BigTV English

Espresso Coffee Story: ‘ఎస్ప్రెస్సో’తో నా ఎక్స్‌పీరియన్స్.. నీకు తెలీనప్పుడు తెలుసుకో.. నామోషీగా ఫీల్ అవ్వకు!

Espresso Coffee Story: ‘ఎస్ప్రెస్సో’తో నా ఎక్స్‌పీరియన్స్.. నీకు తెలీనప్పుడు తెలుసుకో.. నామోషీగా ఫీల్ అవ్వకు!

Espresso Coffee Story: నీకు తెలీనప్పుడు తెలుసుకో .. తప్పులేదు .. తెలిసోళ్లని అడుగు .. నామోషీగా ఫీల్ అవ్వకు.. నిన్న నన్ను కలవడానికి ఒకాయన ఆఫీ‌స్‌కి వచ్చారు. జనాలు నన్ను కూడా కలవడానికి.. వచ్చేంత గొప్పోడివి అయ్యానన్నమాట అనుకుని ఉబ్బి తబ్బిబ్బు అయి ఆనందంతో ఎగిరి గంతేసి.. నల్లద్దాల కళ్లజోడెట్టుకుని ప్యాంట్ సవరించుకుని.. క్రాప్ ఎగదోసుకుని లగెత్తుకుంటూ వెళ్ళా.. మామూలు.. హోటల్‌కి తీసుకెళితే మన రేంజ్ తక్కువ అనుకుంటారేమోనని కాస్త బిల్డప్పు, ఇంకొంచెం తెలివి కలగలిపి దుర్గం చెరువు గట్టుమీద ఎఫ్టీఎల్ పరిధిలో కట్టి.. ఇటీవల హైడ్రామా కూల్చివేతల నుంచి తప్పించుకున్న ఒక ఇంట్లో పెట్టిన ఒక కాఫీ షాప్‌కి తీసుకెళ్లా .. దుర్గం చెరువులో చాలా ఏళ్ల నుంచి నిల్వ ఉన్న నీటి నుంచి వచ్చే కొద్దిపాటి మురికి.. తో కలుపుకుని వచ్చే గాలితో ఇటు కాఫీ వాసన కూడా యాడ్ అయి బాగానే ఉంది.


పొలాల్లో పంటలకు పెట్టే స్ప్రింక్లర్లు మాదిరి గొట్టాలు ,పంపులు గట్రా.. పెట్టి .. నీళ్లు తుంపర మాదిరి స్ప్రే చేస్తున్నారు. అది కూడా బాగానే ఉంది. చెట్ల కింద చెక్క టేబుళ్లు వేసి నల్ల చొక్కాలు వేసుకున్నట్లు అటూ తిరుగుతూ బాగానే హడావిడిగా కనిపిస్తోంది. ల్యాప్ ట్యాప్‌లు ముందేసుకుని కూర్చున్న చాలా మంది సాఫ్ట్ వేరోళ్లు.. వర్క్ ఫ్రమ్ హోమ్ బదులు వర్క్ ఫ్రమ్ కాఫీ.. హౌజ్ అన్నట్టుగా అక్కడ కూర్చుని పని చేస్తున్నట్టుగా నటిస్తూ.. ఎదురుగా కూర్చున్నోళ్లతో కబుర్లు చెప్పుకుంటూ సరసాలాడుకుంటున్నారు. కౌంటర్ దగ్గరకెళ్లి.. డబ్బులు కట్టి ఆర్డర్ ఇస్తే వాళ్లు నంబర్ ప్లేట్ ఇస్తారు.

