10 కోట్లు.. 20 కోట్లు.. 30 కోట్లు.. 40 కోట్లు.. 50 కోట్లు.. 60 కోట్లు.. ఇవి.. రేట్లు కాదు. అంచనాలను మించి మహా కుంభమేళాకు పోటెత్తిన భక్తజనం లెక్కలు. 45 రోజుల పాటు ఈ దేశం మొత్తం అంతులేని ఆధ్యాత్మికతలో మునిగితేలిన అద్భుత క్షణాలు. పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు.. సగం దేశమే కదిలిన అద్భుత ఘడియలు. మొత్తానికి 144 ఏళ్లకోసారి వచ్చే అత్యంత అరుదైన మహా కుంభమేళా.. ఈ దేశంలోని హిందువులతో పాటు విదేశీ యాత్రికులందరినీ పలకరించింది. సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరినీ.. ఆధ్యాత్మికతతో పులకరించేలా చేసింది. మరో 144 ఏళ్ల వరకు గుర్తుండిపోయేలా.. ప్రతి ఒక్కరి మదిలోనూ, ఈ భారత చరిత్రలోనూ నిలిచిపోయింది.
జన ఘన మన మేళా!
⦿ 144 ఏళ్లకోసారి వచ్చే మహోన్నత మహోత్సవం!
⦿ 45 రోజుల పాటు వైభవంగా ఆధ్యాత్మిక సంబరం!
⦿ 65 కోట్ల మందికి పైగా సందర్శించిన పవిత్ర సంగమం!
⦿ దేశం మొత్తం వెల్లివిరిసిన ఆధ్యాత్మిక పరిమళం!
⦿ మహా కుంభమేళాకు మహా ముగింపు
⦿ ప్రయాగ్‌రాజ్ తీరాన వెల్లివిరిసిన ఆధ్యాత్మికం
⦿ త్రివేణి సంగమంలో భక్తుల కోలాహాలం
⦿ అరుదైన కుంభమేళాకు ఊహించని రీతిలో భక్తజనం
⦿ కుంభమేళాలో 65 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు
⦿ సనాతన సంప్రదాయం, వారసత్వానికి ప్రతీకగా కుంభమేళా
⦿ సమస్త భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే ఉత్సవం!
⦿ సనాతన ధర్మానికి ప్రతిరూపంగా మహా కుంభమేళా!
⦿ దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో సామాన్యులు, ప్రముఖులు
⦿ కోట్లాది మంది యాత్రికులతో కిక్కిరిసిపోయిన ప్రయాగ్‌రాజ్
⦿ కుంభమేళాతో ఆధ్యాత్మిక భావనలో మునిగితేలిన భారత్
⦿ ప్రపంచం మొత్తం హాట్ టాపిక్‌గా మహా కుంభమేళా
⦿ కుంభమేళాతో వైభవోపేతంగా వెలిగిపోయిన ప్రయాగ్‌రాజ్
⦿ భూమండలంలోనే ప్రతిష్ఠాత్మకమైన మహోత్సవంగా రికార్డ్
ఏమని చెప్పాలి? ఎంతని చెప్పాలి? భారత ఆధ్యాత్మిక రాజధాని ప్రయాగ్‌రాజ్‌లో మహోన్నతంగా సాగిన మహా కుంభమేళాని.. ఈ దేశం మొత్తం పండగలా జరుపుకుంది. 45 రోజుల పాటు సాగిన ఈ ఆధ్యాత్మిక మహోత్సవానికి కేవలం భారతీయులే కాదు దేశ, విదేశాల నుంచి భక్తులు తరలివచ్చారు. పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. భారత జనాభాలో ప్రతి ఐదుగురిలో సుమారుగా ముగ్గురు మహా కుంభమేళాలో భాగమయ్యారు. భోగితో మొదలై మహా శివరాత్రి వరకు నిరాటంకంగా సాగిన కుంభమేళాకు.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా.. సినీ, రాజకీయ, క్రీడా రంగాల ప్రముఖులంతా తరలివెళ్లారు. భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. పుణ్యస్నానాలు ఆచరించారు. అత్యంత అరుదైన ఈ మేళాకు.. ఊహించని రీతిలో భక్తులు వెళ్లారు. ఈ 45 రోజులు.. ఇండియాలోని దారులన్నీ ప్రయాగవైపే మళ్లాయి. యాత్రికులంతా.. అటువైపే కదిలారు.
