ప్రమాదంలో ప్రమోదం అని దీన్నే అంటారు. ఎల్‌నినో కరువు కాటేయడానికి సిద్దంగా ఉంది. దీని ప్రభావం ఇప్పటికే వ్యవసాయ రంగం మీద పడింది. అయితే ఆ ఎల్నినోనే ఇప్పుడు వరి రైతును కాపాడుతున్నది. ఎలా అనుకుంటున్నారా? రాబోయే యాసంగి సీజన్లో వరి వేయడం కుదరకపోవచ్చు. సర్కార్ కూడా గట్టి నియంత్రణే చేయనుంది. దీంతో ఇప్పుడిప్పుడే వస్తున్న వరి కోతలతో ఆ వచ్చిన పచ్చివడ్లను ఎగబడి కొంటున్నారు పొరుగు రాష్ట్రం వ్యాపారులు.
నిజామాబాద్ జిల్లాలో వరి నాట్లు తొందరగా వేయడం అలవాటు. ఇప్పుడవి కోతలకు వచ్చాయి. ఆ వచ్చిన సన్న పచ్చి వడ్లను క్వింటాల్‌కు రూ. 3500 నుంచి రూ. 3900 వరకు ఇచ్చి కొంటున్నారు మహారాష్ట్ర, కర్ణాటక వ్యాపారులు. కళ్లాల వద్దకే వచ్చి మరీ కొనుక్కునే పోతుండటంతో మిల్లర్లు బరిలోకి దిగారు గద్దల్లా. వీరికి పెద్ద వడ్డీ మోహన్ రెడ్డి. తెలంగాణ రైస్ మిల్లర్ల అసోసియేషన్‌కు రాష్ట్ర బాధ్యుడిగా ఉన్న మోహన్‌రెడ్డిది నిజామాబాదే.
ఏకంగా వ్యాపారుల వద్దకు వచ్చి అలా ఎలా ఎక్కువ మొత్తం ఇచ్చి కొంటారని, మేమేం కావాలంటూ వారిని బెదిరించి అక్కడ్నుంచి తరిమేసే ప్రయత్నం మొదలుపెట్టాడు. అంతే కాదు.. మొత్తం స్టేట్ మిల్లర్లందరినీ రంగంలోకి దించి పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్న వ్యాపారులకు ధమ్కీ ఇచ్చే పనిని పెట్టుకున్నాడు.
ప్రభుత్వం ఇచ్చే ఎంఎస్పీ .. బోనస్‌తో కలిపి క్వింటాలుకు వచ్చేది రూ. 2900 మాత్రమే. దీనికి అదనంగా ఓ వెయ్యి రూపాయల వరకు లాభం దొరుకుతుండగా.. నోటికాడికొచ్చిన లాభాన్ని తరిమేసిన గద్దలు.. ఎంతో కొంత ఇచ్చి రైతుల వద్ద నుంచి తామే ఆ వడ్లు కొనేలా పన్నాగం పన్నుతున్నారు.
ప్రభుత్వం నుంచి తీసుకున్న కస్టమ్ మిల్లింగ్ రైస్(cmr)ను కోట్లకు కోట్లు బోక్కేసిన ఘన చరితను మూటగట్టుకున్న ఈ మిల్లర్ పెద్దలు..ఇప్పుడు రైతులను నిండా ముంచేందుకు రెడీ అయ్యారు. దీనికి ఈ వడ్డీ మోహన్‌రెడ్డి పెద్ద గద్దగా మారి.. అన్ని మిల్లర్ గద్దలను ఏకం చేశారని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలో నిరసనలు కూడా మొదలయ్యాయి. మోహన్‌రెడ్డి బీజేపీకి చెందిన నేత. కానీ మిల్లర్ల అసోసియేషన్‌లో అన్ని పార్టీల నేతలున్నారు. వీరంతా సిండికేట్‌గా మారి రైతులకు వచ్చే లాభాలను తరిమేశారు. వ్యాపారులను బెదిరించారు. నిజామాబాద్‌తో పాటు ఉత్తర తెలంగాణలలో నాణ్యమైన వడ్లు రావడం, ఇక్కడ్నుంచి రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉండటంతో పొరుగు రాష్ట్రం వ్యాపారులు ఇక్కడికి వచ్చి కొంటున్నారు.
అక్కడ ఈసారి వరిసాగును సగానికి తగ్గించేశారు. ఇక్కడ ప్రభుత్వం హెచ్చరించినా.. రైతులు వినలేదు. వరే వేశారు. ఇది ఇలా కలిసి వస్తోంటే.. పీతిరిగద్దల్లా మధ్యలో వచ్చి నోటికాడి కూడును చెదరగొట్టారు తెలంగాణ మిల్లర్లు. దీనిపై ఇప్పటి వరకు ఏ పార్టీ నేతలు కూడా స్పందించలేదు. తెలంగాణ రక్షణ సేన పార్టీ నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌కు వడ్డీ మోహన్‌రెడ్డి పై ఫిర్యాదు చేశారు. రైతులు ఎవరికైనా తమ వడ్లను అమ్ముకునే హక్కు ఉందని, మధ్యలో వీరెందుకు అడ్డుకుంటున్నారని, దీనిపై ప్రభుత్వం జోక్యం చేసుకుని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నిజామాబాద్ సీపీకి, కామారెడ్డి ఎస్పీలకు ఫోన్ చేసి ఈ బెదిరింపులపై ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు ముందస్తు కోతల ద్వారా ఓ 30 శాతం ధాన్యం వచ్చింది. బీపీటీ 5204, తెలంగాణ సోనా, జై శ్రీరామ్, హెచ్ఎంటీ సోనా, కేఎన్ఎం 7715, wgl 44 రకాలకు చెందిన సన్నవడ్లను ఇక్కడ పండించారు.
నీటి వనరులు మంచిగా ఉన్న చోట ముందస్తుగా నాట్లు పడ్డాయి. ఇవి ఇప్పుడు కోతలకు వచ్చాయి. ఇవి పచ్చి వడ్లు కావడంతో నాలుగైదు కేజీల తరుగు తీసి మరీ కొంటున్నారు. అయినా వెయ్యి వరకు లాభం వస్తుండటంతో పొరుగు రాష్ట్రం వ్యాపారులకు అమ్మేసుకుంటున్నారు రైతులు.
ఇప్పుడు ఈ మోహన్‌రెడ్డి టీమ్ బెదిరింపులతో క్వింటాలుకు రూ. 3150 కు ధర పడిపోయింది. దీనిపై తెలంగాణ మిల్లర్లను కంట్రోల్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఇందూరు వరి రైతులు.