BigTV English

Modi’s Anti-Obesity Drive: భారత ప్రజల ఆరోగ్యం డేంజర్‌లో ఉందా?

Modi’s Anti-Obesity Drive: భారత ప్రజల ఆరోగ్యం డేంజర్‌లో ఉందా?

భారతదేశాన్ని భయపెడుతున్న ఊబకాయం

ఏకంగా దేశ ప్రధాని మంత్రే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఉబకాయం హద్దు మీరిందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకూ డాక్టర్లు, హెల్త్ ఇన్ఫ్లు‌యెన్సర్‌లు చెప్పడం వింటూ వచ్చాం. ఇప్పుడు ప్రధాని మోడీ మనసులో మాట విన్న తర్వాత అయినా రాబోయే కాలం ఎంత ప్రమాదకరంగా మారబోతుందా అర్థమయ్యిందా..? దేశంలో ఊబకాయం సమస్య విపరీతంగా పెరుగుతోందని ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరి 23న ఆల్ ఇండియా రేడియో ద్వారా నిర్వహించిన “మన్ కీ బాత్” కార్యక్రమంలో తెలిపారు.


ప్రతి ఎనిమిది మందిలో ఒకరికి ఈ సమస్య

2022లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన గణాంకాల ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా 250 కోట్ల మంది అధిక బరువుతో బాధ పడుతున్నారనీ.. ప్రతి ఎనిమిది మందిలో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారనీ ప్రధాని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. తీవ్రమవుతున్న ఉబకాయం సమస్యపై యుద్ధం ప్రకటించాల్సిన సమయం వచ్చిందని అన్నారు. జనవరి 28న డెహ్రాడూన్‌లో జరిగిన జాతీయ క్రీడల ప్రారంభోత్సవంలో కూడా ప్రధాని మోడీ ఈ అంశాన్ని ప్రస్తావించారు. అధిక వంట నూనె ఉబకాయానికి కారణమవుతుందని తెలిపారు.

ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రా, బాక్సర్ నిఖత్ జరీన్‌

అయితే, ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమంలో.. మోడీ, ముగ్గురు ప్రముఖ వ్యక్తుల అనుభవాల్సి కూడా షేర్ చేశారు. ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రా, బాక్సర్ నిఖత్ జరీన్‌తో పాటు ప్రముఖ కార్డియాక్ సర్జన్ డాక్టర్ దేవి శెట్టి సందేశాలను పంచుకున్నారు. నీరజ్ చోప్రా తన అథ్లెట్ ట్రైనింగ్ ప్రారంభించక ముందు అధిక బరువుతో ఉన్నారనీ.. దానిపై స్పోర్ట్స్ శిక్షణలో పోరాటం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా.. వేయించిన ఆహార పదార్థాలను నివారించాలని నీరజ్ చోప్పా సూచించారు.

ప్రముఖ కార్డియాక్ సర్జన్ డాక్టర్ దేవి శెట్టి అనుభవాల ప్రస్తావన

ఇక, రెండుసార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ అయిన నిఖిత్ జరీన్ కూడా తన అనుభవాన్ని వెల్లడించారు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలనీ.. ఎక్కువ నూనె పదార్థాలు తీసుకున్నప్పుడు ఆమె బాక్సింగ్ రింగ్‌లో త్వరగా అలసిపోయదాన్నని చెప్పారు. అందుకే, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ.. రోజూ ఫిజికల్ ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. డాక్టర్ దేవిశెట్టి కూడా ఉబకాయం ప్రమాదాన్ని నొక్కి చెప్పారు. హెల్తీగా ఉండటానికి నూనె తగ్గించాలని సూచించారు.