మనం వెళ్లి టేబుల్ దగ్గర కూర్చుని ఆ నంబర్ ప్లేట్‌ని డిస్ ప్లే చేస్తే కాసేపటికి మనమిచ్చిన ఆర్డర్ ఆ నంబర్ ప్లేట్ దగ్గరకు తెచ్చిస్తారంట. ఏం కావాలో అర్ఢర్ ఇవ్వండని.. కౌంటర్ లో ఉన్న వ్యక్తి.. మెనూ కార్డ్ ఇచ్చాడు. అందులో చాలా రకాల కాఫీలు, ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. అందులో ఉన్నవాటిలో ఒక్కటి కూడా మనకు తెలీదు. మనకు తెలీదంటే వాళ్ల ముందు లోకువైపోతాం.. అందుకే ఎక్కడా తగ్గకూడదు.. మెనూ తీసుకుని సీరియస్ గా చూసి.. చూసి.. చూసి చూస్తున్నట్టుగా చూస్తూనే ఉంటే.. కౌంటర్‌లో ఉన్నోడు ఆదో రకంగా చూసి.. ఆర్డర్ ప్లీజ్ అన్నాడు.. అప్పటి వరకూ మనకు తెలిసింది కేవలం కాపర్చ్యునో కాఫీ ఒక్కటే. కాపర్చ్యునో అంటే.. మనమిచ్చిన బిల్డప్‌కి వేరే రకంగా అనుకుంటారేమో అనుకుని అందులో ఉన్న ఎస్ ప్రెస్సో కాఫీ అని ఉంటే అదే చాలా స్టైల్ గా చెప్పా.. ఓకే అంటూ 24వ నంబర్ ఇచ్చాడు..పోయి టేబుల్ దగ్గర కూర్చొన్నాం.


కాసేపటికి.. నాలుగు కప్పుల్లో ఆర్డర్ తెచ్చారు.. అందులో చూస్తే.. రెండు కప్పుల్లో అడుగున ఎక్కడో కొద్దిగా కాఫీ ఉంది. ఇంకో రెండు కప్పుల్లో నీళ్లు లాంటివి ఉన్నాయి.. ఎ.. ఏంటిది.. ఏదైనా టేబుల్ దగ్గర కాఫీ తాగేశాక ఆ కప్పుల్ని తెచ్చి ఇక్కడ పెట్టావా.. కాదు.. సర్ ఇదిగో కాఫీ.. కాఫీ ఎక్కడో అడుగున కొద్దిగా ఉంది. ఎస్ప్రెస్సో కాఫీ అంటే అంతే సర్.. కొద్దిగానే ఇస్తారు డబ్బులు ఎక్కువ దొబ్బారు.. కాఫీయేమో కొద్దిగానే ఇచ్చారు. మోసం చేద్దామనుకుంటున్నారా..(కొద్దిగా కోపం, ఇంకొద్దిగా కన్నింగ్ తనం, మరికొంచెం బిల్డప్పు) where is your Manager? i want to talk to manager right now ? సర్.. చెప్పండి నేనే మేనేజర్ ని ఏం కావాలి మీకు..

ఎస్ప్రెస్సో కాఫీ ఆర్డర్ ఇస్తే మీ వోడు ఎవరో తాగేసిన కప్పులు తెచ్చి నా ముందు పెట్టాడు. అవి ఎవరో తాగేసినవి కాదు సర్.. మీరు ఆర్డర్ ఇచ్చిన ఎస్ప్రెస్సో కాఫీ.. అది ప్యూర్లీ కాఫీ డికాషన్ మాత్రమే.. నేను కాఫీ ఆర్డరిస్తే డికాషన్ తేవడం ఏంటి.. ఎక్స్ ప్రెస్సో అంటే అంతే సర్.. అది ప్యూర్ డికాషన్.. చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మరి ఈ రెండు కప్పుల్లో ఈ నీళ్లేంటి.. అవి కలుపుకుని తాగాలా..? అవి నీళ్లు కాదు సర్.. సోడా.. సోడా ఎవడు ఆర్డరిచ్చాడు.. అయినా ఇదేమైనా బ్రాందీనా, విస్కీనా.. సోడా కలుపుకు తాగడానికి అవి కాఫీలో కలుపుకుని తాగరు..సర్..కాఫీ తాగేశాక సోడా తాగుతారు. అదే ఎందుకు? రెగ్యులర్ కాఫీ మాదిరిగా సిప్ చేస్తూ తాగకుండా ఎస్ప్రెస్సో కాఫీ అనేది ఒకేసారి తాగేసి.. తర్వాత వెంటనే ఈ సోడా తాగుతారు సర్.. అంటే కాఫీ ఏదో.. ఎలా తాగాలో తెలీకుండానే నీ కాఫీ షాప్ కి వచ్చాననుకుంటున్నావా.. నేను అలా అనలేదు సర్.. జస్ట్ చెబుతున్నాను అంతే సరే.. మరి ఈ కాఫీ చల్లారిపోయింది ఇలా చల్లగా ఎవరైనా తాగుతారా..

