Middle East War Impact: వంట గ్యాస్ ట్రబుల్స్ మొదలయ్యాయ్.. కట్టెల పొయ్యిలు కనిపిస్తున్నాయ్.. హైదరాబాద్ లాంటి నగరాల్లో కట్టెలకు కూడా డిమాండ్ పెరిగింది.. ఇండక్షన్ స్టవ్‌ల ఆర్డర్స్ కూడా ఊపందుకుంటున్నాయ్.. కొన్ని చోట్ల హోటల్స్ మూతపడితే.. ఇంకొన్ని చోట్ల లిమిటెడ్ మెనూతోనే హోటల్స్ నడిపించేస్తున్నారు.. కొన్ని ఆలయాల్లో ప్రసాదాల తయారీకి కూడా ఇబ్బందులు తలెత్తాయ్. మొత్తానికి.. పాత రోజులు మళ్లీ వచ్చేశాయనిపిస్తోంది. ఇదంతా.. బటర్ ఫ్లై ఎఫెక్ట్ లాగే కనిపిస్తోంది. ఇది కేవలం.. సైన్స్ ఫిక్షన్ సినిమాలకే కాదు.. ప్రస్తుత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకు, ఆర్థిక ముఖ చిత్రానికి తాజా పరిణామాలు అద్దం పడుతున్నాయ్.
అక్కడెక్కడో పశ్చిమాసియాలో పేలుతున్న బాంబులు.. మన వంటిళ్లలో రీసౌండ్ వస్తున్నాయ్. ఎక్కడో మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తితే.. ఇక్కడ ఇండియాలో మిడిల్ క్లాస్ ఎఫెక్ట్ అవుతోంది. యుద్ధం అక్కడైతే.. సెగ ఇక్కడ తగులుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్ వార్ కేవలం రెండు దేశాల మధ్య గొడవ కాదు. అది.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెను సవాల్ విసురుతోంది. ఓ చిన్న నిప్పురవ్వ కార్చిచ్చుగా మారి ఎలాగైతే అడవిని దహించేస్తుందో.. అలాగే, యుద్ధం సృష్టించిన ప్రకంపనలు, సముద్రాలు దాటి మిగతా దేశాల్లోని సామాన్యులని తాకుతున్నాయ్. యుద్ధం ప్రభావంతో.. పబ్లిక్‌లో ప్యానిక్ మొదలైంది.
భారత్ దశాబ్దాలుగా ఇంధన అవసరాల కోసం దిగుమతులపైనే ఆధారపడుతోంది. యుద్ధం వల్ల.. సప్లై చైన్ దెబ్బతినడంతో.. న్యాచురల్ గ్యాస్ ధరలు పెరిగిపోయాయ్. ఇప్పటికే.. వంట గ్యాస్ ధరలు పెరిగాయ్. సీఎన్‌జీ కొరత కూడా మొదలైంది. దీని ప్రభావం రవాణా రంగంపై పడుతుంది. ఎల్పీజీ గ్యాస్ సెగ గట్టిగా తగులుతోంది. ప్రధానంగా.. హోటల్స్ పరిశ్రమ కుదేలైంది. వంట గ్యాస్ ఖర్చు భరించలేక, కమర్షియల్ సిలిండర్లు దొరకక చాలా చోట్ల హోటల్స్ మూత పడ్డాయ్. ఇంకొన్ని హోటల్స్.. మెనూని కుదించేశాయ్. చాలా సేపు ఉడికించాల్సిన వంటలను మెనూ నుంచి తొలగించారు. ఖర్చు తగ్గించుకునేందుకు.. హోటల్ టైమింగ్స్ కూడా మార్చేశారు. కొన్ని ఫుడ్ సెక్షన్లని కూడా మార్చేశారు. ఒకప్పుడు ఆధునికత వైపు అడుగులేస్తూ.. కట్టెల పొయ్యిని వదిలేసిన గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో.. మళ్లీ పొగ కనిపిస్తోంది. గ్యాస్ సిలిండర్ ధరలని, బుకింగ్ టైమ్‌ని పెంచడంతో.. జనం మళ్లీ పాత రోజుల వైపు మళ్లుతున్నారు. ఇప్పుడు కట్టెల పొయ్యి మీద వంట చేయడమనేది ఛాయిస్ కాదు.. అదొక కంపల్సరీగా మారుతోంది.
