YS Jagan: ఏపీలో అధికారంలో లేకపోయినా మాజీ సీఎం జగన్ జాతీయ రాజకీయాల్లో బీజేపీతో అంటకాగలనే చూస్తున్నారు. 2014 నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి మద్దతు ప్రకటిస్తున్నారు. తాజాగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్ధికి మద్దతు ఇవ్వాలని వైసీపీ నిర్ణయం తీసుకుంది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇదే తరహాలో మద్దతుగా నిలిచి బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేసి, సక్సెస్ అయిన వైసీపీ ఇప్పుడే అదే స్ట్రాటజీ అవలంభిస్తోంది. ఆ క్రమంలో కాంగ్రెస్‌తో టచ్ ఉన్న పార్టీ నేతలకు జగన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారంట.
గత పదేళ్లు బీజేపీకి దాసోహమన్న వైసీపీ అధ్యక్షుడు జగన్
వైసీపీ 2014 ఎన్నికల్లో ప్రతిపక్షానికి పరిమితమైంది. 2019 ఎన్నికలు వచ్చేనాటికి అధికారంలోకి వచ్చింది. ఆ రెండు పర్యాయాలు జగన్ తనదైన లెక్కలతో బీజేపీ పెద్దలకు దాసోహమన్నట్లే వ్యవహరించారు. అయితే గత ఎన్నికల్లో బీజేపీ.. టీడీపీ, జనసేనతో కూటమి కట్టడంతో వైసీపీకి చావు దెబ్బతగిలింది. దివంగత వైఎస్ మరణాంతరం తనను ముఖ్యమంత్రిని చేయలేదని, తర్వాత తన ఓదార్పు యాత్రలకు అనుమతించలేదని కాంగ్రెస్‌కు దూరమై వైసీపీ పేరుతో జగన్ సొంత కుంపటి పెట్టుకుని పొలిటికల్ గేమ్ మొదలెట్టారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి దూరంగానే ఉంటూ వస్తున్న వైసీపీ తిరిగి ప్రతిపక్షంలోకి రావడంతో మరోసారి బీజేపీతో దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తుంది.. పార్లమెంట్‌లో వైసీపీకి నలుగురు లోక్ సభ సభ్యులు.. ఏడుగురు రాజ్యసభ సభ్యుల బలం ఉంది..
అసెంబ్లీలో 11 సీట్లకే పరిమితమైనా.. పార్లమెంటులో చెప్పుకోదగ్గ బలం
పార్టీ ఆవిర్బావం నుంచి సోలో గానే పోటీ చేస్తూ వస్తున్న వైసీపీ అయిదేళ్ల అధికారం తర్వాత గత సార్వత్రిక ఎన్నికల్లో దారుణ పరాజయం పాలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైనా.. పార్లమెంటులో చెప్పుకోదగ్గ బలాన్ని చాటుకుంది. అక్రమాస్తుల కేసుతో పాటు వివిధ కేసుల ఉచ్చు బిగుసుకుంటడంతో జగన్ మోడీ సర్కారుకి దాసోహం అంటున్నట్లే కనిపిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎలా కేంద్రంలోని బీజేపీతో స్నేహ సంభందాలు కొనసాగించిందో వైసీపీ అదే తరహాలో తిరిగి తమ స్నేహాన్ని కొనసాగించేందుకు ఉపరాష్ట్రపతి ఎన్నికల ద్వారా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. ఉప రాష్ట్రపతి ఎన్నికపై వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్డీయే ప్రతిపాదించిన అభ్యర్థి రాధాకృష్ణన్ కే తమ మద్దతు ఉంటుందని వైసీపీ ప్రకటించింది. తమ పార్టీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఏర్పడిందని స్పష్టం చేసింది.
