Congress Rift: ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ పాలిటిక్స్ హీటేక్కాయి. జిల్లా పదవుల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకున్న తరుణంలో, పక్క జిల్లాకు చెందిన ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే శృతిమించి జోక్యం చేసుకోవడం ఇప్పుడు పార్టీ వర్గాల్లో తీవ్ర కలకలానికి దారితీసింది.ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్ష పదవి కోసం ఏకంగా ఏఐసీసీ పెద్దల స్థాయిలోనే సదరు ఎమ్మెల్యే తీవ్రంగా లాబీయింగ్ చేస్తున్నారనే చర్చ కొనసాగుతుంది. స్థానిక జిల్లా మంత్రులు, సీనియర్లు, స్థానిక నాయకులను కాదని, తనకు అనుకూలమైన వ్యక్తి కోసం ఆ ఎమ్మెల్యే ప్రయత్నించారని సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు చెబుతున్నారు. ఈ అంశంపై ఢిల్లీ స్థాయిలో పైరవీలు ప్రారంభించడంపై ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర అసంతృప్తిని రగిల్చింది.ఈ వ్యవహారంపై క్షేత్రస్థాయి నేతలు… స్థానిక సీనియర్ నాయకులు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. సొంత జిల్లా రాజకీయాల్లో వేరే జిల్లా నేత అనవసర జోక్యం చేసుకోవడంపై మంత్రి దామోదర రాజనర్సింహ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ఈ వివాదం తారాస్థాయికి చేరిన వేళ, తాజాగా ఢిల్లీలో మంత్రి దామోదర రాజనర్సింహా, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు ఎదురుపడ్డారు. ఏఐసీసీ పిలుపు మేరకు ధర్నా, నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన మంత్రి, ఎమ్మెల్యే.. ఇద్దరూ ఒకే హోటల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో హోటల్ లాబీలో తనకు ఎదురుగా వచ్చిన ఎమ్మెల్యేని మంత్రి దామోదర రాజనర్సింహా ప్రశ్నించారు. ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయాలు, పదవుల ఎంపికలో జోక్యం చేసుకోవడంపై మంత్రి దామోదర అక్కడికక్కడే ఆ ఎమ్మెల్యేను గట్టిగానే ప్రశ్నించారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పక్క జిల్లా పదవుల భర్తీలో వేలు పెట్టడం మంచి పద్దది కాదని మంత్రి దామోదర చెప్పినట్లు పక్కనే ఉన్న ఆయన సన్నిహితులు తెలిపారు. మంత్రి నేరుగా ప్రశ్నించేసరికి ఏం చెప్పాలో తోచక సదరు శాసనసభ్యుడు తీవ్ర ఇబ్బందికి గురై నీళ్లు నమిలినట్లు తెలుస్తుంది. ఆ తర్వాత ఈ అంశంపై వివిధ రకాలుగా సోషల్ మీడియాల్లో సర్క్యులేట్ అయింది. టీవీ మాధ్యమాల్లోనూ ఈ అంశాన్ని కాంట్రవర్సీ ఎపిసోడ్ గా ప్లే చేయడం గమనార్హం.
ఈ పరిణామాలపై జుక్కల్ ఎమ్మెల్యే స్పందిస్తూ.. తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. డీసీసీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ అనేది పూర్తి స్థాయిలో పార్టీ హైకమాండ్ నిర్ణయం మరియు ఆలోచన ప్రకారమే జరుగుతుందని ఆయన తెలిపారు.అందరి ముందూ ఓ సీనియర్ నాయకుడైన మంత్రి తనను తీవ్రంగా నిందించడం, తిట్టడంతో తన మనసు గాయపడినట్లు తెలిపారు. ఇది తన ఆత్మగౌరవానికి సంబంధించిన ఇష్యూ అని, తాను ఎంతో కష్టపడి, క్షేత్రస్థాయి నుంచి పోరాడి ఈ స్థాయికి వచ్చానన్నారు. తన పట్ల జరిగిన ఈ వ్యవహారంపై ఏఐసీసీ హైకమాండ్, టీపీసీసీ నాయకత్వంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకువెళ్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఓవైపు జిల్లా నాయకత్వం తమ ప్రాబల్యాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే, మరోవైపు ఇరుగుపొరుగు జిల్లాల నేతల జోక్యం పార్టీలో వర్గపోరుకు ఆజ్యం పోస్తోంది. ఈ అంశాన్ని రాష్ట్ర నాయకత్వంతో పాటు జాతీయ అధిష్టానం ఏ రకంగా పరిష్కరిస్తుందనేది హాట్ టాఫిక్ గా మారింది.
Also Read: సుకన్య రెడ్డి పేరిట ఫేక్ ప్రొఫైల్.. ట్రేడింగ్ యాప్లో కానిస్టేబుల్కు రూ.30 లక్షల టోకరా!