ఇసుకేస్తే రాలనంత జనం! ఇంచు కూడా కనిపించని త్రివేణి తీరం! 45 రోజుల పాటు పవిత్ర ప్రయాగ్‌రాజ్‌లో పరిస్థితి ఇదే! పాపాల్ని కడిగేసి మోక్షాన్నిచ్చే పవిత్ర సంగమ ప్రదేశంలో.. ఏకంగా 65 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించారు. మహా కుంభమేళా మొదలైనప్పుడు 45 కోట్ల మంది భక్తులే.. కుంభమేళాకు వస్తారని అంచనా వేశారు. కానీ.. ఆ అంచనాలని తలకిందులు చేస్తూ.. కొత్త రికార్డులని సెట్ చేస్తూ.. ఈ దేశం ప్రయాగ వైపు కదిలింది.
ఫిబ్రవరి 14 నాటికే 50 కోట్ల మంది మార్క్ దాటింది. శివరాత్రి నాటికి 65 కోట్ల మార్క్‌ని దాటేసింది. జనవరి 29న విశేషమైన మౌని అమావాస్య రోజునే.. దాదాపు 8 కోట్ల మంది ప్రయాగ్‌రాజ్‌లో పుణ్యస్నానాలు ఆచరించారు. అదే.. మకర సంక్రాంతి రోజున మూడున్నర కోట్ల మంది, జనవరి 30న రెండు కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. సనాతన సంప్రదాయం, వారసత్వానికి.. మహా కుంభమేళా గొప్ప ప్రతీకగా నిలిచింది.
మహా కుంభమేళా అంటేనే.. సమస్త భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే ఉత్సవం. హిందువుల అతిపెద్ద ఆధ్యాత్మిక మహోత్సవం! అణువణువునా ప్రసరించే భక్తిభావంతో.. భారతీయ సనాతన ధర్మానికి ప్రతిరూపంగా నిలిచే అత్యంత గొప్ప మేళా… ఈ మహా కుంభమేళా! ఈ పవిత్ర ఉత్సవంలో.. దాదాపు సగం భారతీయులు పాల్గొన్నారు. మానవ చరిత్రలోనే ఏ మతపరమైన, సాంస్కృతిక, సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఇంత జనం పాల్గొనలేదు. దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో సామాన్యులు, ప్రముఖులు తరలివచ్చి.. గంగ, యమున, సరస్వతి కలిచే పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. అందుకే.. మహా కుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన ఉత్సవంగా నిలిచింది. కోట్లాది మంది భక్తులు, లక్షలాది మంది సాధువులు, ప్రపంచం నలుమూల నుంచి తరలివచ్చిన యాత్రికులతో ప్రయాగ్‌రాజ్ కిక్కిరిసిపోయింది. అంతులేని ఆధ్యాత్మిక పరిమళాలతో విలసిల్లింది.
ఈ ఒక్క మహా కుంభమేళా.. ఈ మొత్తం దేశాన్ని ఆధ్యాత్మిక భావనలో మునిగితేలేలా చేసింది. ఇంతమంది భక్తజనం ఒకచోట చేరిన ఈ గొప్ప వేడుక గురించి.. ఇప్పుడు ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటోంది. ఈ ఆధ్యాత్మిక మేళా జరిగినన్ని రోజులు.. ప్రయాగ్ రాజ్ వైభవోపేతమై వెలిగిపోయింది. అంచనా వేసిన దానికన్నా 20 కోట్ల మంది ఎక్కువ భక్తులు.. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. భారతదేశంలో 140 కోట్ల మందికి పైగా జనాభా ఉంటే.. వారిలో 110 కోట్ల మంది సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నారు. వీరిలో దాదాపు సగం మంది ప్రయాగ్‌రాజ్‌లోని పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. అలా.. ఈ భూమండలంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన హిందూ మహోత్సవంగా కుంభమేళా రికార్డ్ సృష్టించింది. హిందువులతో పాటు హిందూ ధర్మాన్ని నమ్మే కోట్లాది మంది.. 144 ఏళ్లకోసారి వచ్చే ఈ అరుదైన ఆధ్యాత్మిక వైభవాన్ని కనులారా చూసేందుకు.. తనివితీరా ఆస్వాదించేందుకు.. మహా కుంభమేళాలో భాగస్వాములయ్యారు.
