జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్‌గా పదవీ బాధ్యతలు
అంతా మస్క్ మయం.. అమెరికా అంతా మస్క్ మయం.. అన్నట్లుంది ట్రంప్ సెకండ్ టర్మ్ పాలనంతా! అందుకేనేమో.. ట్రంప్ మద్దతుదారుల్లో అసహనం కూడా పీక్స్‌కు చేరుకుంటుంది. ఇది ఏ స్థాయికి చేరుకుందంటే.. ట్రంప్ గెలుపుకు కారణమైన ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ టీమ్ ఇప్పుడు ట్రంప్ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు. జనవరి 20వ తేదీన డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా ప్రెసిడెంట్‌గా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో.. ఇప్పటికే, ట్రంప్ పరిపాలనా వ్యవస్థలో కీలక విభాగాలకు చీఫ్‌ల నియామకం దాదాపు ఫైనల్ అయ్యింది. సరిగ్గా, ఈ తరుణంలోనే విభేదాలు బయటపడ్డాయి.
మెరిట్ ఆధారంగా వలస సంస్కరణల జరగాలని వాదన
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు.. ట్రంప్ టీమ్‌లో భాగంగా ఉన్న ఎలన్ మస్క్, వివేక్ రామస్వామి, ఇతర టెక్ భాగస్వాములతో ఘర్షణ పడుతున్నారు. ఈ విభేదాలకు ఇమ్మిగ్రేషన్ అంశం కేంద్రంగా మారింది. ఒకవైపు, మస్క్‌తో పాటు సిలికాన్ వ్యాలీ మిత్రులంతా.. అమెరికాలో మెరిట్ ఆధారంగా వలస సంస్కరణల జరగాలని వాదిస్తున్నారు. మరోవైపు, ఇమ్మిగ్రేషన్ వ్యతిరేక వైఖరికి మొదటి నుండీ కట్టుబడి ఉన్న డైహార్డ్ ట్రంప్ మద్దతుదారులు.. మస్క్ అభిప్రాయాలను.. ట్రంప్ అజెండాకు వ్యతిరేకమైనవాటిగా పరిగణిస్తున్నారు.
కృష్ణన్ చేసిన ప్రకటనలు వ్యతిరేకించిన ట్రంప్ మద్దతుదారులు
అయితే ఈ రచ్చ మొదలవ్వడానికి ప్రధాన కారణం.. రాబోయే ట్రంప్ పాలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా భారతీయ సంతతికి చెందిన వెంచర్ క్యాపిటలిస్ట్, మస్క్ మిత్రుడైన శ్రీరామ్ కృష్ణన్‌ను నియమించడమే. ఈ నియామకం తర్వాత, MAGA క్యాంపులో చీలికలు కనిపించాయి. నైపుణ్యం కలిగిన వలసదారుల కోసం గ్రీన్ కార్డ్‌లపై ఉన్న కంట్రీ క్యాప్‌లను తొలగించాలని.. గతంలో కృష్ణన్ బలంగా వాదించారు.
కృష్ణన్ నియామకం “తీవ్రంగా కలవరపరిచే” అంశం -లారా లూమర్
కృష్ణన్ చేసిన ప్రకటనలు ట్రంప్ మద్దతుదారులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీనితో, ట్రంప్ మద్దతుదారుల్లో కీలక పాత్ర పోషించిన, సోషల్ మీడియా ఫైర్‌స్టార్ లారా లూమర్ రెచ్చిపోయారు. సోషల్ మీడియాలో టెర్రర్ పుట్టించే లారా.. కృష్ణన్ నియామకాన్ని “తీవ్రంగా కలవరపరిచే” అంశం అని లేబుల్ చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో ఆమె విమర్శలు గుప్పించారు. దీనితో, ఎక్స్ వేదికగా రెండు వర్గాల మధ్య ఘర్షణ పీక్స్‌కు చేరుకుంది.
