BigTV English

Kollu Ravindra-Perni Nani: కొల్లు రవీంద్ర యూ టర్న్.. పేర్ని నాని సేఫ్?

Kollu Ravindra-Perni Nani: కొల్లు రవీంద్ర యూ టర్న్.. పేర్ని నాని సేఫ్?

Kollu Ravindra-Perni Nani: మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని.. రెవెన్యూ రికార్డుల్లో కనిపించని సర్వే నంబర్లతో.. ఎన్నికల ముందు 10 వేలకు పైగా నకిలీ ఇళ్ల పట్టాలను.. ప్రజలకు పంపిణీ చేశారన్న ఆరోపణలున్నాయి. దానిపై అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. నకిలీ ఇళ్లపట్టాల పంపిణీపై విచారణ చేయాల్సిన అధికారులు ఇప్పటికీ దానిపై స్పందించడం లేదు. నకిలీ ఇళ్లపట్టాలపై అప్పట్లో హడావుడి చేసిన కొల్లు రవీంద్ర.. ప్రస్తుతం మంత్రిగా ఉన్నా కూడా ఈ కేసుపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పట్టణ వాసులు ప్రశ్నిస్తున్నారు.అసలు మినిస్టర్ ఎందుకు సైలెంట్ అయినట్లు?


దొంగ సర్వే నెంబర్లతో పేర్ని నాని ఇళ్ల పట్టాలు

మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య అలియాస్ నాని, అతని కుమారుడు పేర్ని కృష్ణమూర్తి కలిసి నకిలీ పత్రాలు, ఫోర్జరీ సంతకాలతో మచిలీపట్నం పరిధిలో రెవెన్యూ రికార్డుల్లో కనిపించని సర్వే నంబర్లతో ఇళ్ల పట్టాలను 10 వేలకు పైగా తయారు చేయించి పంపిణీ చేశారు. నాటి ముఖ్యమంత్రి జగన్‌ చిత్రాలను ముద్రించి మరీ ఇంటింటికీ పప్పు బెళ్లాల్లా పట్టాలు పంచిపెట్టారు. సాధారణ ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన తర్వాత గుట్టుచప్పుడు కాకుండా పట్టాలు పంచుతున్న విషయం తెలిసి.. టీడీపీ అభ్యర్థిగా ఉన్న కొల్లు రవీంద్ర, నాయకులు మచిలీపట్నం తహశీల్దారు కార్యాలయానికి చేరుకుని అప్పట్లో ధర్నా చేపట్టారు.


కొడుకుని గెలిపించుకోవడానికి నకిలీ పట్టాలు

జగన్ చిత్రాలు వేసి ఉన్న నకిలీ పట్టాలను అధికారులకు చూపిస్తూ కొల్లు రవీంద్ర ఫిర్యాదు కూడా చేశారు. ఎన్నికలు నెల రోజుల్లో ముగియనుండగా వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులతో పట్టాలు పంపిణీ చేయించడమేంటని నిలదీశారు. గత ఎన్నికల్లో మాజీ మంత్రి పేర్ని నాని పోటీకి దూరంగా ఉండి, మచిలిపట్నంలో తన కుమారుడు పేర్ని కిట్టుని వైసీపీ అభ్యర్ధిగా నిలబెట్టారు. తన కుమారుడ్ని ఎలాగైనా గెలిపించుకోవాలనే పేర్ని నాని నకిలీ పట్టాలు సృష్టించి పంచారని అప్పట్లో కొల్లు రవీంద్ర మండిపడ్డారు.

