Gender Determination: కాలం మారినా.. ఏఐ యుగం వచ్చినా సరే కొందరు మారడం లేదు. అబ్బాయే కావాలి.. అమ్మాయి వద్దు.. ఈ లెక్కలు మాత్రం ఇంకా ఆగడం లేదు. ఇప్పటికే చాలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా బ్రూణహత్యలు సీక్రెట్ గా జరిగిపోతూనే ఉన్నాయి. తెరవెనుక లింగ నిర్ధారణలు జరుగుతూనే ఉన్నాయి. ఆడపిల్ల అని తెలియగానే కడుపులోనే ఖతం చేస్తున్న ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో పెరగడం కలకలం సృష్టిస్తోంది.
ఆందోళన కలిగిస్తున్న లింగనిర్ధార పరీక్షలు
ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం, అడ్వాన్స్‌డ్ జమానా. స్త్రీపురుష లింగబేధానికి తావులేని సొసైటీ. అయినా సరే కొందరు మాత్రం మారడం లేదు. తమకు అబ్బాయే కావాలని, కడుపులో ఉన్నది అమ్మాయి అని తెలిస్తే చాలు అబార్షన్ చేయించుకోవడానికి సైతం వెనుకాడడం లేదు. జనాల బలహీనతను క్యాష్ చేసుకునేలా ఇల్లీగల్‌గా లింగనిర్ధారణ చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా ఘటనలు ఆందోళనకరంగా మారాయి.
చిత్తూరు జిల్లాలో లింగనిర్ధారణ ముఠాకు చెక్
ఒక సాధారణ ఇంట్లో ఇలా అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తున్నారంటే ఎవరైనా నమ్ముతారా? కానీ చేస్తున్నారు. చేయించుకునే వారు అడ్రస్ తెలుసుకుని మరీ వస్తున్నారు. అడిగినంత ఇచ్చుకుంటున్నారు. ఆడబిడ్డ అని తెలిస్తే వెంటనే హాస్పిటల్ వెళ్లి పిండాన్ని తీయించేస్తున్నారు. ఇదీ కథ. చిత్తూరు జిల్లాలో లింగ నిర్ధారణ ముఠాను స్వయంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులతో కలిసి చెక్ చేస్తే అసలు మ్యాటర్ బయటికొచ్చింది. భరత్ నగర్‌లోని ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా.. లింగ నిర్ధారణ పరీక్షలు జరుపుతున్నట్లు తెలుసుకుని లింగ నిర్ధారణ పరీక్షలకు ఉపయోగించే స్కానింగ్ యంత్రాలను సీజ్ చేశారు. 22 మందిపై చిత్తూరు జిల్లా వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అలాగే ముఠాకు సహకరిస్తున్న రెండు మెడికల్ షాపులను సీజ్ చేశారు డ్రగ్ కంట్రోల్ అధికారులు.
వెంకటేశ్వర కాలనీలోనూ ఇల్లీగల్ స్కానింగ్
ఇదే కాదు.. ఇంతకు కొన్ని రోజుల ముందే చిత్తూరు నగరంలో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న లింగనిర్ధారణ పరీక్షల బాగోతం బయటపడింది. 9వ వార్డులో గాంధీనగర్ వెంకటేశ్వర కాలనీలో ఓ ఇంట్లో ఈ పరీక్షలు చేస్తే ఇలాగే పట్టుకున్నారు. ఎంత చేస్తున్నా గల్లీకొకటి ఇలాంటి ఇల్లీగల్ స్కానింగ్ మిషన్లు ఉన్నాయా అన్న డౌట్లు పెరుగుతున్నాయి. వీటిని వెంటడే కట్టడి చేయాలి.
