Kothagudem Congress: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాజకీయాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. కొత్తగూడెం నియోజకవర్గంలో ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా అందరి దృష్టిని ఆకర్షిస్తుంటుంది. అది భద్రాద్రి జిల్లాలో ఉన్న ఏకైక జనరల్ స్థానం కావడంతో ఎప్పుడూ స్పెషల్‌గానే ఉంటుంది. తాజాగా కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటుతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన వెలువడటంతో నియోజకవర్గ రాజకీయాలు మళ్లీ ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ పరిణామాల్లో ఒకవైపు సీపీఐ తన బలం పెంచుకుంటుంటే, అధికార కాంగ్రెస్ మాత్రం నియోజకవర్గంలో నాయకత్వ లోపంతో, వర్గపోరాటాలతో కొట్టుమిట్టాడుతుండటం చర్చల్లో నలుగుతోంది.
రాష్ట్రంలో సీపీఐ గెలిచిన ఏకైక స్థానం కొత్తగూడెం
కొత్తగూడెం నియోజకవర్గం రాష్ట్రంలో ఏకైక కమ్యూనిస్టు స్థావరంగా నిలిచింది. సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తన ప్రత్యేక శైలిలో నియోజకవర్గ రాజకీయాలను ప్రభావితం చేస్తున్నారట. సభలు, సమావేశాలు నిర్వహిస్తూ కామ్రెడ్ల బలం పెంచే పనిలో పడ్డారంట. ముఖ్యంగా శాసనసభలో తన ప్రావీణ్యాన్ని చాటుకుంటూ, ప్రతిపక్ష విమర్శలను అడ్డుకుంటూ, అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు. ఇక ప్రజా అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంతో సత్సంబంధాలను ఉపయోగించి నిధులను తెచ్చుకోవడం ఆయన ప్రత్యేకతగా మారింది. సిపిఐతోనే అభివృద్ధి సాధ్యం అన్న సందేశాన్ని కూనంనేని ప్రతి వేదికపై బలంగా వినిపిస్తున్నారట.
కొత్తగూడెం కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా పోడెం వీరయ్య
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా పోడెం వీరయ్య పగ్గాలు చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న ఐదు నియోజకవర్గాలలో నాలుగు నియోజకవర్గాలకు కాంగ్రెస్ ఇన్చార్జిలు ఉన్నప్పటికీ జిల్లా కేంద్రమైన కొత్తగూడానికి నియోజకవర్గ ఇన్చార్జ్ ఎవరు అనేది తేలడం లేదంట. ఎన్నికల ముందు నుండే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎడవల్లి కృష్ణకు జనంలో ఉన్న ఆదరణ కాంగ్రెస్ పార్టీకి కాస్తో కూస్తో ఉపయోగపడుతుంది అనుకున్నారు. కానీ మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎన్నికల ముందు రంగప్రవేశం చేసి అక్కడ ఒక కోటరీని ఏర్పాటు చేసుకున్నారట. దానికి తగ్గట్లే పోడెం వీరయ్య వర్గానికి చెందిన నేత అధికార పార్టీ పేరు చెప్పుకుని కొత్తగూడెంటో హవా కొనసాగించాలని చూస్తున్నారంట
సీపీఐ పంచకు చేరిన జలగం, వనమా అనుచరులు
కొత్తగూడెం నియోజకవర్గంలో గులాబీ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు జలగం వెంకటరావు, వనమా వెంకటేశ్వరరావు అనుచరులు సైతం సీపీఐలో చేరడం స్థానికంగా కాంగ్రెస్‌కు పెద్ద దెబ్బ కానుందని అనుకుంటున్నారు. అయితే ఆ లోటు భర్తీ చేసుకోవడంలో కాంగ్రెస్ విఫలమవుతోందని అనుకుంటున్నారు. అప్పుడప్పుడు ఖమ్మం ఎంపీ రామసాయం రఘురామిరెడ్డి పర్యటనలతో మాత్రమే కాంగ్రెస్ జెండాలు కనిపించడం పార్టీ బలహీనతను స్పష్టంగా చెబుతోంది.. స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా మారాయి. అయితే అక్కడ ఇన్చార్జ్ లేకుండా కేవలం మంత్రులపై ఆధారపడితే అధికార కాంగ్రెస్ పార్టీ కొత్తగూడెం నియోజకవర్గంలో మరింతగా పతనం అయ్యే అవకాశాలు ఉన్నాయని అక్కడి ప్రజలు చర్చించుకుంటున్నారు. మరోవైపు సిపిఐ ఈ ఎన్నికలను అవకాశంగా మలుచుకుంటే, కొత్తగూడెం పూర్తిగా కమ్యూనిస్టుల కంచుకోటగా మారిపోవడం ఖాయం అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Also Read: మల్నాడు డ్రగ్స్ కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు!
కొత్తగూడెం నియోజకవర్గంలో కాంగ్రెస్ ఇన్చార్జ్‌గా ఎవర్నో ఒకరిని నియమిస్తే పార్టీ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు దోహద పడతాయని పార్టీ దిగువ స్థాయి క్యాడర్ అంటోంది. పంచాయతీ ఎన్నికల పోరులో కాంగ్రెస్ పార్టీ అత్యధిక పంచాయతీలు గెలవాలంటే ఇన్చార్జ్‌ని నియమించడమే మార్గమని అంటున్నారు. స్థానికంగా క్యాడర్‌కు దిశా నిర్దేశం చేసే నాయకుడు లేకపోతే, అధికారంలో ఉన్నా పార్టీకి నష్టమేనంటున్నారు. జిల్లాలో ఉన్న కాంగ్రెస్ అగ్ర నాయకుల, ముఖ్య అనుచర గణం వర్గపోరాటాలను పక్కనపెట్టి, సమన్వయంతో ముందుకు వెళ్లకపోతే రాబోయే పంచాయితీ ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఉనికి మరింత బలహీనపడుతుందనే చర్చ అక్కడ బహిరంగంగానే జరుగుతోంది.
Story By Ajay Kumar, Bigtv