వివిధ బిల్లులకు పార్లమెంటులో మద్దతిచ్చిన జగన్
ఎన్డీఏ కూటమి అధికారంలో తొలి పదేళ్లు వైసీపీ పార్లమెంట్‌లో కేంద్రం ప్రవేశపెట్టిన పలు బిల్లులకు ఆమోదం తెలిపించి. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు, అంతకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కేంద్రానికి పలు కీలక సందర్బాల్లో బేషరతుగా బీజేపీకి మద్దతు ప్రకటించింది వైసీపీ. వ్యవసాయ చట్టాలు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ సహా పార్లమెంట్‌లో పలు బిల్లులకు కూడా ఎన్డీఏ పక్షాన నిలిచింది. వీటితో పాటు ఢిల్లీ సర్వీస్ బిల్లు, ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ సంస్కరణల బిల్లు, చీఫ్ ఎలక్షన్ కమీషన్ నియామక బిల్లు, ఆర్టికల్ 370 రద్దు బిల్లు, ఓబీసీ ఎమండ్మెంట్ బిల్లు వంటి పలు కీలక బిల్లులకు కూడా వైసీపీ మద్దతు ప్రకటించింది.. అంతేకాకుండా వీటితో పాటు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి వంటి దేశ అత్యున్నత పదవులను రాజకీయాలతో ముడి పెట్టకుండా ఏకగ్రీవంగా గెలిపించుకోవాలని జగన్ అంటూ బీజేపీకి మరింత చేరువయ్యే ప్రయత్నం చేశారు.2017లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే బలపరచిన రాంనాధ్ కోవింద్ కి.. ఉప రాష్ట్రపతి పదవికి వెంకయ్యనాయుడుకు వైసీపీ మద్దతుగా ఓటేసింది. 2022లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో కూడాఎన్డీయే బలపరచిన ద్రౌపది ముర్ముకి.. ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధంకర్ కి మద్దతిచ్చింది..
ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా సీపీ రాధాకృష్ణన్
తర్వాత ఉపరాష్ట్రపతిగా ఉన్న జగదీప్ ధంఖర్ రాజీనామా చేయడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి.. దీంతో ఎన్డీఏ తరఫున బీజేపీ సీపీ రాధకృష్ణన్ ఉప రాష్ట్రపతి అభ్యర్దిగా బరిలో నిలవటంతో మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. మొత్తంమీద మరోసారి తమకు బీజేపీతో స్నేహ సంబంధాన్ని పునరుద్దరించుకోవడానికే జగన్ ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతుంది. తెలంగాణ నుంచి తెలుగు బిడ్డ జస్టీస్ సుదర్శనరెడ్డిని ఇండియా కూటమి అభ్యర్ధిగా ప్రకటించినా జగన్ అలాంటి నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదంగా మారింది. మరోవైపు కాంగ్రెస్ అగ్ర నేతలు వైసీపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు.. రాజ్యసభలో ఏడుగురు సభ్యుల బలమున్న వైసీపీనీ కనీసం తమకు మద్దతు తెలపకపోయినా తటస్థంగా ఉంటే చేయడానికి కాంగ్రెస్ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలో ఎంపీ రఘునాథరెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసానికి వెళ్లి భేటీ ఆవ్వటం ఏపీ రాజకీయాల్లో కీలకంశంగా మారింది. అది జరిగిన గంటల వ్యవధిలోనే కాంగ్రెస్ అగ్ర నేత జై రాం రమేష్ వైసీపీకి కీలక నేత వైవీ సుబ్బారెడ్డి కి ఫోన్ చేసి మద్దతు కోరారు.
ఎలక్ట్రోరల్ కాలేజీలో పూర్తి మెజార్టీ ఉన్న బీజేపీ
ఉప రాష్ట్రపతి ఎన్నికను బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. నిజానికి బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమికి ఎలక్ట్రోరల్ కాలేజిలో పూర్తి మెజారిటీ ఉంది. అయితే ఎక్కువ పార్టీలు పరోక్షంగా అయినా తమతోనే ఉన్నాయని ఎస్టాబ్లిష్ చేసేలా బీజేపీ అడుగులు వేస్తోంది. ఈ ఎత్తుగడతోనే బీజేపీ జగన్‌కి టచ్‌లోకి రాజ్‌నాథ్ సింగ్ వచ్చారనే టాక్ నడుస్తోంది. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కే ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి విపక్షాలను కో ఆర్డినేట్ చేసుకునే బాధ్యతను కేంద్రం అప్పగించింది. దాంతో ఆయన జగన్ కి ఫోన్ చేసి మాట్లాడారు. తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరారు. బీజేపీ నుంచి వచ్చిన ప్రతిపాదనతో జగన్ పార్టీ నేతలతో చర్చించి ఎన్డీఏ అభ్యర్ధికి మద్దతు ప్రకటించారంటున్నారు.
