E-Paper
Advertisement

మోడీ మౌనంతొ ముంచుకొస్తున్న తుపాను.. దేశానికి పీఎం ఇచ్చిన ‘డెంజర్ సిగ్నల్’!

మోడీ మౌనంతొ ముంచుకొస్తున్న తుపాను.. దేశానికి పీఎం ఇచ్చిన ‘డెంజర్ సిగ్నల్’!
Advertisement

Modi Economic Warning: కేంద్రంలో ఎన్డీయే వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత.. భారత ప్రధానిగా నరేంద్రమోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేశాక.. బెంగాల్‌ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించాక.. తొలిసారి తెలంగాణ గడ్డ మీద కాలు మోపారు నరేంద్రమోడీ. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు లాంఛనప్రాయంగా ముగిశాక.. పరేడ్‌గ్రౌండ్ నుంచి తెలంగాణ బీజేపీకి దశ, దిశను నిర్దేశిస్తారని.. కార్యకర్తల్లో జోష్ నింపుతారని.. బెంగాల్ తర్వాత నెక్ట్స్ టార్గెట్ తెలంగాణే అనే విషయాన్ని గట్టిగా చెబుతారని అంతా అనుకున్నారు. తన ప్రసంగంలో మోడీ కూడా ఈ అంశాలను టచ్ చేశారు. కానీ, ఇప్పుడు చర్చ దాని గురించి జరగడం లేదు. దేశం మొత్తం మోడీ అలా ఎందుకన్నారు? అనే దాని గురించే చర్చించుకుంటోంది. మోడీ ఏమన్నారో ఒక్కసారి వింటే.. మున్ముందు ఎలా ఉండబోతోందనే దానిపై ఓ క్లారిటీ వచ్చేస్తుంది..

సంక్షోభ హెచ్చరిక.. దేశానికి మోడీ కీలక పిలుపు

అదీ.. విషయం! సికింద్రాబాద్ సభలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు.. దేశవ్యాప్తంగా పెను సంచలంగా మారాయ్. సంక్షోభం ముంచుకొస్తోంది.. సిద్ధంగా ఉండండి అంటూ ఆయన ఇచ్చిన పిలుపు.. సామాన్యుల్లో కలవరం రేపుతుంటే, ఆర్థిక నిపుణుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు పూర్తిగా తొలగిపోలేదని, దాని ప్రభావం భారతదేశంపై మరింత తీవ్రంగా ఉండబోతోందని మోడీ హెచ్చరించారు. ప్రధానంగా విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడుకోవడంపై పీఎం ఫోకస్ పెట్టారు. అందుకోసమే.. విదేశీ మారకద్రవ్యాన్ని పొదుపు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దానిని సాధించేందుకు కొన్ని మార్గాలను కూడా సూచించారు. సంవత్సరం పాటు బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉండాలని, వంట నూనెల వినియోగాన్ని తగ్గించుకోవాలని కోరారు. మధ్యతరగతి కుటుంబాలు ఏడాది పాటు విదేశీ ప్రయాణాలకు దూరంగా ఉండాలన్నారు. పశ్చిమాసియాలో ఇరాన్-అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధంతో.. సప్లై చైన్‌లో అంతరాయం ఏర్పడింది. ఇది.. ప్రపంచం మొత్తం ప్రభావం చూపింది. ఇండియాపై.. దీని ఇంపాక్ట్ మరీ ఎక్కువగా ఉందని ప్రధాని చెప్పారు.

భారత్‌పై భారీ ప్రభావం?

Advertisement

ముఖ్యంగా.. భారత్‌లో చమురు వనరులు ఎక్కువగా లేవని, మన అవసరాలకు కావాల్సిన పెట్రోల్, డీజిల్, గ్యాస్‌ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుందన్నారు. యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఎరువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయ్. మన అవసరాల్లో 85 శాతానికి పైగా చమురు దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వల్ల.. చమురు సరఫరాకు కీలకమైన హర్మూజ్ జలసంధి దగ్గర ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉందని, దీనివల్ల పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయ్. ఇప్పటికే, మన పొరుగు దేశాల్లో పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయన్నారు మోడీ. యుద్ధం మొదలయ్యాక తలెత్తిన ఈ సంక్షోభం వల్ల.. ప్రజలపై అనవసర భారం పడకుండా, ప్రభుత్వమే ఆ భారాన్ని భరిస్తోందన్నారు ప్రధాని. ఇదంతా విన్నాక.. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందనే విషయం అర్థమైంది. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కోవిడ్ నాటి పరిస్థితులు మళ్లీ తలెత్తే అవకాశం ఉంన్నందున, కోవిడ్ కాలం నాటి జాగ్రత్తలను, పొదుపుని పాటించాలని సూచించారు. అవసరమైతే.. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వాడాలని చెప్పారు.

