Meenakshi Natarajan: తెలంగాణ కాంగ్రెస్లో పదవుల పండుగ ఒకవైపు అలకలు మరోవైపు కొనసాగుతున్నాయి. అవి పార్టీ లో సహజమే కానీ ఆ రుసరుసలు, అసంతృప్తి పీసీసీ చీఫ్, సీఎంలపై అంటే లైట్ తీసుకునే వారేమో.. కానీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుండటం చర్చనీయాంశంగా మారింది. మేడమ్ రాష్ట్రానికి వచ్చే ముందు ఒక స్టాండ్ తీసుకుంటే తగ్గేదేలే అన్నట్లు ఉంటారని, ఎవరి ఒత్తిళ్లకు లొంగరని, సింప్లిసిటీ, లాయల్టీలకి మారుపేరని ప్రచారం జరిగింది. కానీ పీసీసీ కార్యవర్గం లిస్ట్ రిలీజ్ తర్వాత మేడమ్‌పై ఇంప్రెషన్ పోయిందని నేతలు రుసరుసలాడుతున్నారు. ఇంతకీ మేడం చేసిన మిస్టేక్ ఏంటి? నేతలు ఎందుకు అందుకు అంత అసంతృప్తితో ఉన్నారు?
మీనాక్షి వచ్చినప్పుడు హ్యాపీగా ఫీలైన కాంగ్రెస్ శ్రేణులు
ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కి డోకా లేదు.. మీనాక్షి నటరాజన్ లాంటి మేడం ఏఐసీసీ ఇన్ఛార్జ్‌గా వస్తున్నారంటే పార్టీలో అందరికీ ఖచ్చితంగా న్యాయం జరుగతుందని అందరు భావించారు .. మొదట్లో మేడం ట్రైన్‌లో రావడం, ఆటోలో తిరగడం, ఫ్లెక్సీ లు పెట్టవద్దని చెప్పడం, పెద్ద హోటల్ లో కాకుండా గెస్ట్ హౌస్‌లో ఉండడంతో పార్టీ శ్రేణులన్నీ ఆమెపై తెగ ఇంప్రెషన్ పెంచేసుకున్నాయి. లీడర్ అంటే అలా ఉండాలని మాట్లాడుకున్నాయి. ఇక ఖచ్చితంగా పార్టీ లో కష్టపడ్డ వారికీ పదవులు వస్తాయని భావించారు.
విజయశాంతికి ఎమ్మెల్సీ పదవి దక్కడంతో షాక్
అక్కడి వరకు బానే ఉన్నా దాదాపు అన్ని పార్టీలు తిరిగివచ్చిన సినీ నటి విజయశాంతికి ఎమ్మెల్సీ పదవి దక్కడం అందరికీ షాక్ ఇచ్చింది. హీరోయిన్‌గా రిటైర్ అయ్యాక విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీ పెట్టుకుని పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. దాన్ని టీఆర్ఎస్‌లో విలీనం చేసి తొలిసారి ఎంపీగా గెలిచారు. తర్వాత కేసీఆర్ ఆమెకు మెదక్ టికెట్ నిరాకరించడంతో కాంగ్రెస్‌లో చేరారు. అక్కడ నుంచి బీజేపీలో చేరి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. సినిమాల్లో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన రాములమ్మ కాంగ్రెస్ పార్టీలో కూడా పూర్తిస్థాయిలో యాక్టివ్‌గా లేరు. అలాంటి విజయశాంతికి ఎమ్మెల్సీ పదవి ఎలా వచ్చింది? ఆమె విషయంలో మీనాక్షి మేడమ్ ఏం స్టడీ చేసి రికమెండ్ చేశారు? అని పార్టీలో పెద్ద చర్చే జరిగింది. అయితే కొందరు మేడమ్‌ను అడిగితే.. ఎలక్షన్ కంటే ముందు వచ్చారు కదా? అందుకే పదవి వచ్చిందని చెప్పారంట.
సెక్రటేరియట్‌లో సమావేశాల ఏర్పాటుపై ఆశ్యర్యం
ఇక మీనాక్షి నటరాజన్ ప్రభుత్వం విషయంలో జోక్యం చేసుకోరని అందరు అనుకున్నారు. కానీ అందరి ఊహలను తలకిందులు చేశారు ఇన్‌ఛార్జ్ .. కంచె గచ్చిబౌలి భూ వివాదం విషయంలో సర్కార్ ఒక నిర్ణయం తీసుకుంది. దానిపై ఒకింత వ్యతిరేకత వ్యక్తమైంది. వెంటనే మీనాక్షి నటరాజన్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులతో, ప్రజా సంఘాలతో చర్చలు జరిపారు. ఏకంగా సెక్రటేరియట్‌లో సమావేశాలు ఏర్పాటు చేశారు. అది కాంగ్రెస్ నేతలకు మరో షాక్ ఇచ్చింది. ఇదేంటి పార్టీ ఇన్చార్జ్ సెక్రటేరియట్‌లో మీటింగ్స్ పెట్టడం ఏంటి?, ప్రభుత్వ నిర్ణయాల్లో ఇన్వాల్వ్ అవ్వడం ఏంటని అందరూ ఆశ్చర్చపోవాల్సి వచ్చింది.