శరీరానికి అవసరంలేని విధంగా అధిక మొత్తంలో ఆహారం

అయితే, ఒక్కసారి మనం కూడా ఆలోచించాలి. మనం తీసుకునే ఆహారం ఆరోగ్యకరమైనదేనా…? కచ్ఛితంగా కాదు అని అందరికీ తెలుసు. ప్యాకెట్ ఫుడ్స్ నుండీ.. టిన్నుల కొద్దీ నూనె పోసి వండిన స్ట్రీట్ ఫుడ్.. నూరూరించే జంక్ ఫుడ్ మన దైనందిన జీవితంలో భాగమయ్యాయి. కొందరికైతే, నీసు లేనిదే ముద్ద కూడా దిగదు. రోజువారీ కూరల్లో వేపుడు తప్పని సరి కూడా. ఇలా రోజువారీ తీసుకునే ఆహారంలో శరీరానికి అవసరంలేని విధంగా అధిక మొత్తాన్ని ఆరగిస్తున్నాం. నిజానికి, వారసత్వంగా వస్తున్న మన భారతీయ ఆహారంలో అంతగా హాని కలిగించే పదార్థాలు తక్కువే. అయితే, ఇప్పుడు చాలా కుటుంబాలో విదేశీ ఆహారపు అలవాట్లు పెరిగాయి.

షుగర్, బీపీ లాంటి దీర్ఘకాల అనారోగ్యాల ప్రమాదం

దీనికి తోడు ఫ్యూజన్ ఫుడ్ ట్రెండ్‌ పేరుతో.. రకరకాల పదార్థాలు కలుపుకొని, జీర్ణ వ్యవస్థను పాడు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఇంట్లో వండే ఆహారం కంటే బయట దొరికే జంక్ ఫుడ్ పెద్దవాళ్లు తినడమే కాకుండా… చిన్న పిల్లకు కూడా పరిచయం చేస్తున్నారు. ఎప్పుడో ఒకసారే కదా అనుకుంటూ దాదాపు రెగ్యులర్‌గా హానికలిగించే ఆహారానికి అలవాడుపడుతున్నారు. దీని వల్ల, షుగర్, బీపీ లాంటి దీర్ఘకాల అనారోగ్యాల బారిన పడుతున్నారు. అందుకే, ప్రధాని మోడీ.. ఈ సమస్యను వ్యక్తిగతంగా కాదు… సామాజిక సమస్యగా పరిగణించాలని అన్నారు.

ఆహారంలో 10% వంట నూనె వినియోగం తగ్గించాలి

ఉబకాయానికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో దేశంలోని ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ప్రధాని మోడీ సూచించారు. మనం తినే ఆహారంలో 10 శాతం వంట నూనె వినియోగాన్ని తగ్గించాలని కూడా చెప్పారు. వీటిపై దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ అవగాహన కల్పించేందుకు… 10 మందితో ఒక టీమ్‌ని నామినేట్ చేసినట్లు మోడీ వెల్లడించారు. నేరుగా వారందరి పేర్లను ప్రధాని స్వయంగా పేర్కొన్నారు. అందులో ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా, జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్ధుల్లా కూడా ఉన్నారు.

గాయని శ్రేయా ఘోషల్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని

వీరితో పాటు యువ షూటర్ మను బాకర్, వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను, ప్రముఖ నటులు దినేశ్ లాల్ యాదవ్, మోహన్ లాల్, మాధవన్, గాయని శ్రేయా ఘోషల్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, రాజ్యసభ ఎంపీ సుధా మూర్తిని ప్రధాని మోడీ నామినేట్ చేశారు. ఇకపై ఈ 10 మంది దేశవ్యాప్తంగా ఊబకాయం తగ్గించడానికి ప్రచార కార్యక్రమాలు నిర్వహించోతున్నారు. ముఖ్యంగా, వంటనూనె వాడకాన్ని తగ్గించాలని దేశ ప్రజలకు అవగాహన కల్పించబోతున్నారు.