మోడీ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా చర్చ

వంటనూనెల విషయంలోనూ మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్.. ప్రతి సంవత్సరం లక్షల కోట్ల రూపాయల వంట నూనెలను దిగుమతి చేసుకుంటోంది. దిగుమతి భారం తగ్గించుకునేందుకు ప్రజలు తమ వినియోగాన్ని కనీసం 10 శాతం తగ్గించుకోవాలని ఆయన కోరారు. ఇది ప్రజల ఆరోగ్యానికే కాదు దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా మంచిదన్నారు. ఇక.. వ్యవసాయానికి కీలమైన రసాయన ఎరువుల కోసం కూడా.. భారత్ విదేశాలపైనే ఆధారపడుతోంది. యుద్ధ పరిస్థితుల వీళ్ల వీటి ధరలు ఇప్పుడే ఆకాశాన్నంటుతున్నాయ్. వీటి ధరలు పెరిగితే సామాన్య రైతులపై భారం పడుతుంది. అందుకే, ఎరువుల వినియోగాన్ని 50 శాతం తగ్గించి, ఆర్గానిక్ వ్యవసాయం వైపు మళ్లాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఇక.. భారతీయులకు బంగారంపై ఉన్న మక్కువ మన దేశ ఆర్థిక వ్యవస్థకు భారంగా మారుతోందని పీఎం మోడీ అభిప్రాయపడ్డారు. కనీసం.. ఏడాది పాటు బంగారం కొనొద్దని, విదేశీ ప్రయాణాలు మానుకోండని కోరడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంధనాన్ని ఆదా చేసేందుకు.. కోవిడ్ సమయంలో అలవాటు చేసుకున్న వర్క్ ఫ్రమ్ హోమ్, వీడియా కాన్ఫరెన్సింగ్ పద్ధతులను మళ్లీ అమలు చేయాలని సూచించారు. కార్ పూలింగ్, మెట్రో రైళ్లు వాడాలన్నారు. ప్రధాని మోడీ చెప్పింది విన్నాక.. దేశం ఒక రకమైన ఎకనమిక్ ఎమర్జెన్సీ లాంటి పరిస్థితులను ఎదుర్కోబోతోందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయ్.

ప్రజలకు మోడీ పరోక్ష హెచ్చరిక

Advertisement

పశ్చిమాసియాలో యుద్ధం ముగింపు దశకు చేరుకున్నప్పటికీ, సప్లై చైన్ దెబ్బతినడం, అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలపడటం లాంటి అంశాలు.. భారత్ లాంటి ఎదుగుతున్న దేశాలకు ఇబ్బందిగా మారాయ్. క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధరలు వంద డాలర్లు దాటినప్పటి నుంచి మన రూపీపై ప్రెజర్ పెరుగుతోంది. విదేశీ మారక ద్రవ్యం భారీగా ఖర్చవుతుండటంతో.. దేశం లోపల కొరత ఏర్పడకుండా ముందస్తుగా ప్రజలను అప్రమత్తం చేయడం ప్రధాని మోడీ వ్యూహంగా కనిపిస్తోంది. అందువల్ల.. దేశభక్తి అంటే కేవలం సరిహద్దుల్లో ప్రాణాలు అర్పించడమే కాదు, దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు మన అలవాట్లని మార్చుకొని.. ఆర్థిక వ్యవస్థకు అండగా నిలబడటం కూడా దేశ భక్తే. అయితే.. సంక్షోభం ముంచుకొస్తుందా అంటే.. సమాధానం అవుననే వినిపిస్తోంది. సో.. ఇది భయపడాల్సిన సమయం కాదని, బాధ్యతగా వ్యవహరించిన సమయం. విలాసాలకు స్వస్తి చెప్పి, స్వదేశీ వస్తువులకు ప్రాధాన్యత ఇవ్వడమే ఈ సంక్షోభానికి విరుగుడు అని ప్రభుత్వం భావిస్తోంది.

గోల్డ్ రేట్లు ఎందుకు పెరుగుతున్నాయ్?

