E-Paper
Advertisement

లేడీ సివంగులు.. ఆ ఇద్ద‌రు ఐఏఎస్ ఆఫీస‌ర్లు.. క‌బ్జాల‌పై బుల్డోజ‌ర్లు ఎక్కించి..!

లేడీ సివంగులు.. ఆ ఇద్ద‌రు ఐఏఎస్ ఆఫీస‌ర్లు.. క‌బ్జాల‌పై బుల్డోజ‌ర్లు ఎక్కించి..!
Advertisement

హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ గురించి విస్తృతంగా చ‌ర్చ జరుగుతున్న త‌రుణంలో హైదరాబాదీలు ఇప్పుడు ఓ ఇద్ద‌రు డైన‌మిక్ లేడీ ఐఏఎస్ ఆఫీస‌ర్ల‌ను యాది చేసుకుంటున్నారు. క‌బ్జాలపై వారిద్ద‌రూ లేడీ సివంగుల్లా విరుచుకుప‌డిన వైనాన్ని గుర్తు తెచ్చుకుంటున్నారు.

ఎవ‌రి మాట విన‌లేదు. క‌బ్జా చేస్తే పెద్దోడా చిన్నోడా చూడ‌లేదు. రాజ‌కీయ నాయ‌కుల‌ను అసలే వ‌ద‌ల్లేదు. ఒత్తిళ్ల‌కు త‌లొగ్గ‌లేదు. వారిద్ద‌రూ జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్లుగా చేసిన స‌మ‌యంలో క‌బ్జాకోరుల కోర‌లు పీకారు. ఆక్ర‌మ‌ణ‌దారుల పీచ‌మణిచారు. ఎవ‌రైనా క‌బ్జా చేయ‌లంటేనే గ‌జ‌గ‌జ‌లాడేలా చేశారు.

Advertisement

డైన‌మిక్ పాల‌న‌, నిర్ణ‌యాల‌తో క‌బ్జాదారుల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తించారు. యంత్రాంగాన్ని ఉరుకులు, ప‌రుగులు పెట్టించారు. అంతిమంగా సర్కార్‌కు మంచి పేరు తెచ్చిపెట్టారు. జ‌నం చేత శెభాష్ అనిపించుకున్నారు. ఆ ఇద్ద‌రు లేడీ సివంగులు.. ఒక‌రు రేచ‌ల్ చ‌ట‌ర్జీ, మ‌రొక‌రు ఆమ్రాపాలి కాటా.

ముందుగా మ‌నం ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సింది రేచ‌ల్ చ‌టర్జీ ఐఏఎస్ ఆఫీస‌ర్ గురించి. ఈమె 1975 బ్యాచ్‌కు చెందిన ఆఫీస‌ర్‌. 1992-1993 మ‌ధ్య హైద‌రాబాద్ మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్‌గా (ఎంసీహెచ్‌) ప‌నిచేశారు. అప్ప‌టికీ జీహెచ్ఎంసీ ఏర్ప‌డ‌లేదు. అనంత‌పురం జిల్లా క‌లెక్ట‌ర్‌గా, ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ తొలి మ‌హిళా చైర్మ‌న్‌గా.. ప‌లు కీల‌క హోదాల్లో కూడా ఆమె ప‌నిచేశారు. అయితే ఆమె ఎంసీహెచ్ క‌మిష‌న‌ర్‌గా ప‌నిచేసిన‌ప్పుడు మాత్రం .. చ‌ట‌ర్జీ పేరు మార్మోగిపోయింది. కార‌ణం.. క‌బ్జాదారుల భ‌ర‌తం ప‌ట్ట‌డ‌మే.

Advertisement

ఎక్క‌డ క‌బ్జాలున్నా వ‌ద‌ల్లేదు. బుల్డోజ‌ర్లు ఎక్కించారామె. ఆక్రమణలపై ఉక్కుపాదం మోపారు. రోడ్లు, ఫుట్‌పాత్‌లు, ప్రభుత్వ స్థలాలు, చెరువుల పరిసరాల్లో జరిగిన ఆక్రమణల తొలగింపుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా చర్యలు చేప‌ట్ట‌డంతో ఆమె పేరు రాజ‌కీయాల్లో చ‌ర్చ‌కు వ‌చ్చింది. ప్ర‌ముఖుల‌ ఆక్రమణలపైనా వెనుకాడకుండా చర్యలు తీసుకునే అధికారిగా పేరు తెచ్చుకున్నారామె. ఆ తరువాతే ఆమెకు డైన‌మిక్ ఆఫీస‌ర్‌గా ప్ర‌త్యేకంగా గుర్తింపు వ‌చ్చింది.

ఆమ్రాపాలి కాటా, ఐఏఎస్‌ (Amrapali Kata, IAS) గురించి కూడా ప్ర‌త్యేకంగా చెప్పుకోవాలి. జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్‌గా ప‌నిచేసిన స‌మ‌యంలో ప్ర‌త్యేకంగా క‌బ్జాల‌పై దృష్టిపెట్టారామె. అక్ర‌మ నిర్మాణాలు, ప్ర‌భుత్వ భూముల ఆక్ర‌మ‌ణ‌ల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవ‌డంలో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక ముద్ర వేసుకున్నారు ఆమ్రాపాలి. చెరువులు, నాలాలు, ప్ర‌భుత్వ భూముల‌పై జ‌రిగిన ఆక్ర‌మ‌ణ‌ల‌ను గుర్తించేందుకు ఆమె ప్రత్యేక బృందాల‌నే ఏర్పాటు చేశారు.