ఇండియాలో తీవ్రంగా విజృంభిస్తున్న డయాబెటీస్

భారతదేశంలో సాంప్రదాయ ఆహార పదార్థాలు ఆరోగ్యానికి హాని చేసేవి కావు. ఎందుకంటే.. భారతీయ ప్రధాన ఆహారంగా గతంలో చిరుధాన్యాలు అధికంగా ఉండేవి. అయితే, అవి ఇప్పుడు అవి చాలా ఖరీదైనవిగా మారాయి. సామాన్యుడు మిల్లెట్లు కొనేలేని పరిస్థితి ఉంది. వీటి స్థానంలో.. వరి బియ్యం, గోధుమలు భర్తీ అయ్యాయి. ఇక, హరిత విప్లవం పేరుతో విపరీతంగా పెరిగిన హానికర హైబ్రిడ్ కూరగాయల తప్ప మరో దారి కూడా లేదు. గతంలో సహజంగా పండించే కూరగాయలు తినే స్థితి నుండీ ఇప్పుడు ఆర్గానిక్ ప్రొడక్ట్‌లు ప్రత్యేకంగా అమ్మకం పెట్టిన గతి వచ్చింది. అయితే, ఈ పరిస్థితికి ప్రభుత్వాన్ని నిందించడం సబబే అయినా.. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం కూడా చాలా ఎక్కువగా ఉంది.

2045 నాటికి ఈ సంఖ్య 13.4 కోట్లకు పెరుగుతుందని అంచనా

లేకపోతే, భారతదేశం అతి త్వరలోనే ప్రపంచానికి మధుమేహ రాజధానిగా మారే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే, ఇండియాలో డయబెటీస్ తీవ్రంగా విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం మధుమేహంతో భాదపడుతున్న రోగుల్లో.. 17% మంది భారతదేశంలోనే ఉన్నారు. 2019లో, భారతదేశంలో మధుమేహం దాదాపు 7.7 కోట్ల మందిని ప్రభావితం చేసింది. కొన్ని నివేదిక ప్రకారం.. 2045 నాటికి ఈ సంఖ్య 13.4 కోట్లకు పెరుగుతుందని అంచనా. భారతదేశంలో ఈ మార్పు తీవ్రమైన సంక్షోభానికి దారి తీస్తుంది. ఇప్పటికే, దేశంలో వేగంగా పెరుగుతున్న వృద్ధాప్య జనాభాతో పాటు మధుమేహం, గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి నాన్-కమ్యూనికబుల్ వ్యాధులు భారీగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితికి ముఖ్యమైన కారణం కూడా ఉబకాయమే!

దేశంలో 13 కోట్ల 50 లక్షల మందికి పైగా ఉబకాయం

ఇటీవల కాలంలో భారతదేశంలో ఉబకాయం రికార్డ్ స్థాయిలో ఉంది. ప్రస్తుతం, దేశంలో 13 కోట్ల 50 లక్షల మందికి పైగా జనాభా ఉబకాయంతో బాధపడుతున్నారు. వయస్సు, లింగం, సామాజిక-ఆర్థిక అంతరాలు ఏమీ లేకుండా అందరినీ ఉబకాయం సమస్య పట్టి పీడిస్తోంది. 2022లో లెక్కలు చూస్తే.. 4 కోట్ల 40 లక్షల మంది మహిళలు, 2 కోట్లా 60 లక్షల మంది పురుషులు ఉబకాయంతో బాధపడుతున్నారు. ఇటీవల కాలంలో మహిళలు, చిన్నపిల్లల్లో ఉబకాయం పెరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. గణాంకాల ప్రకారం, భారతదేశంలో ఇప్పటికే కోటీ 40 లక్షల మందికి పైగా చిన్నపిల్లలు ఉబకాయంతో ఉన్నారు.