అచంచలమైన భక్తి విశ్వాసాలు, అంతులేని ఆధ్యాత్మికత, పవిత్ర త్రివేణి సంగమం, కోట్లాది మంది భక్తజనం ఒక్క చోట చేరిన అరుదైన కలయిక.. మహా కుంభమేళా. ఇంతటి అత్యద్భుతమైన మేళా.. అద్వితీయంగా సాగింది. అనన్యసామాన్యంగా నిలిచింది. భారత ఆధ్యాత్మిక రాజధాని అయిన ప్రయాగ్‌రాజ్ నేలపై.. సగం భారతం నడయాడింది. పుణ్యస్నానాలు ఆచరించి పునీతమైంది.
ప్రతి మూడేళ్లకోసారి.. మన దేశంలో నాలుగు పుణ్యక్షేత్రాల్లో అర్ధ కుంభమేళాలు జరుగుతుంటాయ్. ప్రతి పన్నెండేళ్లకోసారి ఇదే ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా జరుగుతుంది. కానీ.. ఇలాంటి మహా కుంభమేళా 144 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే వస్తుంది. ప్రతి 3 తరాల్లో ఒక తరానికి మాత్రమే ఈ కుంభమేళాని చూసే అదృష్టం, అందులో భాగస్వాములయ్యే భాగ్యం దక్కుతుంది. అలాంటి అవకాశాన్ని.. భారతీయ హిందువులు అస్సలు వదులుకోలేదు. ఇందుకు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా పేరొందిన మహా కుంభమేళాకు.. గతంలో ఎప్పుడూ లేనంతగా లభించిన ఆదరణే.. బిగ్ ఎగ్జాంపుల్. ఎవరూ ఊహించని స్థాయిలో 65 కోట్ల మందికి పైగా భక్తజనం.. పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారంటే.. కుంభమేళా పవిత్రత, దాని విశిష్టత.. జనంలోకి ఎంతలా వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు.
ఒక్క భారతదేశం నుంచే కాదు.. విదేశాల నుంచి సైతం అనేక మంది ప్రముఖులు కుంభమేళాకు వచ్చారు. రోజుకు కోటి మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి.. అనేక ఆలయాల్ని దర్శించుకున్నారు. సంక్రాంతి, మౌని అమావాస్య, వసంత పంచమి, మాఘ పూర్ణిమ లాంటి విశేషమైన రోజుల్లో ఈ సంఖ్య మరింత ఎక్కువైంది. కేవలం.. 34 రోజుల్లోనే 50 కోట్ల మంది ప్రయాగను సందర్శించారంటే.. కుంభమేళాలో పాల్గొనడాన్ని జనం ఎంత అదృష్టంగా భావించారో తెలుస్తోంది. ఈ విశాల భారతంలోని ప్రతి మూల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ త్రివేణి సంగమం ఒడ్డుకు చేరారు. ఎంత చలి ఉన్నా లెక్క చేయలేదు. కఠినమైన వాతావరణ పరిస్థితుల్లోనూ.. చల్లని నీటిలో పవిత్ర స్నానాలు ఆచరించారు. గుంపులు, గుంపులుగా వచ్చిన ఎన్నో కుటుంబాలు.. రోడ్డు పక్కనే వంటలు చేసుకొని తిన్నారు. ఈ 45 రోజులు ధూప, దీపాలతో.. ప్రయాగ వెలిగిపోయింది. అక్కడి గాలి అంతా సుగంధం వ్యాపించింది. సాధువుల జపాలు, ప్రార్థనలు, భగవన్నామస్మరణతో.. ప్రయాగ మొత్తం మార్మోగింది.