రవీంద్ర ఫిర్యాదుతో నకిలీ పట్టాలు స్వాధీనం చేసుకున్న జేసీ

అప్పట్లో కొల్లు రవీంద్ర ఫిర్యాదుతోనాటి కృష్ణా జిల్లా సంయుక్త కలెక్టర్‌గా ఉన్న గీతాంజలిశర్మ వచ్చి.. నకిలీ పట్టాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. అయితే పట్టాలను పంపిణీ చేసి ఇప్పటికి.. ఏడాదికి పైగా దాటిపోయింది. ఇప్పటికీ ఆ పట్టాలు వేలాది మంది పేదల వద్ద అలాగే ఉన్నాయి. 2019 ఎన్నికల ముందు నకిలీ పట్టాలను సృష్టించి పంపిణీ చేసిన ఉదంతంలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై తాజాగా కేసు నమోదైంది.

రోడ్డు మార్జిన్ స్థలాలు, చెరువుగట్లు శ్మశానాలకు పట్టాలు

పేర్ని నాని, అతని కుమారుడు పంచిన నకిలీ పట్టాల పంపిణీపై.. ఇప్పటివరకూ కేసు పెట్టడం కాదు కదా, కనీసం ఎవరూ దృష్టి సారించిన దాఖలాలు కనిపించడం లేదు. నాడు చర్యలు తీసుకోవాలంటూ నిలదీసి, ఆందోళన చేపట్టిన కొల్లు రవీంద్ర ప్రస్తుతం మంత్రిగా ఉన్నా.. ఎందుకు చర్యలు చేపట్టడం లేదన్నది ప్రశ్నార్థకంగా మారింది. మచిలీపట్నం నగరంలోని రహదారుల పక్కనున్న మార్జిన్‌ స్థలాలు, చెరువుగట్లు, శ్మశానవాటికల స్థలాలను పేదలకు ఇచ్చేస్తామంటూ దొంగ సర్వే నంబర్లతో పట్టాలను తయారుచేశారు. గత ఎన్నికల్లో తన కుమారుడిని ఎలాగైనా గెలిపించాలని.. ఈ నకిలీ పట్టాల వ్యవహారాన్ని పేర్ని నాని దగ్గరుండి నడిపించారు.

5 వేల పట్టాలు పంచిన మాజీ మంత్రి

2024 జనవరి నుంచి ఆ వ్యవహారాన్ని మచిలీపట్నం తహశీల్దారు కార్యాలయం కేంద్రంగానే నడిపించారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చాక.. గుట్టుచప్పుడు కాకుండా పంచుతుండగా.. వ్యవహారం వెలుగులోనికి వచ్చింది. అప్పటికే ఐదు వేలకు పైగా పట్టాలను పంచేశారు. ఈ వ్యవహారమంతా ఎవరి లాగిన్‌లో నుంచి చేశారన్నది ఇప్పటివరకూ బయటకు పొక్కనివ్వట్లేదు. కూటమి సర్కారు కొలువుదీరి 11 నెలలు అవుతున్నా.. నకిలీ పట్టాల వ్యవహారంపై కనీసం దృష్టిసారించిందీ లేదు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ పీజీఆర్‌ఎస్‌ ద్వారా అర్జీలు వస్తున్నాయి. విచారణ చేస్తున్నామంటూ అర్జీలను మూసేసి అధికారులు చేతులు దులిపేసుకుంటున్నారు.

