Air India Compensation| అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఎయిర్ ఇండియా శనివారం 25 లక్షల రూపాయల తాత్కాలిక సహాయాన్ని ప్రకటించింది. ఈ ఆర్థిక సహాయం.. ఎయిర్ ఇండియా మాతృ సంస్థ టాటా సన్స్ ఇప్పటికే ప్రకటించిన 1 కోటి రూపాయల పరిహారాని అదనంగా ఇవ్వబడుతుందని.. ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.
గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్ది సేపటికే, 242 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో కూడిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం మేఘనీనగర్ ప్రాంతంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 241 మంది ప్రయాణికులతో సహా మొత్తం 270 మంది ప్రాణాలు కోల్పోయారు.
“మేము తక్షణ ఆర్థిక అవసరాలను తీర్చడానికి, మరణించిన వారి కుటుంబాలకు.. గాయపడిన వారి చికిత్స కోసం ఒక్కొక్కరికి రూ.25 లక్షల తాత్కాలిక సహాయంగా అందిస్తాము,” అని ఎయిర్ ఇండియా తెలిపింది. ఇది టాటా సన్స్ ప్రకటించిన 1 కోటి రూపాయల (సుమారు 85,000 జీబీపీ) సహాయానికి అదనంగా ఉంటుందని వారు వివరించారు.
“ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ప్రయాణికుల కుటుంబాలకు ఎయిర్ ఇండియా అండగా ఉంటుంది. ” అని ఎయిర్ ఇండియా సిఈఓ పేర్కొన్నారు. ఈ కష్ట సమయంలో బాధితులకు ఆదుకునేందుకు తమ బృందాలు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాయని ఎయిర్ ఇండియా తెలిపింది.
మీ డబ్బెవడికి కావాలి?.. చనిపోయిన వాళ్లను తీసుకురాగలరా?
ఎయిరిండియా విమాన ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబాలకు టాటా గ్రూప్ రూ.1 కోటి పరిహారం ప్రకటించింది. కానీ, ఫాల్గుని అనే మహిళ మాత్రం ఆ డబ్బు వద్దంటోంది. “మీ డబ్బెవడికి కావాలి?.. చనిపోయిన వాళ్లను తీసుకురాగలరా?.. నా తండ్రిని బతికించి తీసుకొస్తే నేనే రెండు కోట్లిస్తా” అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె తండ్రి ప్రమాదంలో చనిపోయారు. మృతదేహం కూడా దొరకలేదు. “పరిహారం నా తండ్రిని, ఆయన ఆప్యాయతను తిరిగి ఇస్తుందా?” అని ఆమె ఆవేదనతో ఎయిర్ ఇండియా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
అహ్మదాబాద్‌లోని బీజే మెడికల్ కాలేజీ వద్ద బాధిత కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. మృతదేహాలు కాలిపోవడంతో డీఎన్‌ఏ పరీక్షలు జరుగుతున్నాయి. కానీ, ఈ ప్రక్రియలో ఆలస్యం అవుతోందని బాధితులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం త్వరలోనే మృతదేహాలను అప్పగిస్తామని చెబుతున్నారు.
విమాన ప్రమాద బాధితుల శవాలను తరలించేందుకు 120 శవపేటికల తయారీ
అహ్మదాబాద్ విమాన ప్రమాద బాధితుల శవాలను వారి కుటుంబాలకు గౌరవంగా తరలించేందుకు స్థానిక క్రైస్తవ సమాజ సభ్యులు 120 చెక్క శవపేటికలను తయారు చేస్తున్నారు. ఆర్దేష్, మెల్విన్ రాజ్‌వాడీ అనే తండ్రి-కొడుకులు నేతృత్వంలోని ఈ బృందం శనివారం సాయంత్రం నాటికి 25 శవపేటికలను పూర్తి చేసింది. ఈ విషాద సమయంలో అసాధారణమైన అంకితభావాన్ని చూపించింది.
వాలంటీర్లు తమ సొంత డబ్బుతో ముడిసరుకును కొనుగోలు చేస్తున్నారని.. ఉత్పత్తి ఖర్చు కంటే ఒక్క రూపాయి అదనంగా వసూలు చేయబోమని చెప్పారు. “ఎయిర్ ఇండియా మమ్మల్ని సంప్రదించి, అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రి మార్చురీలో ఉన్న విమాన ప్రమాదంలో చనిపోయినవారి శవాలను తరలించేందుకు 120 శవపేటికలు తయారు చేయమని ఆర్డర్ ఇచ్చింది. శుక్రవారం రాత్రి 9 గంటలకు పని ప్రారంభించి, శనివారం మధ్యాహ్నం నాటికి 25 శవపేటికలను పూర్తి చేశాం. ఈ రాత్రికి 50 శవపేటికలను పూర్తి చేసి కంపెనీకి అప్పగిస్తాం,” అని ఆర్దేష్ రాజ్‌వాడీ తెలిపారు.
ఐదు నుంచి ఆరుగురు క్రైస్తవ సమాజ వాలంటీర్లు తమకు సహాయం చేస్తున్నారని ఆర్దేష్ చెప్పారు. వాలంటీర్ అల్డ్రిన్ థామస్ మాట్లాడుతూ.. శవపేటిక తయారీ కోసం సమయం పడుతుంది. ఒక్క శవపేటికను పూర్తి చేయడానికి రెండు గంటల సమయం పడుతుందని చెప్పారు.
“ఇవి ప్లైవుడ్‌తో తయారు చేయబడతాయి, కచ్చితమైన కొలతలతో కత్తిరించాలి. కత్తిరించిన ముక్కలను జాగ్రత్తగా జతచేసి సరైన ఆకారంలో శవపేటికలను తయారు చేస్తాము. ఆ తర్వాత వాటిని తెల్లని గుడ్డతో కప్పుతాము. ప్రతి శవపేటిక 2 అడుగుల వెడల్పు, 6 అడుగుల పొడవు ఉంటుంది. తద్వారా చాలా శవాలను సర్దుబాటు చేయవచ్చు. రాజ్‌వాడీ కుటుంబానికి సహాయం చేయడానికి మేము కలిసి పనిచేస్తున్నాము,” అని థామస్ వివరించారు.