పట్టణ-గ్రామీణ అసమానతలను పరిష్కరించడం

ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతుందని నిపుణులు భావిస్తున్నారు. అందుకే, భారతదేశం మధుమేహానికి ప్రపంచ రాజధానిగా మారుతుందని చెబుతున్నారు. అయితే, ఈ సమస్యను అధిగమించడానికి నిపుణులు బహుముఖ విధానాన్ని సిఫార్సు చేస్తున్నారు. ఇందులో.. ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి అవగాహన పెంచడం.. ఆరోగ్య సంరక్షణ సేవలను మెరుగుపరచడం… పోషకాహారం, ఆరోగ్య సంరక్షణలో పట్టణ-గ్రామీణ అసమానతలను పరిష్కరించడం వంటి కీలకమైన చర్యలు ఉన్నాయి. ఇందులో భాగంగానే.. వంట నూనె వాడకం తగ్గించుకోవాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. దేశ ప్రజలు తమ దైనందిన అలవాట్లలో చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా హెల్తీ ఇండియా ఉద్యమానికి తోడ్పడాలని కోరారు.

నెలవారీ నూనె వాటాలో 10% తక్కువ నూనె వాడాలి

ప్రధాని మోడీ తన మన్ కీ బాత్‌లో… కోరింది చాలా చిన్న కోరిక. ప్రతి కుటుంబం తమ నెలవారీ వంట నూనె వాడకాన్ని కాస్త తగ్గించాలి అని. ఇప్పటి వరకూ వాడుతున్న నూనె వాటాలో నెలకు 10% తక్కువ నూనె వాడాలని అన్నారు. ఇకపై, వంట నూనె కొనుగోలు చేసేటప్పుడు 10 శాతం తక్కువ నూనె కొనాలని సూచించారు. ఇది ఊబకాయాన్ని తగ్గించే దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా అవుతుందనడంలో సందేహం లేదు. ఇలా, మన ఆహారపు అలవాట్లలో చిన్న మార్పులు చేయడం ద్వారా… దేశ భవిష్యత్తు బలంగా, ఆరోగ్యంగా, వ్యాధి రహితంగా మార్చుకోవచ్చు కూడా. లేకపోతే… తెలియకుండానే కోట్ల మంది జీవితాలు ఉబకాయం బారినపడాల్సి ఉంటుంది.

ఒక టేబుల్ స్పూన్ నూనెలో దాదాపు 120 కేలరీలు

ఎక్కువ నూనె వల్ల శరీరంలో కొవ్వు అధికంగా పేరుకుపోవడం, మధుమేహం, గుండె జబ్బులు, రక్తపోటుతో పాటు కొన్ని రకాల క్యాన్సర్లు వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. నూనెలో కేలరీలు అధికంగా ఉంటాయి. ఒక టేబుల్ స్పూన్ నూనెలో దాదాపు 120 కేలరీలు ఉంటాయి. ఇక, ఎక్కువ శుద్ధి చేసిన నూనెలను తీసుకోవడం, ముఖ్యంగా ట్రాన్స్ ఫ్యాట్స్, ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉన్న నూనెను వాడటం వల్ల కొవ్వు అధికంగా పేరుకుపోతుంది. ఇది బరువు పెరగడానికి కారణం అవుతుంది. కాలక్రమేణా, అధిక నూనె వినియోగం జీవక్రియకు అంతరాయం కలిగిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను పెంచి, ఇన్సులిన్ నిరోధకతకు దోహదం చేస్తుంది.

పామాయిల్ వినియోగం దాదాపు 38 శాతానికి పెరిగింది

ఇక, భారతదేశం మొత్తం వంట నూనెల వినియోగంలో పామాయిల్ వినియోగం దాదాపు 38 శాతానికి పెరిగిందని గతేడాది ఆసియన్ పామాయిల్ అలయన్స్ నివేదికలో తెలిపింది. భారతదేశంలో వార్షిక దేశీయ వంట నూనె వినియోగం దాదాపు 24 నుండి 25 మిలియన్ టన్నులుగా ఉంది. అందులో 9 మిలియన్ టన్నులు పామాయిల్ వాటా. ఇక, దేశీయ డిమాండ్‌ను తీర్చడానికి, భారతదేశం ప్రతి ఏటా 15 నుండి 16 మిలియన్ టన్నుల వంట నూనెను దిగుమతి చేసుకుంటుంది. దేశీయ డిమాండ్‌లో లోటును తగ్గించడానికి సంవత్సరానికి కనీసం, మరో 9 నుండి 10 మిలియన్ టన్నుల అదనపు వంట నూనె అవసరం అవుతోంది.