నగరంలో సిమెంటు రోడ్ల మార్జిన్ స్థలాలకు పట్టాలు

నగరంలోని చాలా ప్రాంతాల్లో సిమెంటు రహదారుల పక్కన ఖాళీగా ఉంచిన మార్జిన్‌ స్థలాలకూ పట్టాలను సృష్టించి ఇచ్చేశారు. మచిలీపట్నం నుంచి అంతకుముందే బదిలీ అయి వెళ్లిపోయిన తహసీల్దారు సునీల్‌ సంతకాలతో ఈ పట్టాలను తయారుచేశారు. ఈ సంతకాలు కూడా రకరకాలుగా ఉండడం చూస్తుంటే.. స్పష్టంగా అవి నకిలీవని అర్థమవుతోంది. వాటిపై సీల్‌ వేసి.. పంపిణీ చేసేశారు. ఈ పట్టాలను.. పేర్ని నాని, కిట్టు స్వయంగా పేదలకు పంపిణీ చేస్తూ, మళ్లీ తాము గెలిస్తేనే ఈ పట్టాలు చెల్లుతాయని, ఓటు తమకే వేయాలంటూ ఇంటింటికీ తిరుగుతున్న సమయంలోనే వ్యవహారం వెలుగులోనికి వచ్చింది. ఈ పట్టాలను రహస్యంగా ఉంచాలని, మళ్లీ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని రూ.10-20లక్షలు ఒక్కో స్థలం విలువుంటుందని, వాటిలో ఇళ్లు నిర్మించి ఇస్తామని పేదలను ప్రలోభ పెట్టారు.

వీఆర్వోను సప్సెండ్ చేసి చేతులు దులుపుకున్నారు

ప్రభుత్వ మారిన తర్వాత నకిలీ పట్టాల పంపిణీకి కారణమంటూ ఓ వీఆర్‌వోను సస్పెండ్‌ చేసి అంతటితో పనైపోయిందన్నట్టు వదిలేశారు. కానీ.. కీలకంగా వ్యవహరించిన తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్లపై ఎలాంటి చర్యలు చేపట్టలేదు. తహశీల్దారు కార్యాలయంలో రాత్రి వేళ నకిలీ పట్టాలు తయారుచేస్తుండగా.. కొల్లు రవీంద్ర సహా టీడీపీ నేతలు వెళ్లి ఆందోళన చేపట్టారు. అసలు ఎలాంటి నకిలీ పట్టాలు ముద్రించడంలేదని, ఏమీ దొరకేలేదంటూ జిల్లా సమాచార శాఖ రాత్రి 11 గంటలకు ప్రకటన విడుదల చేసింది. కానీ.. రాత్రి 12.30గంటలకు కార్యాలయానికి వచ్చిన జాయింట్ కలెక్టర్‌కి నకిలీ పట్టాలు దొరకగా.. వాటిని తన వెంట తీసుకెళ్లారు. నాడు.. ఏ పట్టాలూ లేవంటూ ప్రకటించిన సమాచారశాఖ సిబ్బందే ఇప్పటికీ మచిలీపట్నంలో విధులు నిర్వహిస్తుండడం గమనార్హం.

మంత్రిగా ఉన్నా నోరు మెదపని కొల్లు రవీంద్ర

పట్టాలు పంపిణీ చేసిన సమయంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో అంతా మాయ చేసేసి.. కనీసం కేసు కూడా నమోదు చేయకుండా పక్కన పెట్టేశారు. బాధ్యులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాల్సి ఉన్నా వదిలేశారు. కానీ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా.. అన్ని ఆధారాలున్నా.. ఎందుకు ఇప్పటికీ కేసు నమోదు చేయడం లేదన్నది ప్రశ్నార్థకంగా తయారైంది. నకిలీ పట్టాలు ఇప్పటికీ వేలాది మంది దగ్గర అలాగే ఉన్నాయి. కనీసం వాటిని రికవరీ చేసే ప్రయత్నం కూడా ఇప్పటివరకూ చేయలేదు. ఆ పట్టాలతో వీధుల పక్కన ఉంచిన మార్చిన్‌ స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేసే అవకాశం ఉందంటున్నారు. మరి పేర్ని నానిపై అప్పట్లో ఆ రేంజ్లో ఫైర్ అయిన కొల్లు రవీంద్రి మంత్రిగా ఉండి కూడా ఎందుకు సైలెంట్ అయ్యారో ఆయనకే తెలియాలి.

Related News

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

AP Liquor Scam Case: జగన్‌ను ఇరికించిన చెవిరెడ్డి?

BIG Shock To Donald Trump: ట్రంప్‌కు మోదీ దెబ్బ.. అమెరికా పని ఖతమేనా

Big Stories

×