Rajagopal Reddy: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అందరికి పదవులు వస్తున్నాయి కానీ ఎప్పటి నుంచో మంత్రి పదవి పై ఆశలు పెట్టుకున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కల మాత్రం నెరవేరడం లేదు. ఇప్పటికే ఇద్దరు మంత్రులు ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాకు తాజాగా రెండు విప్ లు దక్కాయి. శాసనమండలిలో విప్‌గా అద్దంకి దయాకర్, శాసన సభలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం విప్‌గా నియమితులయ్యారు.ఇలా జిల్లా కు అన్ని పదవులు వస్తుంటే, మంత్రి పదవి ఇస్తానని రెండు సార్లు హామీ ఇచ్చిన అధిష్టానం రాజగోపాల్ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోకపోవడం చర్చల్లో నలుగుతోంది.
ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ముఖ్యమంత్రి పదవి మినహా దాదాపు అన్ని పదవులు ఆ జిల్లా కాంగ్రెస్ నేతలను వరించాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న టైమ్‌లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి నల్లగొండ జిల్లా నేతలకు పదవుల పంట పడుతుంటుంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో జిల్లా నుంచి శాసన మండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్ రెడ్డి ఉన్నారు. సీనియర్ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు మంత్రులుగా కొనసాగుతున్నారు.
గత ఎన్నికల్లో జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో 11 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుని సత్తా చాటింది .అదేవిధంగా ఎమ్మెల్సీ పదవుల్లో కూడా నల్గగొండ జిల్లాకు సముచిత ప్రాధాన్యత దక్కింది. జిల్లా కాంగ్రెస్ అదుక్షునిగా ఉన్న శంకర్ నాయక్, అద్దంకి దయాకర్, ఇక సీపీఐ కోటా నుంచి నెల్లికంటి సత్యం ముగ్గురు ఎమ్మెల్సీలుగా ఉన్నారు. ఆ క్రమంలో జిల్లా నుంచి ముగ్గురు ప్రభుత్వ విప్‌లు ఉన్నారు. ఇప్పటికే ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య శాసనసభలో విప్‌గా కొనసాగుతున్నారు. తాజాగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంలకు విప్ పదవులు దక్కడంతో.. ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రభుత్వ పదవులలో ముందుంది.
ఇక త్వరలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కూడా మంత్రి పదవి విషయంలో అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇటీవల ఆయన ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లిఖర్చున ఖర్గే తో అదే విషయమై మంతనాలు కూడా జరిపి వచ్చారంట. రాజగోపాల్‌రెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి తిరిగి వచ్చినపుడు ఆయనకు హైకమాండ్ మంత్రి పదవిపై హామీ ఇచ్చిందన్న ప్రచారం జరిగింది.
అయితే కోమటిరెడ్డి బ్రదర్స్‌లో చిన్నవాడైన రాజగోపాల్‌కి ప్రభుత్వ ఏర్పాటు సమయంలో మంత్రి పదవి దక్కలేదు. తర్వాత ఆయనకు భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ ఇంచార్జ్ బాధ్యతలు ఇచ్చి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని ఎంపీ గా గెలిపించుకుని వస్తే క్యాబినెట్ బెర్త్ పక్కా అని అధిష్టానం చెప్పిందంట. కానీ ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణ జరిగినా చిన్న కోమటిరెడ్డికి ఛాన్స్ దక్కలేదు. ఆయనకు రెండు సార్లు అధిష్టానం హామీ ఇచ్చి న మాట వాస్తవమేఅని పార్టీ నేతలు కూడా చెప్తున్నారు.
నల్గగొండ జిల్లా నుంచి ఉన్న ఇద్దరు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇద్దరు రెడ్డి సామాజికవరం నేతలే. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిది కూడా ఆ వర్గమే. అందుకే సామాజిక సమీకరణాల కారణంగా రాజ్‌గోపాల్‌రెడ్డికి మంత్రి పదవి విషయంలో కొంతవరకు ఆలస్య మవుతుందంటున్నారు. ప్రస్తుతం క్యాబినెట్లో రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉండటం, వాటిని త్వరలో భర్తీ చేస్తారన్న ప్రచారంతో ఈ సారి రాజగోపాల్ రెడ్డి కి మంత్రి పదవి విషయంలో ఎలాంటి ఢోకా లేదని తెలుస్తోంది.
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మంత్రి పదవి దక్కలేదని గతంలో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు పార్టీ పెద్దలపై విమర్శలు చేశారు. అవి కూడా అధిష్ఠానం దృష్టికి వెళ్లాయి. దాని విషయంలో కూడా రాజగోపాల్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారంట. ఇస్థానన్న హామీ ని నెరవేర్చక పోవడంతో అలా మాట్లాడవలసి వచ్చినదని, ఇక మీదట అలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటానని చెప్తున్న రాజగోపాల్‌రెడ్డి ప్రభుత్వంలో అందరితో సఖ్యతగా ఉంటూ ముందుకు సాగుతున్నారు.
ఇటీవల మునుగోడులో ఇంటిగ్రేటెడ్ స్కూల్ శంకుస్థాపన సందర్భంగా ఆయన సీఎం రేవంత్‌రెడ్డి పై ప్రశంసల వర్షం కురిపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అదేవిధంగా సీనియర్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో కూడా శుభకార్యాలు, ఇతరాత్ర కార్యక్రమాల్లో కలిసినపుడు ఎంతో ఆత్మీయంగా మెసులుతున్నారు. దాంతో జిల్లా కాంగ్రెస్ నేతలందరూ రాజగోపాల్‌రెడ్డి కి మంత్రి పదవిపై సుముఖంగానే ఉన్నారంటున్నారు.
ఇటీవల చౌటుప్పల్ లోని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ పదవులు అందరికీ వస్తాయి, కానీ కొంచెం ఓపిక పట్టాలని రాజగోపాల్ రెడ్డి పేర్కొనడం .. ఇంతకాలం ఆయన దూకుడు చూస్తూ వచ్చిన వారిని విస్మయానికి గురిచేసింది. అధిష్టానం హామీ ఇచ్చి ఇప్పటి వరకు మంత్రి ఇవ్వకున్నా, ఓపికతో వేచి చూస్తున్నానని, ఆవేశం లో ఒక్కొక్కసారి నోరు జారినా, తప్పు తెలుసుకుని ఓపికగా ఎదురు చూస్తున్నానని రాజగోపాల్ అంటున్నారంట. ఆ క్రమంలో కాంగ్రెస్ హైకమాండ్ సైతం కన్వీన్స్ అయిన ఆయనకు త్వరలోనే మంత్రి పదవి కట్టబెట్టడం ఖాయమంటున్నారు. మరి అదే జరిగితే నల్లగొండ జిల్లా నుంచి మూడో రెడ్డి సామాజిక వర్గం మంత్రిని క్యాబినెట్లో చూస్తామన్నమాట.
Also Read:దేవుని సాక్షిగా చెబుతున్నా.. జగన్ అన్యాయం చేశాడు.. విజయమ్మ లేఖతో ఏపీ రాజకీయాల్లో పెను తుపాను
Story by: Apparao, Big Tv