BigTV English

Lord Sri Ram an Inspiration | వైఫల్యాల రాముడు.. దేవుడెలా అయ్యాడు?

Lord Sri Ram an Inspiration | మరికొన్ని గంటల్లో అయోధ్యలో భవ్యమైన రామాలయంలో అత్యంత వైభవంగా బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ జరగబోతోంది.

Lord Sri Ram an Inspiration |  వైఫల్యాల రాముడు.. దేవుడెలా అయ్యాడు?

Lord Sri Ram an Inspiration | మరికొన్ని గంటల్లో అయోధ్యలో భవ్యమైన రామాలయంలో అత్యంత వైభవంగా బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ జరగబోతోంది. దీంతో హిందూ సమాజంలో గొప్ప ఉత్సాహ భరిత వాతావరణం నెలకొనగా, ఇందుకు భిన్నంగా తమ ధార్మిక విశ్వాసాలను గాయపరుస్తూ అక్కడ మందిర నిర్మాణం జరిగిందని కొన్ని ముస్లిం వర్గాలు బహిరంగంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరువర్గాల వాదనల ప్రభావానికి లోనుకాకుండా, బయటి వ్యక్తిగా ఓసారి రాముడి జీవితాన్ని చూసే ప్రయత్నం చేద్దాం.


తండ్రి ఆదేశం మేరకు తనకు చెందాల్సిన రాజ్యాన్ని, రాజుగా తాను పొందగలిగిన ప్రతీ అవకాశాన్ని సంతోషంగా, స్వచ్ఛందంగా రాముడు వదులుకున్నాడు. పట్టు వస్త్రాలకు బదులు నార బట్టలు కట్టి 14 ఏళ్లు అడవిలో బతికాడు. అక్కడే తన భార్యను పోగొట్టుకుని, ఆమెను వెతికే క్రమంలో ఒక సామాన్యుడిలా శ్రమను, దు:ఖాన్ని ఎదుర్కొన్నాడు. తర్వాతి రోజుల్లో ఆయన భార్య దీనస్థితిలో ఓ ముని ఆశ్రమంలో ప్రసవించాల్సి రావటం, తన బిడ్డలని తెలియక వారినే రాముడు చంపబోవటమూ జరుగుతుంది. చివరికి తన ప్రాణ సమానమైన భార్య.. కళ్లముందే మరణిస్తుంది. ఒక చక్రవర్తి కుమారుడైన రాముడు తన వ్యక్తిగత జీవితంలో ఇన్ని వైఫల్యాలను ఎదుర్కోవాల్సి వచ్చింది.

కానీ.. ఇంత విఫల జీవితాన్ని ఎదుర్కొన్నప్పటికీ రాముడు ఎప్పుడూ స్వీయ నియంత్రణ, వివేకం, శాంతి, సత్యం, ధర్మం, కరుణ వంటి లక్షణాలనే ప్రదర్శించాడు. హుందాగా, ధైర్యంగానే జీవించాడు. బహుశ: ఈ లక్షణాల వల్లనే రాముడు.. ఒక ఆదర్శంగా 7 వేల ఏళ్ల తర్వాత కూడా నిలవగలిగాడు.


నేటి యువతరానికి, వారి ప్రగతిశీల, హేతుబద్ధమైన దృష్టి కోణంలో ఆలోచించినప్పడు రామాయణం ఓ కట్టుకథగా, రాముడు ఆదర్శపురుషుడిగా అనిపించకపోవచ్చు. ఒక భర్తగా రాముడు.. తన భార్య అయిన సీత పట్ల వ్యవహరించిన తీరు, వాలిని చంపిన తీరు, వానరాలను ఒక సందర్భంలో తక్కువ చేస్తూ వర్ణించిన వైనాలను బట్టి అతడినో పురుష అహంకారిగా, జాత్యంహకారం ఉన్న క్రూరమైన వ్యక్తిగా భావించొచ్చు.