అమెరికా నిర్మాణాన్ని వైట్ యురోపియన్లు చేశారు -లారా లూమర్
మగా క్యాంపైనర్ లారా లూమర్ వ్యాఖ్యలు స్పష్టంగా జాతి వివక్షను రేపేవిగా ఉండటంతో ఎక్స్ వేదికగా మాటల యుద్ధం నడిచింది. అమెరికా నిర్మాణాన్ని వైట్ యురోపియన్లు చేశారు గానీ.. భారతదేశం నుండి వచ్చిన థార్డ్ వరల్డ్ వలసదారులు కాదంటూ.. లారా సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికన్ డ్రీమ్‌ను సృష్టించింది శ్వేతజాతీయులైన యూరోపియన్లు తప్ప.. మీలాంటి ప్రో-ఓపెన్ బోర్డర్ టెక్కీలు అమెరికాను ఉపయోగించడానికి మేము అమెరికాను సృష్టించలేదంటూ.. తీవ్రమైన కామెంట్ చేశారు.
థార్డ్ వరల్డ్ ఉద్యోగులకు అమెరికా చరిత్ర గురించి బోధించాలి
అంతేకాదు, భారతదేశంలోని ప్రజలు స్నానం చేయడానికి, తాగడానికి, చివరికి మలం శుభ్రం చేసుకోడానికి కూడా ఒకే నీటిని వాడతారనే ధోరణిలో వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అలాంటి వారు, ఇన్నోవేషన్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. మీరు అమెరికన్ హిస్టరీ క్లాస్‌ని తిరిగి నేర్చుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. సిలికాన్ వ్యాలీలో పనిచేస్తున్న టెక్ బిలియనీర్లు.. థార్డ్ వరల్డ్ ఉద్యోగులకు అమెరికా చరిత్ర గురించి బోధించాలని అన్నారు.
H-1B వీసాపై యునైటెడ్ స్టేట్స్‌కు వలసవచ్చిన ఎలన్ మస్క్
అయితే, H-1B వీసాపై యునైటెడ్ స్టేట్స్‌కు వలసవచ్చిన ఎలన్ మస్క్‌తో సహా చాలా మంది లారా వ్యాఖ్యలపై మండిపడ్డారు. అత్యుత్తమ గ్లోబల్ టాలెంట్‌లను ఆకర్షించాలనే ఆలోచనను స్థిరంగా కొనసాగించాలని మస్క్ ఎప్పటి నుండో వాదిస్తున్నారు. అమెరికన్ టెక్నాలజీ, ఆర్థిక ఆధిపత్యం అనేది ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ వ్యక్తులను నియమించుకో బట్టే వచ్చిందనీ… అమెరికా సామర్థ్యం దీనిపైన ఆధారపడి ఉందని మస్క్ మరోసారి ఎక్స్ వేదికగా వెల్లడించారు.
భారతీయ వలసదారులకు పుట్టిన వివేక్ రామస్వామి
“ట్రంప్ టీమ్ ఛాంపియన్‌షిప్ గెలవాలని ఎవరైనా కోరుకుంటే, వాళ్లు టాప్ టాలెంట్ ఎక్కడున్నా రిక్రూట్ చేసుకోవాలి” అని లారాకు సమాధానంగా మస్క్ స్పందించారు. ఇక, ట్రంప్ ప్రభుత్వంలో ఎఫిషియన్సీ విభాగానికి కో-ఛైర్‌గా నియమించబడిన వివేక్ రామస్వామి కూడా మస్క్ అభిప్రాయాన్ని సమర్థించారు. రామస్వామి కూడా భారతీయ వలసదారులకు పుట్టిన వ్యక్తి. అమెరికా సంస్కృతి చాలా కాలంగా క్వాలిటీ పైనే నిలబడిందంటూ తనదైన శైలిలో స్పందించారు. సాధారణంగా ఆలోచించి, ఏదో ఊహించుకొని మాట్లాడొద్దంటూ హెచ్చరించారు.