సమీక్షా సమావేశాల్లో నేతల వివరాల సేకరణ
లేటెస్ట్‌గా చూస్తే.. పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల ముఖ్య నేతలు, పార్టీ లో యాక్టివ్‌గా ఉండేవారికి కుడా సమయం ఇచ్చి మాట్లాడుతున్నారు. ఎవరి సమస్యలు ఏంటని తెలుసుకుంటూ.. ఎవరికిఏ పదవి కావాలో? ఎప్పటి నుండి పార్టీ లో ఉన్నారో అన్ని వివరాలు సేకరిస్తున్నారు. అది చాలా మంచి పరిణామమని అందరూ సంతోషపడ్డారు. ఐతే ఇటీవలే పీసీసీ కార్యవర్గం లిస్టు రిలీజ్ అయ్యాక అందరూ మళ్లీ షాక్ అయ్యారంట. 27 మంది వైస్ ప్రెసిడెంట్‌లు, 69 మంది జనరల్ సెక్రటరీలతో విడుదలైన పీసీసీ కార్యవర్గం జాబితాపై పార్టీ సీనియర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారంట.
అధికారంలోకి వచ్చాక ఎంట్రీ ఇచ్చిన వారికి పదవులు
పీసీసీ పదవులులో 10కి పైగా అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు పార్టీ వదిలేసి, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి వచ్చిన వారికి అవకాశం ఇచ్చిన్నట్లు గాంధీభవన్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మీనాక్షి నటరాజన్ 2017 నుండి పార్టీలో ఉన్నవారికే పదవులు అన్నారు. తర్వాత ఎన్నికల కంటే ముందు పార్టీలోకి వచ్చిన వారికి కూడా ప్రాధాన్యత అన్నారు. మరి పార్టీ పవర్‌లోకి వచ్చాక రీఎంట్రీ ఇచ్చిన వారికి ఎలా పదవులు కట్టబెట్టారని కాంగ్రెస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ఆమె కమిట్‌మెంట్‌పై ఎంతో నమ్మకం పెట్టుకుంటే ఇలా చేశారేంటని అసహనం వ్యక్తం చేస్తున్నాయి.
కరోనా సమయంలో సేవలందించిన కాంగ్రెస్ కార్యకర్తలు
అదలా ఉంటే కరోనా సమయంలో ఎక్కడి వారు అక్కడ ఇళ్లల్లో ఉంటే ఒక 12మంది కాంగ్రెస్ కార్యకర్తలు రోజు గాంధీభవన్‌కి సేవలు అందించారు. కాల్స్ రిసీవ్ చేసుకుంటూ సమస్యలో ఉన్నవారికి అందుబాటులోకి వెళ్ళి పని చేశారు. ఆ పన్నెండు మందిలో ప్రేమ్‌లాల్ అనే కార్యకర్తచనిపోయారు. నాగేష్ ముదిరాజ్ పార్టీలో లేరు. ఇక మిగిలిన 10 మందికి ఇంతకు ముందున్న ఇన్‌ఛార్జ్ దీపాదాస్‌మున్షీ భవిష్యత్తులో మంచి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారంట. అలాగే పీసీసీ కార్యవర్గం లిస్టులో కూడా పేర్లు పెటిన్నట్లు వార్తలు ఉన్నాయి. అయితే ఆ 10 మందిలో ఒక్కరికి కూడా పీసీసీ కార్యవర్గంలో అవకాశం ఇవ్వలేదంట.
అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సామాజికవర్గం నేతలు
మరోవైపు యాదవ సామాజికవర్గం నేతలు కూడా కాంగ్రెస్ కమిటీలపై ఆసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికే పదవులు ఇవ్వడంపై సీనియర్లు అసంతృప్తిగా ఉన్నారు. బీసీలలో రాజకీయంగా, సామాజికంగా బలంగా ఉన్న యాదవ సామాజిక వర్గ నేతలు తమకు ప్రాధాన్యత దక్కలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యవర్గంలో అతి కీలకమైన పీసీసీ ఉపాధ్యక్ష పదవుల్లో తమకు ప్రాతినిధ్యం లేకపోవడంపై సదరు ఆశావహులు అలిగారంట. అలాగే 69 మంది జనరల్ సెక్రటరీలో కేవలం ఒక్కటే స్థానం కేటాయించడంపై యాదవ నేతల తీవ్ర అసంతృప్తితో ఉన్నారంట.
మున్నూరు కాపులకు 7, గౌడ సామాజిక వర్గానికి 8 స్థానాలు
సామాజిక న్యాయం అంటూ మున్నూరు కాపులకు 7 , గౌడ సామాజిక వర్గానికి 8 స్థానాలను కేటాయించి మిగిలిన సామాజిక వర్గాలని విస్మరించారని గాంధీభవన్‌లో తెగ చర్చలు నడుస్తున్నాయి. మొత్తానికి ఎవరికి వారు ఏఐసీసీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారంట. హైకమాండ్ దూతలుగా ఎవరు వచ్చినా కష్టపడిన వారికి పదవులు రావని చర్చించుకుంటున్నారు. మరి వారి అసంతృప్తి పై మీనాక్షినటరాజన్ ఎలా స్పందిస్తారో చూడాలి.
Story By Apparao, Bigtv Live