల్లోకి నేరుగా వెళ్లి తన వాదనను వినిపించేందుకు ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాల పనితీరును ప్రశ్నించడం, ఎస్‌ఐఆర్‌పై ప్రతిపక్షాల ఆరోపణలను ఎదుర్కోవడం, పార్టీ శ్రేణుల్లో ఎన్నికల సన్నద్ధతను పెంచడం.. ఈ మూడు అంశాల చుట్టూనే కమలం వ్యూహం తిరుగుతోంది. ఈ రాజకీయ ప్రచారం ప్రజల్లో ఎంతవరకు ప్రభావం చూపుతుంది? కాంగ్రెస్‌కు ఎంతమేరకు కౌంటర్‌ ఇవ్వగలుగుతుంది? అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.

Also Read: అన్‌హెల్దీ అని తినడం మానేశారా? నిజానికి ఈ 5 ఫుడ్స్‌తో కలిగే లాభాలు అన్నీ ఇన్నీ కావు!

Tags

Related News

ఖైరతాబాద్ ఉపఎన్నిక సస్పెన్స్.. దానం నాగేందర్ వర్సెస్ పి. విజయారెడ్డి న్యాయపోరాటంలో గెలుపెవరిది?

ఉమ్మడి మెదక్ జిల్లా పదవుల్లో.. పక్క జిల్లా ఎమ్మెల్యే పైరవీలు..?

తమిళనాడుకు షాక్.. ఏపీకి జాక్‌పాట్.. రూ. 1614 కోట్ల కొరియన్ పెట్టుబడుల వెనుక అసలు కథ!

సీఎం విజయ్ కొత్త బిల్డింగ్ చూస్తే మైండ్ బ్లాకే.. అసలు ఆ లోపల ఏం జరుగుతోంది?

నాడు వై నాట్ కుప్పం.. నేడు ఫినిష్ పులివెందుల! ఏపీలో పీక్‌కి చేరిన ఈగో వార్!

ఏమిటీ మురసు తుఫాన్? పేరు వెనుక కథేంటి? ఏయే జిల్లాలపై తీవ్ర ప్రభావం?

బీఆర్ఎస్ ప్రాజెక్టుల పర్యటన ఎప్పుడు?.. కేసీఆర్ రీ-ఎంట్రీపై బిగ్ అప్‌డేట్?

Big Stories

Advertisement
×