NEET Scam: జంతర్ మంతర్ లో నిరసన చేస్తున్న జెన్-జి కి నేను పూర్తి మద్దతు ప్రకటిస్తాను.. అలాగే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ ని నేను సపోర్ట్ చేస్తాను.. అలాగే ఇంకా వీలైతే పేపర్ లీక్ చేసిన ఇడియట్స్‌ను అదే జంతర్ మంతర్ దగ్గరకు తెచ్చి నడిరోడ్డు మీద కాల్చిపారేయమంటాను..
ఇదంతా ఓకే.. నీట్ వ్యవహారంలో కాక్రోచ్ పార్టీ చేస్తున్న పోరాటంతో దేశమంతా రెండు వర్గాలుగా చీలిపోయి ఒకరిపై మరొకరు తీవ్రంగా విమర్శించుకుంటున్నారు.. ఏదో సొల్యూషన్ కాదు..
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో ప్రస్తావించిన లెక్కలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తానికి కేటాయించే విద్యా బడ్జెట్ సుమారు రూ.1.40 లక్షల కోట్లు అయితే, కేవలం ఒకే ఒక్క NEET పరీక్ష కోసం భారతీయ కుటుంబాలు వెచ్చిస్తున్న సొమ్ము ఏటా సుమారు రూ.1.32 లక్షల కోట్లు.
ఇది కేవలం ఒక పరీక్షకు సంబంధించిన అంకె కాదు… దేశంలో విద్యా వ్యవస్థ ఎంతగా వ్యాపారమయమైందో, విద్యార్థుల భవిష్యత్తు ఏ రీతిలో పందెం కోడిలా మారిందో చెప్పే నగ్న సత్యం.
రూ. 55,000 కోట్ల కోచింగ్ సామ్రాజ్యం: డిమాండ్-సప్లై చక్రబంధం
భారతదేశంలో కోచింగ్ రంగానికి ఉన్న వార్షిక టర్నోవర్ సుమారు రూ.55,000 కోట్లు. కోటా రాజస్థాన్ నుంచి హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడల దాకా విస్తరించిన ఈ సెంటర్లు కేవలం చదువును మాత్రమే కాకుండా ‘ర్యాంకులను’ విక్రయించే కార్పొరేట్ కంపెనీలుగా మారాయి.
అంత ఖర్చు ఎందుకు అవుతోంది?
లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్, రెసిడెన్షియల్ క్యాంపస్‌లు, హాస్టల్ ఫీజులు, మెటీరియల్స్ పేరుతో ఒక్కో విద్యార్థి నుంచి ఏడాదికి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. వైద్య విద్యలో సీట్లు పరిమితంగా ఉండటం సుమారు 1.08 లక్షల సీట్లు పోటీపడే విద్యార్థుల సంఖ్య 24 లక్షలకు పైగా విపరీతంగా పెరగడమే ఈ ‘డిమాండ్ అండ్ సప్లై’ దందాకు మూలకారణం.
ర్యాంకుల ఆధిపత్య పోరు.. రూ.50 నుంచి రూ.70 లక్షల పేపర్ లీక్ దందా!
కోచింగ్ సెంటర్ల మధ్య నడిచే ప్రాణాంతకమైన పోటీయే ఈ పేపర్ లీకేజీలకు ప్రధాన ఇంధనం. “మా సంస్థ నుంచే టాప్-10 ర్యాంకులు వచ్చాయి” అని హోర్డింగ్‌లు వేస్తేనే మరుసటి ఏడాది వేల మంది విద్యార్థులు, వందల కోట్ల ఫీజులు వస్తాయి.
నెట్‌వర్క్ ఎలా పనిచేస్తోంది?
* NTA నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వంటి అత్యున్నత పరీక్షా నిర్వహణ సంస్థల్లో ఉండే లోపాలను, అక్కడి కొందరు అధికారుల లొసుగులను ఈ మాఫియా వాడుకుంటోంది.
* పేపర్ తయారీ లేదా రవాణా దశలోనే లీక్ చేసి, దానిని నెట్‌వర్క్ ఏజెంట్ల ద్వారా కోచింగ్ సెంటర్లకు లేదా నేరుగా ధనిక తల్లిదండ్రులకు ₹50 లక్షల నుంచి ₹70 లక్షల వరకు విక్రయిస్తున్నారు.
* తమ పిల్లలకు ఎలాగైనా సీటు రావాలనే ఆరాటంతో తల్లిదండ్రులు కూడా ఇది నేరమని తెలిసి కూడా లీక్ అయిన పేపర్లు కొనుగోలు చేయడానికి సిద్ధపడుతున్నారు.