ట్రంప్‌కు అత్యంత నమ్మకమైన మద్దతుదారుల్లో విభజన
అయితే, ఇలాంటి వాదోపవాదాల మధ్య ట్రంప్‌కు అత్యంత నమ్మకమైన మద్దతుదారుల్లో విభజన వచ్చిందన్నది స్పష్టం అయ్యింది. లారా లూమర్, ఆన్ కౌల్టర్, మాజీ కాంగ్రెస్ సభ్యుడు మాట్ గేట్జ్ వంటి ట్రంప్ మద్దతుదారులు.. మస్క్, రామస్వామి అభిప్రాయాలను బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అమెరికన్ కార్మికులను అణగదొక్కుతున్నారనే ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చకు దారితీస్తున్నాయి.
“ఇండియా ఫస్ట్” కార్యకర్త ముద్రకు గురైన కృష్ణన్
గతంలో కృష్ణన్‌ను “ఇండియా ఫస్ట్” కార్యకర్తగా అభివర్ణించిన లారా లూమర్ వంటి రైటిస్ట్‌లు ఇప్పుడు మరింత దూకుడుగా కామెంట్లు చేస్తున్నారు. కృష్టన్‌కు కీలక బాధ్యతలు అప్పగించడం వల్ల అమెరికన్ కార్మికులు నిరుద్యోగులుగా మిగులుతారంటూ ట్రంప్ మద్దతుదారులు ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో.. యునైటెడ్ నేషన్స్‌లో అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ కూడా రంగంలోకి దిగారు. ఈ వాదోపవాదాలు పక్కన పెట్టి, అమెరికా ప్రతిభపై పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. “అమెరికన్ కార్మికుల్లో, అమెరికన్ సంస్కృతిలో ఎలాంటి తప్పు లేదు” అని రామస్వామి చేసిన విమర్శలను సవాలు చేస్తూ నిక్కీ హేలీ కామెంట్లు ఈ వివాదానికి మరింత ఆజ్యం పోశాయి.
ట్రంప్ మొదటి పాలనలో H-1B వీసాలపై పరిమితులు
ఇప్పటి వరకూ ఇమ్మిగ్రేషన్‌పై ట్రంప్ అస్థిర వైఖరికి ఈ గందరగోళం తోడయ్యి పరిస్థితి రచ్చ రచ్చగా మారింది. ట్రంప్ మొదటి పాలనలో.. H-1B వీసాలపై భారీగా పరిమితులను విధించినప్పటికీ.. ఆయన ఇటీవలి ప్రకటనలు కాస్త సున్నితమైన విధానాన్ని సూచించాయి. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అమెరికా విశ్వవిద్యాలయాల్లోని విదేశీ గ్రాడ్యుయేట్‌లకు గ్రీన్ కార్డ్‌లను మంజూరు చేయడానికి ట్రంప్ మద్దతు వ్యక్తం చేశారు. ఈ మార్పు ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానాల భవిష్యత్తు వైఖరిపై అనిశ్చితికి కారణం అయ్యాయి.
ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానాల భవిష్యత్తు వైఖరిపై అనిశ్చితి
దీనికి తోడు, కృష్ణన్‌కు కీలక పదవిని అప్పజెప్పడంతో ట్రంప్ టీమ్‌లో మంట రేగింది. చివరికి ఇది, H-1B వీసాపై అమెరికాలో పనిచేస్తూ.. ప్రపంచంలో అత్యంత కుబేరుడుగా మారిన మస్క్‌తో సహా.. ట్రంప్ టీమ్‌లో కీలక బాధ్యతలను అందుకున్న వివేక్ రామస్వామి, కాష్ పఠేల్ వంటి వారిపైన కూడా జాతి వివక్ష వ్యాఖ్యల ప్రభావం పడే పరిస్థితిని తీసుకొచ్చింది.