మిడిల్ ఈస్ట్‌లో యుద్ధంతో.. స్టాక్ మార్కెట్ నుంచి క్రూడ్ ఆయిల్, బంగారం, వెండి, రూపాయి వరకు అన్ని రంగాల్లో తీవ్రమైన అస్థిరత కనిపిస్తోంది. గతేడాదే బంగారం ధరల్లో చరిత్రాత్మక పెరుగుదల కనిపించింది. బంగారం విలువ 60 శాతానికి పైగా పెరిగింది. యుద్ధం కారణంగా ఏర్పడిన అస్థిర పరిస్థితులను తట్టుకునేందుకు పెట్టుబడిదారులు సంప్రదాయ ఆస్తుల్లో పెట్టుబడి పెట్టడానికి మొగ్గు చూపుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో అమెరికా డాలర్‌పై ఆధారపడటం తగ్గి, బంగారంపై ఆధారపడటం పెరుగుతోంది. ప్రెసిడెంట్ ట్రంప్ విధానాల వల్ల స్టాక్ మార్కెట్ అనేక ఎదురుదెబ్బలు తిన్నది. ఫలితంగా, పెట్టుబడిదారులు ఇప్పుడు బంగారం, వెండి లాంటి విలువైన లోహాల్లోకి తమ పెట్టుబడులను మళ్లిస్తున్నారు. గోల్డ్ రేట్ల పెరుగుదల వెనుక ఉన్న అత్యంత ముఖ్యమైన కారకాల్లో మరో అంశం కేంద్ర బ్యాంకుల భారీ కొనుగోళ్లు. ప్రపంచవ్యాప్తంగా అమెరికా డాలర్ ఆధిపత్యం క్షీణిస్తుండటమే ఈ చర్యలకు కారణమంటున్నారు. ఈ మార్పు బంగారం ధరలపై స్పష్టమైన ప్రభావాన్ని చూపిస్తోంది.

బంగారం కొనొద్దు.. మోడీ పిలుపు

కొన్ని దశాబ్దాలుగా.. భారతీయ ఆర్థిక వ్యవస్థలో ఎప్పుడూ వినని, కనని ఒక అసాధారణ పిలుపు ప్రధాని మోడీ నుంచి వచ్చింది. ఏడాది పాటు పెళ్లిళ్లకు, శుభకార్యాలకు బంగారం కొనడం మానుకోండి అని చేసిన విజ్ఞప్తి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇది కేవలం ఓ సూచన మాత్రమే కాదు. ఈ దేశం ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆర్థిక సంక్షోభానికి హెచ్చరిక. మరి.. బంగారం కొనుగోళ్లు ఆగితే దేశ ఆర్థిక పరిస్థితి మారుతుందా? మోడీ ప్రకటన వెనుక ఉన్న చిక్కుముడులేంటి?

మోడీ వ్యూహం ఇదే!

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఇంధన సంక్షోభంతో.. ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీనికి తోడు విదేశాల నుంచి భారత్ అత్యధికంగా దిగుమతి చేసుకునే రెండో వస్తువు బంగారం. ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు దిగుమతిదారుల్లో ఇండియా ఒకటి. బంగారం దిగుమతి చేసుకోవాలంటే.. మనం భారీగా అమెరికన్ డాలర్లను చెల్లించాలి. గత ఆర్థిక సంవత్సరంలోనే బంగారం దిగుమతుల కోసం ఏకంగా 6 లక్షల కోట్లు ఖర్చు చేశాం. బంగారం కోసం కరెన్సీ మార్కెట్‌లో మనం డాలర్లను కొనేకొద్దీ, మార్కెట్‌లో డాలర్‌కు డిమాండ్ పెరిగి.. రూపాయి విలువ పడిపోతోంది. ఇప్పటికే.. రూపాయి మారకం విలువ డాలర్‌తో 95 రూపాయలు దాటి చరిత్రాత్మక కనిష్టానికి పడిపోయింది. మరోవైపు.. భారత విదేశీ మారక నిల్వలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయ్. చమురు ధరల భారాన్ని మోస్తూ, రూపాయిని కాపాడేందుకు రిజర్వ్ బ్యాంక్ డాలర్లను ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇలాంటి సమయంలో.. బంగారం లాంటి అనవసర దిగుమతులను కొంత కాలం పాటు తగ్గించడం ద్వారా.. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయాలన్నది ప్రభుత్వ వ్యూహం.

సంక్షోభ సమయంలో గోల్డ్‌పై ఎందుకు ఫోకస్?