ఎస్ప్రెస్సో కాఫీ తక్కువ వేడిగానే ఉంటుంది సర్.. ఎందుకంటే అది ఉండే క్వాంటిటీ చాలా తక్కువ.అందుకే ఒకేసారి ఎత్తి తాగేస్తారు. అయినా సరే.. వేడి చేసి పట్టుకురా.. ఓకే సర్.. అంటూ కాఫీ కప్పుల్ని తీసుకెళ్లిపోయాడు. నిజానికి ఇక్కడ నాకు ఎస్ప్రెస్సో కాఫీ అంటే తెలీదు.. అతను చెప్పింది అంతా నిజమే.. కాకపోతే సహజంగా మనిషిలో ఉండే డామినేటింగ్ మెంటాలిటీ, హోటల్లకు వెళ్లినపుడు అక్కడ పనిచేసే సిబ్బంది మీద పెత్తనం చేయాలనే లక్షణం చాలామందిలో ఉంటుంది. అలాగే వాళ్లకంటే మనకే బాగా తెలిసినట్టు.. నటించడం కూడా చాలామందికి అలవాటే.. ఇక్కడ నేను చేసింది కూడా అదే.. కాసేపటికి కొద్దిగా వేడి చేసి మళ్లీ కప్పులు తెచ్చారు.

అందులో ఉన్న కాఫీ వెంటనే తాగేసి.. అతను చెప్పినట్టు ఆ వెంటనే.. సోడా కూడా తాగేసి వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చేశాను. వెనుక నుంచి ఆ మేనేజర్ పిలుస్తున్నాడు. సార్ సార్ .కాఫీ ఎలా ఉంది. కానీ అతనికి ముఖం చూపించడం ఇష్టం లేక మళ్లీ వస్తా.. అర్జెంట్ పని ఉంది అంటూ వచ్చేశాను. అందుకే.. అందరికీ అన్ని విషయాలు తెలియాలని లేదు. చాలామందికి చాలా విషయాలు తెలీవు.. ప్రతి ఒక్కరూ ప్రతి విషయాన్ని ఎవరో ఒకరి నుంచి తెలుసుకుంటారు. ఇప్పుడు కాఫీ షాప్ లో ఎన్నిరకాల కాఫీలు ఉంటాయో.. గుక్క తిప్పుకోకుండా చెప్పే వాళ్లు కూడా ఒకప్పుడు నా మాదిరిగా వెళ్లి తెలుసుకున్నవాళ్లే..కానీ ప్రతి మనిషిలోనూ ఒక తెలీని ఇగో ఉంటుంది. ఎదుటి వాళ్ల ముందు ఓడిపోకూడదనే లక్షణం సహజంగా ఉంటుంది. ఏదైనా తెలీని విషయాన్ని ఎదుటోళ్ల నుంచి నేర్చుకోవడానికి నామోషీగా ఫీలవుతాం.. ఇది అలాంటిదే.. అశోక్ వేములపల్లి (నా కాఫీ ఎక్స్ పీరియన్స్ కి కొద్దిగా నాటకీయత జోడించి సరదాగానే రాశాను.. ఇందులో మళ్లీ వితండవాదాలు చేయకండి)

-అశోక్ వేములపల్లి

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×