Komatireddy Venkat Reddy: తెలంగాణ కాంగ్రెస్‌లో పాత డిమాండ్లు కొత్తగా వినిపిస్తున్నాయి. ఎన్నికల ముందు పీసీసీ అధ్యక్షుడి నియామక సమయంలో ఆ పదవి కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy) గట్టిగానే ప్రయత్నించారు. కాంగ్రెస్ అధిష్ఠానం రేవంత్‌రెడ్డికి ఆ పదవి కట్టబెట్టినప్పుడు కోమటిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి అంతా సెట్‌రైట్ అయినట్లు కనిపిస్తున్న తరుణంలో కోమటిరెడ్డి నోట పీసీసీ పీఠంపై మళ్లీ కొత్త మాటలు వినిపిస్తుండటం హాట్ టాపిక్‌గా మారింది. జగ్గారెడ్డిని పీసీసీ అధ్యక్షుడ్ని చేస్తే, కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో వంద సీట్లు గెలుచుకుంటుందని వ్యాఖ్యానించారు కోమటిరెడ్డి. అంటే పీసీసీ చీఫ్‌గా మహేష్‌కుమార్‌గౌడ్ ఉండటం ఆయనకు ఇష్టం లేదా? అసలు కోమటిరెడ్డి మాటల వెనుక ఆంతర్యమేంటి?
అసలు సిసలు మాస్ లీడర్ అంటే సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న జగ్గారెడ్డికి పీసీసీ పగ్గాలు అప్పగించాలని కోమటిరెడ్డి మీడియా చిట్‌చాట్‌లో తన మనసులో మాట బయటపెట్టారు. జగ్గారెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయితే వచ్చే ఎన్నికల్లో వంద సీట్లు గెలుచుకుని తిరిగి అధికారంలోకి వస్తుందని వ్యాఖ్యానించారు. వాస్తవానికి 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు టీపీసీసీకి కొత్త అధ్యక్షుడ్ని నియమించడానికి కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించుకున్న సమయంలో ఆ పదవి కోసం పలువురు కాంగ్రెస్ సీనియర్లు తీవ్రంగా పోటీ పడ్డారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పీసీసీ పీఠం కోసం గట్టి ప్రయత్నాలు చేశారు. అయితే కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్‌రెడ్డిపై నమ్మకంతో ఆయనకు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పజెప్పింది. ఆ సమయంలో కోమటిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. తర్వాత హైకమాండ్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి క్యాబినెట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి అయ్యారు. ఆ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సన్నిహితులైన మహేష్‌కుమార్‌గౌడ్ పీసీపీ పగ్గాలు చేపట్టారు. మహేష్ గౌడ్ సారథ్యంలో కాంగ్రెస్ మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో ఆయన తన సమర్థతను నిరూపించుకున్నట్లైంది.
Also Read: IPL 2026 New Rule: ఐపీఎల్ 2026లో 3.5 గంటల రూల్, ఇకపై వాళ్ల ఆటలకు చెక్ !
కొంత కాలంగా కేబినెట్‌లోని ఖాళీలను భర్తీచేస్తారనే ప్రచారం నడుస్తుంది. కేబినెట్‌లోకి ప్రస్తుతం పీసీసీ చీఫ్‌గా ఉన్న మహేశ్‌కుమార్ గౌడ్‌కు చోటు దక్కబోతుందనే ఉహగానాలు పొలిటికల్ సర్కిల్స్‌లో నడుస్తున్నాయి. మహేశ్‌కుమార్ గౌడ్‌ను కేబినెట్‌లోకి తీసుకుంటే పీసీసీ పదవిని మరోకరి ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి తరుణంలోనే మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ఒకవేళ కేబినెట్‌లో మార్పులు చేర్పులు చేసి…పీసీసీ చీఫ్‌గా మహేశ్ కుమార్ కేబినెట్‌లోకి వెళ్తే …పీపీసీ చీఫ్‌గా జగ్గారెడ్డి వస్తే బాగుటుందనేది నేతల మాటగా ఉందంట. పార్టీ, ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు, ప్రతిపక్షాల విమర్శలకు ఘాటుగా రిప్లై ఇవ్వడంలో జగ్గారెడ్డి తీరే వేరు. మాస్ ఇమేజ్ ఉన్న జగ్గారెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగిస్తే మంచి ఫలితాలు వస్తాయనేది పార్టీ నేతల్లో చర్చ నడుస్తుందట.
జగ్గారెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలను పార్టీ నేతలు ఆసక్తికరంగా గమనిస్తున్నారట. అయితే జగ్గారెడ్డిపై తన అభిప్రాయాన్ని మాత్రమే కోమటిరెడ్డి వ్యక్తపరిచారనేది పార్టీ నేతల టాక్‌గా ఉందట. ఎందుకంటే మంత్రి కోమటిరెడ్డిపై వచ్చిన వ్యతిరేక కథనాలపై పార్టీ పరంగా తొలుత స్పందించింది జగ్గారెడ్డే. పార్టీ పరంగా మంత్రికి అండగా నిల్వడంతో పాటు…వస్తున్న ఆరోపణలను తిప్పికొట్టడంలో జగ్గారెడ్డి ముందున్నారు. దీంతో జగ్గారెడ్డిపై ఉన్న సాఫ్ట్ కార్నర్‌లోనే కోమటిరెడ్డి అలా స్పందించారంటున్నారు. అయితే కేబినెట్ విస్తరణ జరిగినా…పార్టీ పదవుల విషయంలో ఇప్పట్లో మార్పులు చేర్పులు ఉండవని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి ఉన్న నేపథ్యంలో…పీసీసీ స్ధానంలో మరో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారిని నియమించడం సాధ్యంకాదనేది పార్టీ నేతలు చేప్పే మాట. జగ్గారెడ్డి విషయంలో మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు బూతద్దంలో పెట్టి చూడాల్సినవసరం లేదని….జగ్గారెడ్డిపై తన అభిమానాన్ని మంత్రి కోమటిరెడ్డి వ్యక్తపరిచారే తప్ప…మరో ఉద్దేశం ఏమి లేదనే చెబుతున్నారట హస్తం నేతలు.
Story By Apparao Big tv