ఆర్థికవేత్తలు కూడా బంగారాన్ని సాధారణ వినియోగ వస్తువుగా పరిగణించరు. రవాణా, విద్యుత్, పారిశ్రామిక కార్యకలాపాలకు అవసరమైన చమురులా కాకుండా, బంగారం దిగుమతుల్ని విచక్షణతో కూడిన ఖర్చు, పొదుపు డిమాండ్‌గా పరిగణిస్తారు. ప్రపంచ సంక్షోభ సమయంలో.. అనేక కుటుంబాలు పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకున్న బంగారాన్ని కొనుగోలు చేసినప్పుడు, దేశం నుంచి మరిన్ని డాలర్లు బయటకు తరలిపోతాయి. ఇది.. ఇండియా కరెంట్ అకౌంట్ లోటుని పెంచుతుంది. ఈ లోటు.. దిగుమతులు, ఎగుమతుల మధ్య గ్యాప్‌కు కొలమానంలా మారుతుంది. దేశం సంపాదించే దానికంటే.. ఎక్కువ విదేశీ మారకద్రవ్యాన్ని ఖర్చు చేయడం వల్ల, అధిక లోటు రూపాయిని బలహీనపరుస్తుంది. అందుకే.. ప్రభుత్వాలు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో.. దిగుమతుల విషయంలో జాగ్రత్త వహిస్తాయ్. చమురు ధరలు అధికంగా పెరిగినప్పుడు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు, కరెన్సీ బలహీనపడ్డప్పుడు.. బంగారం దిగుమతుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుంది. ఆర్థిక సంక్షోభ సమయాల్లో అధిక బంగారు దిగుమతులను నిరుత్సాహపరిచేందుకు భారతదేశం గతంలోనే చర్యలు తీసుకుంది. అప్పట్లో.. బంగారంపై దిగుమతి సుంకం పెంచడం, దిగుమతుల్ని పరిమితం చేయడం, సావరిన్ గోల్డ్ బాండ్స్ లాంటి ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించింది. ఇదంతా.. విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి తగ్గించి.. రూపాయిని స్థిరీకరించడం కోసమే!

దేశానికి మోడీ అలారమ్

ఇప్పుడు కూడా ప్రధాని మోడీ విజ్ఞప్తి చేసిన సమయం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే.. మిడిల్ ఈస్ట్‌లో తలెత్తిన ఉద్రిక్తతలు.. క్రూడ్ ఆయిల్ రేట్లని పెంచాయ్. సప్లై చైన్ బ్రేక్ అవుతుందనే భయాలు పెరిగాయ్. ఎమర్జింగ్ మార్కెట్ కరెన్సీల బలహీనపడ్డాయ్. ఇప్పుడు భారత చమురు దిగుమతుల బిల్లుపై పెరుగుతున్న ఆందోళనల క్రమంలో.. అమెరికా డాలర్‌తో పోలిస్తే.. మన రూపాయి ఆల్‌టైమ్ రికార్డు స్థాయి కనిష్టానికి పడిపోయింది. చమురు ధఱలు ఇలాగే అధికంగా కొనసాగి, బంగారం దిగుమతులు కూడా బాగా పెరిగితే, రూపాయిపై ఒత్తిడితో పాటు ద్రవ్యోల్బణం కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. రూపాయి విలువ పడిపోతే.. దిగుమతులు మరింత ఖరీదైనవిగా మారతాయ్. దీనివల్ల.. చమురు, బంగారం, ఇతర దిగుమతి వస్తువుల ధరలు దేశీయంగా మరింత పెరుగుతాయ్. అందువల్ల.. ఈ క్లిష్ట పరిస్థితుల్లో.. విదేశీ మారకద్రవ్యాన్ని పరిరక్షించుకోవడమే ప్రధాని మోడీ సందేశం ఉద్దేశం. అందుకోసమే.. బంగారం కొనుగోళ్లని తగ్గించమని చెప్పడంతో పాటు సాధ్యమైన వాళ్లంతా.. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలన్నారు. అనవసర ప్రయాణాలను తగ్గించి, ఇంధనాన్ని జాగ్రత్తగా వాడాలని సూచించారు. పశ్చిమాసియా సంక్షోభంతో ముడిపడి ఉన్న ప్రపంచ ఆర్థిక అనిశ్చితి కాలానికి.. దేశ పౌరులను సిద్ధం చేసేందుకు ప్రధాని అలారమ్ మోగించారనే విషయం అర్థమవుతోంది.

