Fake IPS officer: ఏపీ పోలీసు శాఖలో ఏం జరుగుతోంది? డిప్యూటీ సీఎం సెక్యూరిటీ విషయంలో హోంశాఖ డొల్లతనం బయట పడిందా? పవన్ మన్యం టూర్‌లో ట్రైనీ ఐపీఎస్ అధికారినని సూర్య ప్రకాష్ హంగామా వెనుక ఏం జరిగింది? భూ వివాదాన్ని సెటిల్ చేసుకోవడానికి ట్రైనీ ఐపీఎస్ అధికారి అవతారమెత్తాడా? పవన్ కళ్యాణ్ భద్రతపై అలసత్వం ఎవరిది? ఈ వ్యవహారంపై విపక్షం నుంచి మాట దాడి మొదలైందా?
తెలుగు రాష్ట్రాల్లో ఫేక్ పోలీసు అధికారుల హంగామా క్రమంగా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ మధ్య హైదరాబాద్ తోపాటు వివిధ ప్రాంతాల్లో కొందరు ఇదే విధంగా పట్టుబడ్డారు. ఇప్పుడు ఏపీ వంతైంది. పట్టుబడిన వారంతా పోలీసులపై ఎందుకు గురిపెట్టారు. వారి సమస్యలు ఫుల్‌స్టాప్ పెట్టేందుకు ఈ స్కెచ్ వేస్తున్నారా? అవుననే అంటున్నారు కొందరు ఉన్నతాధికారులు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనలో కలకలం రేపిన నకిలీ ట్రైనీ ఐపీఎస్ అధికారి సూర్యప్రకాష్ గురించి కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పర్యటన జరిగిన వారం రోజుల తర్వాత నకిలీని గుర్తించారు పోలీసులు. పవన్ కళ్యాణ్ భద్రతపై పోలీసుల అలసత్వంపై రాజకీయ దుమారం మొదలైంది.
దీనికి హోంశాఖ, ఇంటిలిజెన్స్ బాధ్యత వహించాలన్నది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట. ఇప్పటికే నకిలీ ట్రైనీ ఐపీఎస్‌ని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు విజయనగరం పోలీసులు. పవన్ కళ్యాణ్ పర్యటన తర్వాత ట్రైనీ ఐపీఎస్ సూర్యప్రకాష్ వచ్చాడని చెప్పారు డీజీపీ ద్వారకా తిరుమలరావు. డిప్యూటీ సీఎం పర్యటనలో సభా వేదిక వద్ద అటు ఇటు తిరుగుతూ కనిపించారు ఫేక్ ఐపీఎస్.
ALSO READ: ఖైదీల ముందే పోలీసుల బట్టలు విప్పిస్తున్నారు.. ఎక్కడో కాదు మన ఏపీలోనే..
తన భూమి వివాదాన్ని పరిష్కరించుకోవడానికి సూర్య ప్రకాష్ పోలీస్ అవతారం ఎత్తినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే.. సూర్యప్రకాష్ సొంతూరు విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం గడసాం గ్రామం. బొబ్బిలిలో బీటెక్, కర్ణాటకలో ఎంబీఏ పూర్తి చేశాడు. 2003-05 మధ్యకాలంలో ఆర్మీ పని చేశాడు.
ఏం జరిగిందో తెలీదు గానీ, ఆ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అయితే మూడు నెలల కిందట విజయనగరం వచ్చాడు. డిప్యూటీ సీఎం ఆవిష్కరించిన శిలాఫలకం, వ్యూ పాయింట్ వద్ద ఎవరూ లేని సమయంలో ఫోటోలు దిగాడు. పవన్ టూర్ ముగిసిన వెంటనే పోలీసులు ప్రత్యేక బలగాలతో ఫోటోలు దిగాడు. ఆ తర్వాత వాటిని వాట్సప్ స్టేటస్ పెట్టుకున్నాడు. వాట్సాప్ స్టేటస్ అయన్ని పట్టించింది.
ఇక అసలు విషయానికి వద్దాం. ఈనెల 20న పార్వతీపురంలోని బాగుజోలలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు. విజయనగరం జిల్లాకు చెందని సూర్య ప్రకాష్ పోలీసు డ్రెస్‌లో హంగామా చేశారు. డిప్యూటీ సీఎం పర్యటనలో డ్రెస్ వేసుకుని స్థానికంగా ట్రాఫిక్ క్లియర్ చేశాడు. అయితే ఆయన్ని చూసిన స్థానిక పోలీసులు, విజయవాడ నుంచి స్పెషల్‌గా వచ్చారని భావించారు. అయితే డిప్యూటీ సీఎం సెక్యూరిటీ అధికారులు.. స్థానిక అధికారి అని భ్రమపడ్డారు.
2005లో సూర్య ప్రకాష్ తండ్రి దత్తిరాజేరు మండంలో భూమి కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. నాలుగేళ్ల కిందట ఆయన తండ్రి చనిపోయాడు. ఆ తర్వాత భూమి డీల్‌కి సంబంధించి ఒప్పందం పత్రాలు లభించాయి. దాన్ని దక్కించుకోవాలనే ఉద్దేశంతో ఈ ఏడాది ఐపీఎస్‌కు ఎంపికైనట్టు స్థానికులను చెప్పుకుంటూ వచ్చాడు. కొద్దిరోజులపాటు హైదరాబాద్ వచ్చిన పోలీసు స్టయిల్‌ను అంతా గమనించాడు. తిరిగొచ్చి ఆ భూమి గల రైతును బెదిరించాడు. డీల్ ప్రకారం 90 సెంట్లు రాసిచ్చాడు సదరు రైతు.
డిప్యూటీ సీఎం పవన్ టూర్‌లో ఎవరెవరు ఉన్నారు? కానిస్టేబుల్‌తో ట్రైనీ ఐపీఎస్ ఫోటోలు దిగడం ఏంటి? అనేదానిపై అధికారులు కూపీ లాగారు. పోలీసుల బెల్టు ఒకలా, కేప్ మరొకలా ఉండడంతో అధికారులకు డౌట్ మొదలైంది. శనివారం అరెస్ట్ చేసిన పోలీసులు, పార్వతీపురం కోర్టులో హాజరుపరిచాడు.
అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదన్నారు మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. పోలీసులు ఉన్నారా లేరా అంటూ పలు ప్రశ్నలు రైజ్ చేశారు. పవన్ కళ్యాణ్ టూర్‌లో పోలీసుల వ్యవహార శైలి వెనక జగన్ కారణమని కూటమి నేతలు చెప్పాలంటూ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు విసిరారాయన.