ఈ ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా.. అది కేవలం అక్కడున్న దేశాలకు మాత్రమే పరిమితం కాదు. గ్లోబల్ ఎకానమీలో.. ప్రతి కంట్రీ ఇప్పుడు కీలకంగా ఉంది. దాంతో.. యుద్ధం ప్రభావం ఇండియాతో పాటు అనేక దేశాల్లోని కుటుంబాలపై పడుతోంది. అందుకే.. యుద్ధం ఎక్కడ వచ్చినా సామాన్యుడి జేబుకు చిల్లు పడుతోంది. మనం వాడుతున్న ఎల్‌పీజీ గ్యాస్‌లో ఎక్కువ భాగం గల్ఫ్ దేశాల నుంచే దిగుమతి అవుతోంది. యుద్ధం వల్ల గ్యాస్ ధరలు పెరిగి.. సామాన్యుల బడ్జెట్ తలకిందులవుతోంది. సింపుల్‌గా చెప్పాలంటే.. పశ్చిమాసియాలో పేలే ప్రతి బాంబు ప్రభావం ఇప్పుడు ఇండియాలో.. నిత్యవసర వస్తువులపై పడుతోంది. ఈకాలంలో.. ప్రపంచంలో ఏ మూల యుద్ధం జరిగినా, దాని సెగ అనేక దేశాలను తాకుతోంది.
ఒక యుద్ధం ఇంత మార్పు తెస్తుందా? అని.. అందరికీ ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ఒకప్పుడు.. వార్ అంటే రెండు దేశాల మధ్య సైనిక నష్టం, ఆయుధాల నష్టం జరిగేది. కానీ.. ఇప్పుడు యుద్ధం అంటే.. సామాన్యుడికి ఇబ్బందులు తప్పవనే విషయం అర్థమవుతోంది. టెక్నాలజీ ఎంత పెరిగినా, మనమంతా ఇంకా ప్రాథమిక అవసరాల కోసం ఒకరిపై ఒకరం ఆధారపడుతూనే ఉన్నామని ఈ సంక్షోభం గుర్తు చేస్తోంది. యుద్ధం ఆగిపోతే పరిస్థితులు చక్కబడతాయ్. కానీ, ఇప్పుడు ఎదుర్కొన్న ఇబ్బందులు మాత్రం.. చాలా ఏళ్లు గుర్తుండిపోతాయ్.
పశ్చిమాసియాలో రాజుకున్న చిచ్చు ఇప్పుడు ప్రపంచాన్ని తాకుతోంది. అక్కడి సెగ అనేక దేశాల ఎకానమీలనే ఊపేస్తోంది. ఎక్కడో గల్ఫ్ దేశాల్లో బాంబులు పడితే, మన ఇంట్లో గ్యాస్ పొయ్యి వెలగడం కష్టమవుతోంది. కిచెన్, కిరాణా బడ్జెట్ తలకిందులవుతోంది. ఒక సంక్షోభం వస్తే గానీ మనకు నిత్యవసర వస్తువుల విలువేంటో అర్థం కాదు. ఇబ్బందులు తలెత్తితే గానీ తెలియదు.. మనం పడే పాట్లు ఎంత దారుణంగా ఉంటాయో! ఈ భూగోళంలో ఎక్కడేం జరిగినా.. సామాన్యులకే సమస్య. వారికే.. ఎక్కువ ఎఫెక్ట్. ఎందుకంటే.. ఎక్కడ సంక్షోభం వచ్చినా.. నిత్యవసర వస్తువులు భారీగా పెరిగిపోతాయ్. రోజువారీ ఖర్చుల లెక్క మారిపోతుంది. యుద్ధాల్లాంటివి వస్తే.. దాని ఎఫెక్ట్ నేరుగా మన ఇంట్లో కిచెన్ మీదే పడుతుంది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంతో.. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే.
ఒక్క సిలిండర్ కొరతకే కిందా మీదా అయిపోతుంటే.. యుద్ధం ఇలాగే కొనసాగితే, దాని ఎఫెక్ట్ ఇంకా చాలా వాటిపై ఉంటుందని చెబుతున్నారు. ఇప్పుడు వంట గ్యాస్ మాత్రమే కనిపిస్తోంది. నెక్ట్స్.. పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ లాంటివి కూడా షార్టేజ్ అయితే పరిస్థితేంటి? వాటి రేట్లు కూడా పెరిగే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. ఇప్పుడంటే.. ఇండియాలో ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయ్. కానీ.. పక్కనున్న పాకిస్థాన్‌లో ఇప్పటికే ధరల షాక్ తగిలింది. పెట్రోల్, డీజిల్ రేట్లు.. 20 శాతానికి పైగా పెరిగాయ్. బంగ్లాదేశ్‌లో రేట్లు పెంచకపోయినా, ప్రభుత్వం పరమితులు విధించింది. దాంతో.. పెట్రోల్ బంకుల దగ్గర కిలోమీటర్ల మేర క్యూలు కడుతున్నారు వాహనదారులు. యుద్ధం వల్ల సప్లై చైన్ దెబ్బతింటే, అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ముడి చమురు ధర ఆకాశాన్ని తాకుతుంది. 2022 తర్వాత తొలిసారి బ్యారెల్ చమురు ధర 100 డాలర్లు దాటింది. ఈ నెలంతా హర్మూజ్ జలసంధిలో చమురు రవాణా జరగకపోతే.. బ్యారెల్ రేటు 150 డాలర్లు దాటే అవకాశం ఉందంటున్నారు. అదే జరిగితే.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయ్. అప్పుడు, ఎఫెక్ట్ వాహనదారులకు మాత్రమే కాదు. ఆటోమేటిక్‌గా రవాణా ఖర్చులు పెరుగుతాయ్. దాని ప్రభావం కూరగాయలు, నిత్యవసర వస్తువులపై పడి సామాన్యుడిపై భారం పడుతుంది.