అయితే.. రాముడినైనా, ఏసునైనా లేదా మరెవరినైనా వారి జీవిత వైఫల్యాలు, బలహీనతలు, లోపాల ఆధారంగా విమర్శించటం ఎవరికైనా సులువే. కానీ వారిని ఆదర్శ పురుషులు కాదని పక్కనబెట్టే ముందు వారికి ప్రత్యామ్నాయంగా ఆదర్శ వ్యక్తిత్వాలున్న మరెవరినైనా చూపించలేరని కూడా అంగీకరించాలి.

అలాగే.. మానవ సముదాయం శాంతియుతంగా బతకాలంటే ఆయా సమాజాలకు చెందిన కొన్ని ఆదర్శ చిహ్నాలుండాలని వీరు మరచిపోకూడదు. అంతేకాదు.. తాము అనుకుంటున్నట్లుగా రాముడికి ఉన్నత వ్యక్తిత్వం లేదని భావించేవారు.. రాముడి పేరు, ఆయన చరిత్ర .. ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఎలా చెక్కుచెదరకుండా నిలిచి ఉందనే విషయాన్ని కూడా ఆలోచించాలి.

మహాత్మా గాంధీ.. ఉత్తమ పాలనకు ఉదాహరణ రామరాజ్యమేనన్నారు. అంతటి గొప్ప వ్యక్తి.. రాముడి పాలనను ఉత్తమమని అన్నాడంటే.. రాముడు అనే వ్యక్తి మన జీవితాలలో, ఆలోచనల్లో ఎంతగా ఇమిడిపోయాడో, ఇంకిపోయాడో తెలుస్తుంది. ఈ విషయంలో భిన్నాభిప్రాయాలున్నప్పటికీ.. ఒక ఆదర్శాన్ని తృణీకరించటం వల్ల మానవాళికి మేలు జరుగుతుందో కీడు జరుగుతుందో కూడా విమర్శకులు నిజాయితీగా ఆలోచించుకోవాలి.

వేల ఏళ్ల తర్వాత కూడా రాముడిని ఇంత అసాధారణమైన వ్యక్తిగా సమాజం ఎందుకు భావిస్తుందనేందుకు అతని జీవితంలోని కొన్ని తార్కాణాలు గమనించొచ్చు. బలవంతుడే రాజు.. అని భావించే రోజుల్లోనూ రాముడు ఆదర్శప్రాయమైన మానవత్వాన్ని, త్యాగాన్నీ, న్యాయాన్నీ ప్రదర్శించాడు. రావణుడిని చంపినప్పుడు చాలామంది అనుకుంటున్నట్లుగా రాముడు విజయగర్వాన్ని పొందలేదు. పైగా ఇప్పుడైనా తన భార్యను వదిలేస్తే వెనక్కి పోతానని అంటాడు. చివర్లో అంతటి వీరుడిని చంపాల్సి వచ్చినందుకు పశ్చాత్తాప పడతాడు.

వ్యక్తిగా ఎవరి మీదా అకారణమైన ద్వేషాన్ని, పగని పెంచుకున్నట్లు గానీ, ఒక పాలకుడిగా వంచన, అనైతిక ప్రవృత్తి, అధికార దుర్వినియోగం చేసినట్లుగానూ రాముడు కనిపించడు. పైగా.. ఒక్క మనిషి అభిప్రాయాన్ని గౌరవించి, తన సొంత ఆనందాన్ని, చివరికి భార్యనూ వదులుకున్నాడు.

నిజానికి రాముడు ఏ సందర్భంలోనూ తనను ఏ వర్గానికీ ప్రతినిధిగా చెప్పుకోలేదు. ఇంకా చెప్పాలంటే.. ఎక్కడా హిందువుననీ ప్రకటించుకోలేదు. కనుక.. కొందరు చిత్రీకరిస్తున్నట్లుగా రాముడు ఒక మతానికి, ఒక ధార్మిక విశ్వాసానిక ప్రతీక కాబోడు. అతడు ఒక ఉత్తమ విలువకు ప్రతీక. కాబట్టే వేల ఏళ్ల తర్వాత కూడా అతడొక సాంస్కృతిక, ఆధ్యాత్మిక, నైతిక చిహ్నంగా జనం మనసులో నిలిచిపోయాడని భావించొచ్చు.