సూర్యాపేటలో ఇల్లీగల్ గా అబార్షన్లు
ఇక ఈ ఘటన చూడండి.. సూర్యాపేటలోని పాత రామలింగేశ్వర థియేటర్ రోడ్ లోని ప్రైవేట్ హాస్పిటల్ ను వైద్యశాఖ అధికారులు సీజ్ చేశారు. కారణం ఏంటంటే.. గర్భిణికి అబార్షన్ చేస్తుండగా వికటించి చనిపోయింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూడడంతో అధికారులు రంగంలోకి దిగారు. ఈ హాస్పిటల్ రన్ చేసిన వారు గతంలోనూ ఇలాగే అబార్షన్లు చేయడంతో గుర్తించి సీజ్ చేశారు. అయితేనేం పేరు మార్చి మళ్లీ దందా షురూ చేశారు. ఇప్పుడు ఓ నిండు ప్రాణమే పోయింది. జిల్లాలోని మోతె మండలానికి చెందిన ఓ మహిళ మూడోసారి గర్భం దాల్చింది. ఆర్ఎంపీ సలహాతో కుటుంబ సభ్యులు చట్టవిరుద్ధంగా ఆమెకు ఐదోనెలలో నార్కట్ పల్లిలో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించారు.
అబార్షన్ వికటించి 5 నెలల గర్భిణి మృతి
ఆడబిడ్డగా తేలడంతో అబార్షన్ చేయించేందుకు నాలుగు రోజుల క్రితం సూర్యాపేటలోని పాత రామలింగేశ్వర థియేటర్ రోడ్డులోని ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. గర్భస్రావం చేస్తుండగా వికటించి గర్భిణి పరిస్థితి విషమించడంతో ఖమ్మంలోని మరో ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె ఆదివారం చనిపోయింది. విషయం బయటకు రాకుండా ఆసుపత్రి నిర్వాహకులు ఆమె కుటుంబ సభ్యులకు కొంత డబ్బు ముట్టజెప్పారు. రాత్రికిరాత్రే ఆసుపత్రిని మూసేశారు. గతంలోనూ ఇదే ఆసుపత్రిలో అబార్షన్ చేస్తూ పట్టుబడటంతో అధికారులు సీజ్ చేశారు. అయినా మరో పేరుతో ఆసుపత్రిని నడిపిస్తున్నారు.
సూర్యాపేట జిల్లాలో నకిలీ డాక్టర్ల హల్ చల్
సూర్యాపేట జిల్లాలో నకిలీ డాక్టర్ల హల్ చల్ ఇంకా నడుస్తోంది. అనుమతులు లేకుండా మెడికల్ షాపులు, హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్ సెంటర్లు ఇలా పుట్టగొడుగుల్లా ఉన్నాయి. ఇటీవలే నకిలీ డాక్టర్ నిర్వాకంతో సాయి గణేష్ హాస్పిటల్లో అరుణ అనే మహిళ మృతి చెందింది. ఈ నకిలీ హాస్పిటల్స్, నకిలీ డాక్టర్లు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. వైద్యశాఖ ఇటీవలే దాడులు కూడా చేసింది. అయినా సరే మారడం లేదు.
తెలుగు రాష్ట్రాల్లో ఆందోళనకరంగా బ్రూణహత్యలు
తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో ప్రతి 1000 బాలురతో పోలిస్తే 900 కంటే తక్కువ బాలికలు పుడుతున్నారు. ఇది బ్రూణహత్యల సూచికగా గుర్తించాలి. అల్ట్రాసౌండ్ స్కానింగ్ కేంద్రాలపై మరింత నిఘా పెంచాల్సిందే. ఆంధ్రప్రదేశ్‌లోని కడప, కర్నూలు సహా మరికొన్ని జిల్లాలు అలాగే తెలంగాణలోని రంగారెడ్డి, మహబూబ్‌నగర్ సహా పలు జిల్లాల్లో లింగ నిష్పత్తి అసమతుల్యతలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. అంటే ప్రతి వెయ్యి మంది బాలురతో పోలిస్తే బాలికల సంఖ్య చాలా తక్కువగా ఉంది. జాతీయ ఆరోగ్య సర్వే 2019-21 డేటా ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో లింగ నిష్పత్తిలో కొంత మెరుగుదల కనిపించినప్పటికీ, బ్రూణహత్యలు ఇప్పటికీ ఆందోళనకరంగానే ఉన్నాయి. ఈ సమస్యపై అవగాహన పెంచాల్సిన అవసరం కనిపిస్తోంది.