తనకు ఖర్గేతో 30 ఏళ్ల పరిచయం ఉందంటున్న రఘునాథరెడ్డి
మరోవైపు కాంగ్రెస్‌కి చెందిన కీలక నాయకులు నలుగురు వైసీపీ తో టచ్‌లో ఉన్నారు. వైసీపీ ఎంపీ రఘునాథరెడ్డి ఏకంగా మల్లికార్జున ఖర్గేతోనూ సమావేశమయ్యారు. తనకు ఖర్గేతో 30 ఏళ్లకుపైగా అనుబంధం ఉందని.. అందుకే కలిశానని ఆయన చెప్పుకొస్తున్నారు. దీనిపై వైసీపీ అధినేత సదరు నేతను వివరణ కోరినట్టు తెలిసింది. ఇక, కాంగ్రెస్ పార్టీ నుంచి కీలక నాయకులు డీకే శివకుమార్, మల్లికార్జున ఖర్గే, జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతున్న చిదంబరం వంటి వారి నుంచి వైసీపీకి ఫోన్లు వచ్చాయని సమాచారం. వచ్చే నెల 9న జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి బి. సుదర్శన్ రెడ్డిని గెలిపించేందుకు సహకరించాలని కోరుతున్నారు. అయితే.. దీనికి వైసీపీ నుంచి సరైన సమాధానం రాలేదు. ఇదిలావుంటే.. అంతర్గత సమావేశంలో కాంగ్రెస్ నేతల వైఖరిపై జగన్ ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. పార్టీ నాయకులను కూడా ఆయన మందలించినట్టు తెలిసింది. అసలు వారు ఫోన్లు చేస్తే.. మీరెందుకు రిసీవ్ చేసుకున్నారని.. ప్రశ్నించినట్టు సమాచారం.
Also Read: కొత్తగూడెంలో కాంగ్రెస్‌కు కష్టాలు తప్పవా?
తనపై కేసులు పెట్టిన విషయం.. తమ పార్టీని ఇరుకున పెట్టేలా.. ఇప్పటికీ షర్మిలతో మాట్లాడిస్తున్న విషయం మీకు తెలియదా? ఎవడో మాణిక్యం ఆయన కూడా మనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారంట. ఇలాంటి పార్టీ వారు ఫోన్లు చేస్తే.. మనం ఎందుకు స్పందించాలి. ఇక, నుంచి ఫోన్లు కూడా తీయొద్దని సీరియస్ గా చెప్పేశారని.. తాడేపల్లి కార్యాలయానికి చెందిన సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ ఒకరు ఆఫ్ ద రికార్డుగా మీడియా వారితో అన్నారంట. ప్రస్తుతం కాంగ్రెస్‌కు వైసీపీ మద్దతు ఉన్నా.. లేకున్నా.. తటస్థంగా వ్యవహరిస్తే తమకు మేలు జరుగుతుందని వైసీపీ సీనియర్లు కొందరు అంటున్నారు. నేరుగా మాకు ఓటు వేయకపోయినా ఫర్వాలేదు. మీరు ఎన్నికలకు దూరంగా ఉండండి. అదే మేం కోరుతున్నామని ఖర్గే కూడా వ్యాఖ్యానించారు. ఎన్డీయేలో లేని పార్టీలు ఈ విషయంపై ఆలోచన చేయాలని ఆయన కోరుతున్నారు. ప్రస్తుతం వైసీపీ ఏ కూటమిలో లేదు. తటస్థంగా ఉంది. ఈ నేపథ్యంలో ఎలాగోలా వైసీపీని తటస్థంగా ఉంచడానికి కాంగ్రెస్ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. మరి వైసీపీ మాత్రం కాంగ్రెస్‌పై నిప్పులు చెరుగుతోంది. ఆ క్రమంలో బీజేపీతో అంటకాగడానికే జగన్ ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది.
Story By Rami Reddy, Bigtv