ఇక.. ఎంతో తీవ్రమైన భావోద్వేగం ముడిపడి ఉన్న వివాదాస్పద రామజన్మభూమి స్థలం లిటిగేషన్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఒక బిడ్డ కోసం ఇద్దరు తల్లులు రాజు వద్దకు వచ్చినప్పుడు ఆ రాజు ఆ బిడ్డను నరికి చెరొక ముక్కా తీసుకోమనే కథను గుర్తుకు చేసినట్లు అనిపిస్తోంది. ఇద్దరు వాటాదారులు మధ్య వచ్చిన స్థల వివాదం మాదిరిగా దీనిని పరిష్కరించలేమని భావించిన కోర్టు, ఆ స్థలాన్ని ముక్కలు చేయకుండానే అర్థవంతమైన, వివేకవంతమైన, శాశ్వతమైన ముగింపునిచ్చింది. 500 ఏళ్లకు పైగా దేశాన్ని కుదిపేస్తూ వస్తోన్న ఈ వివాదానికి నిర్ణయాత్మకమైన, నిస్పాక్షికమైన రీతిలో పరిష్కారాన్ని కోర్టు సూచించటం వల్లనే కొన్ని మినహాయింపులున్నప్పటికీ.. రెండు వర్గాల ప్రతినిధులూ ఈ తీర్మానాన్ని స్వాగతించారు.

144 కోట్ల జనాభా గల దేశంగా, ప్రపంచపు 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా వర్తమాన ప్రపంచంలో నిలబడిన ఈ దేశం.. శతాబ్దాలుగా కేవలం 2.77 ఎకరాల భూమి కోసం గాయపడుతూ వచ్చిన వైనాన్ని ఎవరూ మరచిపోరాదు. కానీ.. అదే సమయంలో రాముడు అనే వ్యక్తి పట్ల.. భారత ఉపఖండంలో నివసించే కోట్లాది జనం మనసుల్లో ఉన్న గౌరవాన్ని, భక్తిని తేలికగా తీసివేయటమూ సాధ్యం కాదు. రాముడిని ఒక దేవుడిగా చూసేకంటే.. ఒక ఆదర్శానికి ప్రతీకగా చూసినప్పుడే మన దేశానికి గొప్ప భవిష్యత్తు సిద్ధిస్తుందని అనిపిస్తోంది. మొత్తంగా చూసినప్పుడు బహుశ: కాలమే ఈ సమస్యను పరిష్కరించిందేమో అనే భావనా కలుగుతోంది.

Tags

Related News

Telangana Politics: మరోసారి హాట్ టాపిక్‌గా మారిన కొండా ఫ్యామిలీ

Gaza conflict: హమాస్ VS ఇజ్రాయెల్.. గాజాలో శాంతి నెలకొంటుందా?

AI assistant: AI యుగం వచ్చినా.. అమ్మాయిలపై వేధింపులు ఆగవా..

BJP: బీజేపీపై కొండ సెటైర్లు.. ఫ్లవర్ కాదు ఫైర్

Telangana Politics: రాజకీయాలకు దూరంగా జగ్గారెడ్డి.. అసలు ఏమైంది..!

AP Fake Liquor Case: ఏపీ కల్తీ మద్యం స్కామ్.. వెనుకుంది వాళ్లేనా..

AP Politics: అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరుపై చంద్రబాబు వార్నింగ్..

AP Politics: జగన్ నర్సీపట్నం టూర్.. అసలు ప్లాన్ ఇదేనా..?

Big Stories

×