భారతదేశ వ్యతిరేక వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ గ్రిమ్స్ ఆసక్తికర చర్చ
అమెరికాలో నడుస్తున్న ఇమ్మిగ్రేషన్ వివాదంపై ఇప్పుడు ట్రంప్ టీమ్‌లోనే రెండు గ్రూపులు తయారయ్యాయి. అందులో ఒకటి మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ క్యాంపైన్‌లో కీలకంగా వ్యహరించిన లారా లూమర్ వంటి వారు ఒక గ్రూపుగా ఉంటే.. మరోవైపు, రాబోయే ట్రంప్ పాలనలో కీలక పోజీషన్స్ దక్కించుకున్న మస్క్, రామస్వామి వంటి వాళ్లు మరో గ్రూపుగా మారారు. చివరికి ఏ గ్రూపు వాదనలకు బలం వస్తుందో ఇప్పుడప్పుడే చప్పలేము గానీ.. ఈ మధ్యలో, మస్క్ మాజీ గార్ల్‌ఫ్రెండ్, కెనడియన్ మ్యూజీషియన్ అయిన గ్రిమ్స్ వ్యాఖ్యలు కూడా ఈ చర్చలో కీలకంగా మారాయి. అమెరికన్ సోషల్ మీడియాలో పెరుగుతున్న భారతదేశ వ్యతిరేక వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ గ్రిమ్స్ ఆసక్తికర చర్చను నడిపారు.
భారతీయ, అమెరికన్ సంస్కృతులు ఎప్పుడో కలిసిపోయాయి
తాను హాఫ్-ఇండియన్ ఫ్యామిలీలో పెరిగినట్లు వెల్లడించారు. తన ఎక్క్ పోస్ట్‌లో… “అకస్మాత్తుగా ఎక్కడా లేని భారతీయ వ్యతిరేకతను తీసుకురావడం చాలా ఇబ్బందికరంగా ఉందనీ… కావాలనే, ఈ అంశాన్ని కొందరు ప్లాన్ చేసినట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో భారతీయ, అమెరికన్ సంస్కృతులు ఎప్పుడో కలిసిపోయాని వెల్లడించారు. గ్రిమ్స్ వ్యాఖ్యలు… భారతదేశంలో అమెరికన్ గాడ్జెట్‌ల ప్రవాహాన్ని కూడా ప్రస్తావించాయి. అమెరికన్ కంపెనీల ఉనికి భారత్‌లో అధికంగా ఉందనీ… మరిన్ని అమెరికన్ కంపెనీలు స్థాపించడం వల్ల, అవి అదనపు ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తాయని సూచించారు.
యూఎస్ కంపెనీల్లో ఉన్న ఉద్యోగ ఖాళీలను..
ఇక, యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ.. ఇటీవల, H-1B వీసా ప్రోగ్రామ్‌ను ఆధునీకరించే లక్ష్యంతో తుది నియమాన్ని వెల్లడించింది. యూఎస్ కంపెనీల్లో ఉన్న ఉద్యోగ ఖాళీలను మరింత సమర్థవంతంగా పరిష్కరించడంలో సహాయపడే విధంగా వీసా ప్రోగ్రామ్‌ను రూపొందించినట్లు తెలిపారు. జనవరి 17, 2025 నుండి అమలులోకి వచ్చేలా ఈ కొత్త విధానాన్ని రూపొందించారు. అప్‌డేట్ చేసిన నియమం ద్వారా వీసా ఆమోద ప్రక్రియ క్రమబద్ధీకరించబడటంతో పాటు అత్యుత్తమ ప్రతిభను నిలుపుకోవడానికి యజమానులకు అవకాశం పెంచుతుందని కూడా వెల్లడించారు.
సిలికాన్ వ్యాలీలో అత్యుత్తమ ఇంజినీరింగ్ టాలెంట్ కొరత
అయితే, దీనికి తగ్గట్లుగానే, మస్క్, రామస్వామి వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. అమెరికా టెక్ ఇండస్ట్రీ అభివృద్ధి అనేది ఇండియా లాంటి దేశాల నుండి వచ్చిన ఇంజనీర్లు, నిపుణుల నైపుణ్యంపై ఆధారపడి ఉందని వాదించారు. అలాగే, ట్రంప్ పాలనలో సక్సెస్ రావాలని కోరుకుంటే.. ప్రపంచవ్యాప్తంగా టాప్ టాలెంట్ ఎక్కడ ఉన్నా వారిని రిక్రూట్ చేసుకోవాలని అన్నారు. సిలికాన్ వ్యాలీలో అత్యుత్తమ ఇంజినీరింగ్ టాలెంట్ కొరతను ఈ సందర్భంగా ఎత్తి చూపారు.
