Congress Party: అన్ని నియోజకవర్గాల్లో పొలిటికల్ లెక్కలు ఒక ఎత్తు అయితే ఆ నియోజకవర్గంలో మాత్రం మరో ఎత్తు. జిల్లాలో ఆ సెగ్మెంట్ ఒక్కదానికే ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు. ఆ ఎమ్మెల్యేని కష్టపడి గెలిపించుకున్న నాయకుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. వారు కాంగ్రెస్ నుంచి పిలుపు వస్తే వాలిపోవాలని చూస్తుంటే వారి ఆశలకు గండి కొడుతూ నో ఎంట్రీ బోర్డు పెట్టిందట కాంగ్రెస్ అధిష్టానం. ఆలస్యంతో అమృతం విషమన్నట్లు.. సరైన సమయంలో రెస్పాండ్ అవ్వకపోవడమే వారి ఆశలకు గండి పడిందని లోకల్ టాక్ నడుస్తుంది. దీంతో ప్రస్తుతం వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారిందట.
పదేళ్లపాటు ఏకచత్రాధిపత్యంగా పాలించిన బీఆర్ఎస్‌కి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఓటర్లు కోలుకోలేని షాక్ ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో ఆ పార్టీ కేవలం రెండు సీట్లకే పరిమితం అయ్యింది. కేవలం గద్వాల, ఆలంపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లలో మాత్రమే గులాబీ జెండా ఎగిరి జిల్లాలో పరువు దక్కించుకుంది. గద్వాల నుండి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలంపూర్ నుంచి అనూహ్యంగా బరిలో నిలిచిన విజయుడు విజయం సాధించారు.
అయితే గెలిచిన తర్వాత గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో జిల్లా బీఆర్ఎస్‌లో ఒకే ఒక్కడుగా విజయుడు మిగిలిపోయారు. ఇక ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిచిన చల్ల వెంకట్రామిరెడ్డి సైతం బీఆర్ఎస్లోనే ఉండిపోయాడు. మిగిలిపోయిన ఈ ఇద్దరు కూడా ముహూర్తం చూసుకుని కాంగ్రెస్‌లోకి మారుతారన్న ప్రచారం జరిగింది. ముహూర్తం కుదరలేదో? మరే ఇతర కారణాలో తెలియదు కానీ వారి పార్టీ మార్పు వ్యవహారం అక్కడితో ఆగిపోయింది.
గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో అలంపూర్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన సంపత్ కుమార్‌కు ఓటమి తప్పలేదు. తన అనుచరుడైన విజయుడుని అనూహ్యంగా బరిలో ఉంచి సంపత్ కుమార్ ఓటమికి కారణమయ్యారు చల్ల వెంకట్రామిరెడ్డి. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆయన గెలిపించుకున్న అభ్యర్థి డమ్మీగా ఉండిపోవాల్సి వస్తుందంట. తాను ఎమ్మెల్సీగా ఉండి తన అనుచరుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ నియోజకవర్గంలో తమకు సరైన గుర్తింపు లేదని వెంకటరామిరెడ్డి మధనపడుతున్నారంట.
Also Read: బాపుకు బలుపు..! బీఆర్ఎస్ అక్కసు వెనుక కథ ఇదే..!
ఆలంపూర్ ఎన్నికలలో పోటీ చేసి ఓటమిపాలైన ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ తన ఓటమికి ప్రధాన బాధ్యుడు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రా మిరెడ్డి అని ఆగ్రహంతో ఉన్నారంట.. అందుకే వారిద్దరినీ కాంగ్రెస్‌లో చేర్చుకోకుండా అడ్డం పడుతున్నారంట. ఈ క్రమంలో నియోజకవర్గంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, ఇతరాత్ర వ్యవహారాలకు సంబంధించి సంపత్‌కుమార్ పెత్తనమే నడుస్తుంది. నియోజకవర్గం యాంత్రాంగం మొత్తం సంపత్‌కుమారే ఎమ్మెల్యే అన్నట్లు వ్యవహరిస్తుంది.
అయినప్పటికీ ఏదో రకంగా కాంగ్రెస్‌లో చేరడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ప్రయత్నాలు చేసి విఫలం అయ్యారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణులు తమ పార్టీకి ఎమ్మెల్యే లేడు అన్న లోటు తెలియకుండా అధకారిక కార్యక్రమాలలో పాల్గొంటుండగా.. బీఆర్ఎస్ శ్రేణులు తమ పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ.. ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఆ క్రమంలో కొంతకాలంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మౌనంగా ఉండి పోవడంతో నియోజకవర్గ ప్రజలు వారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అదలా ఉంటే ఇద్దరిలో గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లో చేరిపోగా మిగిలిన ఎమ్మెల్యే విజయుడికి అవకాశం లేకుండా పోవడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ డోర్లు తెరుచుకోకపోవడంతో ఎమ్మెల్యే విజయుడు తప్పని పరిస్థితులలో బీఆర్ఎస్‌లో చురుగ్గా వ్యవహరించాలని చూస్తున్న కేడర్ సహకరించడం లేదంట.. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి మాత్రం ఇప్పటికీ నియోజకవర్గం వైపు తొంగి చూడడం లేదు. ఎన్నికలలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలయ్యే పరిస్థితి లేకపోవడంతో.. స్థానిక సంస్థల ఎన్నికలలో అలంపూర్ నియోజకవర్గంలో గులాబీ పార్టీకి ప్రతికూల ఫలితాలు తప్పవన్న ప్రచారం సాగుతోంది.