కేంద్రానికి పెద్ద సవాల్

నిజానికి, ఒక కుటుంబం ఆభరణాల కొనుగోళ్లను వాయిదా వేయడం వల్ల రూపాయి విలువలో ఎలాంటి కదలిక ఉండదు. కానీ, ఆర్థికవేత్తలు లక్షలాది కుటుంబాల మొత్తం డిమాండ్‌ని లెక్కలోకి తీసుకుంటారు. భారత్ ప్రతి ఏటా వందల టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. పెళ్లిళ్ల సీజన్లలో, అనిశ్చిత ఆర్థిక కాలాల్లో, కుటుంబాలు బంగారాన్ని ఒక సురక్షితమైన ఆస్తిగా పరిగణించడం వల్ల.. దానికి డిమాండ్ తరచుగా మరింత పెరుగుతుంది. చమురు ధరలు ఇప్పటికే భారతదేశ దిగుమతుల భారాన్ని పెంచుతున్న తరుణంలో, బంగారం దిగుమతుల ద్వారా డాలర్ల తరలింపులో.. అదనపు పెరుగుదలను నివారించేందుకు పాలసీ మేకర్స్ ఆసక్తి చూపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం.. అధిక క్రూడ్ ఆయిల్ ధరలు, భారీగా పెరిగిన దిగుమతుల బిల్లులు, బలహీనపడుతున్న రూపాయి, అధిక ద్రవ్యోల్బణం, విదేశీ మారక నిల్వలపై ఒత్తిడిని నియంత్రించేందుకు ప్రయత్నిస్తోంది.

గోల్డ్‌పై మోడీ పిలుపు.. ప్రజలు స్పందిస్తారా?

ఎందుకంటే.. ఇవన్నీ దేశ ఆర్థిక వృద్ధిని మందగింపజేయడమే కాక, ఆర్థిక వ్యవస్థ అంతటా ఖర్చులను పెంచుతుంది. అయితే, ఇండియాలో బంగారం అనేది కేవలం లోహం కాదు. అదొక ఎమోషన్. పెళ్లిళ్లలో బంగారం లేని వేడుకని భారతీయులు ఊహించుకోలేరు. పైగా, మధ్యతరగతి కుటుంబాలకు బంగారం ఓ ఆపద్బాంధవుడిలా కనిపిస్తుంది. అత్యవసర సమయాల్లో తాకట్టు పెట్టుకునేందుకు, అమ్ముకునేందుకు సురక్షితమైన ఆస్తి. బంగారంతో.. ఇంతటి బలమైన బంధం ఉన్న దేశంలో.. ప్రధాని పిలుపుకు ప్రజలు ఏ మేరకు స్పందిస్తారనేది సందేహామే. అయితే, పీఎం నుంచి ఈ ప్రకటన రాగానే.. ప్రముఖ జ్యువెలరీ కంపెనీల షేర్లు 10 శాతం దాకా పడిపోయాయ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో.. బంగారం కొనుగోళ్లు తగ్గితే దేశానికి మేలు జరుగుతుందనేది మాత్రం వాస్తవం.

ఆర్థిక దేశభక్తికి మోడీ పిలుపు

ప్రధాని మోడీ పిలుపు ఒక రకంగా ఆర్థిక దేశభక్తిని తట్టిలేపే ప్రయత్నమే! పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు పౌరులంతా సహకరించాలని, తమ వ్యక్తిగత ఇష్టాలను పక్కన పెట్టాలని ఆయన కోరారు. అయితే, బంగారం కొనడం ఆపడం కంటే.. డిజిటల్ గోల్డ్, సావరిన్ గోల్డ్ బాండ్ల వైపు ప్రజలను మళ్లించడం ద్వారా అటు సంప్రదాయాన్ని, ఇటు దేశ ఆర్థిక ప్రయోజనాలను కాపాడే మార్గాన్ని ప్రభుత్వం మరింత వేగవంతం వేయాలని ఆర్థిక వేత్తలు సూచిస్తున్నారు.

Also Read:విజయ్ శకం ప్రారంభం.. జెన్ జీ పెట్టుకున్న ఆశలని నెరవేరుస్తాడా?

Story by: Anup, Big Tv

Related News

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

డీలిమిటేషన్‌పై మోడీ సర్కార్ సరికొత్త వ్యూహం.. సౌత్ స్టేట్స్‌కు చెక్ పడినట్లేనా?

Big Stories

Advertisement
×