అమెరికా జారీ చేసిన H-1B వీసాల సంఖ్య ఏడాదికి 65 వేలు
అయితే, ఇప్పటి వరకూ అమెరికా జారీ చేసిన H-1B వీసాల సంఖ్య సంవత్సరానికి 65 వేలుగా ఉంది. అలాగే, అమెరికాలోని పలు విద్యా సంస్థల నుండి మాస్టర్స్ చదివిన వ్యక్తులకు అదనంగా 20 వేల వీసాలను పరిమితం చేశారు. బౌండ్‌లెస్ అనే ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీ ఇటీవలి పరిశోధన ప్రకారం.. దాదాపు 73% H-1B వీసాలు భారతీయ పౌరులకు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఇక, ఈ వీసాల్లో 12% చైనా పౌరులకు జారీ చేశారు. నిజానికి, అమెరికా టెక్ ఎకనామీ ఆధిపత్యంలో భారతీయ టెక్కీల భాగస్వామ్యం అధికంగా కనిపిస్తుంది. అందుకే, శ్రీరాం కృష్ణన్ కూడా గతంలో భారతీయ టెక్కీలకు H-1B వీసాలు భారీగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
టెక్ ఎకనామీ ఆధిపత్యంలో భారతీయ టెక్కీల భాగస్వామ్యం అధికం
అందుకే, కృష్ణన్‌పై ఇండియా ఫస్ట్ క్యాంపైనర్‌గా ముద్ర వేశారు. ఇక, ఇలాంటి పరిస్థితుల్లోనే… ట్రంప్ అధికారం చేపట్టిన వెంటనే పత్రాలు లేని వలసదారులను భారీగా బహిష్కరిస్తామమనే హామీ కూడా వచ్చింది. H-1B ప్రోగామ్‌పై ట్రంప్ మొదటి నుండి విమర్శలు చేస్తున్నారు. మరోవైపు, ట్రంప్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న జెడి.వాన్స్ కూడా వీసా కార్యక్రమానికి వ్యతిరేకంగా ప్రచారం చేసారు. కానీ, టెక్ ప్రపంచంతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తూనే ఉన్నారు. వెంచర్ క్యాపిటలిస్ట్‌గా ఉన్న వాన్స్.. తన గత కెరీర్‌లో, H-1B వీసాలతో కార్మికులను నియమించుకునే స్టార్టప్‌లకు నిధులు కూడా సమకూర్చారు.
తాను మస్క్ బొటనవేలు కింద లేనంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
అయితే, ఈ వివాదాల మధ్య ట్రంప్ నిర్ణయాలు మస్క్ సూచనలతో వస్తున్నాయా అనే కామెంట్లకు కారణం అయ్యింది. అంతర్గతంగా వాతావరణం ఎలా ఉన్నప్పటికీ ఈ కామెంట్లను మాత్రం ట్రంప్ తిరస్కరించారు. ఇటీవల, అరిజోనాలో జరిగిన ఓ సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. తాను మస్క్ బొటనవేలు కింద లేనంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలన్ మస్క్‌కు ప్రెసిడెన్సీని అప్పగించాననే వ్యాఖ్యలు హాస్యా స్పదంగా ఉన్నాయనీ.. మస్క్ ఎప్పటికీ అధ్యక్షుడు కాలేడనీ.. అలా ఎప్పుడూ జరగదనీ.. అసలు, మస్క్ అమెరికాలో పుట్టకుండా అధ్యక్షుడు ఎలా అవుతాడంటూ ట్రంప్ స్పష్టం చేశారు.