కేవలం మంత్రుల రాజీనామాలు, కఠిన శిక్షలతో సరిపోతుందా?
సమస్య వచ్చిన ప్రతిసారీ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం రాజకీయంగా సహజమే. రాజీనామాలు బాధ్యతకు సంకేతమే అయినా, అది పర్మనెంట్ సొల్యూషన్ కానే కాదు. ఇంకో మంత్రి వచ్చినా వ్యవస్థలో లోపాలు అలానే ఉంటే లీక్‌లు పునరావృతమవుతూనే ఉంటాయి.
* లక్షలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థుల రక్తాన్ని పిండి, వారి రాత్రనక పగలనక పడే కష్టాన్ని కాలరాసే లీకేజీ రహిత దగాకోరులకు అత్యంత కఠినమైన శిక్షలు పడాల్సిందే. కానీ శాశ్వత పరిష్కారం చట్టాల్లో, వ్యవస్థాగత సంస్కరణల్లోనే ఉంది.
వ్యవస్థాగత లోపాలకు శాశ్వత పరిష్కారాలు
ఈ ఘోరమైన క్రైమ్ నెట్‌వర్క్‌ను అంతం చేయాలంటే మూలాల్లో మార్పు రావాలి:
డిజిటలైజేషన్ & ఎన్‌క్రిప్టెడ్ ప్రశ్నాపత్రాలు
* ఫిజికల్ పేపర్ రవాణా విధానాన్ని పూర్తిగా స్వస్తి చెప్పాలి. పరీక్ష ప్రారంభమయ్యే 15-30 నిమిషాల ముందు మాత్రమే డిజిటల్ పద్ధతిలో బయోమెట్రిక్ కీ ద్వారా అన్‌లాక్ అయ్యే ఎన్‌క్రిప్టెడ్ పేపర్ విధానాన్ని తీసుకురావాలి.
NTA వికేంద్రీకరణ & అకౌంటబిలిటీ
* దేశమంతటికీ ఒకే ఏజెన్సీ పరీక్ష నిర్వహించే బదులు, సురక్షితమైన సాంకేతిక నిబంధనలతో రాష్ట్రాల వారీగా లేదా జోన్ల వారీగా వికేంద్రీకరించి నిర్వహించాలి. NTA లోపలి అధికారులపై కఠినమైన స్వతంత్ర నిఘా ఉండాలి.
కార్పొరేట్ కోచింగ్ సెంటర్లపై కఠిన నియంత్రణ
* కోచింగ్ సెంటర్ల ఫీజులపై ప్రభుత్వ పరిమితిఉండాలి.
* అబద్ధపు ప్రకటనలు, ర్యాంకుల క్లెయిమ్‌లపై భారీ జరిమానాలు మరియు రిజిస్ట్రేషన్ రద్దు వంటి చర్యలు ఉండాలి.
మెడికల్ సీట్ల పెంపు & ప్రభుత్వ విద్య బలోపేతం
* డిమాండ్-సప్లై గ్యాప్ తగ్గాలంటే ప్రభుత్వ మెడికల్ కళాశాలల సంఖ్యను, సీట్లను భారీగా పెంచాలి.
ఇంటర్మీడియట్ స్థాయిలో పాఠశాల విద్య నాణ్యత పెరిగితే, విద్యార్థులు లక్షల రూపాయిలు పోసి కోచింగ్ సెంటర్లపై ఆధారపడే అవసరమే ఉండదు.
ముగింపు
తల్లిదండ్రులారా.. కష్టపడి సంపాదించిన సొమ్ముతో పిల్లలకు చదువు చెప్పించడం ఎంత ముఖ్యమో, అడ్డదారుల్లో పేపర్లు కొని ఇచ్చి వ్యవస్థను మరింత దిగజార్చకుండా ఉండటమూ అంతే ముఖ్యం. లీక్ చేసేవారు ఎంత నేరస్థులో, కొనేవారు కూడా అంతే భాగస్వాములు.
ప్రభుత్వాలు కేవలం మంత్రులను మార్చడం లేదా తాత్కాలిక కమిటీలు వేయడం కాకుండా, ఈ 1.32 లక్షల కోట్ల వ్యాపార కోణాన్ని అరికట్టే శాశ్వత సాంకేతిక మరియు చట్టపరమైన సంస్కరణలను తక్షణమే అమలు చేయాలి. లేకపోతే దేశంలో ప్రతిభ చచ్చిపోతుంది, ధనం ఉన్నవాడికే విద్య పరిమితమవుతుంది.
Story Credit By : Ashok Vemulapalli
Also Read: తిరుమలలో విగ్రహం చోరీ.. ఒంగోలులో దొరికిపోయిన దొంగ.. అసలేం జరిగిందంటే?