అంటే ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి.. హైడ్రా అని ఏర్పాటు చేసిన‌ట్టుగా.. ఆమె కూడా అదే త‌ర‌హాలో ఈ క‌బ్జాల కోసమే స్పెష‌ల్ టీమ్స్‌ను ఏర్పాటు చేయ‌డం అప్ప‌ట్లో పొలిటిక‌ల్ చ‌ర్చ‌కు తావిచ్చింది. కోర్టు ఆదేశాలు, టౌన్ ప్లానింగ్ నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా ఉన్న నిర్మాణాల‌ను బుల్డోజ‌ర్లు ఎక్కించారు. ఎవ‌రి ఒత్తిళ్ల‌కు త‌లొగ్గ‌లేద‌నే పేరు తెచ్చుకున్నారు. అధికారుల‌కు కూడా ఇదే త‌ర‌హా ఆదేశాలిచ్చారామె.

నిబంధ‌న‌ల ప్ర‌కారం పోతున్నామ‌ని చెబుతూనే.. ఆక్ర‌మ‌ణ‌ల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేద‌ని సీరియ‌స్ ఆదేశాలు ఇచ్చి త‌న యంత్రాంగానికి కూడా వెన్నుద‌న్నుగా నిలిచారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి, అక్రమ అనుమతులపై కూడా అంతర్గత విచారణలు జరిపించారు. నాలాలపై నిర్మాణాల వల్ల వర్షాకాలంలో వరదలు ముంచెత్తుతున్న నేపథ్యంలో వాటిని తొలగించడంపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టిన సంద‌ర్భంలో ఆమె స్థానికుల నుంచి ప్ర‌శంస‌లు అందుకున్నారు.

రాష్ట్ర విభ‌జ‌న సంద‌ర్భంగా ఏపీకి అలాట్ అయిన ఆమ్రాపాలిని ఇక్క‌డే కొన‌సాగించాల‌ని  స‌ర్కార్ అభ్య‌ర్థించిందంటే.. ఆమె ప‌నితీరుపై అంత‌లా న‌మ్మ‌కం పెట్టుకున్నారప్పుడు. ఈ ఇద్ద‌రి పేర్లు ఇప్పుడు ప్ర‌ధానంగా వినిపిస్తున్నాయి. రంగ‌నాథ్‌ను హైడ్రా క‌మిష‌న‌ర్‌గా తొల‌గించాల‌ని హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేప‌థ్యంలో.. రంగ‌నాథ్ కూడా నిజాయితీగా క‌బ్జాల‌పై బుల్డోజ‌ర్లు ఎక్కించ‌డం ద్వారా.. ఓ భ‌యం క్రియేట్ చేయ‌గ‌లిగాడ‌ని, ఎక్క‌డా ఎవ‌రికీ త‌లొగ్గ‌లేద‌నే పేరు తెచ్చుకున్నాడు.

ఆయ‌న దూకుడు హైడ్రా ల‌క్ష్యానికి ఎంతో ఊత‌మిచ్చింది. స‌ర్కార్‌కు మంచి పేరే తెచ్చిపెట్టింది. అందుకే రంగ‌నాథ్ విష‌యంలో రేవంత్ రెడ్డి ఓ క్లారిటీతో ఉన్నాడు. హైడ్రా ఉంటుంది.. రంగ‌నాథ్ క‌మిష‌న‌ర్‌గా కొన‌సాగుతాడు.. అని స్ప‌ష్టంగా ప్ర‌క‌టించ‌డం కూడా ఆయ‌న ప‌నితీరుకు గీటురాయిగా చెప్పాలి.

Related News

అవినీతి అనకొండలకు ఇక గజగజ.. బినామీ ఆస్తులపై IT, ACBల డబుల్ స్ట్రోక్!

తెలంగాణలో టీడీపీ సైలెంట్ ఆపరేషన్.. పొలిటికల్ రీ-ఎంట్రీకి పక్కా స్కెచ్!

గాంధీ భవన్‌లో ‘రచ్చ’.. ఢిల్లీలో ‘ఆల్ ఈజ్ వెల్’!

హైడ్రా ఆగ‌దు.. మీ ఆట‌లు సాగ‌వు! రంగ‌నాథే ఉంట‌డు.. క‌బ్జాదారుల ప‌ని ప‌డ‌త‌డు!

తగ్గాడా? వ్యూహం మార్చాడా? పొలిటికల్ రీ-ఎంట్రీకి వంశీ బిగ్ ప్లాన్!

నేరెళ్ల నెత్తుటి నేల సాక్షిగా కేటీఆర్‌పై తొమ్మిది అస్త్రాలు.. నిల‌దీసిన క‌విత‌.. వ‌దిలిపెట్ట‌బోమ‌ని శ‌ప‌థం..!

ప‌దేళ్ల పాపాల పాల‌న‌.. ఆ కుటుంబంలో పుట్టినందుకు ప‌శ్చాత్తాపం! నేరెళ్ల బాధిత కుటుంబాల‌కు క్ష‌మాప‌ణ‌..

Big Stories

Advertisement
×