మిల్లెట్ల ఉత్పత్తిలో భారత్‌ను ప్రపంచ లీడర్‌గా నిలబెట్టే ప్రయత్నం

ఇలా, భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద పామాయిల్ దిగుమతిదారుగా కూడా మారింది. దీన్ని పక్కనపెడితే.. భారతదేశ ప్రతిపాదన ప్రకారం.. 2023ని అంతర్జాతీయ మిల్లెట్ల సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిన తర్వాత… మిల్లెట్ల ఉత్పత్తిలో భారతదేశాన్ని ప్రపంచ లీడర్‌గా నిలబెట్టడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చొరవలతో మిల్లెట్ల ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే, వాటి పండించడానికి రైతులు సిద్ధంగా ఉండాలి. డిమాండ్ ఎక్కువగా ఉంటే ఉత్పత్తిని కూడా పెంచే అవకాశం ఉంటుంది కాబట్టి, ప్రజలు వారి రోజువారీ ఆహారంలో వీటిని తీసుకోవడం అలావాటుగా మార్చుకోవాలి. ఇది, దేశంలో ఉబకాయాన్ని తగ్గించడంతో పాటు.. అందరూ ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడుతుంది.

వంట నూనెల్లో ఉండే మోనో శ్యాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్..

ఇక, వంటకు ఉపయోగించే నూనెలో ఎన్నో రకాలు ఉంటాయి. కొబ్బరి నూనె నుండీ పామాయిల్, వేరు శనగ, సన్ ఫ్లవర్, రైస్ బ్రాన్, నువ్వుల నూనె వంటి వంట నూనెలు ఉపయోగిస్తారు. అయితే, ఏది తిన్నాము అనేదానికి కంటే.. ఎంత హెల్దీగా తిన్నాము అనేది ముఖ్యం. నిజానికి, వంట నూనెల్లో ఉండే మోనో శ్యాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, పాలీ అన్‌శ్యాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ శరీరానికి కావాలి కూడా. శరీరం వాటిని స్వయంగా తయారుచేసుకోలేదు. వంట నూనె ద్వారాలనే అవి శరీరానికి అందుతాయి. అందుకే, ఒకే నూనె కాకుండా వేర్వేరు నూనెలను కలిపి, పరిమితిలో వాడటం మంచిదంటారు నిపుణులు.

రిఫైండ్ నూనెల కంటే మిగిలిన నూనెలు మంచివి

మనం వాడే నూనెల్లో అవొకాడో ఆయిల్, అవిసె గింజల నూనె, ఆలివ్ ఆయిల్ ఆరోగ్యకరమైనవిగా చెబుతుంటారు. ఇక, రిఫైండ్ నూనెల కంటే మిగిలిన నూనెల్లో కూడా మంచి చేసేవి ఉన్నాయి కాబట్టి, పరిమితంగా నూనెను వాడొచ్చు. అయితే, ఆహారంలో ఎక్కువ నూనె వాడి చేసే వేపుళ్లను తగ్గించుకోవడం చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు సూచన. నివేదికల ప్రకారం చూస్తే… నూనెలు, కొవ్వుల వినియోగాన్ని రోజుకు 10 టీస్పూన్లకే పరిమితం చేయడం చాలా మంచిది కూడా. అలాగే, వంట నూనె కొనే ముందు అందులో ఉన్న కొవ్వు శాతం చూడాలి. అందులో నిర్ణీత మోతాదు కంటే ఎక్కువ కొవ్వు ఉంటే అది అనారోగ్యానికి కారణం అవుతుంది.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×