ప్రయాగకు చేరిన వాళ్లలో ఎంతో మందికి.. ఆ సంగమం ఘాట్ దగ్గరే కొత్త స్నేహితులు పరిచయమయ్యారు. తమతో ఉన్న ఆహారాన్ని, ఇతర వస్తువుల్ని.. ఒకరితో ఒకరు పంచుకున్నారు. ఇదే కుంభమేళాలో.. బూడిద, సింధూరం పూసుకున్న శరీరాలతో లక్షలాది మంది సాధువులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కుంభమేళా సమయంలో మాత్రమే కనిపించే అఘోరాలు, నాగ సాధువులను చూసేందుకు.. వారి ఆశీర్వాదం తీసుకునేందుకు వచ్చిన వాళ్లు కూడా లక్షల్లో ఉన్నారు. వందల, వేల కిలోమీటర్ల నుంచి ప్రయాణం చేసిన వచ్చిన వాళ్లంతా.. పవిత్ర త్రివేణి సంగమంలో మునగగానే.. తాము అనుభవించిన అలసటని మర్చిపోయారు. ఆధ్యాత్మిక ప్రపంచంలో భాగస్వాములై కదిలారు. 45 రోజుల పాటు సాగిన ఈ సుదీర్ఘ మహా కుంభమేళా ప్రయాణంలో.. ప్రతి ఒక్కరికీ మరపురాని ఘట్టాలున్నాయ్. ఎప్పటికీ మర్చిపోలేని గుర్తులున్నాయ్.
తొక్కిసలాట జరిగినా, వందల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయినా.. ప్రయాగ వైపు కదిలే భక్తజనం తగ్గలేదు. అరుదుగా వచ్చే మహా కుంభమేళాలో పవిత్ర పుణ్యస్నానం ఆచరించడమే ఏకైక లక్ష్యంగా.. ప్రతి ఒక్కరూ త్రివేణి సంగమం వైపు కదిలారు. అత్యద్భుతమైన అనుభూతి చెందారు. ఈ పవిత్ర మహా కుంభమేళా గురించి.. భారతీయ పురాణాల్లో అనేక ప్రస్తావనలున్నాయ్. కోట్లాది మంది భక్తుల నమ్మకం ముడిపడి ఉంది. త్రివేణి సంగమానికి ప్రత్యేక ఇతిహాసముంది. అందువల్లే.. ఇంత మంది జనం కుంభమేళాకు తరలివెళ్లారు. ఈ 45 రోజుల పాటు ఈ దేశంలోని ఒక్కరిలోనూ భక్తి భావం కనిపించింది. ప్రతి మూలన ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. ఎవరి నోట విన్నా.. కుంభమేళా విశేషాలే వినిపించాయ్. ఎవరిని కదిపినా.. కుంభమేళా గురించిన చర్చలే జరిగాయ్. దేశం మొత్తం ఒకేసారి జరుపుకున్న అత్యంత గొప్ప మహోత్సవం.. మహా కుంభమేళా.
Also Read: పవన్ భార్యపై దారుణమైన వ్యాఖ్యలు.. ఆ కామెంట్సే పోసాని కొంప ముంచాయా?
మహా కుంభమేళా సాగినన్ని రోజులు.. దేశం మొత్తం ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. రోజువారీ పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు.. ఇలా తీరిక లేనోళ్లు కూడా.. ప్రత్యేకంగా సమయం తీసుకొని మరీ కుంభమేళాలో పాల్గొన్నారు. ఈ పవిత్రోత్సవంలో పాల్గొనే అదృష్టాన్ని అస్సలు వదులుకోవద్దనే ఉద్దేశంతో.. కుటుంబాలతో సహా ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లిన వారెందరో ఉన్నారు. అలా వచ్చిన కోట్లాది మంది భక్తజనంతో.. త్రివేణి సంగమం 45 రోజుల పాటు కోలాహలంగా కనిపించింది. ప్రయాగ్‌రాజ్ తీరాన పుట్టిన ఆధ్యాత్మిక భావం.. భారతదేశమంతటా వ్యాపించింది.
144 ఏళ్లకోసారి వచ్చే ఈ అరుదైన కుంభమేళాలో.. తామూ భాగస్వాములు కావాలని భారతదేశంలోని హిందువులంతా సంకల్పించుకున్నారు. ఎంత కష్టమైనా.. ఇష్టంతో అక్కడిదాకా వెళ్లారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. నిజమైన ఆధ్యాత్మిక ప్రపంచం ఎలా ఉంటుందో.. ప్రయాగలో కనులారా చూశారు. మహా కుంభమేళాలో పాల్గొని పునీతులయ్యారు.