ట్రంప్ 2.0లో కీలక పదవుల్లో ఐదుగురు భారతీయ అమెరికన్లు
అయినప్పటికీ, ట్రంప్ వ్యతిరేకులు మాత్రం ఇలాంటి కామెంట్లను కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో.. మస్క్ H-1B వీసాల విషయంలో చేస్తున్న వ్యాఖ్యలు మరింత హీట్ పెంచాయి. ట్రంప్ మద్దతుదారుల్ని మరింత రెచ్చ గొడుతున్నాయి. దీనికి తోడు, ట్రంప్ 2.0లో అత్యంత కీలక పదవుల్లో ఐదుగురు భారతీయ అమెరికన్లను తీసుకోవడంతో ఈ వివాదం మరింత రాజుకుంది.
జాతీయ భద్రతా ముప్పుగా అక్రమ వలసలను భావిస్తున్న ట్రంప్
ఇక, రాబోయే ట్రంప్ ఇమ్మిగ్రేషన్ పాలసీలో భాగంగా, భారత్‌తో సహా అన్ని దేశాలకూ చెందిన అక్రమ వలసదారులపై ఇటీవల కీలక ఉత్తర్వులు వచ్చాయి. తుది డిపోర్టేషన్ ఉత్తర్వులు ఇప్పటికే తీసుకొచ్చారు. ఈ నిర్ణయాత్మక చర్యలో భాగంగా అవసరమైతే బహిష్కరణ ప్రయత్నాల్లో అమెరికా మిలిటరీని కూడా వినియోగించే ప్లాన్ కూడా ట్రంప్ చేస్తున్నట్లు తెలుస్తోంది. జాతీయ భద్రతా ముప్పుగా అక్రమ వలసలను భావిస్తున్న ట్రంప్, దీన్ని కఠినంగా అమలు చేస్తారని సరైన పత్రాలు లేని భారతీయులు కంగారుపడుతున్నారు.
హోదాను చట్టబద్ధం చేసే మార్గం చాలా కష్టంగా మారిన వైనం
అయితే వీళ్లంతా చట్టబద్ధత కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ వారికి ICE నుంచి అనుమతిరావడానికి సంవత్సరాల సమయం పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. సరైన పత్రాలు లేని చాలా మంది భారతీయులకు, వారి హోదాను చట్టబద్ధం చేసే మార్గం చాలా కష్టంగా కనిపిస్తుంది. కొందరికైతే… ఈ కేసు దర్యాప్తు కోసం రెండు నుండి మూడు సంవత్సరాల వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి. అలాంటి వారు చాలా మంది ఇప్పుడు ICE నుండి క్లియరెన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి, వీళ్ల విషయంలో రాబోయే ట్రంప్ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందో అనే ఆందోళన ఉంది.
18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 5.5 మిలియన్లు
ఇక, మైగ్రేషన్ పాలసీ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం.. 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 5.5 మిలియన్ల మంది పిల్లలు అమెరికాలో అక్రమ వలసదారులుగా గుర్తించబడ్డారు. వీళ్లు కనీసం ఒక పేరెంట్‌తో నివసిస్తున్నారని నివేదిక పేర్కొంది. అసోసియేటెడ్ ప్రెస్ ప్రకారం, వాళ్లంతా యూఎస్ బాలల జనాభాలో 7%గా ఉన్నారు. అయితే, యూఎస్ బర్త్ రైట్ పౌరసత్వానికి సంబంధించిన సవరణ.. గ్రీన్ కార్డ్‌లు, H-1B వీసాలతో ఉన్న భారతీయ తల్లిదండ్రులకు, అమెరికాలో జన్మించిన పిల్లలకు సంబంధించిన సవాళ్లను పెంచుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్లు అమెరికన్ పౌరులుగా మారకపోవచ్చు. వీరికి, ఇతర చట్టపరమైన పరిష్కారాల అవసరం ఉంది. మరి, ఈ విషయంలో రాబోయే ట్రంప్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.