భారత్‌లో వినియోగించే వంట నూనెలో అధిక భాగం దిగుమతి అయ్యేదే. పామాయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్ కోసం ఇతర దేశాలపై ఇండియా ఎక్కువగా ఆధారపడుతోంది. ఇలా.. యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడు.. సముద్ర మార్గాల్లో షిప్పింగ్ ఛార్జీలు పెరిగిపోతాయ్. ముఖ్యంగా.. పశ్చిమాసియా ప్రాంతం నుంచి వెళ్లే నౌకలపై దాడులు జరిగితే, ఇన్సూరెన్స్ ప్రీమియంలు పెరిగి వంట నూనెల ధరలు భారమవుతాయ్. ఇప్పటికే దేశంలో.. ఎల్‌పీజీ సప్లైలో ఇబ్బందులు మొదలయ్యాయ్. వంట గ్యాస్ ధరలు మండిపోవడం కూడా ఇప్పటికే మొదలైంది. కేంద్రం కూడా రేట్లు పెంచేసింది. యుద్ధం సుదీర్ఘంగా సాగితే సరఫరాలో అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉంది. దాంతో.. మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందో.. ఇప్పుడే చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయ్. ఇక.. యుద్ధం ప్రభావంతో.. చాలా దేశాల్లో విమాన టికెట్ల ధరలు పెరిగిపోయాయ్. ఫ్లైట్లు తగ్గిపోవడంతో.. డిమాండ్ పెరిగింది. అందుకు తగ్గట్లుగానే రేట్లు పెరిగాయ్. కంటికి కనిపించని మరో వస్తువు.. ప్యాకేజింగ్ ఎరువులు. భారత్‌కు దిగుమతి అయ్యే యూరియా, అమ్మోనియా రవాణా హర్మూజ్ జలసంధి గుండానే రావాలి. దాంతో.. సీజన్ మొదలయ్యే సమయంలో ఎరువుల ధరలు పెరిగితే.. సాగుపై ప్రభావం పడుతుంది. ఫలితంగా కూరగాయల ధరలు కూడా భారీగా పెరిగిపోతాయ్. ఎరువుల తాయారీకి అవసరమైన న్యాచురల్ గ్యాస్ కూడా అక్కడి నుంచే వస్తుంది. దీనివల్ల.. పంటల సాగు ఖర్చు పెరిగి, చివరకు బియ్యం, పప్పుల ధరలు పెరిగిపోతాయ్. ఇప్పటికే.. ఇలాంటి భయాలు జనాల్లో మొదలయ్యాయ్.
యుద్ధం ఎప్పుడు ఆగుతుందనేది ఎవరి చేతుల్లోనూ లేదు. కానీ.. ఆర్థిక క్రమశిక్షణ మన చేతుల్లోనే ఉంది. యుద్ధ సమయాల్లో ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, విలాసాల కోసం చేసే ఖర్చులను తగ్గించుకొని, ఎమర్జెన్సీ ఫండ్‌ని పెంచుకోవాలి. అనవసర ఖర్చులకు చెక్ పెట్టి, బడ్జెట్ ప్లానింగ్ చేసుకోవాలి. పెట్రోల్, గ్యాస్ ధరలు పెరిగే అవకాశం ఉన్నందున, వీలైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వాడటం ఉత్తమం అంటున్నారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. భయంతో.. నిత్యవసర వస్తువులను ఇళ్లలో నిల్వ చేయడం వల్ల మార్కెట్‌లో కృత్రిమ కొరత ఏర్పడి ధరలు మరింత పెరుగుతాయ్. ఇది.. ఎవరికీ మంచిది కాదంటున్నారు.
Also Read: ఉగాది నాడే లోకేష్ సీఎం? బాబు ఢిల్లీకి.. పవన్ పరిస్థితి ఏంటి? అసలు లెక్కలు ఇవే..!
Story by: Anup, Big Tv